పసిఫిక్‌‌ సముద్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బ.. దీనిని ఎలా కనుగొన్నారంటే..

    • రచయిత, జార్జినా రానార్డ్
    • హోదా, క్లైమేట్ రిపోర్టర్

పసిఫిక్ మహా సముద్రంలో అతిపెద్ద పగడపు దిబ్బను కనుగొన్నారు.

ఈ భారీ పగడపు దిబ్బ వయసు 300 ఏళ్ల కంటే ఎక్కువే ఉంటుందని, ఇది నీలి తిమింగలం కంటే పెద్దదని శాస్త్రవేత్తల బృందం తెలిపింది.

వాతావరణ మార్పుల కారణంగా పసిఫిక్ సముద్రంలోని మారుమూల ప్రాంతాలు ఎలాంటి ప్రభావానికి లోనయ్యయో తెలుసుకోవడానికి ప్రయాణిస్తున్న నేషనల్ జియోగ్రాఫిక్ షిప్‌లో‌ని వీడియోగ్రాఫర్ ఒకరు సోలమన్ దీవులలో ఈ పగడపు దిబ్బను కనుగొన్నారు.

"మ్యాప్‌ ఒక ఓడ మునిగిపోయినట్టుగా చూపుతున్న ప్రాంతంలోకి దూకాను. అప్పుడే ఆ పగడపు దిబ్బ కనిపించింది’’ అని మను శాన్ ఫెలిక్స్ చెప్పారు. వెంటనే ఆయన తన డైవింగ్ స్నేహితుడు, తన కుమారుడైన ఇనిగోను డైవింగ్‌కి పిలిచారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి దాన్ని పరిశీలించడానికి మరింత లోతుకు వెళ్లారు..

సోలమన్ దీవులలో ఉన్న పగడపు దిబ్బని చూడటం, నీటి అడుగున అద్భుతమైమన దేవాలయాన్ని చూసినట్లుగా ఉందని అన్నారు.

దీన్ని చూడగానే భావోద్వేగానికి గురయ్యాను, వందల సంవత్సరాల నుండి ఇది జీవించి ఉన్నందుకు చాలా సంతోషంగా అనిపించింది, దీనిపై గౌరవం పెరిగిందని ఆయన చెప్పారు.

వాతావరణ మార్పుల వల్ల సముద్రాలు వేడెక్కడం పగడపు దిబ్బలకు ముప్పుగా పరిణమిస్తోంది. పాలిప్స్ అని పిలిచే అతి చిన్న జీవులతో ఈ పగడపు దిబ్బలు ఏర్పడతాయి. ఇవి ఒక కాలనీగాపెరుగుతాయి.

పగడపు దిబ్బలు పర్యటకం, చేపల వేట సంబంధిత రంగాలలో ఉపాధి అవకాశాల పెరగడానికి కారణమై ప్రపంచ వ్యాప్తంగా వందకోట్లమందికి జీవనోపాధికి మద్దతుగా నిలుస్తున్నాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలిపింది.

సాధారణంగా పగడపు దిబ్బలు ఉండే లోతుకంటే ఇంకా లోతులో ఈ పగడపు దిబ్బ ఉండడం వల్లే ఇన్నేళ్లూ సముద్రపు ఉష్ణోగ్రతలను తట్టుకుని నిలబడి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అజర్‌బైజాన్‌లోని బాకులో వాతావరణ మార్పులను పరిష్కరించడంలో పురోగతి సాధించడానికి ప్రయత్నిస్తున్న COP29 సదస్సు జరుగుతున్న సమయంలోనే దీనిని కనుగొనడం విశేషం.

ఈ సదస్సులో సోలమన్ దీవుల వాతావరణ మంత్రి ట్రెవర్ మనేమహాగా బీబీసీ న్యూస్‌తో మాట్లాడుతూ 300 ఏళ్ల కంటే పాతదైన పగడపు దిబ్బను కనుగొనడం తమ దేశానికి గర్వకారణమని అన్నారు.

" ఇదొక ప్రత్యేక ప్రదేశం దీనిని రక్షించాల్సిన అవసరం ఉందని ప్రపంచం గుర్తించాలని...మేం కోరుకుంటున్నాం" అని ఆయన చెప్పారు.

"మేం ఆర్థికంగా సముద్ర వనరులపై ఎక్కువగా ఆధారపడతాం, కాబట్టి పగడపు దిబ్బలు మాకు చాలా ముఖ్యమైనవి. మా పగడపు దిబ్బలు దోపిడీకి గురికాకుండా చూసుకోవడం మా ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకం" అని ఆయన అన్నారు.

వాతావరణ మార్పులు... సోలమన్ దీవుల వంటి చిన్న ద్వీప దేశాలకు చాలా హాని కలిగిస్తున్నాయి. తన దేశంపై గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను తాను ప్రత్యక్షంగా చూశానని, ఇది మరింత శక్తివంతమైన తుఫానులకు తద్వారా తీరప్రాంతం మునిగిపోవడానికి కారణమవుతోందని తెలిపారు.

కాప్ సదస్సులో అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు వాతావరణ మార్పుల విషయంలో తమ వ్యూహాల అమలుకు సాయపడటానికి... సంపన్న దేశాల నుంచి మరింత ఆర్థిక సాయాన్ని కోరాయి.

సోలమన్ దీవులకు ఆర్థిక సహాయం పెరిగితే, ఉద్యోగాలను సృష్టించేందుకు సహాయపడుతుందని మనేమహాగా చెప్పారు. ఫలితంగా పగడపు దిబ్బలను దెబ్బతీసే పరిశ్రమలలో పనిచేయకుండా, కొత్త ఉద్యోగాలు సృష్టించే వీలుంటుందని ఆయన అన్నారు.

నేషనల్ జియోగ్రఫిక్ రీసెర్చ్ ట్రిప్‌లో శాస్త్రవేత్త అయిన ఎరిక్ బ్రౌన్ మాట్లాడుతూ

"సముద్రపు ఉష్ణోగ్రతలు పెరిగి, తక్కువ లోతులోని దిబ్బలు క్షీణించిపోతున్న వేళ, కొంచెం లోతైన నీటిలో ఈ పెద్ద పగడపు శతాబ్దాల తరబడి మనుగడ సాగించడం పగడపు దిబ్బల భవిష్యత్తుపై ఆశ కలిగిస్తోందని " చెప్పారు.

పవోనా క్లావ్స్ అనే జాతికి చెందిన ఈ పగడపు దిబ్బ పీతలు, చేపలు, ఇతర సముద్ర జీవులకు ఆవాసంగా ఉంటుంది.

దీని వయస్సు ఆధారంగా గతంలో సముద్ర స్థితిగతులు ఎలా ఉండేవో తెలుసుకోవడంతోపాటు అది ఎలా పెరిగిందనే విషయాన్ని అర్ధం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేయాలని భావిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)