Bowel Health: మలవిసర్జన అలవాట్లకు - మరణాలకూ మధ్య సంబంధం, పరిశోధనల్లో ఏం తేలిందంటే..

    • రచయిత, జాస్మిన్ ఫాక్స్-స్కెల్లీ

టైప్ 3, టైప్ 4గా వర్గీకరించిన సాసేజ్ (గట్టిగా, ముద్దగా, పాము ఆకారంలో) ఆకారంలో రోజుకు ఒకసారి మల విసర్జనకు వెళ్లడం ఆరోగ్యకరంగా చెబుతుంటారు.

మీరు రోజుకు మూడుసార్లు మల విసర్జనకు వెళ్తారా? లేదా ఎప్పుడో ఒక్కసారి బాత్‌రూమ్‌కు వెళ్తారా?

మీరు ఎన్నిసార్లు మల విసర్జనకు వెళ్తారో అది కూడా మీ ఆరోగ్యం గురించి తెలియజేస్తుందా?

మల విసర్జన వెనుకాల ఉన్న సైన్స్ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

రోజులో ఎన్నిసార్లు వెళ్లడం మంచిది?

ఎన్నిసార్లు మల విసర్జనకు వెళ్తాం అనేది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. మనం ఆహారం తీసుకున్నప్పుడు, పెద్ద పేగు సంకోచించి, జీర్ణాశయం గుండా ఆహారాన్ని పంపిస్తుంది. శరీరం లోపల సాధారణంగా జరిగే ''గ్యాస్ట్రో-కోలిక్ రిఫ్లెక్స్'' మల విసర్జనకు వెళ్లాలనిపించే హార్మోన్లను విడుదల చేస్తుంది.

చాలామంది దీన్నెలా ఆపాలో తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు, దీంతో రోజుకు ఒకసారి లేదంటే అంతకంటే తక్కువగా మల విసర్జనకు వెళ్లడం సాధారణంగా భావిస్తుంటారు.

'' మల విసర్జనకు వెళ్లడానికి మన దగ్గర సమయం ఉండటం లేదు'' అని ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా హాస్పిటల్‌లో జనరల్ మెడిసిన్ ఫిజీషియన్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మార్టిన్ వెస్సీ చెప్పారు.

సంప్రదాయకంగా రోజుకు ఒకసారి మల విసర్జనకు వెళ్లడమనేది ఆరోగ్యానికి మంచిదని భావిస్తుంటారు. కాకపోతే, గతంలో సరైన బోవెల్ మూవ్‌మెంట్ (పేగు పనితీరు) చాలామందికి తెలిసేది కాదు.

అంతకుముందు అధ్యయనాల్లో, కొన్ని వారాలకు లేదా నెలలకు ఒకసారి నుంచి రోజులో 24 సార్లు మల విసర్జనకు వెళ్లడం వరకూ, దేనినైనా సాధారణంగానే భావించేవారు.

కానీ, బ్రిటన్‌లోని బ్రిస్టల్ రాయల్ ఇన్‌ఫర్మరీలో కన్సల్టెంట్ ఫిజిషియన్‌గా పనిచేసే కెన్ హీటన్ వంటి శాస్త్రవేత్తల పరిశోధనల కారణంగా అసల వాస్తమేంటో మనకు తెలిసింది.

1980ల చివర్లో, హీటన్, ఆయన సహోద్యోగులు కలిసి ఈస్ట్ బ్రిస్టల్‌లోని ప్రజలను రోజుకు ఎన్నిసార్లు మల విసర్జనకు వెళ్తుంటారని అడిగారు.

ఈ అధ్యయనంలో ఎన్నో రకాల బోవెల్ మూవ్‌మెంట్స్ ఉన్నాయని తెలిసింది.

రోజుకు ఒకసారి వెళ్లడం సాధారణ అలవాటని, పురుషుల్లో 40 శాతం మంది, మహిళల్లో 33 శాతం మంది ఈ అలవాటును అనుసరిస్తున్నట్లు చెప్పారు.

కొందరు వారంలో ఒకసారి కంటే తక్కువ, కొందరు రోజులో మూడుసార్లు మల విసర్జన చేస్తుంటారని తెలిసింది.

మల విసర్జనలపై హీటన్ చేసిన అధ్యయనం ద్వారా బ్రిస్టల్ స్టూల్ ఫామ్ స్కేల్ తయారీకి సాయపడ్డారు. చిత్రాలతో దీన్ని వివరించారు. జీర్ణవ్యవస్థలోని సమస్యలను కనుగొనేందుకు ఇది వైద్యులకు ప్రాక్టికల్‌గా ఎంతో సాయపడింది.

