You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
స్వార్మ్ డ్రోన్స్: చైనా, పాకిస్తాన్ బలగాలకు భారత సైన్యం వీటితో చెక్ పెట్టగలదా?
- రచయిత, నియాజ్ ఫరూకీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
వాయువ్య సిరియాలోని రష్యా అధీనంలో ఉన్న ఖమీమ్ సైనిక స్థావరంపై ఒక తిరుగుబాటు గ్రూపు దాడి చేసింది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత అంటే, 2018 జనవరిలో అదే ప్రాంతంపై ఏకకాలంలో 13 డ్రోన్లు దాడి చేశాయి.
యుద్ధాల చరిత్రలో ఇలా ఒకేసారి డ్రోన్లు గుంపుగా దాడి చేయడం ఇదే తొలిసారి.
దాడికి దిగిన 13 డ్రోన్లలో ఏడింటిని రష్యా ఆర్మీ పేల్చి వేసింది. మిగతా ఆరింటిని నిర్వీర్యం చేసింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. కానీ, ఇది ఆందోళనకర పరిణామం.
ఇప్పుడు రష్యా, యుక్రెయిన్ వంటి సంప్రదాయ మిలిటరీ శక్తులు కూడా శత్రువులను లక్ష్యంగా చేసుకోవడానికి ‘‘స్వార్మ్ డ్రోన్ల’’ను ఉపయోగిస్తున్నాయి.
స్వార్మ్ డ్రోన్లు అంటే ఏంటి?
డ్రోన్లు అంటే చిన్నగా ఉండే పైకి ఎగిరే మానవరహిత పరికరాలు. వీటిని యూఏవీ (అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్) అని కూడా పిలుస్తారు. అవి విమానాల్లా కూడా ఉండొచ్చు.
ఇవి చౌకగా లభించడంతో పాటు వీటి వాడకం కూడా సులభంగా ఉంటుంది. సంప్రదాయ యుద్ధరీతులను తిప్పిగొట్టే సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉంటాయి. తేలికాపటి వస్తువులను, ఆయుధాలను మోసుకెళ్లగలవు. నేరుగా లక్ష్యాన్ని ఢీకొట్టి, దాన్ని నాశనం చేయగల డ్రోన్లు చాలానే ఉన్నాయి.
ఖమీమ్ వైమానిక స్థావరంపై దాడికి ఉపయోగించిన డ్రోన్లు డిజైన్ పరంగా చూస్తే తొలితరం నాటివి. కానీ, ఏకకాలంలో ఈ డ్రోన్లన్నీ ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకుంటూ, సహకారం అందించుకుంటూ లక్ష్యంపై దాడి చేస్తాయి. మానవ ప్రమేయం లేకుండా అసాధారణ వేగంతో పనిని పూర్తి చేస్తాయి. ఇవి భవిష్యత్తు యుద్ధాలకు ప్రతీకగా నిలిచాయి.
రక్షణ పరిభాషలో ఈ డ్రోన్లు లేదా యూఏవీలను ‘‘స్వార్మ్ డ్రోన్లు’’ అంటారు.
ఈ దాడుల్లో 10 నుంచి 100 వరకు డ్రోన్లు, ఒక్కోసారి 1000 కంటే ఎక్కువ డ్రోన్లు కూడా ఒక సమూహంగా ఎగురుతూ లక్ష్యంపై గురిపెడతాయి.
ఇందులో ప్రతీ డ్రోన్ స్వతంత్రంగా పని చేసుకుంటూ, సమూహంలోని మిగతా డ్రోన్లతో సమన్వయాన్ని కలిగి ఉంటుంది. ఇలా ప్రతీ నిమిషం మనిషి జోక్యం అవసరం లేకుండానే డ్రోన్లు తమ పనిని సమర్థంగా చేస్తాయి.
జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే ఏమన్నారు?
సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులపై భారత రక్షణ వ్యవస్థలు పూర్తి అవగాహనతో ఉన్నాయి.
సిరియాలో జరిగిన డ్రోన్ దాడి గురించి ప్రస్తావిస్తూ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే 2021లో ఇలా అన్నారు.
‘‘కంప్యూటర్ అల్గారిథమ్‌తో నడిచే డ్రోన్ల వాడకం, సంప్రదాయ మిలిటరీ యుద్ధశైలి అయిన యుద్ధట్యాంకులు, ఫిరంగులు ఇతర ఆయుధాల వాడకానికి సవాలుగా నిలిచింది. కీలక వ్యవస్థలపై డ్రోన్ దాడులను అరికట్టడానికి భారత్ కూడా డ్రోన్ల వ్యవస్థపై, యాంటీ డ్రోన్ వ్యవస్థల వాడకంపై కృషి చేస్తోంది.’’
