తత్కాల్‌లోనూ రైలు టికెట్ దొరకట్లేదా? ఏం జరుగుతుందంటే?

    • రచయిత, అల్లు సూరిబాబు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''దిల్లీలో ఉద్యోగం చేస్తున్నాను. అత్యవసరంగా హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చింది. రైలు టికెట్ బుక్ చేద్దామని తెలంగాణ ఎక్స్‌ప్రెస్ థర్డ్ ఏసీ రిజర్వేషన్ చార్ట్ చూస్తే జూన్ 21 వరకు వెయిటింగ్ లిస్ట్ ఉంది. జూన్ 28 తేదీకి ఆర్ఏసీ చూపిస్తోంది. దక్షిణ్ ఎక్స్‌ప్రెస్, రాజధాని తదితర రైళ్లలోనూ ఇదే పరిస్థితి. తత్కాల్ స్కీమ్‌లోనైనా టికెట్ దొరుకుతుందేమోనని ఆన్‌లైన్‌‌లో ప్రయత్నిస్తే వివరాలు నింపే లోపే వెయిటింగ్ లిస్టుకు వెళ్లిపోయింది. ఇప్పుడే కాదు తరచుగా ఇదే సమస్య ఎదురవుతోంది'' అని హరికృష్ణ అనే ప్రయాణికుడు బీబీసీతో చెప్పారు.

‘తత్కాల్ స్కీమ్‌లోనూ రైలు టికెట్ దొరకడం గగనమైపోయింది. దూరప్రాంతాలకు వెళ్లే ఏ రైలు రిజర్వేషన్ చార్ట్ చూసినా వెయింటింగ్ లిస్ట్ కొండవీటి చాంతాడంత ఉంటోంది’ అని సగటు ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.

వేసవిలోనే కాదు సంక్రాంతి, దసరా వంటి పండుగల సెలవుల్లోనూ రైలు ప్రయాణానికి రిజర్వేషన్ టికెట్ దొరకట్లేదు. ఇక శుక్ర, శని, ఆదివారాల్లోనూ ఇదే స్థాయిలో రద్దీ ఉంటోంది. కొన్ని రైళ్లకు నెల రోజుల తర్వాత తేదీకి చూసినా ‘నాట్ అవైలబుల్’ అని వచ్చేస్తోంది.

అత్యవసరంగా ప్రయాణించాల్సిన వారి కోసం రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చిన తత్కాల్ స్కీమ్‌లోనూ టికెట్ దొరకడం కష్టమవుతోంది.

నిమిషాల వ్యవధిలోనే కోటా ఖాళీ అయిపోతోంది.

అదే సమయంలో ఏజెంట్లను సంప్రదిస్తే టికెట్ దొరుకుతోందని, టికెట్ ఫేర్‌కు అదనంగా డిమాండ్‌ను బట్టి రూ. 200 నుంచి రూ. 500 వరకు ఏజెంట్లు కమీషన్ తీసుకుంటున్నారని ఓ ప్రయాణికుడు చెప్పారు.

రైలు బెర్త్‌ల సామర్థ్యంలో సుమారు 30 శాతం వరకు తత్కాల్ స్కీమ్‌లోకి తెస్తున్నా టికెట్ కష్టమవుతోందంటే, ఈ వ్యవహారం వెనుక ఏదో గుట్టు ఉందనే సందేహాలు బాధితుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

'తత్కాల్' స్కీమ్ ఎందుకంటే...

అనుకోకుండా అప్పటికప్పుడు ఆఖరి నిమిషంలో దూరప్రాంతానికి వెళ్లాల్సి వస్తే 'ఎమర్జెన్సీ కోటా' కింద రైల్వే టికెట్ కోసం దరఖాస్తు చేసుకొనే సౌలభ్యం ఎప్పటి నుంచో ఉంది.

దానికి ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారుల సిఫారసు ఉండాలి.

అలా కాకుండా, ఎవరైనా కౌంటర్ దగ్గరకు వెళ్లి, లేదంటే ఆన్‌లైన్‌లో ఎక్కడి నుంచైనా నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా రైల్వే శాఖ 'తత్కాల్' విధానాన్ని 1997లో తీసుకొచ్చింది.

దాదాపుగా అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అన్ని రకాల రిజర్వ్ క్లాస్‌ బెర్తులకు (కొన్ని రైళ్లలో ఫస్ట్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్ తప్ప) ఈ సౌలభ్యం ఉంది. కోచ్ మొత్తం సామర్థ్యంలో గరిష్ఠంగా 30 శాతం వరకు సీట్లను తత్కాల్ కోటా కింద రైల్వే శాఖ ఇస్తోంది.