''గోల్డిలాక్స్/గోల్డిలాప్స్'' జోన్

రోజుకు ఒకసారి లేదా వారంలో మూడుసార్లు మల విసర్జనకు వెళ్లడమనేది సాధారణమని ఎన్‌హెచ్ఎస్, ఇతర ఆరోగ్య సంస్థలు చెప్పాయి.

అయితే, సాధారణం, ఆరోగ్యకరం అనేవి రెండూ వేర్వేరు కావొచ్చు.

ఎన్నిసార్లు మల విసర్జనకు వెళ్తున్నామనే దాని వెనకున్న రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించి ఉండొచ్చు. కానీ, అది ఎన్నిసార్లు మల విసర్జనకు వెళ్లాలి? అనే ప్రశ్నకు సమాధానం కాదు.

ఒక వ్యక్తి ఎన్నిసార్లు మల విసర్జన చేస్తారనే విషయం, వారి ఆరోగ్యానికి బలమైన సూచికగా పరిశోధకులు క్రమంగా కనుగొంటూ వస్తున్నారు.

ఉదాహరణకు, అమెరికాలో 14,573 మంది పెద్దవారి మల విసర్జన అలవాట్లపై 2023లో అధ్యయనం చేశారు.

వారానికి ఏడుసార్లు మెజార్టీ ప్రజల బోవెల్ మూవ్‌మెంట్ ఉందని దీనిలో గుర్తించారు. మల విసర్జన అనేది ''స్మూత్‌గా, సాఫ్ట్‌గా'', లేదా ''సాసేజ్ లేదా పాము ఆకారంలో'' ఉంటుంది. మల విసర్జన అలవాట్లు, మరణాల మధ్యలో ఏదైనా లింక్ ఉందా అని తెలుసుకోవడం కోసం వీరిపై ఐదేళ్ల పాటు పరిశోధన చేశారు.

వారంలో ఏడుసార్లు సాధారణ మల విసర్జన వెళ్లే వారి కంటే, నాలుగు సార్లు మాత్రమే సాఫ్ట్ మల విసర్జన చేసేవారు ఐదేళ్లలో మరణించే అవకాశం 1.78 రెట్లు ఎక్కువగా ఉందని వారు గుర్తించారు.

ఇక, తరచుగా మల విసర్జనకు వెళ్లని వారు క్యాన్సర్ బారినపడి మరణించే అవకాశం 2.42, గుండె సంబంధిత జబ్బుల బారిన పడి మరణించే అవకాశం 2.27 రెట్లు ఎక్కువ.

అయితే, మల విసర్జన ఎంత స్థాయిలో ఉంటే మంచిదనే ప్రశ్న అమెరికా, సీటెల్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ బయాలజీలో పనిచేసే మైక్రోబయాలజిస్ట్ సీన్ గిబ్బన్స్‌కు ఎదురైంది. ఆయన 1,400 మంది పెద్ద వారిని వారి మల విసర్జన అలవాట్లను బట్టి నాలుగు వర్గాలుగా విభజించారు.

వారానికి ఒకటి, రెండుసార్లు మల విసర్జనకు వెళ్లే వారిని మలబద్ధకంగా, వారానికి మూడు నుంచి ఆరుసార్లు వెళ్లే వారిని 'లో నార్మల్'గా, రోజులో ఒకటి లేదా మూడుసార్లు వెళ్లే వారిని 'హై నార్మల్‌'గా, అంతకంటే ఎక్కువసార్లు వెళ్తే డయేరియాగా పేర్కొన్నారు.

ఒక వ్యక్తి మల విసర్జనకు వెళ్లడానికి, ఆ వ్యక్తి పేగులోని సూక్ష్మజీవులకు మధ్య ఏదైనా సంబంధం ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

గుండె జబ్బుకు, బోవెల్ మూవ్‌మెంట్లకు ఏదైనా సంబంధం ఉందా?

తరచూ మల విసర్జనకు.. అంటే రోజుకు ఒకటి లేదా మూడుసార్లు వెళ్లే వారి జీర్ణవ్యవస్థలో ఎక్కువ మొత్తంలో మంచి బ్యాక్టీరియా ఉంటుందని గిబ్బన్స్ గుర్తించారు.

మరోవైపు, వారానికి మూడుసార్లు కంటే తక్కువగా వెళ్లే వారి రక్తంలో హానికరమైన పదార్థాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, దీనివల్ల, దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు, అల్జీమర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని గుర్తించారు.

''గోల్డిలాక్స్ జోన్‌లో షార్ట్ చైన్ ఫాటీ యాసిడ్స్‌గా పిలిచే రసాయనాలను ఉత్పత్తి చేసే ఏరోబిక్ ఆర్గానిజం పెరుగుదలను మేం గుర్తించాం'' అని గిబ్బన్స్ చెప్పారు.

