ఇజ్రాయెల్‌‌పై అక్టోబర్ 7న చేసిన దాడికి హమాస్ ఎలా బలగాలను కూడగట్టింది, ఎలాంటి శిక్షణ ఇచ్చింది?

    • రచయిత, అబ్దెలాలీ రగద్, రిచర్డ్ ఇర్విన్-బ్రౌన్, బెనెడిక్ట్ జర్మన్, సీన్ సెడాన్
    • హోదా, బీబీసీ అరబిక్, బీబీసీ వెరిఫై

ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7 నాటి భీకర దాడిలో హమాస్‌కు మరో అయిదు సాయుధ పాలస్తీనా గ్రూపులు కూడా జతయ్యాయి.

2020 నుంచి మిలిటరీ తరహా డ్రిల్స్‌లో కలిసి శిక్షణ తీసుకున్న తర్వాత ఈ గ్రూపులన్నీ కలిసి ఇజ్రాయెల్‌పై దాడికి పాల్పడినట్లు బీబీసీ న్యూస్ అనాలిసిస్‌లో తేలింది.

ఈ గ్రూపులు గాజాలో సంయుక్తంగా డ్రిల్స్ నిర్వహించాయి. భీకర దాడిలో హమాస్ వాడిన వ్యూహాలకు సరిగ్గా సరిపోలేలా ఈ డ్రిల్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలో ఈ కసరత్తులను పోస్ట్ చేశారు.

డ్రిల్స్ సందర్భంగా బందీలను పట్టుకోవడం, కాంపౌండ్ రైడింగ్, ఇజ్రాయెల్ రక్షణ వలయాలను ఛేదించడం వంటివి ప్రాక్టీస్ చేశారు. అక్టోబర్ 7నాటి దాడికి సరిగ్గా 25 రోజుల ముందు వారంతా కలిసి చివరిసారి ప్రాక్టీస్ చేశారు.

పోరాట పద్ధతులను మెరుగుపరచడానికి గాజా వర్గాలను హమాస్ ఎలా ఏకతాటిపైకి తీసుకొచ్చిందో సూచించే సాక్ష్యాధారాలను బీబీసీ అరబిక్, బీబీసీ వెరిఫై సేకరించాయి.

ఐక్యతకు చిహ్నం

హమాస్ అగ్ర నాయకుడు ఇస్మాయిల్ హనియా 2020 డిసెంబర్ 29న గాజాలోని వివిధ సాయుధ వర్గాల మధ్య ‘‘స్ట్రాంగ్ పిల్లర్: బలమైన సందేశం, ఐక్యతా చిహ్నం’’ అనే కోడ్ నేమ్‌తో నాలుగు డ్రిల్స్‌లో మొదటి దాన్ని ప్రారంభించారు.

యుద్ధ క్రీడల శైలి డ్రిల్స్‌లో గాజాలోని శక్తిమంతమైన సాయుధ గ్రూపు హమాస్, తమ సంకీర్ణ దళాల్లో ఆధిపత్యం ప్రదర్శించింది. మరో 10 ఇతర పాలస్తీనా సాయుధ వర్గాలతో కలిసి ఈ సంకీర్ణ దళాలు ఏర్పాటు అయ్యాయి. ఈ డ్రిల్స్ ‘‘జాయింట్ ఆపరేషన్ రూమ్’’ పర్యవేక్షణలో జరిగాయి.

ఒక సెంట్రల్ కమాండ్ కింద గాజాలో సాయుధ వర్గాలను సమన్వయం చేయడానికి 2018లో ఈ జాయింట్ ఆపరేషన్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

2018కి ముందు హమాస్ అధికారికంగా పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ (పీఐజే)తో కలిసి ఉండేది. హమాస్ తరహాలోనే గాజాలోని రెండో అతిపెద్ద సాయుధ వర్గమైన పీఐజేని తీవ్రవాద గ్రూపుగా గుర్తిస్తూ యూకేతో పాటు ఇతర దేశాలు నిషేధం విధించాయి.

