కామెన్వెల్త్‌ గేమ్స్‌లో అద్భుతంగా ఆడిన భారత మహిళల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధిస్తుందా?

    • రచయిత, మనోజ్ చతుర్వేది
    • హోదా, బీబీసీ సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్

హాంగ్జౌ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సాధిస్తామని భారత మహిళల హాకీ కెప్టెన్ సవితా పూనియా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.

గత ఏడాది కాలంగా భారత జట్టు కనబరుస్తోన్న అద్భుత ప్రదర్శన కారణంగా ఏర్పడిన ఆత్మవిశ్వాసం అది.

ఒకవేళ, ఈ ఆసియా క్రీడల్లో భారత జట్టు విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకుంటే, వచ్చే ఏడాది ప్యారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌కు టీమిండియా అర్హత సాధిస్తుంది.

భారత మహిళల హాకీ జట్టు ప్రదర్శనలో మెరుగుదలకు గత పదేళ్ల కాలంలో అందుబాటులోకి వచ్చిన మౌలిక వసతులే కారణమని సవిత చెప్పారు.

ఆటగాళ్లకు శిక్షణా వసతులు మెరుగుపడటంతో ఆట ఎంతో పురోగతి సాధించారని అన్నారు.

‘‘2008లో నేను హాకీ ఆడటం మొదలుపెట్టినప్పుడు పరిస్థితులు ఏమీ బాగా లేవు. ఆటగాళ్లు రెండు పూటలా సరైన భోజనం కూడా చేయలేని కాలం అది. తొమ్మిదేళ్లు హాకీ ఆడిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది. కానీ, ఇప్పుడు ప్లేయర్లు తమ కుటుంబం కోసం మంచి ఇల్లు కూడా కట్టిస్తున్నారు. ప్లేయర్లందరికీ మంచి ఉద్యోగాలు కూడా ఉన్నాయి’’ అని సవితా చెప్పారు.

రూపిందర్ చిట్కాలు

ప్రస్తుతం, పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలిచే నైపుణ్యంపైనే మ్యాచ్ ఫలితాలు ఆధారపడి ఉన్నాయి.

హాంగ్జౌకు బయల్దేరేముందు బెంగళూరులో సాయ్ ఆధ్వర్యంలో జరిగిన శిక్షణా శిబిరంలో భారత్ ఈ అంశంపైనే ఎక్కువగా శ్రమించింది.

పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడంలో రూపిందర్ పాల్ సామర్థ్యం గురించి హాకీ అభిమానులకు బాగా తెలుసు.

41 ఏళ్ల తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు పతకం గెలవడంలో రూపిందర్ పాల్ కీలక పాత్ర పోషించాడు.

మహిళా జట్టు శిక్షణా శిబిరంలో రూపిందర్ పాల్ తన సేవలు అందించాడు.

దీనివల్ల మహిళా జట్టు డ్రాగ్ ఫ్లికర్ల ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది.

పెనాల్టీ కార్నర్‌లో వేగంగా దూసుకొస్తున్న డిఫెండర్ల నుంచి బంతిని ఎలా కాపాడుకోవాలో రూపిందర్ పాల్ నేర్పించారని భారత జట్టులో భాగమైన ప్లేయర్ దీపిక చెప్పారు.

ఫ్లికింగ్‌తో గోల్ ఎలా చేయాలో కూడా నేర్పించారని, రూపిందర్ పాల్ చిట్కాల వల్ల తమ ఆట ఎంతో మెరుగైందని దీపిక అన్నారు.

సులభంగా గ్రూప్ దశ

భారత మహిళల జట్టు దక్షిణ కొరియా, మలేసియా, హాంకాంగ్, సింగపూర్‌లతో కలిసి పూల్ ‘ఎ’లో ఉంది. ర్యాంకింగ్, అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనల ఆధారంగా చూస్తే భారత్‌కు వీటిలో ఏ జట్టు నుంచి కూడా పెద్దగా ముప్పు కనిపించట్లేదు.

ఎఫ్‌ఐహెచ్ ర్యాంకింగ్స్‌లో భారత్ ఏడో స్థానంలో ఉండగా, దక్షిణ కొరియా 12, మలేసియా 19వ ర్యాంకుల్లో ఉన్నాయి. మలేసియాతో భారత్‌కు ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ, దక్షిణ కొరియా మాత్రం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

పూల్ దశలో టాప్-2లో నిలిచి భారత్ సెమీస్‌కు చేరుకోగలదు. కానీ, సెమీ ఫైనల్ రౌండ్‌లో మాజీ చాంపియన్ జపాన్ లేదా ఆతిథ్య చైనాలతో భారత్ పోటీపడే అవకాశం ఉంది. ఈ రెండు జట్లతో పోటీ చాలా కఠినంగా ఉంటుంది. ర్యాంకింగ్స్‌లో భారత్ కంటే జపాన్ మూడు స్థానాలు దిగువన ఉన్నప్పటికీ, టీమిండియాకు ఎప్పుడూ గట్టి సవాలునే విసురుతుంది. ఇక చైనా విషయానికొస్తే, అసలే పటిష్టమైన జట్టు ఆపై సొంత గడ్డపై ఆడుతుంది కాబట్టి చైనాను ఓడించేందుకు ఎవరైనా తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరచాల్సి ఉంటుంది.