ఈ షార్ట్ చైన్ ఫాటీ యాసిడ్స్‌లో ఒకటి బ్యుటీరేట్ (butyrate), ఇది కడుపులో మంటను తగ్గిస్తుంది. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే, దీర్ఘకాలికంగా ఉండే మంటలు గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, అల్జీమర్స్ వంటి వ్యాధులకు కారణమవుతున్నాయని భావిస్తున్నారు.

అత్యధిక స్థాయిలోని బ్యుటిరేట్ మీ శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రించేందుకు, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచేందుకు సాయపడుతుందని గిబ్బన్స్ చెప్పారు.

అరుదుగా మల విసర్జనకు వెళ్లే వారిలో ఎక్కువ సమయం పాటు గట్‌లోనే మలం ఉండటంతో, రక్తంలో అత్యధిక స్థాయిలో టాక్సిన్లు ఉంటున్నాయని గిబ్బన్స్ భావిస్తున్నారు.

దీనివల్ల జీర్ణ వ్యవస్థలోని బ్యాక్టీరియా ఫైబర్‌ను అంతా తినేసి, వాటిని షార్ట్ చైన్ ఫాటీ యాసిడ్స్‌గా మార్చేస్తుంది. అయితే, సమస్య ఏంటంటే.. ఫైబర్ అంతా అయిపోయిన తర్వాత బ్యాక్టీరియా ప్రొటీన్‌ను తినడం మొదలు పెడుతుంది. ఇవి రక్తంలో హానికరమైన టాక్సిన్లను విడుదల చేస్తాయి. ఈ టాక్సిన్లు కిడ్నీలు, గుండె వంటి అవయవాలకు నష్టం చేస్తాయి. ఫెనిలేస్‌టిల్‌గ్లూటమైన్‌ అనే టాక్సిన్ గుండె జబ్బులకు కారణమవుతుంది.

''ఒకవేళ ఇది మీ రక్తంలో ఎక్కువ సేపు జరిగితే అది అథెరోస్క్లెరోసిస్‌ ముప్పును పెంచుతుంది. ఇది ధమనులను గట్టిపర్చి, హృదయనాళాల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది'' అని గిబ్బన్స్ చెప్పారు.

రోజుకు మూడుసార్లు లేదా వారంలో మూడుసార్లు అనేది ఆరోగ్యకరమైనదిగా కొందరు వైద్యులు చెప్పినప్పటికీ, వీరికి భవిష్యత్‌‌లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవా? అంటే చెప్పడం కష్టమని, తమ వద్ద డేటా లేదని గిబ్బన్స్ చెప్పారు.

ఆరోగ్యకరంగా ఉండేందుకు రోజుకు ఒకసారి లేదా రెండుసార్లు మల విసర్జన చేయడం మంచిదని సూచించారు. గిబ్బన్స్ కేవలం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని ఎంపిక చేసిన వ్యక్తులపైనే అధ్యయనం చేశారు.

పేగు ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి?

జీర్ణాశయం గుండా ఆహారం వెళ్లేందుకు ఎంత సమయం తీసుకుంటుందో దాన్ని బట్టి మీ పేగు ఆరోగ్యాన్ని చెప్పవచ్చు. దీన్నే గట్ ట్రాన్సిట్ టైమ్ అంటారు. దీన్ని మీ ఇంట్లో నుంచే చేసుకోవచ్చు. మొక్కజొన్న లాంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు, అరిగి బయటికి వచ్చేందుకు ఎంత సమయం తీసుకుంటుందో దాన్ని బట్టి అంచనా వేయొచ్చు.

ఒక వ్యక్తి గట్ ట్రాన్సిట్ టైమ్ పెరిగితే, తక్కువ సార్లు వారు మల విసర్జనకు వెళ్తూ.. పేగు సంబంధింత సమస్యలతో బాధపడుతుండొచ్చు.

జీర్ణాశయం గుండా ఆహారం వెళ్లే సమయం లేదా గట్ ట్రాన్సిట్ సమయం ఒక్కొక్కరికీ ఒక్కోవిధంగా ఉంటుంది. ఇటీవలి అంచనాల ప్రకారం ఈ జీర్ణక్రియకు 12 నుంచి 73 గంటలు పట్టవచ్చు. సగటున 23 లేదా 24 గంటలు పడుతుంది.

జీర్ణక్రియలో ఈ వైవిధ్యం పేగుల్లోని బ్యాక్టీరియాలో కొన్ని తేడాలను, పేగు ఆరోగ్యాన్ని వివరిస్తుంది.

గట్ ట్రాన్సిట్ సమయాలు తక్కువగా ఉండే వ్యక్తులకు ఆరోగ్యకరమైన గట్ మైక్రోబ్స్‌ ఉన్నట్లు గుర్తించారు.