భారత్‌లో గత కొన్నేళ్లలో చేపట్టిన చర్యలు ఆయన మాటలకు రుజువులుగా కనబడుతున్నాయి.
డ్రోన్ అభివృద్ధికి భారత ప్రభుత్వం ఒక స్వతంత్ర విధానాన్ని ఏర్పాటు చేసింది. డ్రోన్లను స్థానికంగా తయారు చేయడానికి 2022-23 బడ్జెట్‌లో 120 కోట్ల రూపాయలను కేటాయించింది. డ్రోన్ల తయారీ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రైవేట్ కంపెనీలతో జతకట్టింది.
2030 నాటికి భారత్‌ను డ్రోన్ హబ్‌గా మార్చాలనే ప్రభుత్వ ప్రయత్నాల్లో ఇది కూడా ఒక భాగం.
డ్రోన్ స్టార్టప్‌లకు ప్రోత్సాహం
‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం కింద, కొత్త సాంకేతికతను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న స్టార్టప్‌లకు భారత ప్రభుత్వం సహాయం చేస్తోంది.
ఈ ప్రయత్నాల్లో భాగంగా, 2018లో డ్రోన్ స్టార్టప్ అవార్డులను అందించడాన్ని భారత్ మొదలుపెట్టింది.
ఈ అవార్డును మొదటిసారిగా భారత వైమానిక దళం కోసం స్వార్మ్ డ్రోన్లను తయారు చేసే ‘న్యూస్ స్పేస్’ సంస్థ గెలుచుకుంది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు సమీర్ జోషి.
‘ఐడియా ఫోర్స్’ అనే డ్రోన్ స్టార్టప్ కంపెనీ తయారు చేసిన డ్రోన్లను చైనాతో వాస్తవాధీన రేఖ వద్ద భారత్ ఇప్పుడు వాడుతోంది.
అధిక ఎత్తులో, నిలువుగా ఎగిరే డ్రోన్లను అందించడానికి ఐడియా ఫోర్స్ కంపెనీతో భారత్ అనేక ఒప్పందాలను చేసుకుంది. ఈ సంస్థ సీఈవో అంకిత్ మెహతా.
సరిహద్దు ప్రాంతాల పర్యవేక్షణలో సైన్యానికి సమర్థమైన ఆయుధాలుగా ఈ డ్రోన్లు ఉపయోగపడతాయి.
ఈ డ్రోన్లు అత్యంత ఎత్తులో సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా ఎగరగలవు. శత్రువులకు దొరకకుండా ఆకాశంలో ఎక్కువ సమయం పాటు వాటికి అప్పజెప్పిన పనులను చేయగలవు.
కశ్మీర్‌లో తీవ్రవాదుల జాడలను గుర్తించడానికి కూడా ఈ కంపెనీ డ్రోన్లను ఉపయోగించారు.
భారత్‌లో డ్రోన్ల తయారీ
అమెరికా డ్రోన్ల వినియోగంతో భారత్‌లో స్థానిక డ్రోన్ల తయారీ కార్యక్రమం మొదలైంది.
అమెరికా డ్రోన్ సహాయంతో ‘లక్ష్య’ అనే పేరుతో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఒక డ్రోన్‌ను తయారు చేసింది.
దీని తర్వాత నిషాంత్, గగన్ అనే స్వల్ప శ్రేణి డ్రోన్లను కూడా డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది. ఈ డ్రోన్లకు అత్యధిక రిజల్యూషన్ ఉండే త్రీడీ చిత్రాలను రూపొందించగల సామర్థ్యం ఉంటుంది.
ఇదే విధంగా రుస్తమ్-2 డ్రోన్‌కు సొంతంగా ల్యాండింగ్ చేయగల సామర్థ్యం ఉంది. నిఘా, గూఢచర్య కార్యకాలాపాలకు దీన్ని ఉత్తమ డ్రోన్‌గా పరిగణిస్తారు.
భారత్ చాలా డ్రోన్లను ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకుంది. 1998లో తొలిసారిగా ఇజ్రాయెల్ నుంచి డ్రోన్ల దిగుమతి మొదలుపెట్టింది.
భారత్‌లో డ్రోన్ల ఉత్పత్తి సామర్థ్యం 2025 నాటికి 4.2 బిలియన్లకు, 2030 నాటికి 23 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అంచనా వేసింది.
ప్రిడేటర్ తరహా డ్రోన్లను భారత్ తయారు చేయగలదా?