గత సంఘర్షణల్లో హమాస్ ఇతర గ్రూపులతో కలిసి పోరాడింది. కానీ, 2020 నాటి డ్రిల్స్ ఒక విస్తృత శ్రేణిలో సమూహాలన్నీ ఏకీకృతం అవుతున్నాయనే ప్రచారానికి సాక్ష్యంగా నిలిచాయి.

మూడేళ్లలో నిర్వహించిన నాలుగు సంయుక్త డ్రిల్స్‌లో 2020 నాటి ఎక్సర్‌సైజులు మొదటివి. ఈ నాలుగు డ్రిల్స్‌ను వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియా చానెళ్లలో పోస్ట్ చేశారు.

మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫుటేజీలో స్ట్రాంగ్ పిల్లర్ డ్రిల్స్‌ సమయంలో హమాస్‌తో పాటు పీఐజే సహా 10 గ్రూపులు శిక్షణ పొందడాన్ని బీబీసీ ధ్రువీకరించింది. ఈ గ్రూపుల సభ్యులు ధరించిన విభిన్న హెడ్‌బ్యాండ్లు, ముద్రల ఆధారంగా వారిని వర్గీకరించింది.

అక్టోబర్ 7 దాడి తర్వాత, ఈ దాడిలో తాము కూడా పాల్గొన్నట్లుగా చూపించే వీడియోలను అయిదు గ్రూపులు పోస్ట్ చేశాయి. మరో మూడు సమూహాలు, ఇజ్రాయెల్‌పై దాడిలో పాల్గొన్నట్లుగా చెబుతూ టెలిగ్రామ్‌లో రాతపూర్వక ప్రకటనలు ఇచ్చాయి.

దాడిలో ఈ గ్రూపుల పాత్రపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఎందుకంటే, అక్టోబర్7న ఈ గ్రూపులే ఇజ్రాయెల్ నుంచి గాజాకు డజన్ల కొద్ది మహిళలు, చిన్నారులను బందీలుగా తీసుకెళ్లినట్లు నమ్ముతున్నారు. బందీలుగా తీసుకెళ్లినవారిని కనుగొనాలంటూ ఇప్పుడు హమాస్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో దాడిలో ఇతర సంస్థల పాత్ర గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది.

ఆరోజున హమాస్‌తో పాటు మరో మూడు గ్రూపులు పీఐజే, ముజాహిదీన్ బ్రిగేడ్స్, అల్ నసర్ సలా అల్ దీన్ బ్రిగేడ్స్ గ్రూపులు ఇజ్రాయెల్ బందీలను పట్టుకున్నట్లు పేర్కొన్నాయి.

గాజాలో తాత్కాలిక సంధికి దారితీసే ప్రయత్నాలన్నీ ఈ బందీలను హమాస్ గుర్తించడంపై ఆధారపడి ఉన్నాయని చెబుతున్నారు.

ఈ సమూహాలు వివిధ భావజాలాలకు చెందినవి. ఇందులో కఠిన ఇస్లామిస్ట్ నుంచి లౌకికవాదాన్ని పాటించే గ్రూపులు ఉన్నాయి. అయితే, ఇవన్నీ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా హింసను ఆయుధంగా ఉపయోగించేందుకు రెడీగా ఉన్నాయి.

గాజా సాయుధ సమూహాల మధ్య ఐక్యత గురించి హమాస్ పదేపదే నొక్కి చెప్పింది. సంయుక్త డ్రిల్స్‌లో ఈ సమూహాలన్నీ తమకు సమాన స్థాయిలో ఉన్నాయని హమాస్ చెప్పింది. అయితే, ఇజ్రాయెల్‌పై దాడి ప్రణాళికల్లో తాము ప్రధాన పాత్ర పోషించినట్లు తెలిపింది.