మీ పేగులో ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతోందంటే.. (అంటే నెమ్మదిగా శక్తిగా మారుతుంటే), పెద్ద పేగులోని బ్యాక్టీరియా వేర్వేరు మెటాబొలైట్స్‌ను ఉత్పత్తి చేస్తోందని అర్థం.

''గట్ ట్రాన్సిట్ సమయాలు ఎక్కువగా ఉన్న వ్యక్తులలో, చెడు గట్ బ్యాక్టీరియా ఉంటుందని మేం గుర్తించాం. అది గుండె ఆరోగ్యానికి, జీర్ణ వ్యవస్థకు హాని చేస్తుందని గుర్తించాం'' అని కింగ్స్ కాలేజీ లండన్‌లోని మైక్రోబయోమ్ సైంటిస్ట్ ఎమిలీ లీమింగ్ చెప్పారు.

మన శరీరంలోని బ్యాక్టీరియాకు ఆహారం ఇవ్వాలి. ఆ బ్యాక్టీరియా ఫైబర్‌ను ఇష్టపడుతుంది.

పేగులో ఆహారం కదులుతూ, ఫైబర్ పెద్ద పేగుకు చేరుకోవడానికి చాలా సమయం పడితే, పేగుల్లో ఉండే బ్యాక్టీరియా మరో ఆహార వనరు కోసం వెతకాలి. కాబట్టి అవి ప్రోటీన్ కోసం చూస్తాయి.

ఈ మార్పు విష వాయువుల ఉత్పత్తికి దారితీస్తుంది. ఉబ్బరం, కడుపులో మంట వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

గట్ ట్రాన్సిట్ టైమ్ తక్కువగా ఉన్నవారికి ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ ఉండి, విసెరల్ ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఈ ఫ్యాట్ గుండె జబ్బులు, డయాబెటిస్, కొన్ని క్యాన్సర్ల వంటి ముప్పును పెంచుతుంది. గట్ ట్రాన్సిట్ టైమ్ తక్కువగా ఉంటే, వారికి షుగర్ లెవల్స్ కూడా అదుపులో ఉంటాయి. గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది.

ఎవరైనా వ్యక్తి దీర్ఘకాలికంగా మలబద్ధకంతో బాధపడుతుంటే, వారికి బోవెల్ క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదం కూడా అధికం కావొచ్చు.

అయితే, దీనిని బలపరిచే ఆధారాలు మిశ్రమంగా ఉన్నాయి. ఒక అధ్యయనం మలబద్ధకం ఉన్న వ్యక్తులకు బోవెల్ క్యాన్సర్ ఎక్కువగా లేదని కనుగొంది. కానీ, శరీరంలో ఇతర అవయవాలతో లింక్స్‌ను కూడా చూడాల్సి ఉందని లీమింగ్ చెప్పారు.

మల విసర్జన మీ గురించి ఏం చెబుతుంది

వారంలో ఎన్ని సార్లు మల విసర్జనకు వెళ్తున్నారనేది ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా ఉంటుంది. మల విసర్జనకు వెళ్లే అలవాట్లలో ఏదైనా మార్పు వచ్చిందో అది గమనించాల్సిన విషయమని లీమింగ్ చెప్పారు. మల విసర్జనకు వెళ్లే అలవాటును ట్రాక్ చేసుకోవడం మంచిదని సూచించారు.

మీరెన్ని సార్లు మల విసర్జనకు వెళ్తున్నారన్నది కాకుండా, దాని రంగు, ఏ ఆకారంలో వెళ్లున్నారో కూడా చూసుకోవాలన్నారు.

మల విసర్జనలో నలుపు లేదా ఎర్ర రంగు ఉంటే, అది రక్తం ఉనికిని సూచిస్తుంది. కొన్నిసార్లు కొలొరేక్టల్ క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు. ఎంతవీలైతే అంత త్వరగా వైద్యుని వద్దకు వెళ్లాలి.

ఒకవేళ తరచూ డయేరియా బారిన పడినా లేదా అకస్మాత్తుగా వచ్చినా లేదా నొప్పి వచ్చినా, తిన్న తర్వాత గ్యాస్ అయినా వైద్యుడిని సంప్రదించాలి.

చివరిగా, మల విసర్జన మరింత రెగ్యులర్‌గా ఉండాలంటే మూడు సింపుల్ అంశాలు పాటించాలి.

'' మా అధ్యయనంలో పాల్గొన్న వారిలో గోల్డిలాక్స్ జోన్‌లో ఉన్న వ్యక్తులు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తిన్నారు. ఎక్కువగా నీరు తీసుకున్నారు. శారీరకంగా చురుగ్గా ఉన్నారు'' అని గిబ్బన్స్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)