‘మంగ‌ళ‌వారం’ రివ్యూ: ఈ అమ్మాయికీ, ఆ రోజు జ‌రిగే హ‌త్య‌ల‌కూ సంబంధం ఏమిటి?

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

తొలి సినిమాతోనే మార్క్ వేసుకోవ‌డం అంత ఈజీ కాదు. ఒక‌వేళ వేసుకొన్నా.. దాన్ని అధిగమించే సినిమా తీయ‌డం మ‌రింత క‌ష్టం. ఆర్‌ఎక్స్ 100తో అజ‌య్ భూప‌తికి అదే జ‌రిగింది.

ఈ సినిమాతో అతడి పేరు మార్మోగిపోయింది. ఓ హార్డ్ హిట్టింగ్‌ పాయింట్‌ను క‌థ‌గా మ‌లిచి, క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ కొట్టాడు అజ‌య్ భూప‌తి.

ఆ త‌ర్వాత వ‌చ్చిన మ‌హా స‌ముద్రం అంచ‌నాల్ని ఏ మాత్రం అందుకోలేక‌పోయింది. ఆర్‌ఎక్స్ 100 చూసి పొగిడిన వాళ్లే, అజ‌య్ భూప‌తిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అలా మారిపోయింది సీన్‌!

‘మహా స‌ముద్రం’ గుణపాఠాలు నేర్పడంతో కాస్త గ్యాప్ తీసుకొని, ఇప్పుడు `మంగ‌ళ‌వారం` సినిమాతో త‌న‌ని తాను నిరూపించుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు అజయ్ భూపతి.

టైటిల్‌, పోస్ట‌ర్లు, టీజ‌ర్లు, ట్రైల‌ర్లు... అన్నీ‘మంగ‌ళ‌వారం’ పై ఆశ‌లు, అంచ‌నాలూ పెంచేశాయి. అజ‌య్ భూప‌తి ఈసారి హిట్టు కొడ‌తాడ‌న్న న‌మ్మ‌కాన్ని క‌లిగించాయి.

మ‌రి మంగ‌ళ‌వారం ఎలా ఉంది? ప్ర‌చారంలో ఉన్న ద‌మ్ము సినిమాలోనూ ఉందా?

రకరకాల మనుషులు

మాల‌చ్చ‌మ్మ‌పురం అనే ఓ ఊరు. అక్క‌డ ర‌క‌ర‌కాల మ‌నుషులు. కొంత‌ మంది మంచోళ్లు. ఇంకొంద‌రు చెడ్డోళ్లు. మ‌రికొంద‌రు మేకవ‌న్నె పులులు.

ఓరోజు.. ఊరి తెల్ల‌టి గోడ మీద ఎర్ర‌టి అక్ష‌రాలు మెరుస్తూ క‌నిపిస్తాయి. ఆ వెంట‌నే ఓ జంట హ‌త్య‌. ఆ ఊళ్లో ఎవరైనా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే, మంగ‌ళ‌వారం రోజే చ‌నిపోతుంటారు.

ఆ ఊరి గ్రామ దేవ‌త మాలచ్చ‌మ్మ‌కి మంగ‌ళ‌వారం అంటే ఇష్టం. అందుకే ఆ హ‌త్య‌ల‌కూ, అమ్మ‌వారికీ ఏదో సంబంధం ఉంద‌న్న వ‌దంతు వ్యాపిస్తుంది.

ఈ హ‌త్య‌లను చేస్తోందెవ‌రో ఛేదించ‌డానికి పోలీస్ అధికారిణి (నందితా శ్వేత‌) రంగంలోకి దిగుతుంది. ఈ ఊరి క‌థ‌కీ, శైలు(పాయ‌ల్ రాజ్ పుత్‌)కీ సంబంధం ఏమిటి? ఈ హ‌త్య‌లు చేస్తోందెవ‌రు? ఇదంతా తెర‌పై చూసి తెలుసుకోవాల్సిన మిస్టరీనే.

అదే క‌థ‌.. సెట‌ప్పే వేరు

ఓ ఊరు. అక్క‌డ వ‌రుస హ‌త్య‌లు. కొంద‌రు అనుమానితులు. వాటి చుట్టూ జ‌రిగే నేర ప‌రిశోధ‌న‌. `అన్వేష‌ణ‌` కాలం నుంచీ చూస్తున్న క‌థ‌లే ఇవ‌న్నీ. `మంగ‌ళ‌వారం` కూడా దానికి అతీతం కాదు. సూక్ష్మంగా ఆలోచిస్తే.. `మంగ‌ళ‌వారం` కూడా అలాంటి క‌థే. కాక‌పోతే అజ‌య్ భూప‌తి తెలివిగా ఇక్క‌డ కొన్ని సెట‌ప్పులు వేసుకొన్నాడు.

ఊరు, అక్క‌డో అమ్మ‌వారు, ర‌క‌ర‌కాల మ‌నుషులు, వాళ్ల మ‌ధ్య గొడ‌వ‌లు, ఆ త‌ర‌వాత హ‌త్య‌లు.. ఇలా చాలా హంగామా ఉంది ఈ క‌థ‌లో.