బంకర్‌లో ముసుగు ధరించిన కమాండర్లు, రాకెట్లను ప్రయోగించడంతో ఎక్సర్‌సైజులు మొదలుపెట్టడం మొదటి డ్రిల్స్‌కు సంబంధించిన ఫుటేజీలో కనిపిస్తుంది.

అక్టోబర్ 7 దాడిలో దాదాపు 1200 మంది చనిపోయారు. 240 మందిని బందీలుగా తీసుకెళ్లారు. ఆరోజున సైనికులను పట్టుకోవడానికి, పౌరులను లక్ష్యంగా చేసుకోవడానికి హమాస్ రెండు వ్యూహాలను ఉపయోగించినట్లు వీడియోలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా మనకు తెలుస్తుంది.

ప్రపంచానికి చాటింపు

సరిగ్గా ఒక ఏడాది తర్వాత రెండో స్ట్రాంగ్ పిల్లర్ డ్రిల్‌ను నిర్వహించారు.

2021 డిసెంబర్ 6న జరిగిన ఈ ఎక్సర్‌సైజుల లక్ష్యం ‘‘ప్రతిఘటన వర్గాల ఐక్యతను ధ్రువీకరించడం’’ అని హమాస్ సాయుధ విభాగం ఇజ్జెదిన్ అల్-ఖసమ్ బ్రిగేడ్స్ కమాండర్ అయ్‌మన్ నోఫాల్ అన్నారు.

గాజా సరిహద్దుల్లోని గోడలు, ఇంజినీరింగ్ నైపుణ్యాలు తమను రక్షించలేవని శత్రువుకు ఈ డ్రిల్ చెబుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

గాజాకు దగ్గరలోని స్థావరాలను విముక్తి చేయడానికి ఈ సంయుక్త మిలిటరీ డ్రిల్స్‌ను రూపొందించినట్లు హమాస్ నుంచి మరో ప్రకటన వచ్చింది.

2022 డిసెంబర్ 28న ఈ డ్రిల్స్ మళ్లీ చేశారు. ఇందులో మిలిటరీ స్థావరాలకు ప్రతిరూపంగా నిర్మించిన భవనాలను ధ్వంసం చేయడం, మిలిటరీ ట్యాంకులను కూల్చేయడంలో ఫైటర్లు సాధన చేశారు. ప్రచార చిత్రాల్లో ఈ అంశాలన్నీ ప్రచురించారు.

ఈ ఎక్సర్‌సైజుల గురించి ఇజ్రాయెల్‌కు రిపోర్టులు అందాయి. దేశంలోని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నిశితంగా వీటిని పరిశీలించాయి.

హమాస్ శిక్షణా కార్యక్రమాలకు ఆటంకం కలిగించేందుకు ఇజ్రాయెల్ రక్షణ బలగాలు (ఐడీఎఫ్) గతంలో వైమానిక దాడులు చేశాయి.

మొదటి స్ట్రాంగ్ పిల్లర్ డ్రిల్ కోసం వాడిన ప్రాంతంలో 2023 ఏప్రిల్‌లో ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది.

దాడులకు వారాల ముందు గాజా సరిహద్దుకు సమీపంలోని మహిళా నిఘా సైనికులు, అసాధారణ డ్రోన్ కార్యకలాపాల గురించి హెచ్చరికలు జారీ చేశారు.

కానీ, హమాస్ తమ హెచ్చరికల్ని పట్టించుకోలేదని సైనికులు చెప్పినట్లు ఇజ్రాయెల్ మీడియాలో కథనాలు వచ్చాయి.

హమాస్ శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు నిఘా సమాచారం అందిందని గాజాలోని ఐడీఎఫ్ మాజీ డిప్యూటీ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అమీర్ అవివి చెప్పారు.

ఇజ్రాయెల్ కంచెకు కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఈ కసరత్తులు జరిగాయని ఆయన తెలిపారు.

