You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వర్షం పడితే నగరాలు అతలాకుతలమే.. దేశంలో ఈ పరిస్థితి పదేపదే ఎందుకు వస్తోంది?
- రచయిత, నికితా యాదవ్
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
"ఈ గందరగోళానికి బాధ్యులెవరు?"
భారతదేశ ఆర్థిక రాజధాని ముంబయి అంతటా ఈ ప్రశ్న ప్రతిధ్వనించింది.
వరదల్లో చిక్కుకుపోయి, ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర నిరాశలో కూరుకుపోయిన ముంబయి ప్రజల ప్రశ్న ఇది.
భారీ వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేశాయి. రుతుపవనాల ప్రభావం పూర్తిగా మొదలు కాకముందే వరదలు ముంచెత్తాయి. రోడ్లు నదులను తలపించాయి. ప్రయాణిస్తున్న వాహనాలు కూడా పాడైపోయాయి. కొన్ని గంటల వ్యవధిలోనే లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.
అండర్ గ్రౌండ్‌లో కొత్తగా నిర్మించిన మెట్రో స్టేషన్ కూడా ఈ భారీ వర్షాన్ని తట్టుకోలేకపోయింది. బురద నీటితో నిండిన మెట్రో స్టేషన్ ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
ఇంకా వర్షాకాలం రాకముందే ముంచెత్తిన వరదలు నగరంలో మౌలిక సదుపాయాల లోపాలను మరోసారి బయటపెట్టాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మురుగు కాలువల్లో చెత్త పేరుకుపోవడం, మెట్రో నిర్మాణం నుంచి వచ్చిన శిథిలాలే ఈ సమస్యకు కారణమంటూ, మౌలిక సదుపాయాల నిర్వహణాబాధ్యత వహించే, భారత్‌లో అత్యంత సంపన్న పౌర సంస్థలలో ఒకటైన బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (బీఎమ్‌సీ)మొదట్లో ఆరోపించిందని ది హిందుస్తాన్ టైమ్స్ వార్తాపత్రిక రాసింది.
విమర్శలు రావడంతో.. బీఎమ్‌సీ వరద ప్రాంతాలలో నీటి తొలగింపు పంపులను ఏర్పాటు చేసింది. కాలువల నుంచి వ్యర్థాలను తొలగించే పని మొదలుపెట్టింది. కానీ చాలా నివాసిత ప్రాంతాలకు ఈ చర్యలన్నీ ఆలస్యంగా చేరాయి.
అయితే ముంబయికి ఇదేమీ కొత్తా కాదు, వింతా కాదు.
ఉత్తరాన దిల్లీ నుంచి దక్షిణాన బెంగళూరు వరకు , భారతదేశంలోని అతిపెద్ద నగరాలను ప్రతి వర్షాకాలంలో వరదలు ముంచెత్తుతాయి. రోడ్లు కుంగిపోతాయి, డ్రైనేజీలు పొంగిపొర్లుతాయి, మౌలిక సదుపాయాలు దెబ్బతింటాయి, ట్రాఫిక్ నిలిచిపోతుంది.
ప్రణాళికాబద్ధం కాని నగరీకరణ, పేలవమైన మౌలిక సౌకర్యాలు, ఏళ్ల తరబడి పర్యావరణంపై నిర్లక్ష్యం మొదలైనవి ఈ సమస్యలకు మూలకారణాలని నిపుణులు చెబుతున్నారు.
"నగరం ఎంత వేగంగా విస్తరిస్తోందంటే మౌలిక సదుపాయాల కల్పన కష్టమైపోతోంది. ముఖ్యంగా నీటి వసతి, మురుగునీటి పారుదల వ్యవస్థలలో ఇది మరింత కష్టమవుతోంది" అని దిల్లీలోని ఆర్కిటెక్ట్, అర్బన్ ప్లానర్ దిక్షు కుక్రేజా అన్నారు.
"చాలా నగరాలు దశాబ్దాల కిందట రూపొందిన పాత వ్యవస్థలపైనే ఆధారపడ్డాయి. నగరాలు అపరిమితంగా విస్తరిస్తున్నాయి కానీ అదనపు వర్షపు నీటిని పీల్చుకునే సహజ పారుదల కాలువలు(డ్రైనేజ్ చానల్స్), చిత్తడి నేలలు, నీటి వనరులను నిర్లక్ష్యం చేయడమో లేదంటే వాటిపైనే నిర్మాణాలు చేయడమే ఎక్కువైంది.." అని ఆయన చెబుతున్నారు.
