You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అస్సాం నుంచి సిక్కిం వరకు ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తిన వరదలు, 30 మంది మృతి
- రచయిత, దిలీప్ కుమార్ శర్మ
- హోదా, బీబీసీ ప్రతినిధి
గత కొన్ని రోజులుగా అస్సాం, దాని పొరుగున ఉన్న ఈశాన్య రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా, అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి.
భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో వర్షాల కారణంగా 30 మంది మరణించారు. అనేక ప్రాంతాలలో వరదలు ముంచెత్తుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
మే 31 సాయంత్రం అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం, అస్సాంలో 12 జిల్లాల్లోని 175 గ్రామాలు నీటమునిగాయి.
అస్సాంలో వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి వేర్వేరు సంఘటనల్లో ఇప్పటివరకు ఎనిమిది మంది మరణించారు. కాగా, 60 వేలమందికిపైగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అస్సాంలో వివిధ ప్రాంతాలలోని వందలాది మంది తమ ఇళ్లను వదిలి సహాయ శిబిరాలకు వచ్చారు.
వరదల కారణంగా లఖీంపుర్ జిల్లా అత్యధిక నష్టాన్ని చవిచూసింది. జిల్లా యంత్రాంగం లఖీంపుర్‌లో పదికి పైగా సహాయ శిబిరాలను ప్రారంభించింది. సహాయక శిబిరాల్లోని బాధితులకు పప్పుధాన్యాలు, బియ్యం, నూనె, ఉప్పు, అటుకులు, బెల్లం పంపిణీచేసింది.
శనివారం లఖీంపుర్లో ఒకరు, గోలాఘాట్‌లో ఇద్దరు వరద నీటిలో మునిగి చనిపోయారని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. దీనికి ఒక రోజు ముందు, గౌహతిలోని బోండాలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మరణించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అస్సాంలో వరద పరిస్థితి గురించి ఫోన్‌లో ఆరా తీశారు. వరదలను ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా సాయపడతామని భరోసా ఇచ్చారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఎక్స్‌లో చెప్పారు.
అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు, మణిపూర్ గవర్నర్‌తో మాట్లాడి తాజా పరిస్థితి గురించి సమాచారం తీసుకున్నానని, పరిస్థితిని ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని హోంమంత్రి అమిత్ షా తన సోషల్ మీడియా ఖాతాలో తెలిపారు.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అస్సాంతో పాటు, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వరదలు, కొండచరియలు విరిగిపడిన సంఘటనలు చాలా జరిగాయి.
అస్సాంతో పాటు, మిజోరం, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడింది. రోడ్లు కొట్టుకుపోయాయి, ఇళ్ళు ధ్వంసమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
మిజోరంలో విరిగిపడిన కొండచరియలు
మిజోరంలో అనేక చోట్ల కొండచరియలు విరిగిపడి 50 కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.
కొండచరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు మరణించినట్లు సమాచారం. మరణించిన వారిలో ముగ్గురు మయన్మార్ శరణార్థులు కూడా ఉన్నట్టు గ్రామ పంచాయతీ తెలిపింది.
మరో ఘటనలో ఇద్దరు మరణించినట్టు సమాచారం.
మేఘాలయలో పిడుగుపాటు, ఇద్దరు బాలికలు మృతి
మేఘాలయలో కురిసిన భారీ వర్షాల కారణంగా పిడుగుపాటుకు ఇద్దరు బాలికలు మృతి చెందగా, మరొకరు నీళ్లలో మునిగి చనిపోయారు.
మేఘాలయలో మరణాల సంఖ్య ఏడుకు చేరుకుంది. రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల వల్ల 49 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో తొమ్మిది మంది మృతి
అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కామెంగ్‌లో మరణించిన ఏడుగురి కుటుంబాలకు, జిరో వ్యాలీలో రెండుకుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.4 లక్షల నష్టపరిహారం ప్రకటించింది.
ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని సీఎం ఖాండూ కోరారు.
ఇంఫాల్‌లో వరదలు
మణిపూర్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నాలుగు వేల మందికి పైగా ప్రజలు ఇబ్బందులుపడ్డారు. వరదల కారణంగా దాదాపు 880 ఇళ్లు దెబ్బతిన్నట్లు సమాచారం.
ఖురయ్, హింగాంగ్, చెకోన్ ప్రాంతాల్లో నది కట్ట తెగిపోవడంతో రాజధాని ఇంఫాల్‌లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఈ ప్రాంతాలను గవర్నర్ అజయ్ కుమార్ భల్లా సందర్శించారు.
సైన్యం, అస్సాం రైఫిల్స్ సిబ్బంది ఇంఫాల్ తూర్పు జిల్లాలోని మునిగిపోయిన ప్రాంతాల నుంచి సుమారు 800 మందిని రక్షించి సహాయ శిబిరాలకు తరలించారు.
గత శుక్రవారం నుంచి సిక్కింలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడటంతో, ఉత్తర సిక్కింలోని మిగిలిన ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయని బీబీసీ హిందీ అసోసియేట్ జర్నలిస్ట్ ప్రభాకర్ మణి తివారీ తెలిపారు.
నిరంతర వర్షాల కారణంగా, తీస్తా నది నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుకుందని పోలీసులు తెలిపారు.దీనివల్ల మంగన్‌ను చుంగ్‌తాంగ్‌కు కలిపే బెయిలీ వంతెన పాక్షికంగా దెబ్బతింది.
మరోవైపు, మున్సితాంగ్ ప్రాంతంలో కారు నదిలో పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న 11 మందిలో తొమ్మిది మంది ఆచూకీ ఇంకా తెలియలేదు.అందులో ఒడిశా, ఉత్తరప్రదేశ్, త్రిపుర రాష్ట్రాలకు చెందిన పర్యటకులు ఉన్నారు.
వీరిలో ఇప్పటివరకు ఒడిశాకు చెందిన ఇద్దరు పర్యటకులను మాత్రమే రక్షించగలిగారు.
గల్లంతయినవారిలో నలుగురు ఒడిశాకు చెందినవారు, ఇద్దరు త్రిపురకు చెందినవారు, ఇద్దరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు ఉన్నారని సిక్కిం ప్రభుత్వం తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)