కాస్త క్రైమ్‌, ఇంకాస్త థ్రిల్, మ‌రి కాస్త హార‌ర్‌, ఇవి చాల‌ద‌న్న‌ట్టు.. ఊరి దేవ‌త‌, ఇలా చాలా రంగులు పులుముకొన్న క‌థ ఇది. దాంతోపాటు లైంగిక సంబంధిత వ్యాధితో బాధ ప‌డుతున్న ఓ అమ్మాయి క‌థ‌ని అంత‌ర్లీనంగా రాసుకొన్నాడు.

ఈ అన్ని విష‌యాల్నీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి, ఓ క‌థ చెప్పాల‌నుకొన్నాడు. నిజంగా పెద్ద టాస్క్ ఇది. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు కొంత‌ మేర విజ‌యం సాధించాడ‌నే చెప్పాలి. మామూలు రివెంజ్ డ్రామాగా క‌నిపించే ఈ క‌థ‌ను కొత్త‌గా మార్చింది ఈ సెట‌ప్పులే.

కాశీ రాజు ర‌న్నింగ్ కామెంట్రీ

ఊర్లో లెక్క‌లేన‌న్ని పాత్ర‌లు క‌నిపిస్తుంటాయి. జ‌రుగుతున్న హ‌త్య‌ల‌కు వీళ్ల‌లో కొంత‌ మందికీ ఏదో సంబంధం ఉంద‌న్న బిల్డ‌ప్ ఇవ్వ‌డానికి ఆ పాత్ర‌లు ప‌నికొచ్చాయి కూడా. కొన్ని పాత్ర‌లు కాల‌క్షేపం కోసం మాత్ర‌మే. ఉదాహ‌ర‌ణ‌కు కాశీ రాజు (అజ‌య్ ఘోష్‌) పాత్ర‌.

కాశీ రాజుగా త‌న మేనరిజం, గెట‌ప్పు, డైలాగులు సూట‌య్యాయి. ఊళ్లో జ‌రుగుతున్న త‌తంగానికి ర‌న్నింగ్ కామెంట్రీ నడిపించడానికి డైరెక్టర్ ఈ పాత్రను వాడుకొన్నాడు. ఇంకొన్ని పాత్ర‌లు గుంభనంగా ఉంటూ, చివ‌ర్లో కీల‌కంగా మారాయి. దానికి ఉదాహ‌ర‌ణ‌- పులి (ల‌క్ష్మ‌ణ్‌) క్యారెక్ట‌ర్‌.

అయితే, చాలా పాత్ర‌లు క‌థ‌లో గంద‌ర‌గోళాన్ని క‌ల్పించ‌డానికే సృష్టించినట్టు క‌నిపిస్తాయి. ఇన్ని పాత్ర‌లు ఉండ‌డం, వాటికంటూ కొన్ని సీన్లు రాసుకోవాల్సి రావ‌డం వ‌ల్ల‌.. కథాగ‌మ‌నం మంద‌గిస్తుంది.

ఊళ్లో హ‌త్య‌లు మొద‌లైనప్పుడు కథనం కాస్త వేగం అందుకొంటుంది.

విశ్రాంతి ఘ‌ట్టంలో శైలు ఎంట్రీ ఇవ్వ‌డంతో మ‌రింత ఆస‌క్తి మొద‌ల‌వుతుంది.

అక్క‌డ ఈ సినిమా ఇంకో రంగు పులుముకొంటుంది.

శైలుకు వచ్చిన కష్టమేంటి?

ద్వితీయార్ధంలో అస‌లు శైలు ఎవ‌రు, ఆమెకొచ్చిన క‌ష్టం ఏమిటి అనే ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. నిజానికి ఈ క‌థ‌కు ఫ్లాష్ బ్యాక్ కూడా అవ‌స‌రం లేదు. శైలు ఏదో స‌మస్య‌తో బాధ ప‌డుతోంద‌న్న‌విష‌యం తెలుస్తూనే ఉంటుంది.

దానిపై ద‌ర్శ‌కుడు చివ‌రి వ‌ర‌కూ స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు.

శైలు పాత్ర‌పై సానుభూతి ఎంత క‌లిగితే... అంత ఈ క‌థ‌కు మేలు జ‌రుగుతుంది. శైలు స‌మ‌స్య ఏమిటి, దానితో తను ఎంత స‌త‌మ‌త‌మ‌వుతోంది అనే విష‌యాలు ప్రేక్ష‌కుల‌కు ముందే తెలియాల్సింది. దాన్ని దాచి పెట్ట‌డం వ‌ల్ల ఆ పాత్ర‌పై సానుభూతి క‌ల‌గ‌క‌పోగా, ఏవ‌గింపు కలగొచ్చు. ఈ క‌థ‌లో జ‌రిగింది అదే.

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ త‌ర‌వాత వ‌చ్చిన సీన్లు, ఆ త‌ర‌వాత ద‌ర్శ‌కుడు ఇచ్చిన ట్విస్టులూ ఆక‌ట్టుకొంటాయి. ద్వితీయార్ధంలో జారిపోయింద‌నుకొన్న ప‌ట్టును మళ్లీ ప‌తాక సన్నివేశాల ద‌గ్గ‌ర అందుకోగ‌లిగాడు అజయ్ భూపతి.