అక్కడ డ్రిల్స్ జరుగుతున్నాయని తెలిసినప్పటికీ, వారికి ఎలాంటి శిక్షణ అందిస్తున్నారో చూడలేదని ఆయన చెప్పారు.

నోఫాల్‌ అడ్డు తొలిగించినట్లు 2023 అక్టోబర్ 17న ఐడీఎఫ్ చెప్పింది. సంఘర్షణ సమయంలో చనిపోయిన హమాస్ తొలి సీనియర్ మిలిటరీ లీడర్ నోఫాల్.

మాక్ డ్రిల్స్

డ్రిల్స్‌ను వాస్తవికంగా ఉంచడం కోసం హమాస్ చాలా కష్టపడింది.

హమాస్ ఫైటర్లు 2022లో ఐడీఎఫ్ నియంత్రణలోని ఒక ఇజ్రాయెల్ మిలిటరీ స్థావరంపై దాడి చేస్తున్నట్లుగా మాక్ డ్రిల్ ప్రాక్టీస్ చేశారు. గాజా, ఇజ్రాయెల్ మధ్య మార్గంలో ఎరెజ్ క్రాసింగ్‌కు 2.6 కి. మీ దూరంలో ఈ మిలిటరీ స్థావరం ఉంటుంది.

శిక్షణ ఫుటేజీలో కనిపించే భౌగోళిక లక్షణాలు, ఆ ప్రాంతంలోని ఏరియల్ ఇమేజ్‌లను పోల్చడం ద్వారా ఇజ్రాయెల్ బారియర్‌కు 800 మీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతాన్ని బీబీసీ వెరిఫై గుర్తించింది.

2023 నవంబర్ వరకు కూడా బింగ్ మ్యాప్స్‌లో ఈ ప్రాంతం కనిపిస్తుంది.

హమాస్ శిక్షణా శిబిరం, ఇజ్రాయెల్ అబ్జర్వేషన్ టవర్, ఎలివేటెడ్ అబ్జర్వేషన్ బాక్స్‌కు 1.6 కి.మీల పరిధిలోనే ఉంది.

సెక్యూరిటీ బారియర్‌లోని అంశాల నిర్మాణం కోసం ఇజ్రాయెల్ లక్షల డాలర్లు వెచ్చించింది.

ఈ మాక్ శిక్షణా స్థావరం, భూమట్టానికి కొన్ని మీటర్ల లోతులో నిర్మించారు. కాబట్టి ఇది ఇజ్రాయెల్ గస్తీకి వెంటనే కనిపించకపోవచ్చు. కానీ, పేలుళ్ల నుంచి వచ్చే పొగ మాత్రం తప్పకుండా కంటికి కనిపిస్తుంది. పైగా వైమానిక నిఘా (ఏరియల్ సర్వైలెన్స్) విషయంలో ఐడీఎఫ్‌కు మంచి పేరు ఉంది.

భవనాల్లోని చొచ్చుకెళ్లడం, బందీలుగా పట్టుకోవడం, భద్రతా వలయాలను ధ్వంసం చేయడం వంటివి ప్రాక్టీస్ చేయడం కోసం హమాస్ ఈ ప్రాంతాన్ని వాడుకుంది.

బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారంతో పాటు శాటిలైట్ చిత్రాలను ఉపయోగించి గాజా అంతటా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న 14 శిక్షణా స్థలాలను బీబీసీ వెరిఫై గుర్తించింది.

ఐక్యరాజ్యసమితి సహాయక ఏజెన్సీ పంపిణీ కేంద్రానికి కేవలం 1.6 కి.మీ దూరంలో వారు రెండుసార్లు శిక్షణ పొందారు. 2022 డిసెంబర్‌లో ఏజెన్సీ ప్రచురించిన అధికారిక వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా ఈ ప్రాంతం కనిపిస్తుంది.

