You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పర్వతం పైకెక్కి దిగలేకపోతే రక్షించారు.. పైన మొబైల్ ఫోన్ మర్చిపోయానని మళ్లీ పైకెక్కి చిక్కుకుపోయాడు
- రచయిత, జోయెల్ గింటో
- హోదా, బీబీసీ న్యూస్
ఫూజీ పర్వతం ఎక్కడానికి వెళ్లిన ఓ 27 ఏళ్ల విద్యార్థిని రెస్క్యూ బృందాలు నాలుగు రోజుల్లో రెండుసార్లు రక్షించాయి.
చైనాకు చెందిన ఓ విద్యార్థి కొన్నాళ్లుగా జపాన్‌లో నివసిస్తున్నారు. ఆయన క్లైంబింగ్ సీజన్ కానీ సమయంలో మౌంట్ ఫూజీని అధిరోహించడానికి వెళ్లారు.
తన క్లైంబింగ్ షూస్ అడుగున స్పైక్స్‌తో ఉండే పరికరం ఊడిపోవడంతో ఆయన కిందికి దిగలేకపోయారు.
దాంతో గత మంగళవారం సముద్ర మట్టానికి దాదాపు 9,800 అడుగుల ఎత్తున చిక్కుకుపోయిన ఆయన్ను హెలికాప్టర్ సహాయంతో తొలుత రక్షించారు.
అయితే పర్వతంపై ఉండిపోయిన తన మొబైల్ ఫోన్, ఇతర వస్తువుల కోసం ఆ విద్యార్థి మళ్లీ పైకి ఎక్కారు.
శనివారం సహాయ సిబ్బంది మరోసారి ఆయన్ను కాపాడారు.
ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నట్లు అధికారులు చెప్పారు.
మౌంట్ ఫూజీపై కఠిన పరిస్థితుల కారణంగా ఆ పర్వతాన్ని జులైలో ప్రారంభమై సెప్టెంబర్‌లో ముగిసే క్లైంబింగ్ సీజన్‌లో మాత్రమే అధిరోహించడానికి అనుమతిస్తారు.
క్లైంబింగ్ సీజన్ ముగిశాక పర్వతంపైకి దారి తీసే అన్ని మార్గాలనూ మూసేస్తారని జపాన్ పర్యావరణ మంత్రిత్వ శాఖ చెప్తోంది.
ఆ విద్యార్థిని రక్షించిన తర్వాత షిజువోకా పోలీసులు ఆఫ్-సీజన్ సమయంలో పర్వతం ఎక్కకూడదని మరోసారి సూచించారు.
వాతావరణం అకస్మాత్తుగా మారే ప్రమాదం ఉంటుందని.. రెస్క్యూ సిబ్బంది కూడా వెంటనే స్పందించే అవకాశం లేకపోవచ్చని.. దారిలో వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండవని చెప్పారు.
ఆఫ్-సీజన్‌లో పర్వతాన్ని ఎక్కకూడదని సూచించినా వినకుండా ఆ విద్యార్థి వెళ్లినందుకు కొందరు ఎక్స్ యూజర్లు ఆయనను విమర్శించగా, మరికొందరు రెస్క్యూ మిషన్‌లకు అయిన ఖర్చును ఆయనే చెల్లించాలన్నారు.
ప్రపంచంలోని పర్వతాలన్నిటిలోనూ కచ్చితంగా కోన్ ఆకారంలో ఉండే పర్వతంగా పేరున్న 3,776 మీటర్ల (12,388 అడుగులు) ఎత్తైన మౌంట్ ఫూజీ జపాన్‌లోని అత్యంత ఆకర్షణీయ ప్రాంతాల్లో ఒకటి.
ఈ పర్వతాన్ని అధిరోహించేవారు ఎక్కువవుతుండడంతో జపాన్ ప్రభుత్వం ఇటీవల క్లైంబింగ్ ఫీ పెంచింది.
2023 జులై, సెప్టెంబర్ మధ్య 220,000 మందికి పైగా ఈ పర్వతాన్ని అధిరోహించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)