You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రైలు ఢీకొని 6 ఏనుగులు మృతి
- రచయిత, కోహ్ యూవ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గురువారం తెల్లవారుజామున శ్రీలంకలోని వన్యప్రాణుల అభయారణ్యం దగ్గర ఏనుగుల గుంపును ఢీకొట్టడంతో ఒక ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది.
రైలు ఢీకొట్టడంతో ఆరు ఏనుగులు చనిపోయాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. శ్రీలంక రాజధాని కొలంబోకు తూర్పున ఉన్న హబరానాలో ఈ ఘటన జరిగింది.
ప్రమాదంలో గాయపడ్డ రెండు ఏనుగులకు చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గతంలో ఎప్పుడూ శ్రీలంకలో వన్యప్రాణులకు ఇలాంటి ప్రమాదం జరగలేదని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.
శ్రీలంకలో ఏనుగులకు తరచూ ప్రమాదాలు
శ్రీలంకలో ఏనుగుల గుంపులను రైళ్లు ఢీకొట్టడం సాధారణం. ఏనుగులు మనుషులపై దాడి చేయడం, వాటిని తరిమికొట్టేందుకు జనం ప్రయత్నించడం వంటివి ఎప్పుడూ జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనల్లో జనం చనిపోతుంటారు. ఏనుగులకూ ప్రాణనష్టం వాటిల్లుతుంది. ఇలాంటివి మిగిలిన దేశాలతో పోలిస్తే శ్రీలంకలో ఎక్కువ.
'శ్రీలంకలో గత ఏడాది మనుషులకు, ఏనుగులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 170మందికిపైగా చనిపోయారు. 500 ఏనుగులూ మృత్యువాతపడ్డాయి. దాదాపు 20 ఏనుగులు రైళ్ల ప్రమాదంలో చనిపోయాయి' అని స్థానిక మీడియా తెలిపింది.
శ్రీలంకలో ఏనుగులు రైలు ప్రమాదాల్లో చనిపోవడం సాధారణమైనప్పటికీ, ఇలా ఒక ప్రమాదంలో ఒకేసారి ఆరు ఏనుగులు చనిపోవడం ఇంతకుముందు జరగలేదని ఏఎఫ్‌పీ తెలిపింది.
ఏనుగును చంపడం నేరం
అడవులు, వనరులు తగ్గిపోతుండడంతో ఏనుగుల సహజ ఆవాసాలపై ప్రభావం పడుతోంది. దీంతో ఏనుగులు మనుషులుండే ప్రాంతాల్లోకి వస్తున్నాయి.
కాస్త నెమ్మదిగా వెళ్లాలని, రైల్వే ట్రాకులపై నడుస్తున్న జంతువులకు వినిపించేలా హారన్ కొట్టాలని రైలు డ్రైవర్లకు కొందరు సూచిస్తున్నారు.
2018లో, హబరానాలో గర్భంతో ఉన్న ఓ ఏనుగు, దాని రెండు పిల్లలు రైలు ఢీకొని చనిపోయాయి. ఈ మూడు ఏనుగులు తెల్లవారుజామున రైలు పట్టాలు దాటుతున్న పెద్ద మందలోనివి.
గత అక్టోబర్‌లో మిన్నేరియాలో మరో రైలు ఇలాగే ఒక మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు ఏనుగులు చనిపోగా, ఒకటి గాయపడింది. హబరానా నుంచి మిన్నేరియా 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
శ్రీలంకలో దాదాపు 7,000 ఏనుగులు ఉన్నాయని అంచనా. అధిక సంఖ్యాకులైన బౌద్ధులు వీటిని గౌరవిస్తారు. చట్టబద్ధమైన రక్షణ కూడా వీటికి ఉంది. ఏనుగును చంపడాన్ని నేరంగా చూస్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)