You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అలెక్స్ హోనోల్డ్: ఉత్త చేతులతో 101 అంతస్తుల భవనాన్ని గంటన్నరలో ఎక్కేసిన సాహసి
- రచయిత, ఆటిలీ మిచెల్
తైవాన్‌లోని ఓ ఆకాశహార్మ్యాన్ని అమెరికాకు చెందిన ఆరోహకుడు అలెక్స్ హోనోల్డ్ విజయవంతంగా అధిరోహించారు. ఆయన ఎటువంటి రక్షణ పరికరాలు లేకుండా కేవలం ఉత్త చేతులతో ఈ స్కైస్క్రాపర్‌ను ఎక్కేశారు.
'తైపే 101' అని పిలిచే ఈ భవనం.. 508 మీటర్ల (1,667 అడుగులు) ఎత్తు, 101 అంతస్తులతో ఉంటుంది.
వెదురు బొంగును పోలి ఉండే ఈభవనాన్ని స్టీల్, గ్లాసు, కాంక్రీట్‌తో నిర్మించారు.
హోనోల్డ్ గతంలో ఎల్‌క్యాప్టెన్ అనే పర్వత శిఖరాన్ని ఎలాంటి తాడు, సేఫ్టీ గేర్ లేకుండా అధిరోహించిన తొలివ్యక్తిగా గుర్తింపు పొందారు.
కాలిఫోర్నియాలోని యోసెమైట్ జాతీయ పార్కులో ఉండే ఈ గ్రానైట్ శిఖరం 915 మీటర్ల (3,000 అడుగుల) పొడువు ఉంటుంది.
తైపీ 101 ఆకాశహార్మ్యాన్ని హోనోల్డ్ శనివారం( జనవరి 24)నాడే ఎక్కాలని మొదట నిర్ణయించారు. అయితే వాతావరణం తేమగా ఉండడంతో ఆదివారానికి(జనవరి 25) వాయిదా వేశారు.
రికార్డులను బ్రేక్ చేస్తూ...
హోనోల్డ్ భవనం ఎక్కుతున్న దృశ్యాన్ని నెట్‌ఫ్లిక్స్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. అయితే ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ప్రత్యక్ష ప్రసారంలో కనిపించకుండా, కొద్దిగా ఆలస్యంతో ఈ ప్రసారం చేస్తామని ముందుగానే తెలిపింది.
ఈ ఈవెంట్‌కు ముందు వెరైటీ మేగజీన్‌తో మాట్లాడిన నెట్‌ఫ్లిక్స్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ గాస్పిన్.. "అవాంఛనీయమైనది జరగాలని ఎవరూ కోరుకోరుకదా" అన్నారు.
భవనం ఎక్కడానికి హోనోల్డ్ గంట 31 నిమిషాల సమయం తీసుకున్నారు. భవనంపైకి చేరుకున్నాక ఆయన "సిక్" అనే ఒకే పదంతో తన విజయోత్సవాన్ని జరుపుకున్నారు.
తైపే 101 భవనాన్ని అంతకుముందు అధిరోహించిన వారికన్నా సగం కంటే తక్కువ సమయంలోనే హోనోల్డ్ ఈ ఫీట్ చేశారు.
స్పైడర్‌మ్యాన్‌కు 4గంటల సమయం
తనను తాను ‘స్పైడర్‌మ్యాన్’గా చెప్పుకునే ఫ్రాన్స్‌కు చెందిన అలెయిన్ రాబర్ట్ అనే సాహసికునికి తైపే 101 భవనాన్ని అధిరోహించడానికి నాలుగు గంటల సమయం పట్టింది. ఆయన తాడు,రక్షణ పరికరాల సాయంతో ఈ సాహసాన్ని పూర్తి చేశారు.
తైవాన్‌లో ఉపాధ్యక్షులు ష్యో బీ కీమ్ 'ఎక్స్' వేదికగా హోనోల్డ్‌కు అభినందనలు తెలిపారు. "నేను కూడా సిక్ అయ్యానని అంగీకరిస్తున్నా. చాలా కష్టంగా చూశాను" అని పోస్టు చేశారు.
భవనం పైభాగానికి చేరుకోగానే… హోనోల్డ్ భార్య ఆయనకు అభినందనలు తెలిపారు. ఆయన ఈ ఫీట్ చేసే సమయంలో.. గాలి, వేడి వాతావరణంపై ఆమె ఆందోళన చెందారు.
అభిమానుల అరుపులు
హోనోల్డ్ ఈ భవనాన్ని అధిరోహిస్తున్న సమయంలో.. ఆయన దృష్టిని మరల్చే సంఘటన ఒకటి ఎదురైంది. ఆయన 89వ అంతస్తుకు చేరుకున్న సమయంలో… అభిమానులు అరుస్తూ, చేతులు ఊపుతూ కనిపించారు.అభిమానులు, ఆయన ముఖాముఖిగా ఉన్నారు. కేవలం అద్దం మాత్రమే అడ్డుగా ఉంది.
ఈదృశ్యాన్నిహోనోల్డ్, నెట్‌ఫ్లిక్స్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. అందులో అభిమానుల అరుపుల మధ్యే హోనోల్డ్ ఏమాత్రం దృష్టి మరల్చకుండా భవనాన్ని అధిరోహించడం కనిపించింది.
హోనోల్డ్ తన కెరీర్‌లో అనేక ప్రమాదకరమైన పర్వతారోహణలు చేశారు. 'ఫ్రీ సోలో' పేరుతో 'ఎల్‌క్యాప్టెన్'ను హోనోల్డ్ అధిరోహిస్తుండగా తీసిన డాక్యుమెంటరీ.. అకాడమీ అవార్డును గెలుచుకుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)