You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సీతారాం ఏచూరి, ప్రొఫెసర్ సాయిబాబా: చనిపోకముందే శరీర దానం చేయొచ్చా? మెడికల్ కాలేజీలకు దానం చేసిన మృతదేహాలను ఏం చేస్తారు?
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
ఇటీవల మరణించిన సీపీఎం నాయకులు సీతారాం ఏచూరి, ప్రొఫెసర్ సాయిబాబాల దేహాలను మెడికల్ కాలేజీలకు వైద్య ప్రయోగాల కోసం దానం చేశారు.
ఇలా దానం చేసిన మృతదేహాలను మెడికల్ కాలేజీలు ఏం చేస్తాయి? దానం చేసిన శరీరాలను మళ్లీ తిరిగి ఇస్తారా? శరీర, అవయవ దానం చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? ఇలాంటి అంశాలు చర్చలోకి వచ్చాయి.
శరీరాన్ని దానం చేయాలనుకుంటే చనిపోయిన తర్వాత చేయాలా? ముందే చేయొచ్చా? అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది.
ఈ అంశాలపై వివరాలు తెలుసుకునేందుకు అఖిల భారత అవయవ, శరీర దాతల సంఘం ప్రతినిధులు, శరీర, అవయవ దాతలు, విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజ్ వైద్యులతో బీబీసీ మాట్లాడింది.
“కాలిపోవడం కంటే, ప్రయోగాలకు ఉపయోగపడటమే గౌరవం”
‘‘మా అమ్మ ఎప్పటి నుంచో తన శరీరాన్ని మెడికల్ కాలేజ్‌కు దానం చేయాలని అనుకున్నారు. ఆమె చనిపోయే నాటికి విల్లు రాయలేకపోయారు. ఆమె కోరిక మేరకు అమ్మ భౌతిక దేహాన్ని మెడికల్ కాలేజ్‌కు దానం చేశాం’’ అని హైదరాబాద్‌కు చెందిన ముని సురేష్ బీబీసీతో చెప్పారు.
“మా అమ్మ దేహం మా కళ్ల ఎదుట కాలిపోయి బూడిదైపోయే కంటే.. వైద్యులను తయారు చేసే ప్రయోగశాలలో ఉండటం ఉపయోగం కదా. అది ఆమెకు, మాకు గౌరవం కూడా” అని ముని సురేష్ బీబీసీతో అన్నారు.
హైదరాబాద్‌కు చెందిన ముని సురేష్ ఇలా చెప్తుంటే...తన శరీరాన్ని దానం చేయాలనుకుంటుంటే కుటుంబ సభ్యులే అడ్డుపడుతున్న అనుభవం విశాఖకు చెందిన సీతాదేవిది.
“నా దేహాన్ని దానం చేస్తుంటే మా పిల్లలు అడ్డుకుంటున్నారు. ఇదెక్కడి న్యాయం? పుట్టుకతో నా సొంతమైన దేహాన్ని నేను దానం చేస్తుంటే పిల్లల అనుమతి ఎందుకు? ఈ నిబంధనను ప్రభుత్వం తొలగించాలి” అని సీతాదేవి అన్నారు.
శరీర, అవయవ దానాన్ని గౌరవంగా భావించేవారు చాలా తక్కువమందే ఉన్నారని, కానీ, ఈ విషయంలో కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్న వారు వందల్లో ఉన్నారని అఖిల భారత అవయవ, శరీర దాతల సంఘం, వ్యవస్థాపక అధ్యక్షురాలు గూడూరు సీతామహాలక్ష్మీ అన్నారు.
అయితే, మరణాంతరం శరీరదానం లెక్కలు తీస్తే.. ఏపీలో పది లక్షల మందికి ఒక్కరే శరీర దానం చేస్తున్నారు. అదే తెలంగాణాలో పది లక్షల మందికి ముగ్గురు శరీర దానం చేస్తున్నారని ఆమె బీబీసీకి తెలిపారు.
శరీర దానం చేయాలంటే...
ఒక వ్యక్తి మృతదేహాన్ని ఏదైనా వైద్య కళాశాలకు ప్రయోగాల కోసం అప్పగించడమే శరీర దానమని ఆంధ్ర మెడికల్ కాలేజీ వైద్యులు చెప్పారు.
ఈ నిర్ణయాన్ని సాధారణంగా చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులే తీసుకుంటారు.