గాలి, నేల, సముద్రం

మిలిటరీ యూనిఫారాలు ధరించి గాజా కంచె వద్ద నిఘా నిర్వహిస్తోన్న పురుషుల ఫోటోలను టెలిగ్రామ్ చానెల్‌లో జాయింట్ కమిటీ రూమ్ 2023 సెప్టెంబర్ 10న పోస్ట్ చేసింది.

రెండు రోజుల తర్వాత నాలుగో స్ట్రాంగ్ పిల్లర్ మిలిటరీ ఎక్సర్‌సైజులు జరిగాయి. ఇజ్రాయెల్‌పై దాడికి ఉపయోగించే అన్ని రకాల వ్యూహాలను అక్టోబర్ 7 నాటికి రిహార్సల్స్ చేశారు.

తెల్లటి టయోటా పికప్ ట్రక్‌లలో ఫైటర్లు తిరుగుతుండటాన్ని చిత్రీకరించారు. దాడి తర్వాతి నెలలో దక్షిణ ఇజ్రాయెల్‌లో ఇలాంటి ట్రక్‌లు తిరగడం కనిపించాయి.

మాక్ బిల్డింగ్‌లలో సాయుధులు దాడులు చేయడం, లోపల డమ్మీ టార్గెట్ల మీద కాల్పులు జరపడం, పడవలను ఉపయోగించి బీచ్‌ల్లోకి చొచ్చుకెళ్లడం వంటివి క్యాంపెయిన్ వీడియోల్లో కనిపించాయి. అక్టోబర్ 7న తీర ప్రాంతాల్లో హమాస్ పడవల్ని తిప్పికొట్టినట్లు ఇజ్రాయెల్ చెప్పింది.

అయితే, స్ట్రాంగ్ పిల్లర్ వ్యూహంలో భాగంగా మోటార్ సైకిళ్లు, పారాగ్లైడర్ల శిక్షణను హమాస్ ప్రచారం చేయలేదు.

అక్టోబర్ 7 దాడి జరిగిన మూడు రోజుల తర్వాత హమాస్ పోస్ట్ చేసిన ట్రైనింగ్ వీడియోలో మోటార్ సైకిళ్లు వెళ్లేందుకు వీలుగా కంచెలు, అడ్డంకుల్ని నాశనం చేయడం కనిపిస్తుంది. దక్షిణ ఇజ్రాయెల్‌ను చేరుకోవడానికి మోటార్ సైకిళ్లను హమాస్ వాడింది. ఇలాంటి మునుపటి వీడియోలను మేం గుర్తించలేదు.

అక్టోబర్ 7 దాడి జరిగే వరకు ఫైటర్లు పారాగ్లైడింగ్ పరికరాలను వాడుతున్న ఫుటేజీ బయటకు రాలేదు.

దాడి జరిగిన రోజు షేర్ చేసిన ట్రైనింగ్ వీడియోలో రఫాకు ఉత్తరాన మాక్ కిబ్బుజ్‌లోని ఒక వైమానిక స్థావరంలో సాయుధులు దిగడం కనిపించింది.

ఈ వీడియో 2022 ఆగస్టు 25కు ముందు రికార్డు చేసినట్లుగా బీబీసీ వెరిఫై నిర్ధారించింది.

ఈగల్ స్క్వాడ్రన్ పేరుతో ఈ వీడియోను కంప్యూటర్‌లో భద్రపరిచారు. వైమానిక విభాగానికి హమాస్ ఈ పేరును వినియోగిస్తుంది. దీన్నిబట్టి సంవత్సర కాలంగా హమాస్ పారాగ్లైడింగ్ ప్రణాళికపై పనిచేసిందని అర్థం అవుతుంది.

