ఫ్యాక్ట్ చెక్ - చంద్రయాన్-3: నాలుగేళ్ల కిందటి బీబీసీ వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం

బీబీసీ వరల్డ్ న్యూస్‌లో ప్రసారమైన నాలుగేళ్ల నాటి వీడియోను ఎడిట్ చేసి, తాజా వీడియోగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు పలువురు నెటిజన్లు. దీనిపై బీబీసీ ఫ్యాక్ట్ చెక్ చేసింది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-3‌లోని ‘ల్యాండర్ విక్రమ్’ బుధవారం సాయంత్రం చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సురక్షితంగా దిగి చరిత్ర సృష్టించింది.

ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం తుది అంకాన్ని దేశ, విదేశాల్లో కోట్ల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. బీబీసీ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థలు ఈ ప్రయోగానికి ప్రాధాన్యం ఇచ్చి కవర్ చేశాయి.

చంద్రయాన్-3 ల్యాండింగ్ గురించి బీబీసీ పూర్తి కవరేజీని బీబీసీ న్యూస్ తెలుగు‌ వెబ్‌సైట్‌లో, బీబీసీ న్యూస్ తెలుగు యూట్యూబ్ చానల్, బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీ, ఇతర సోషల్ మీడియా వేదికల్లో చూడొచ్చు.

దుష్ప్రచారానికి వాడిన ఆ వీడియో ఎప్పటిది?

బీబీసీ నాలుగేళ్ల కిందట ప్రసారం చేసిన ఒక వీడియోను విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగిన కొద్దిసేపటికే కొందరు సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విటర్‌లో వక్రీకరించడం ప్రారంభించారు.

అది 2019లో చంద్రయాన్-2 ప్రయోగానికి ముందు బీబీసీ వరల్డ్ టెలివిజన్ ప్రజెంటర్, బీబీసీ భారతీయ కరస్పాండెంట్ మధ్య జరిగిన చర్చకు సంబంధించిన వీడియో.

దాన్ని ఎడిట్ చేసి ట్విటర్‌లో షేర్ చేయడం ప్రారంభించాయి కొన్ని హ్యాండిళ్లు.

సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఆ వీడియో క్లిప్‌కు చంద్రయాన్-3తో ఎలాంటి సంబంధమూ లేదు.

దానిలో కేవలం ప్రజెంటర్ ప్రశ్నను మాత్రమే పూర్తిగా చూపించారు. ప్రజెంటర్ ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో సగం మాత్రం ఎడిట్ చేసి, వీడియో క్లిప్ తయారు చేసి తిప్పారు.

ఈ వీడియో పాతదని స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే దానిపై బీబీసీ వరల్డ్ న్యూస్ లోగో ఉంది. వాస్తవం ఏమిటంటే ఈ లోగోతో ప్రస్తుతం బీబీసీ ఛానల్ ప్రసారం కావడం లేదు.

ఆనంద్ మహీంద్రా లాంటి చాలా మంది ప్రముఖులు కూడా ఈ తప్పుదారి పట్టించే ట్వీట్‌ను షేర్ చేసి, వారి అభిప్రాయాలను పంచుకున్నారు.

బుధవారం రాత్రి ప్రముఖ టీవీ ఛానల్ ఆజ్ తక్ ట్విటర్ హ్యాండిల్ కూడా ఈ ఎడిట్ చేసిన వీడియో ఆధారంగా ఒక పోస్టు పెట్టింది.

ఈ విషయాన్ని ఆ ఛానల్ దృష్టికి బీబీసీ తీసుకెళ్లగా, చానల్ వారు ఆ ట్వీట్‌ను తొలగించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)