అన్ని నగరాలకు ఒకేరకమైన పరిష్కారం పనిచేయదు. ప్రతి నగరానికి ప్రత్యేకమైన పరిష్కారాలు ఉన్నాయన్నారు. ఆయా నగరాల భౌగోళిక, జనాభా, వాతావరణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, పరిష్కారాలు సూచించాలని నిపుణులు అంటున్నారు.
భారతదేశ వార్షిక వర్షపాతంలో 80% వర్షాకాలంలోనే నమోదవుతుంది. సాధారణంగా జూన్ నుంచి ప్రారంభమై సెప్టెంబర్ వరకు వర్షాకాలం ఉంటుంది.
వ్యవసాయానికి, లక్షలాది మంది భారతీయ రైతుల జీవనోపాధికి రుతుపవనాలు చాలా కీలకమైనవి. సరైన నీటిపారుదల మార్గాలు లేని కొన్ని ప్రాంతాలలో రైతులు వర్షాధార పంటలపైనే ఆధారపడతారు.
కానీ వాతావరణ మార్పు వల్ల అకాల వర్షాలు, ఆకస్మిక వరదలు, కరవు వంటి వాతావరణ ప్రభావం పెరిగిందని, అత్యంత సాధారణంగా మారిన ఈ ప్రభావం లక్షలాది మందిపై ప్రత్యక్షంగా పడుతోందని నిపుణులు అంటున్నారు.
ఈ సంవత్సరం రుతుపవనాలు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో వారం ముందుగానే ప్రవేశించాయి, దీంతో తగిన ఏర్పాట్లు చేసేందుకు అధికారులకు సమయం దొరకలేదు.
"తూర్పు మధ్య అరేబియా సముద్రంపై ఏర్పడిన అల్పపీడనం వల్ల రుతుపవనాలు వేగంగా కదిలాయి" అని వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్‌లో వాతావరణ మార్పుల విభాగం ఉపాధ్యక్షుడు మహేష్ పలావత్ అన్నారు.
దిల్లీలో ఏటా పోటెత్తే వరదలకు ‘మింటో వంతెన’ సాక్ష్యంగా నిలుస్తోంది. దాదాపు ప్రతి ఏడాది భారీ వర్షం తర్వాత ఒక బస్సో లేదా లారీనో ఈ వంతెన కింద చిక్కుకుపోతాయి. ఇది వరదలవల్ల నగరం పడుతున్న ఇబ్బందిని చూపించే ప్రత్యక్ష ఉదాహరణ.
1901 తరువాత దిల్లీలో ఈ ఏడాది మే నెలలో 185 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఎండలు మండించే మే నెల చల్లగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
దిల్లీ నుంచి 2,000 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్న బెంగళూరులో సమస్య భిన్నంగా కనిపిస్తోంది. కానీ ఆ రెండిటి మూల కారణం ఒకటే.
ఒకప్పుడు అదనపు వర్షపు నీటి నిర్వహణలో సాయపడే సరస్సులకు పేరుగాంచింది బెంగళూరు. ఈ నీటి వనరులలో చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయి. ఇప్పుడు వాటి స్థానంలో అపార్ట్‌మెంట్లు, వ్యాపార కేంద్రాలు, రోడ్లు ఉన్నాయి. నగరాన్ని వరదలకు గురిచేస్తున్నాయి.
"బెంగళూరు మూడు ప్రధాన లోతట్టు ప్రాంతాలతో విస్తరించిఉంది. వాటి ద్వారా నీరు సహజంగా ప్రవహిస్తుంది. నగరంలోని చాలా సరస్సులు ఈ లోతట్టు ప్రాంతాల్లోనే ఉన్నాయి" అని సరస్సు పరిరక్షణ కార్యకర్త రామ్ ప్రసాద్ వివరించారు.
ఈ ప్రాంతాలలో మొదట్లో నిర్మాణాలు లేవు. కానీ కాలక్రమేణా ఆక్రమణలు, చట్టంలో మార్పులు ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మించడానికి అనుమతించాయని ఆయన చెప్పారు.
