యెమెన్‌లోని హూతీల స్థావరాలపై అమెరికన్ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల దాడులు

    • రచయిత, సెబాస్టియన్ అషర్, మాక్స్ మట్జా
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

యెమెన్‌లోని హూతీల స్థావరాలపై దాడులు చేసినట్లు అమెరికన్ సైన్యం ప్రకటించింది. 15 లక్ష్యాలపై దాడులు చేసినట్లు తెలిపింది.

ఈ దాడుల కోసం యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను ఉపయోగించినట్లు పెంటగాన్ (అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం) తెలిపింది. ఈ ప్రాంతంలో నౌకా ప్రయాణాల స్వేచ్చను కాపాడేందుకు దాడులు చేసినట్లు తెలిపింది.

యెమెన్‌ రాజధాని సనా సహా కీలక నగరాల్లో పలు చోట్ల పేలుళ్లు జరిగినట్లు కథనాలు వెలువడ్డాయి.

2023 నవంబర్ నుంచి ఎర్ర సముద్రం గుండా ప్రయాణిస్తున్న దాదాపు వందకు పైగా నౌకల మీద హూతీలు దాడులు చేశారు. రెండు నౌకల్ని ముంచేశారు. గాజా మీద ఇజ్రాయెల్ దాడి చేసినందుకు ప్రతీకారంగా తాము దాడులు చేస్తున్నట్లు హూతీ గ్రూప్ ప్రకటించింది.

హూతీల ఆయుధ వ్యవస్థలు, స్థావరాలతో పాటు, వారికి సంబంధించిన ఇతర సామగ్రిని లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు పశ్చిమాసియాలో అమెరికన్ సైనిక ఆపరేషన్లను పర్యవేక్షిస్తున్న సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.

ఈ దాడులు జరిగిన ప్రాంతాల్లో యెమెన్ రాజధాని సనా కూడా ఉందని హూతీలకు సంబంధించిన మీడియా తెలిపింది.

సోమవారం యెమెన్‌ మీదుగా ప్రయాణిస్తున్న అమెరికన్ మేడ్ ఎంక్యు-9 డ్రోన్‌ను కూల్చివేసినట్లు హూతీలు ప్రకటించారు. ఈ విషయాన్ని అమెరికన్ సైన్యం ధ్రువీకరించింది.

ఈ ప్రాంతంలో తమ నౌకల మీద హూతీలు దాడి చేశారని, వారు ప్రయోగించిన ఆయుధాలను ధ్వంసం చేశామని వారం రోజుల కిందట పెంటగాన్ వర్గాలు తెలిపాయి.

సనాలో రెండేళ్ల నుంచి బాంబు దాడుల మోత తగ్గింది. యెమెన్‌లో పోరాడుతున్న గ్రూపుల మధ్య దాడులు కూడా తగ్గాయి.

అయితే, ఇటీవల హూతీలు ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకల మీద దాడులు చేయడంతో పాటు ఇజ్రాయెల్ మీద కూడా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశారు.

జులైలో యెమెన్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ మీదకు ప్రయోగించిన డ్రోన్ దాడిలో ఒకరు మరణించారు. పది మంది గాయపడ్డారు. సెప్టెంబర్‌లో హూతీలు ఇజ్రాయెల్ మీదకు అనేక క్షిపణులను ప్రయోగించారు. ఇందులో ఒకటి ఇజ్రాయెల్ ప్రధాన విమానాశ్రయం లక్ష్యంగా ప్రయోగించారు. అనంతరం యెమెన్‌లోని హూతీల స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది.

ఎర్ర సముద్రం గుండా ప్రయాణించే నౌకల్ని కాపాడుకునేందుకు ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా, బ్రిటన్, మరో 12 దేశాలు ప్రాస్పరిటీ గార్డియన్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి.

పశ్చిమాసియాలో ఇరాన్ మద్దతున్న సాయుధ గ్రూపులు హిజ్బుల్లా, హమాస్ మాదిరిగానే హూతీ గ్రూపు కూడా ఒటి.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)