భారత డ్రోన్ సామర్థ్యం తక్కువ, మధ్యస్థ ఎత్తులో పనిచేసే డ్రోన్లకే పరిమితమైంది.
దేశీయంగా అభివృద్ధి చేసినవి కావొచ్చు లేదా దిగుమతి చేసుకున్నవి కావొచ్చు భారత్ ఈ స్థాయి వరకే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
అధిక ఎత్తుకు ప్రయాణించే సామర్థ్యం ఉండే ఆధునిక డ్రోన్ల కోసం భారత్ ఇతర దేశాలపై ఆధారపడుతుంది.
ఇటీవలి అమెరికా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 31 ప్రిడేటర్ డ్రోన్ల కోసం ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రిడేటర్ డ్రోన్లు అత్యధిక ఎత్తులో ఎగురుతాయి. వాటిని ‘‘హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్’’ డ్రోన్లు అని పిలుస్తారు.
ఈ తరహా డ్రోన్లను దేశీయంగా తయారు చేసే అవకాశం ప్రస్తుతం భారత్‌కు లేదని, వాటి కోసం ఇతర దేశాలతో భారత్‌కు భాగస్వామ్యం కూడా లేదని రక్షణ వ్యవహారాల నిపుణుడు బ్రిగేడర్ (రిటైర్డ్) రాహుల్ భోస్లే చెప్పారు.
మెరుగైన డ్రోన్లను ఉత్పత్తి చేస్తున్న చైనా
భారత సరిహద్దు దేశాల్లో ఒకటైన చైనా సామర్థ్యాల గురించి మాట్లాడుకుంటే, చైనా సొంతంగా స్థానిక డ్రోన్ ఉత్పత్తి వ్యవస్థను అభివృద్ధి చేసుకుంది.
‘‘21వ దశకం తొలినాళ్లలోనే తమ వద్ద ఉన్నవి అవసరాలకు సరిపోవనే విషయాన్ని చైనా గుర్తించింది. ఇంకా తమకు మెరుగైన, ప్రత్యేకమైన వ్యవస్థ కావాలని చైనా నిర్ణయించుకుంది. ఆ దిశగా పనిని మొదలుపెట్టింది. గత 20 ఏళ్లలో చైనా అంతా మార్చేసింది’’ అని సమీర్ జోషి చెప్పారు.
ఇప్పటివరకు యుద్ధ పరిస్థితుల్లో చైనా డ్రోన్లను వాడలేదు కాబట్టి వాటి సామర్థ్యాలను అంచనా వేయడం కష్టమే. కానీ, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని చైనా డ్రోన్ల శ్రేణులను తయారు చేస్తుందనే విషయం సుస్పష్టం.
చైనా, తుర్కియే మద్దతుతో పాకిస్తాన్ వద్ద కూడా డ్రోన్లు ఉన్నాయి. తుర్కియే నుంచి పాకిస్తాన్‌కు లభించిన డ్రోన్లు ఎంత శక్తిమంతమైనవో అజర్‌బైజాన్- అర్మేనియా, యుక్రెయిన్-రష్యా వంటి యుద్ధాలతో తేలిపోయింది.
డ్రోన్ల తయారీలో భారత్ ‘గ్లోబల్ హబ్’ కాగలదా?
చైనా, అమెరికా వంటి దేశాలు ఆధిపత్యం ప్రదర్శిస్తున్న రంగంలో పట్టు సాధించడానికి సమీర్ జోషి, మెహతా వంటి వ్యక్తులపై భారత్ ఆధారపడుతోంది.
తుర్కియే, ఇరాన్ వంటి దేశాలు కూడా ఈ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
భారత్‌లో డ్రోన్లను తయారు చేసేవారు సాఫ్ట్‌వేర్ లైసెన్సింగ్, డ్రోన్లలో వినియోగించే హార్డ్‌వేర్ దిగుమతుల్లో తలెత్తే ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తున్నారు.
ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసిస్తున్నప్పటికీ, ఈ రంగంలో నిధుల సమస్య స్థిరంగా అలాగే ఉందంటున్నారు.
ఇప్పుడు టెక్నాలజీ మీద ఏ ఒక్కరికో పూర్తి ఆధిపత్యం లేదని, కానీ, నిధుల అవసరం చాలా ఎక్కువగా ఉందని రక్షణ, అంతర్జాతీయ సంబంధాల నిపుణుడు ఖమర్ అఘా అన్నారు.
ఒకవేళ ప్రభుత్వం నిధులను సమకూర్చితే భారత్‌కు చాలా మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- ట్రినిటైట్: అణుబాంబు బద్దలై రంగు రాళ్లు బయటపడ్డాయి
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)