రైలు బయల్దేరే సమయానికి సరిగ్గా ఒక్క రోజు ముందు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా మొబైల్ యాప్‌‌లో 'తత్కాల్' టికెట్ బుక్ చేసుకోవచ్చు.

ఏసీ క్లాస్‌ల్లో టికెట్ కోసం ఉదయం 10 గంటలు, నాన్-ఏసీ తరగతులకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రైల్వే స్టేషన్లలో టికెట్ కౌంటర్‌లో తత్కాల్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐఆర్‌సీటీసీ అధీకృత ఏజెంట్లకు మాత్రం 15 నిమిషాల తర్వాత, అంటే 10:15 గంటలకు తత్కాల్ టికెట్ బుకింగ్ అందుబాటులోకి వస్తుంది.

సెకండ్ క్లాస్ టికెట్లకు బేసిక్ చార్జీలో 10 శాతం, మిగతా క్లాస్‌లకు 30 శాతం అధికంగా తత్కాల్‌ చార్జీ కింద రైల్వే శాఖ వసూలు చేస్తోంది.

పరిమితులున్నా హాట్‌కేక్‌ల్లా

ఒక్క పీఎన్ఆర్ (ప్యాసింజర్ నేమ్ రికార్డ్) కింద గరిష్ఠంగా నలుగురికి తత్కాల్ ఇ-టికెట్‌లు తీసుకోవచ్చు.

ఒక్క రోజుకు ఓపెనింగ్ అవర్స్‌లో ఒక్క యూజర్-ఐడీపై గరిష్ఠంగా రెండు తత్కాల్ టికెట్లు(ఒక్కో టికెట్‌లో నలుగురు వరకు ఉండొచ్చు) తీసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంది.

ఒకవైపు పరిమితులున్నా మరోవైపు నిమిషాల్లోనే తత్కాల్ కోటాలోనూ టికెట్లు హాట్‌కేక్‌ల్లా అయిపోతున్నాయి.

కొందరు ఫేక్ ఐడీలతో రైల్వే టికెట్లు తీసుకొని, అవసరమైనవారికి వాటిపై భారీగా కమీషన్ తీసుకొని విక్రయిస్తారన్న ఆరోపణలు ప్రయాణికుల నుంచి తరచూ వినిపిస్తుంటాయి.

''ఇటీవల తిరుపతి వెళ్లేందుకు రైల్వే టికెట్ల కోసం ప్రయత్నిస్తే వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. ఏజెంట్‌ను సంప్రదిస్తే మాకు కన్ఫర్మ్ బెర్త్‌లతో టికెట్ తెచ్చి ఇచ్చారు'' అని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన కిశోర్ బీబీసీతో చెప్పారు.

''తత్కాల్ స్కీమ్‌లో అక్రమాలకు ఆస్కారం తక్కువ. బెర్త్‌ల కేటాయింపు అంతా కేంద్రీకృత వ్యవస్థ ద్వారా జరుగుతుంది. దేశంలో ఏ స్టేషన్ నుంచైనా ఆఫ్‌లైన్‌లో లేదంటే ఆన్‌లైన్‌లో తత్కాల్ స్కీమ్‌లో టికెట్ కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉండటంతో నిమిషాల వ్యవధిలోనే పరిస్థితి మారిపోతుంది'' అని విశాఖ నగరానికి చెందిన భాస్కర్ అనే ఏజెంట్ బీబీసీతో అన్నారు.

నిర్ణీత సమయానికి కాస్త ముందుగానే అప్రమత్తమైతే ఆన్‌లైన్‌ ద్వారానే తత్కాల్ టికెట్ పొందవచ్చని భాస్కర్ చెప్పారు.

తత్కాల్ టికెట్‌కు ఇలా ప్రయత్నించండి

ఆఫ్‌లైన్‌లో తీసుకోవాలనుకుంటే సమీప రైల్వే స్టేషన్‌కు నిర్ణీత సమయానికి కాస్త ముందుగానే వెళ్లి క్యూలో ఉండాలి. వివరాలన్నీ తప్పుల్లేకుండా నింపి కౌంటర్‌లో సిబ్బందికి ఇవ్వాలి.

ఆన్‌లైన్‌లో ప్రయత్నించాలనుకుంటే, ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌కు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్‌ ఉండాలి.