అయితే, ద‌ర్శ‌కుడు కొన్నిచోట్ల‌.. త‌నకు అవ‌స‌రం అనుకొన్న విష‌యాల్ని దాచేసి, అవసరమైనప్పుడు త‌న‌కు అనుకూలంగా వాటిని రివీల్ చేశాడు. ఓర‌కంగా ప్రేక్ష‌కుల్ని అది మోసగించడమే.

ఎవ‌రూ చేయ‌లేని సాహ‌సం

ఇలాంటి పాత్ర‌ని ఎంచుకొన్నందుకు పాయ‌ల్‌ రాజ్‌పుత్‌ను త‌ప్ప‌కుండా అభినందించాలి. ఎందుకంటే, శైలు పాత్ర‌లో అంత సంఘ‌ర్ష‌ణ ఉంది. ఆ క్యారెక్ట‌రైజేష‌న్ చెప్పిన‌ప్పుడే హీరోయిన్ల ఒళ్లు జ‌ల‌ద‌రిస్తుంది. అలాంటిది ఒప్పుకొని చేయ‌డం పెద్ద రిస్కే.

ఆ పాత్ర‌లో పాయ‌ల్ బాగానే ఒదిగిపోయింది. కానీ, ఆశించినంత సింప‌తీ రాలేదు. దానికి కార‌ణం.. పాయ‌ల్‌‌కు గ‌తంలో ఉన్న ఇమేజే. కొత్త‌మ్మాయిని తీసుకొని ఉంటే, మ‌రింత మంచి ఫ‌లితం వ‌చ్చేదేమో!

నందితా శ్వేత ఇది వ‌ర‌క‌టి సినిమాల‌కంటే భిన్నంగా క‌నిపించింది.

ఆద్యంతం సీరియ‌స్‌గా సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో కాస్తంత వినోదం దొరికిందంటే దానికి కార‌ణం అజ‌య్ ఘోష్‌.

ఊరి పెద్ద ప్ర‌కాశంగా చైత‌న్య కూడా కూడా త‌న ప‌రిధిలో బాగానే చేశాడు. అయితే ఈ పాత్ర వ‌ర‌కూ రాంగ్ కాస్టింగ్ అనిపించింది.

ప్రియ‌ద‌ర్శిది ఓ షాకింగ్ ఎంట్రీ అని చెప్పొచ్చు. ఆ త‌ర‌హా పాత్ర‌లో ప్రియ‌ద‌ర్శిని ఎవ‌రూ ఎక్స్‌పెక్ట్ చేయ‌లేరు.

‘కాంతార’ అజనీష్ బీజీఎం ఎలా ఉంది?

కాంతార సినిమాతో సంగీత ద‌ర్శ‌కుడిగా త‌న మార్క్ చూపించుకొన్నాడు అజ‌నీష్‌. ఈ సినిమాకి తెర వెనుక హీరో త‌నే. త‌న నేపథ్య సంగీతంతో ద‌ర్శ‌కుడు అనుకొన్న స‌న్నివేశానికి ప్రాణం పోశాడు. సినిమా అంతా ఓ మూడ్‌, టెంపో కొన‌సాగిందంటే దానికి కార‌ణం.. అజ‌నీష్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోరే.

హార‌ర్ ఎలిమెంట్స్ కి తను వాడిన ఇన్‌స్ట్రుమెంట్స్ బాగా ప‌నిచేశాయి.

కెమెరా వ‌ర్క్ మ‌రింత బాగుంది. ఊరి వాతావ‌ర‌ణాన్ని, అక్క‌డ మ‌నుషుల్ని బాగా క్యాప్చ‌ర్ చేశాడు. ఎడిటింగ్ పేట్ర‌న్ కూడా కొత్త‌గా ఉంది.

ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి ఓ కొత్త సెట‌ప్‌లో రొటీన్ రివెంజ్ డ్రామాను తెర‌పైకి తీసుకొచ్చాడు. కొన్ని చోట్ల `కాంతార` ప్ర‌భావం క‌నిపిస్తుంటుంది. హార‌ర్ ఎలిమెంట్‌ని మ‌రింత బాగా వాడుకొనే అవ‌కాశం ఉన్నా, ద‌ర్శ‌కుడు ఎందుకో ఆ దిశ‌గా ఆలోచించ‌లేక‌పోయాడు.

మంగ‌ళ‌వార‌మే హ‌త్య‌లు ఎందుకు జ‌ర‌గాలి, వివాహేతర సంబంధాల‌కూ, ఈ క‌థ‌కూ ఉన్న లింకేంటి అనేవి ఆలోచిస్తే సంతృప్తిక‌ర‌మైన స‌మాధానాలు దొర‌క‌వు. అయితే, అంత‌ర్లీనంగా ట‌చ్ చేసిన పాయింట్ మాత్రం రిస్క్‌తో కూడిన‌దే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)