You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మియన్మార్ భూకంపం: కుప్పకూలిన భవనాలు, ధ్వంసమైన రోడ్లు
- రచయిత, జేక్ బర్గెస్
- హోదా, బీబీసీ న్యూస్
మియన్మార్‌లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది.
సగైంగ్ నగరానికి వాయువ్యాన 16 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదైంది.
భూకంపం తీవ్ర స్థాయిలో రావడంతో చైనా, థాయిలాండ్‌ల వరకు ప్రకంపనల ప్రభావం ఉంది.
బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న ఎత్తైన భవనం కూలిపోవడంతో 81 మందికిపైగా కార్మికులు కనిపించడం లేదని థాయిలాండ్ ఉప ప్రధాని వెల్లడించారు.
భూకంపంతో అపార నష్టం వాటిల్లిందని, వందల సంఖ్యలో మరణించి ఉంటారని మాండలే నగరంలో సహాయక చర్యల్లో పాల్గొన్న ఒక వ్యక్తి బీబీసీతో చెప్పారు.
మియన్మార్‌లోని రెండో అతిపెద్ద నగరం మాండలే.
మియన్మార్ రాజధాని నెప్యిడాలో రహదారులు కుంగిపోయినట్లు కథనాలు వస్తున్నాయి. దేశంలోని ఆరు రీజియన్లలో అత్యవసర పరిస్థితిని విధించారు.
15 లక్షల ప్రజల జనాభా ఉన్న మాండలే నగరానికి సమీపంలో మొదట భూకంపం వచ్చింది.
మరో 12 నిమిషాల తర్వాత సగైంగ్‌కు దక్షిణాన 18 కి.మీ దూరంలో 6.4 తీవ్రతతో రెండోసారి భూకంపం వచ్చినట్లు యూఎస్‌జీఎస్ తెలిపింది.
మియన్మార్‌లోని అతిపెద్ద నగరం యాంగాన్.
మొదటి భూకంపం తాలూకూ ప్రభావాన్ని చాలాసేపు అనుభవించానని బీబీసీతో యాంగాన్‌కు చెందిన సో ల్విన్ చెప్పారు.
భూకంపం తర్వాత మరిన్ని ప్రకంపనలు రావొచ్చేమోనని స్థానికులు చాలా భయపడ్డారని ఆయన తెలిపారు.
మొదటి భూకంపం వచ్చినప్పుడు తాను ఇంట్లో వంట చేస్తున్నానని బీబీసీ వరల్డ్ సర్వీస్ న్యూస్‌డే కార్యక్రమంలో బ్యాంకాక్‌లో నివసించే బీబీసీ జర్నలిస్ట్ బుయ్ థు చెప్పారు.
''నేను చాలా భయపడ్డాను. ఆందోళన చెందాను. బ్యాంకాక్‌లోని భవనాలు, భూకంపాలను తట్టుకునేలా ఉండవు. అందుకే భూకంప నష్టం తీవ్రంగా ఉండొచ్చని నేను అనుకుంటున్నా'' అని ఆమె అంచనా వేశారు.
2021 తిరుగుబాటులో సైనిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మియన్మార్‌లో రాజకీయ గందరగోళం నెలకొంది.
దేశంలోని దాదాపు అన్ని స్థానిక రేడియో, టీవీ, ప్రింట్, ఆన్‌లైన్ మీడియాను ప్రభుత్వం నియంత్రిస్తోంది.
ఇంటర్నెట్‌పై కూడా ఆంక్షలు ఉన్నాయి. దీనివల్ల తరచుగా సమాచారాన్ని పంపించడం, అందుకోవడం కష్టతరం అవుతుంది.
నెప్యిడాలోని ఒక ఆసుపత్రి ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ ప్రవేశద్వారం కూలిపోవడంతో, ఆసుపత్రి ఆవరణలోనే క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.
మియన్మార్ మిలిటరీ చీఫ్ మిన్ ఆంగ్ హైంగ్ , భూకంప నష్టాన్ని పరిశీలించారు. భయాందోళనతో ఒకచోట గుమిగూడిన ప్రజలను పరామర్శించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)