You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చైనాలో ఆయనో పెద్ద సైనిక జనరల్, కానీ ప్రభుత్వానికి ఆయనపై అనుమానం ఉంది, అందుకే...
దేశంలోని అత్యున్నత స్థాయి మిలిటరీ జనరల్‌పై దర్యాప్తు ప్రారంభించినట్టు చైనా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ''తీవ్రమైన క్రమశిక్షణ, చట్టఉల్లంఘన'' అనే ఆరోపణలపై ఈ విచారణ మొదలుపెట్టినట్టు తెలిపింది.
జనరల్ ఝాంగ్ యౌషియాపై ఆరోపణలకు సంబంధించి మంత్రిత్వశాఖ ఇతర వివరాలేమీ వెల్లడించలేదు.
ఝాంగ్ యౌషియాను అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు సన్నిహిత సైనిక మిత్రునిగా భావిస్తారు.
‘తప్పు చేశారు’ అనే పదాన్ని చైనాలో సాధారణంగా అవినీతిని సూచించడానికి ఉపయోగిస్తుంటారు.
మరో సీనియర్ సైనికాధికారి జనరల్ లియు జెన్‌లీపై కూడా దర్యాప్తు సాగుతోందని మంత్రిత్వశాఖ తెలిపింది.
జిన్‌పింగ్‌కు సన్నిహితునిగా గుర్తింపు
అక్టోబరులో తొమ్మిదిమంది ఉన్నతస్థాయి జనరల్స్‌ను బహిష్కరించారు. ఇటీవలి దశాబ్దాల్లో మిలిటరీలో జరిగిన అతిపెద్ద ఘటన ఇది.
కమ్యూనిస్టు పార్టీ గ్రూప్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) వైస్ చైర్మన్ ఝాంగ్ వయసు 75 ఏళ్లు. అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ సీఎంసీకి నేతృత్వం వహిస్తారు. చైనా భద్రతాబలగాలపై పూర్తిస్థాయి నియంత్రణ ఆయనదే.
24మంది సభ్యులతో ఉండే అత్యున్నత నిర్ణయాత్మక పొలిట్‌బ్యూరోలో కూడా ఝాంగ్ సభ్యులు.
చైనా కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక జనరల్స్‌లో ఆయన తండ్రి ఒకరు.
1968లో ఝాంగ్ ఆర్మీలో చేరారు. పోరాట అనుభవం ఉన్న అతికొద్ది మంది సీనియర్ నేతల్లో ఆయన ఒకరు.
చైనా మిలిటరీలో సాధారణ పదవీ విరమణ వయసు దాటినా తర్వాత కూడా ఆయన పదవిలో కొనసాగారు. అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఝాంగ్‌పై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం.
డిసెంబరు నుంచే అనుమానాలు
డిసెంబరులో జరిగిన పార్టీ అత్యున్నత స్థాయి కార్యక్రమానికి ఝాంగ్, లియూ హాజరు కాకపోవడంతో వారిపై దర్యాప్తు జరగనుందన్న ప్రచారం జరిగింది. ఇంతలోనే ఈ ప్రకటన వచ్చింది.
అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్షుడు జిన్‌పింగ్ అనేక విభాగాల్లో అవినీతి వ్యతిరేక చర్యలు పెద్ద ఎత్తున ప్రారంభించారు. ఇటీవల మిలిటరీపై దృష్టిపెట్టారు.
కమ్యూనిస్టుపార్టీకి అవినీతి ''అతిపెద్దముప్పు''గా జిన్‌పింగ్ అభివర్ణించారు. అవినీతి వ్యతిరేక పోరాటం తీవ్రంగానూ, కఠినంగానూ ఉందని అన్నారు.
అవినీతిపై దర్యాప్తు సుపరిపాలనకు దోహదపడుతుందని ప్రభుత్వ మద్దతుదారులు అంటుండగా, మరికొందరు మాత్రం దీన్ని రాజకీయ ప్రత్యర్థులను తొలగించే అస్త్రంగా చూస్తున్నారు.
ఝాంగ్, లియుపై విచారణ ప్రారంభమవడంతో సీఎంసీలో సభ్యుల సంఖ్య మరింత తగ్గిపోయింది. ఒకప్పుడు ఏడుగురు సభ్యులుంటే, ఇప్పుడు చైర్మన్ షీ జిన్‌పింగ్, మిలిటరీ క్రమశిక్షణ వ్యవహారాలను చూసుకునే ఝాంగ్ షెంగ్మిన్ మాత్రమే మిగిలారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)