"వరదలకు అడ్డుకట్ట వేసే సరస్సులను నిర్మాణ ప్రాంతాలుగా మారిస్తే, నీరు ఎక్కడికి వెళుతుంది? ఎక్కడికీ వెళ్ళలేదు. అక్కడే నిలిచిపోతుంది. ప్రస్తుతం బెంగళూరులో మనం చూస్తున్నదంతా పేలవమైన పట్టణ ప్రణాళిక ఫలితమే."
కొండపై ఉన్న బెంగళూరును సాధారణంగా వరదలు ముంచెత్తవు. కానీ ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మానవ తప్పిదమని ప్రసాద్ నొక్కి చెప్పారు.
భవన నిర్మాణ నిబంధనల ఉల్లంఘనలు, ముఖ్యంగా మురికినీటి కాలువలను ఇరుకుగా చేసే లేదా వాటిపై నేరుగా నిర్మించే నిర్మాణాలు పరిస్థితిని మరింత దిగజార్చాయని ఆయన అన్నారు.
మరోవైపు..ముంబయి నగరం మాత్రం భౌగోళిక పరిస్థితి కారణంగా సవాళ్లు ఎదుర్కొంటోంది. ఉదాహరణకు, ముంబయిలోని అనేక ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలే. సముద్రానికి దగ్గరగా ఉన్నాయి, దీని వలన భారీ వర్షాలు, అధిక ఆటుపోట్ల సమయంలో వరదలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వరదలకు సహజ అడ్డంకులుగా పనిచేసే మడ అడవులను నరికివేయడం, నీరు ఇంకిపోవాల్సిన ప్రదేశాలలో నిర్మాణాలు చెపట్టడం వంటి చర్యలే పరిస్థితిని మరింత దిగజార్చాయి అని నిపుణులు అంటున్నారు.
ఈ సమస్య మొత్తం వ్యవస్థలో లోతుగా పాతుకుపోయింది. భవిష్యత్తులో వాతావరణం ఎలా మారవచ్చో (తీవ్రమైన వర్షం లేదా వేడి వంటివి) పరిగణనలోకి తీసుకోకపోవడం, మంచి ప్రణాళికలు కూడా సరిగా అమలు చేయకపోవడం, నియమాలు, చట్టాలు సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల సమస్య మరింత పెరగుతుంది. దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయడానికి బదులుగా.. నాయకులు సాధారణంగా విపత్తు సంభవించిన తర్వాత మాత్రమే స్పందిస్తారు అని ఆయన అన్నారు.
ఇది కేవలం పెద్ద నగరాల సమస్య మాత్రమే కాదు. చిన్న పట్టణాలు కూడా తరచుగా ముంపుకు గురవుతున్నాయి.
గత వారాంతంలో భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కనీసం 30 మంది మరణించారు . పదివేల మందిపై వరదల ప్రభావంపడింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కాబట్టి, దీనిని నివారించడానికి ఏదైనా చేయవచ్చా? అంటే..
"చెయ్యొచ్చు" అని కుక్రేజా అంటున్నారు, కానీ అది దీర్ఘకాలిక, సమన్వయ వ్యూహంలో భాగమైతేనే సాధ్యమవుతుంది.
అధిక-ప్రమాదకరమైన జోన్స్‌ని గుర్తించడానికి, కమ్యూనిటీలను అప్రమత్తం చేయడానికి మ్యాపింగ్, రియల్-టైమ్ సెన్సార్లను ఉపయోగించాలని ఆయన సూచిస్తున్నారు. ముందస్తు నమూనాలు.. ప్రజలు ఇబ్బుందులు పడకుండా మెరుగైన ప్లాన్‌లు రూపొందించడంలో సహాయపడతాయని ఆయన చెప్పారు.
"కానీ సాంకేతికత మాత్రమే పరిష్కారం కాదు, దానికి సమన్వయ పాలన, సమాజ ప్రమేయం కూడా తోడవ్వాలి" అని ఆయన అన్నారు.
భారతదేశంలోని నగరాలు వర్షాలను తట్టుకోవాలంటే, వాటికి నీటిని డీ-డీఫ్రాయింగ్ పంపులు, త్వరిత పరిష్కారాలు మాత్రమే కాదు.. నష్టం జరగకముందే భవిష్యత్తు ఏంటని ఆలోచించే ప్రణాళిక కూడా అవసరం అని కుక్రేజా చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)