అయితే, శరీరాన్ని దానం చేయాలని ఒక వ్యక్తి బతికి ఉండగానే నిర్ణయం తీసుకుంటే... సమీప వైద్య కళాశాలకుగానీ, దేహ దానాన్ని పొందే అనుమతి ఉన్న ఎన్జీవో సంస్థలకుగానీ, తన శరీరాన్ని దానం చేస్తున్నట్లు అంగీకార పత్రం ఇవ్వాలి.
మరణాంతరం కుటుంబ సభ్యుల అనుమతితో వైద్య సిబ్బంది లేదా ఎన్జీవో ఆ శరీరాలను తీసుకుని వెళ్లవచ్చు.
కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వం నిబంధన విధించింది. వారే శరీరదానం చేసిన వ్యక్తి చనిపోయినట్లు తెలియజేయడంతో పాటు, దేహాన్ని అప్పగించాల్సి ఉంటుంది.
అంగీకార పత్రంలో రాసి ఉన్న విధంగా కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి మరణానంతరం శరీర దానం చేయాలి.
అంగీకార పత్రం రాసి ఇచ్చారు కాబట్టి కుటుంబ సభ్యులను కాదని వైద్య కళాశాల సిబ్బంది లేదా ఎన్జీవో ఆ శరీరాన్ని తీసుకెళ్లకూడదు.
దానంగా తీసుకున్న దేహంతో ఏం చేస్తారు?
మెడికల్ కాలేజీలలో హ్యుమన్ అనాటమి ల్యాబ్స్ ఉంటాయి. అందులో మానవ శరీరంలో ఏయే అవయవం ఏ స్థానంలో ఉంటుంది? అవి ఏ పరిమాణంలో ఉంటాయి? అవెలా పని చేస్తాయి? అనే అంశాలపై మెడికల్ విద్యార్ధుల కోసం ప్రాక్టికల్ క్లాసులు జరుగుతాయి. ఇందుకోసం సాధారణంగా మనిషి బొమ్మలు లేదా డిజిటల్ రూపంలో క్లాసులు చెబుతుంటారు.
వీటితో పాటు శరీరదానం ద్వారా వచ్చిన దేహాలతో అనాటమి పాఠాలు చెప్తారు. శరీర దానం చేసిన వాటితో విద్యార్థులు ప్రయోగాలు చేస్తూ, వాటి ద్వారా శరీర నిర్మాణ శాస్త్రంపై అవగాహన పెంచుకుంటారు.
ఇలా చనిపోయిన వారి దేహాలతో విద్యార్థులకు ఆయా అంశాలపై నేరుగా తరగతులు నిర్వహిస్తారు.
ఒకవేళ శరీర దాతలు ముందుగానే కోరితే, కొంతకాలం ప్రాక్టికల్ వర్క్ చేసిన తర్వాత ఆయా శరీరాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు.
పది లక్షల్లో ఒక్కరు మాత్రమే...
శరీర దానం వైద్య విద్యార్థులకు ఉపయోగపడితే, అవయవ దానం ప్రాణాలను కాపాడుతుంది.
ఒక మనిషి అవయవ దానంతో 8 మందికి ప్రాణం పోయవచ్చని చెబుతారు. ఈ విషయంలో దశాబ్దాలుగా అవగాహన కల్పిస్తున్నా, ఇంకా అనేక అపోహలు ప్రజలను వీడటం లేదని గూడూరు సీతామహాలక్ష్మీ అన్నారు.
సెంట్రల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లెక్కల ప్రకారం...
• 2024 జనవరి నాటికి దేశంలో శరీర దానం చేసిన వారు: 17,061 మంది మాత్రమే.
• 2024 అక్టోబర్ 13 నాటికి దేశంలో అవయవ దానం చేసిన వారు: 1,92,604 మంది.
• ఇందులో ఏపీలో 5,853 మంది, తెలంగాణలో 13,427 మంది అవయవ దాతలు ఉన్నారు.