నిర్ణీత సమయానికి ముందుగానే మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్‌లోని మాస్టర్ లిస్ట్ లేదా బెనిఫిసియర్స్ జాబితాలో పేరు, వయసు, జెండర్, ఐడీ ప్రూఫ్ వివరాలు నమోదు చేసి ఉంచుకోవాలి.

తత్కాల్ బుకింగ్ విండో ఓపెన్ కావడానికి కనీసం 10 నిమిషాల ముందే మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్‌లో లాగిన్ అవ్వాలి.

బుకింగ్ విండో ఓపెన్ కాగానే జర్నీ తేదీ తదితర వివరాలు క్షణాల్లో పూరించగలగాలి.

ఏ రైలులో ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయో త్వరత్వరగా చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి.

పేమెంట్ విషయంలో ఆటో పే ఆప్షన్ పెట్టుకుంటే మేలు.

సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

రైల్వే శాఖ నుంచి ఎలాంటి గుర్తింపూ లేకుండా టికెట్లు విక్రయించడానికి ఫేక్ యూజర్ ఐడీలను సృష్టించడం రైల్వే యాక్ట్- 1989, సెక్షన్ 143 ప్రకారం నేరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కేవలం అనధికార ఏజెంట్ల అక్రమాలపై చర్యలు తీసుకోవడానికే ఈ చట్టం ఉపకరిస్తుంది. కానీ, రైల్వేశాఖ గుర్తింపు ఉన్న అధికారిక ఏజెంట్ల అనధికారిక కార్యకలాపాలపై చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉందని ఈ ఏడాది జనవరి నెలలో ఒక కేసులో తీర్పు సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ప్రస్తావించింది.

ఈ-రిజర్వేషన్, ఈ-టికెట్ల విధానాన్ని ప్రవేశపెట్టడానికి ముందు నుంచి అమల్లో ఉన్న చట్టం కాబట్టి ఈ-టికెట్ల అక్రమ అమ్మకాలను నిరోధించడానికి సెక్షన్ 143 సరిపోదని ధర్మాసనం స్పష్టంచేసింది. కఠినతరం చేయాల్సిన అవసరాన్ని పరోక్షంగా సూచించింది.

రద్దీకి తగినట్లుగా రైళ్లు ఎందుకు వేయడం లేదు?

''దిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల నుంచి దేశంలో ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రైళ్లలో సెలవుల్లో, వారాంతాల్లో విపరీతమైన రద్దీ ఉంటోంది. కోవిడ్ తర్వాత నుంచి ప్రజలు పర్యటనలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఆధ్యాత్మిక కేంద్రాలు, పుణ్యక్షేత్రాల సందర్శన ఎక్కువైంది'' అని దక్షిణ మధ్య రైల్వే జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (జెడ్‌ఆర్‌యూసీసీ) మాజీ సభ్యుడు వైడీ రామారావు బీబీసీకి చెప్పారు.

ఏటా శబరిమల యాత్రకు, ఇటీవల ప్రయాగ్‌రాజ్ కుంభమేళా వంటి సందర్భాల్లోనూ రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నా కొత్తగా రెగ్యులర్‌ రైళ్లను వేయలేని పరిస్థితి ఉందని రామారావు అన్నారు.

ఇప్పటికే ట్రాక్ సామర్థ్యానికి మించి రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయని, మరోవైపు రైళ్ల మెయింటనెన్స్‌కు తగిన సంఖ్యలో యార్డులు, మౌలిక సదుపాయాలు లేవని చెప్పారు.

ఉదాహరణకు యానాం ప్రజల సౌకర్యం కోసం సర్కారు ఎక్స్‌ప్రెస్‌ను కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు నడపాలని కొన్నేళ్లుగా ప్రతిపాదనలు పంపితే, పాక్షికంగా నెరవేరింది. ప్రస్తుతం రెండు రోజులు పాండిచ్చేరికి, రెండు రోజులు చెంగల్పట్టు వరకు నడుపుతున్నారని అన్నారు.

వందేభారత్‌ మాదిరిగా మిగతా ప్రధాన రైళ్ల స్పీడ్ పెంచాలన్నా, కొత్త రైళ్లను వేయాలన్నా ట్రాక్ ఆధునికీకరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్‌సీ)తో దిల్లీ-నాగ్‌పూర్, నాగ్‌పూర్-ఖాజీపేట్, విజయవాడ-చెన్నై తదితర మార్గాల్లో మూడో లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అవన్నీ పూర్తయితే రైళ్ల సంఖ్యతో పాటు రైళ్ల స్పీడ్ కూడా పెంచడానికి అవకాశం ఉంటుందని రామారావు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)