మాంసం తినడం మానేసి, కొద్దికాలం తర్వాత మళ్లీ తింటే శరీరానికి ఏమవుతుంది?

    • రచయిత, వెరోనిక్ గ్రీన్‌వుడ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మాంసం తినడం మానేసి, మళ్లీ తినడం మొదలుపెడితే, కడుపులో ఏదో ఇబ్బందికరంగా అనిపిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. దీంతో, మాంసాన్ని జీర్ణం చేసుకునే గుణాన్ని మన శరీరాలు కొద్దికాలం తర్వాత మర్చిపోతాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గించేందుకు అత్యంత తేలికైన విధానాల్లో మాంసాన్ని తక్కువగా తినడం ఒకటి.

బ్రిటన్‌లో ప్రతి ఒక్కరూ తక్కువగా మాంసం తినడం మొదలుపెడితే, అంటే రోజుకు సుమారు 50 గ్రాముల మాంసం తింటే, 80 లక్షల కార్లు రోడ్డు ఎక్కకపోతే మిగిలేంత కార్బన్ ఆదా అవుతుందని తాజాగా పరిశోధకులు కనుగొన్నారు.

యూకే ప్రభుత్వ డేటా ప్రకారం...1980 నుంచి 2022 మధ్య కాలంలో గొడ్డు, గొర్రె, చేప మాంసాల వినియోగం 62 శాతం తగ్గింది. కారణాలు ఏమైనప్పటికీ, ఇప్పుడు చాలామంది మాంసం మానేస్తున్నారు.

మాంసం తినడం మళ్లీ మొదలుపెట్టినప్పుడు కడుపులో నొప్పి, ఉబ్బరంలాంటి లక్షణాలు కనిపిస్తాయా? అని కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నలు వేసినప్పుడు, చాలామంది తమ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు.

అయితే, మాంసం మానేసి మళ్లీ తినడం ప్రారంభిస్తే, కలిగే వికారాల గురించి పెద్దగా తెలియదని అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీకి చెందిన న్యూట్రీషియన్ ప్రొఫెసర్ శాండర్ కెర్‌స్టెన్ అన్నారు.

‘‘ తెలియదు అంటే అసలు సమస్యే లేదని కాదు. దీనిపై ఇంకా అధ్యయనం జరగలేదు, అంతే.'' అని కెర్‌స్టెన్ అన్నారు.

మాంసం ఒంటికి పడకపోవడం అరుదైనప్పటికీ అది జరిగే అవకాశమైతే ఉంది. అల్ఫా గాల్ సిండ్రోమ్ కారణంగా మీ రోగ నిరోధక వ్యవస్థ జంతువుల నుంచి వచ్చే ప్రొటీన్లను చొరబాటుదారులుగా గుర్తించే అవకాశం ఉంది. అది అనాఫిలాక్సిస్‌ అనే తీవ్రమైన అలర్జీకి దారితీసి, ప్రాణాలకు ముప్పు తేవచ్చు.

జీవితాంతం ఏ కట్టడీ లేకుండా మాంసాన్ని తిని, ఆ తర్వాత మాంసం తీసుకోవడం తగ్గిస్తూ వచ్చినవారికి ఈ అలర్జీ సమస్య ఉండదు.

అయితే, చాలామంది మాంసానికి పూర్తిగా దూరంగా ఉండి, తెలియకుండానే మాంసం తిన్నప్పుడు ఏదో పాపం చేసినట్లు ఫీలవుతారని కెర్‌స్టెన్ అన్నారు. కెర్‌స్టెన్ కూడా శాకాహారే.

''కొందరు వ్యక్తులు దీనికి చాలా బాధపడతారు.'' అని కెర్‌స్టెన్ అన్నారు. అయితే, ఇలాంటి పరిణామం ఏదైనా శారీరక సమస్యలకు దారి తీస్తుందో లేదో తాను చెప్పలేనన్న కిర్‌స్టెన్, ఈ పరిణామం ఆ వ్యక్తులను అసహనానికి గురి చేయొచ్చని మాత్రం అన్నారు.

పండ్లు, కూరగాయలలోని ఫైబర్‌లా కాకుండా మాంసం చాలా తేలికగా అరిగిపోతుంది. దాన్ని అరిగించేందుకు మన మైక్రోబయోమ్ నుంచి మన శరీరాలు సాయం తీసుకుంటాయి. ఈ మైక్రోబ్స్‌లో ఆహారాన్ని అరిగించేందుకు అవసరమైన ఎంజైమ్‌లు ఉంటాయి.