‘అపోహాలు వద్దు... ఆరోగ్యానికి ఇబ్బంది లేదు’
‘‘సమాజంలో అవయవ, శరీర దానం అంటే అదో పెద్ద తప్పులా భావిస్తారు. అలాగే మూఢ నమ్మకాలూ చాలా మందిలో ఉన్నాయి. కిడ్నీ దానం చేస్తే వచ్చే జన్మలో కిడ్నీ లేకుండా, కళ్లు దానం చేస్తే కళ్లు లేకుండా పుడతారని నమ్ముతారు. ఇది సరైన ఆలోచన విధానం కాదు. శాస్త్రీయంగా ఆలోచించాలి. మనం చేసే ఒక మంచి పని మరొకరి నిండు ప్రాణం నిలబెడుతుంది” అని కిడ్నీ దానం చేసిన విశాఖకు చెందిన టీచర్ జి. కన్యాకుమారి బీబీసీతో అన్నారు.
తన సోదరికి కిడ్నీ దానం చేసి పదేళ్లు అయ్యిందని, తానిప్పటి వరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోలేదని ఆమె చెప్పారు.
అవయవ దానం, శరీర దానం అంశాలపై ఆమె ప్రజలకు అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కూడా.
"శరీర దాన ఉద్యమంలో నేను భాగస్వామినే. వైద్య విద్యార్థులకు నేను ఒక ఉపకరణంగా మారి ఈ సమాజానికి సేవ చేయాలని విల్లు రిజిస్టర్ చేసి అఖిల భారత అవయవ, శరీర దాతల సంఘానికి ఇచ్చాను" అని ఆమె చెప్పారు.
ప్రజల్లో అనేక అపోహలు ఉండటంతో శరీర దానం చేసేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఏపీలో పది లక్షల్లో ఒక్కరు మాత్రమే శరీర దానానికి ముందుకు వస్తుండగా, తెలంగాణలో ఆ సంఖ్య మూడేనని సీతామహాలక్ష్మీ బీబీసీతో చెప్పారు.
ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైద్యులు ఏం చెప్పారు?
బతికున్న మనిషి అవయవ దానం చేయాలని అనుకుంటే కాలేయం, కిడ్నీ దానం చేయవచ్చు. కాలేయం మళ్లీ మూడు నెలల్లో పెరిగిపోతుంది. రెండు కిడ్నీల్లో ఒకటి దానం చేసినా...ఒక దానితో ఆరోగ్యకరమైన జీవితాన్నే గడపొచ్చునని ఆంధ్ర మెడికల్ కాలేజ్(ఏఎంసీ) వైద్యులు చెప్పారు.
‘‘శరీరాన్ని దానంగా తీసుకునేటప్పుడు ఎంతో గౌరవంతో తీసుకుంటారు. కొంతకాలం తర్వాత మెడికల్ కాలేజ్ నుంచి మృతదేహాన్ని తిరిగి కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లవచ్చు. లేదంటే మెడికల్ కాలేజ్ ఆయా మతాల ఆచారాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుంది. అంతిమ సంస్కారాల తర్వాత మృతదేహం తాలూకు బూడిద, ఇతర అవశేషాలను కుటుంబ సభ్యులు తీసుకెళ్లవచ్చు’’ అని డాక్టర్ సురేఖ బీబీసీతో చెప్పారు.
‘దాతలకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలి’
2012లో ఉమ్మడి రాష్ట్రంలో అవయవ దానం, అవయవ మార్పిడికి 'జీవన్ దాన్’ పేరుతో ఒక విభాగం ఏర్పాటు చేశారు. ఇది కొంత వరకు ఫలితాలను ఇస్తోంది.
శరీర దాతలు, అవయవ దాతల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం జీవో నెంబరు 95ని విడుదల చేసింది.
దీంతో పాటు మరికొన్ని కార్యక్రమాలు చేపడితే ప్రజల్లో వీటి పట్ల అవగాహన పెరుగుతుందని సీతామహాలక్ష్మీ సూచించారు.
- అవయవ మార్పిడి ఆపరేషన్లు ప్రభుత్వం ఉచితంగా చేయించాలి.
- అవయవాలు దానం చేసిన వారికి ప్రభుత్వమే ఉపాధి కల్పించాలి.
- శరీర దానం విషయంలో మహాప్రస్థానం వాహనాలను దాతల ఇంటికి పంపించాలి.
- శరీర, అవయవ దానాలు చేసిన వారికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇచ్చి...వాటి ద్వారా బస్సు, రైళ్లలో రాయితీ కల్పించాలి.
- ఒక వ్యక్తి శరీర దానం చేసినా.. మళ్లీ వారి కుటుంబ సభ్యుల అంగీకారం తప్పనిసరనే విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)