హమాస్‌కు షాక్

ఐడీఎఫ్ కమాండర్లను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం, అక్టోబర్ 7కు ముందు గాజా స్ట్రిప్‌లో హమాస్‌కు 30 వేల మంది ఫైటర్లు ఉన్నట్లు భావించారు. అనేక ఇతర చిన్న గ్రూపుల నుంచి కూడా ఫైటర్లను హమాస్ కూడబెట్టగలదని అనుకున్నారు.

ఇతర వర్గాల సహాయం తీసుకోకుండానే పాలస్తీనా సాయుధ వర్గాల్లో హమాస్‌ను అత్యంత శక్తిమంతమైనదిగా పేరుంది.

అక్టోబర్ 7 నాటి దాడుల్లో 1500 మంది ఫైటర్లు పాల్గొన్నట్లు ఐడీఎఫ్ గతంలో అంచనా వేసింది. అయితే, ఈ సంఖ్య 3 వేలకు దగ్గరగా ఉంటుందని ఐడీఎఫ్ ఇప్పుడు నమ్ముతున్నట్లుగా ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వార్తా సంస్థ పేర్కొంది.

నిజానికి ఈ దాడుల్లో ఎంతమంది పాల్గొన్నారో తెలియదు. కానీ, గాజాలోని సాయుధుల సంఖ్య ప్రకారం చూస్తే, చాలా తక్కువ సంఖ్యలో ఇందులో పాల్గొన్నట్లు అర్థం అవుతుంది. చిన్నగ్రూపులకు చెందిన ఫైటర్లు ఎంతమంది ఈ దాడిలో, స్ట్రాంగ్ పిల్లర్ డ్రిల్స్‌లో పాల్గొన్నారో నిర్ధరించడం చాలా కష్టం.

దాడికి సంబంధించిన అసలు ప్రణాళిక గురించి కేవలం హమాస్‌కు మాత్రమే అవగాహన ఉందని, మిగిలిన వర్గాలను ఆరోజున తమతో కలవాలని బహుశా అడిగి ఉండొచ్చని లెబనీస్ ఆర్మీ మాజీ బ్రిగేడియర్ జనరల్ హిషమ్ జబెర్ అన్నారు. ఆయన ఇప్పుడు మిడిల్ఈస్ట్ సెంటర్ ఫర్ స్టడీస్ అండ్ రీసెర్చ్‌కు సెక్యూరిటీ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు.

కేంద్రీకృత ప్రణాళిక ఉన్నప్పటికీ, అమలు మాత్రం వేర్వేరుగా జరిగిందని బీబీసీతో లండన్ కింగ్స్ కాలేజీలో సెక్యూరిటీ స్టడీస్ సీనియర్ లెక్చరర్ ఆండ్రియాస్ క్రెగ్ చెప్పారు.

ఇజ్రాయెల్ రక్షణ దళం బలహీనతను చూసి హమాస్‌లోని లీడర్లు కూడా ఆశ్చర్యపోయారని ఆయన అన్నారు.

హమాస్ సంయుక్త శిక్షణ శిబిరాల గురించి ఇజ్రాయెల్‌కు అవగాహన ఉండొచ్చని, కానీ ఆ విషయంలో ఇజ్రాయెల్ తప్పుడు నిర్ధరణకు వచ్చిందని యూరోపియన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్‌కు చెందిన మిడిల్ ఈస్ట్ అనలిస్ట్ హ్యూ లోవట్ అన్నారు.

ఈ కథనంలో లేవనెత్తిన అంశాల గురించి ఇజ్రాయెల్ రక్షణ బలగాలను అడిగినప్పుడు, ప్రస్తుతం తమ దృష్టి అంతా హమాస్ తీవ్రవాద సంస్థ నుంచి పొంచి ఉన్న ముప్పును తొలగించడంపైనే ఉందని అన్నారు. ఆ తర్వాత ఎక్కడ తప్పులు జరిగాయో చూస్తామని చెప్పారు.

ఇదంతా జరగడానికి సంవత్సరాలు పట్టొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)