You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్: మీ ఊళ్లో వాతావరణం రేపు ఎలా ఉంటుందో ఈరోజే చెప్పేసే కొత్త టెక్నాలజీ, ఇదెలా పనిచేస్తుందంటే..
- రచయిత, అల్లు సూరిబాబు
- హోదా, బీబీసీ ప్రతినిధి
మీ ఊరు, గ్రామ పరిసరాలల్లో రేపు వాతావరణం ఎలా ఉంటుందో ఇకపై మరింత కచ్చితంగా తెలుసుకోవచ్చు.
గ్రామ స్థాయిలో వాతావరణ హెచ్చరికలు చేసే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం 'భారత్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్' (బీఎఫ్ఎస్) భారత వాతావరణ శాఖకు అందుబాటులోకి రానుంది.
రుతుపవనాల స్థితిగతులపై కచ్చితమైన అంచనాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, మరీముఖ్యంగా వ్యవసాయ రంగానికి చాలా కీలకం.
అత్యాధునిక భారత్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్
మునుపటి వాతావరణ వ్యవస్థ 12 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని అంచనా వేయగలదు. కానీ, హైరిజల్యూషన్‌తో కూడిన ఈ కొత్త వ్యవస్థ 6 కిలోమీటర్ల వరకు వాతావరణ సూచనలు అందించడంతో పాటు మరింత కచ్చితంగా అంచనా వేయగలదు.
ఇకపై గ్రామ పంచాయతీలవారీగా వాతావరణ పరిస్థితులు ఒక్కరోజు ముందే తెలుసుకునేందుకు ఈ బీఎఫ్ఎస్ వ్యవస్థ ఉపయోగపడుతుంది.
హై రిజల్యూషన్‌తో కూడిన ఈ వాతావరణ హెచ్చరికల వ్యవస్థను అర్కా, అరుణిక అనే సూపర్ కంప్యూటర్ల సహాయంతో పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోఫికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం) శాస్త్రవేత్తలు రూపొందించారు.
వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి, దానిని ప్రాసెస్ చేసి, వాతావరణ సూచనలు రూపొందించడానికి ప్రత్యూష అనే పేరున్న సూపర్ కంప్యూటర్‌కు దాదాపు పది గంటల సమయం పడుతోంది.
అదే పనిని, ఈ అడ్వాన్స్‌డ్ సూపర్ కంప్యూటర్ అర్కా నాలుగు గంటల్లో పూర్తి చేస్తుంది.
బీఎఫ్ఎస్ ఆవిష్కరణ సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ‘‘ భారత వాతావరణ శాఖకు సంబంధించిన ఈ సూచనల వ్యవస్థ అత్యాధునికనది’’ అని చెప్పారు.
భారత ఆర్థిక వ్యవస్థను ఉన్నత స్థానానికి తీసుకెళ్లడంలో ఐఎండీ పాత్రపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఐఎండీని సద్వినియోగం చేసుకునేలా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.
బీఎఫ్ఎస్ ప్రత్యేకతలు..
గత వాతావరణ వ్యవస్థ 12 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని అంచనా వేయగలదు. ఈ నూతన వ్యవస్థ అంతకంటే ప్రభావవంతంగా, ఆరు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని అంచనా వేసి, హెచ్చరికలు చేస్తుంది.
ఒక గ్రామ పంచాయతీ లేదా కొన్ని గ్రామాల పరిధిలో.. అంటే తక్కువ విస్తీర్ణం ఉన్న ప్రదేశంలోని వాతావరణ పరిస్థితుల్లో రానున్న మార్పులను అర్థం చేసుకోవడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది.
దేశవ్యాప్తంగా 40 డాప్లర్ రాడార్ల నుంచి డేటా (సమాచారం)ను బీఎస్ఎఫ్ ఉపయోగిస్తుంది. దీన్ని క్రమక్రమంగా 100 రాడార్లకు పెంచాలనే ప్రణాళికలు ఉన్నాయి.
బీఎస్ఎఫ్‌తో ఉపయోగాలు..
వ్యవసాయ రంగానికి సంబంధించి అత్యంత కచ్చితత్వంతో వాతావరణ సూచనలు ఇవ్వడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది.
పంట నష్టాలను తగ్గించడానికి సహాయపడుతుంది.
తుపానులు, భారీ వర్షాలు వంటి విపత్కర సంఘటనలను అత్యంత కచ్చితంగా అంచనా వేయవచ్చు.
అత్యంత సమర్థమైన విపత్తుల నిర్వహణ ద్వారా ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చు.
వాతావరణ మార్పుల తీవ్రత, అనిశ్చితి పెరుగుతున్న సమయంలో భారత్ ఈ కొత్త వాతావరణ సూచనల విధానాన్ని ఆవిష్కరించింది.
తద్వారా వ్యవస్థను 30 శాతం మేర మరింత మెరుగుపరుస్తుంది.
బీఎఫ్ఎస్‌ను 2022 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేశామని, తుపానుల తీవ్రతను, వాటి గమనాన్ని అత్యంత కచ్చితత్వంతో అంచనా వేయడానికి ఉపయోగపడుతుందన్నది కేంద్ర భూవిజ్ఞాన శాఖ చెబుతున్న మాట.
‘ప్రతి గ్రామంలో వాతావరణ పరిస్థితులను గమనించవచ్చు’
''వాతావరణంలో మార్పులను గమనించడానికి శాటిలైట్ చిత్రాలే ఆధారం. తొలుత 36 వేల కిలోమీటర్ల పైనుంచి చిత్రాలు వచ్చేవి. ఇప్పుడు 12 కిలోమీటర్ల రిజల్యూషన్‌లో స్పష్టంగా ఉంటున్నాయి. అలాంటిది బీఎస్ఎఫ్‌తో 6 కిలోమీటర్ల రిజల్యూషన్ చిత్రాలివ్వడమంటే చాలా స్పష్టంగా ప్రతి గ్రామంలో వాతావరణ పరిస్థితులను గమనించవచ్చు'' అని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీ కృష్ణ బీబీసీకి చెప్పారు.
తుపానులు, భారీ వర్షాల ప్రభావం ఏయే గ్రామాలపై ఉంటుందో చెప్పవచ్చు.
అక్కడి ప్రజలను, రైతులను వాతావరణ శాఖ అప్రమత్తం చేయడానికి అవకాశం ఉంటుంది.
ఆ హెచ్చరికలను, సూచనలను చాలామంది అలక్ష్యం చేయడం వల్లే నష్టపోతున్నారు.
ప్రజలు, రైతులు తక్షణం స్పందించాలి. ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో వచ్చిన సౌలభ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మురళీకృష్ణ సూచించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)