అంతేకాక, మొక్కల నుంచి వచ్చే ప్రొటీన్లను అరిగించేందుకు ఉపయోగపడే ఎంజైములు, మాంసం ప్రొటీన్లను జీర్ణం చేసే ఎంజైముల మాదిరిగానే ఉంటాయి.

మొక్కల నుంచి వచ్చినా, జంతువుల నుంచి వచ్చినా, అమైనో యాసిడ్స్‌ అనే బ్లాక్‌ల ద్వారా ప్రొటీన్లు తయారవుతాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయన్నదానితో సంబంధం లేకుండా ఎంజైమ్‌లు వీటిని జీర్ణం చేస్తాయి.

అయితే, కొన్నింటిలో ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. లాక్టోస్ అనే పశువుల పాల షుగర్లనే తీసుకుంటే..లాక్టోస్ జీర్ణమయ్యేందుకు లాక్టేస్ అనే ప్రత్యేక ఎంజైమ్ మీ శరీరానికి ఉపయోగపడుతుంది. ఎవరిలోనైతే ఈ ఎంజైమ్ సరిపడినంత విడుదల కాదో, వారికి డెయిరీ ప్రొడక్టులు తిన్న తర్వాత కడుపు నొప్పి వస్తుంది.

''కానీ, హాంబర్గర్‌ను అరిగించుకునే ఎంజైములు శరీరం నుంచి విడుదల కాకుండా మాంసం ప్రొటీన్లు అడ్డుకుంటాయనుకోవడంలో అర్ధం లేదు. బఠానీలు కావచ్చు, సోయాబీన్స్ కావచ్చు...ప్రొటీన్లు వేటి నుంచి వచ్చిన ఎంజైములు వాటిని జీర్ణం చేస్తాయి.’’ అని కెర్‌స్టెన్ అన్నారు.

మనుషుల పేగుల్లో ఉండే మైక్రోబయోమ్ నిరంతరం మారుతుంటుంది. ఏం తిన్నారు అన్నదాన్నిబట్టి ఈ మార్పు జరుగుతుంది.

అంటే కొన్నిసార్లు బ్యాక్టీరియాకు చెందిన ప్రత్యేక రకాలు మారొచ్చు. కొన్నిసార్లు ఇతర ఎంజైమ్‌లను మైక్రోబ్స్ ఉత్పత్తి చేయొచ్చు.

శాకాహారులు, వేగన్లు, శాకాహార, మాంసాహారాలను తినేవారి మైక్రోబయోమ్స్‌ మధ్య కొన్ని తేడాలుంటాయి. అయితే, మాంసాహారులు వివిధ రకాల మొక్కల ఆహారాన్ని తినేంత వరకు, పెద్దగా మార్పు కనిపించకపోవచ్చని ఒక పరిశోధన గుర్తించింది.

మనం తినే ఆహారాన్ని మార్చినప్పుడు మైక్రోబయోమ్‌లు వేగంగా మారుతాయి. చాలాకాలం తర్వాత పెద్ద మొత్తంలో ఫైబర్‌ను అకస్మాత్తుగా తీసుకున్నప్పుడు, జీర్ణక్రియలో సమస్యలు రావొచ్చు. ఇలాంటి మార్పులను మెల్లగా చేపట్టాలి. ఫైబర్‌ను బట్టి, దాని బలమైన రియాక్షన్లు ఉంటాయి.'' అని కెర్‌స్టెన్ అన్నారు.

చాలాకాలానికి మాంసం తిన్న తర్వాత కడుపులో వికారంగా, ఏదోలా అనిపిస్తే, దానికి కారణం ఎంజైమ్‌లు కోల్పోవడం అనుకోవాల్సిన పనిలేదని, అయితే ఇదేంటో గుర్తించేందుకు పరిశోధనలు జరగలేదని కెర్‌స్టెన్ అన్నారు.

మన శరీరానికి దేనినైనా స్వీకరించే గుణం ఉంటుందని, మనం అనుకునేదానికంటే ఎక్కువగా అది పనిచేస్తుందన్నారు కెర్‌స్టెన్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)