వందన, సలీమా, నవనీత్ త్రయం

సలీమా టెటె, నవనీత్ కౌర్‌లు ఇద్దరూ మిడ్ ఫీల్డర్లు. మైదానంలో వేగంగా కదులుతారని వీరిద్దరికీ పేరుంది. సలీమా దగ్గర బంతి ఉన్నప్పుడు దాన్ని చేజిక్కించుకోవడం కష్టమని చెబుతుంటారు. నవనీత్ కౌర్ వేగంగా ఆడే సమయంలో కూడా మెదడును తెలివిగా ఉపయోగిస్తుంది. సాధారణంగా భారత అటాకింగ్‌లో ఈ ఇద్దరు ప్లేయర్ల పాత్ర చాలా ముఖ్యం.

అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే ఫార్వర్డ్ ప్లేయర్ వందనా కటారియా. ఒకవేళ సలీమా, నవనీత్‌లతో వందన సమన్వయం సరిగ్గా కుదిరితే, అత్యంత కఠినమైన మ్యాచ్‌లను కూడా భారత్ వైపు తిప్పగల సామర్థ్యం ఈ ముగ్గురి సొంతం.

అయితే, ఈ ముగ్గురే ఆటంతా ఆడతారని కాదు. డిఫెన్స్‌లో దీప్ గ్రేస్ ఎక్కా, గోల్‌పోస్ట్ వద్ద సవితా పూనియా చాలా కీలకం.

రాణి రాంపాల్‌కు నిరాశ

రాణి రాంపాల్ సారథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళళ జట్టు అద్భుత ప్రదర్శన చేసి నాలుగో స్థానంలో నిలిచింది.

ఆ తర్వాత హామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీ కారణంగా రాణి రాంపాల్ చాలా కాలం ఆటకు దూరమైంది.

గత జాతీయ క్రీడలతో మళ్లీ మైదానంలోకి దిగిన రాణి, గరిష్టంగా 18 గోల్స్‌ స్కోరు చేసింది. ఈ ప్రదర్శన తర్వాత కూడా ఆమెకు జాతీయ జట్టులో చోటు దక్కలేదు.

జాతీయ జట్టులో స్థానం పొందకపోవడంతో నిరాశ చెందిన రాణి రాంపాల్, ఫిట్‌నెస్ లేని చాలామంది ఆటగాళ్లను ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్టులో ఎంపిక చేశారని ఆరోపించారు.

ఇటీవలి ప్రదర్శనలు చూస్తుంటే భారత జట్టు సమష్టిగా ముందుకు సాగుతున్నట్లుగా అనిపిస్తోందని, నిరంతం కొత్త పాఠాలు నేర్చుకుంటోందని భారత మహిళల కోచ్ షాప్‌మన్ అన్నారు.

అంచనాలను పెంచిన ప్రదర్శనలు

భారత మహిళల హాకీ జట్టు ఇటీవలి ప్రదర్శనలు చూస్త హాంగ్జౌలో మెరుగైన ప్రదర్శనపై ఆశలు చిగురిస్తున్నాయి.

వీటిలో నిరుడు డిసెంబర్‌లో నేషన్స్ కప్‌ను గెలుపొందడం అత్యంత ప్రత్యేకం. ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్‌లో జట్లను చేర్చడం, తీసేయడం కోసం ఈ కప్‌ను నిర్వహిస్తారు.

నేషన్స్ కప్‌ను గెలవడ ద్వారా, 2024-25 ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్ సీజన్‌కు భారత మహిళల జట్టు అర్హత సాధించింది.

ఈ టోర్నీ ఫైనల్లో భారత్ 3-0తో పటిష్టమైన స్పెయిన్ జట్టును ఓడించింది. ఈ ప్రదర్శన భారత జట్టును గొప్ప జట్లలో ఒకటిగా నిలిపింది.

స్పానిష్ హాకీ సెంటినరీ ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన టోర్నమెంట్‌లోనూ భారత్ జట్టు మెరుగైన ప్రదర్శన చేసింది.

కామన్వెల్త్‌లోనూ అద్భుత ప్రదర్శన

బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లోనూ అద్భుతంగా ఆడిన భారత జట్టు 16 ఏళ్ల తర్వాత కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ పతకాన్ని గెలుచుకోవడం కోసం భారత జట్టు పెనాల్టీ షూటౌట్‌లో ( 2-1తో) 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్ చాంపియన్ న్యూజీలాండ్‌ను ఓడించింది. ఈ గెలుపులో సవితా పూనియా అద్భుతమైన డిఫెన్స్ కీలక పాత్ర పోషించింది.

సెప్టెంబర్ 27న సింగపూర్‌తో జరిగే మ్యాచ్‌తో ఆసియా క్రీడల్లో భారత్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. తర్వాత 29న మలేసియాతో, అక్టోబర్ 1న దక్షిణ కొరియాతో, 3న హాంకాంగ్‌తో తలపడుతుంది. అక్టోబర్ 5న సెమీఫైనల్స్, అక్టోబర్ 7న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)