నేపాల్‌ అల్లకల్లోలం: పార్లమెంట్‌కు నిప్పు, మంత్రుల ఇళ్లపై దాడులు

నేపాల్‌లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా తర్వాత ఆందోళనలు ఉధృతమయ్యాయి.

మంగళవారం మధ్యాహ్నం పార్లమెంట్ ఆవరణలో ప్రవేశించిన నిరసనకారులు ఆ తర్వాత పార్లమెంట్ భవనానికి నిప్పంటించారు.

ఓలీ, షేర్ బహదూర్ దేవ్‌బా సహా పలువురు ప్రముఖుల ఇళ్లపై దాడి జరిగింది. కాఠ్‌మాండూతో పాటు నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున యువత నిరసనల్లో భాగమయ్యారు. వారిని అదుపు చేసేందకు భద్రతాబలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి.

వేలాదిమంది నిరసనకారులు నేపాల్ పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించారు.

పార్లమెంట్ భవనం కాంపౌండ్‌లోకి కొందరు నిరసనకారులు బైక్‌లతో ప్రవేశించారు.

భవనం ప్రవేశద్వారం దగ్గర నిప్పుపెట్టిన ఆందోళనకారులు నేపాల్ జెండా పట్టుకుని మంటలు చుట్టూ తిరుగుతూ, డ్యాన్స్ చేస్తూ నినాదాలు చేశారు.

భవనం కిటికీలను ధ్వంసం చేసి కొందరు లోపలకి ప్రవేశించారు. లోపలి గోడలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సందేశాలు రాశారు.

మరోవైపు ఓలీ రాజీనామా తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి ప్రదీప్ యాదవ్ కూడా పదవి నుంచి తప్పుకున్నారు. వ్యవసాయమంత్రి రామ్ నాథ్ అధికారి, హోం మంత్రి రమేశ్ లేఖక్ రాజీనామాలు సమర్పించారు.

నిరసనల్లో చనిపోయిన వారికి న్యాయం చేయాలని యువత డిమాండ్ చేసింది.

నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ జెన్ ‌జీ నిరసనల్లో అనేకమంది మరణించారు. రాజకీయ అవినీతి పెరిగిపోతోందని, భావప్రకటనా స్వేచ్ఛపై పరిమితులు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ రాజధాని కాఠ్‌మాండూలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు.

నిరసనకారుల ప్రధాన డిమాండ్లలో ఒకటి కేపీ శర్మ ఓలీ రాజీనామా.

యువత చేస్తున్న ఈ ఉద్యమంపై విస్తృతమైన బలప్రయోగం కారణంగా ఇప్పటివరకు 22 మంది మరణించారు.

ఓలీ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి

అధికార సంకీర్ణ భాగస్వాములైన నేపాలీ కాంగ్రెస్, నేపాలీ సమాజ్ పార్టీకి చెందిన పలువురు మంత్రులు రాజీనామా చేసిన వెంటనే ప్రధాన మంత్రి ఓలీ కూడా వారి బాటలోనే నడిచారు.

జెన్ జీ నిరసనల్లో ఒక్కరోజులోనే పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించడంతో ప్రధాని ఓలీ రాజీనామా చేయాలంటూ ఒత్తిడి పెరిగింది.

ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తూ కొన్ని వార్తాపత్రికలు ప్రత్యేక సంపాదకీయాలను ప్రచురించాయని బీబీసీ నేపాలీ సర్వీస్ రిపోర్ట్ చేసింది.

‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 77 (1) (ఎ) ప్రకారం నేను ఇవాళ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశాను. దీనివల్ల రాజ్యాంగానికి అనుగుణంగా రాజకీయ పరిష్కారం కనుగొనవచ్చు. దేశంలో తలెత్తే అసాధారణ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సమస్యలను పరిష్కరించడానికి మరిన్ని చర్యలు తీసుకోవచ్చు" అని అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్‌కు పంపిన రాజీనామా లేఖలో ఓలీ పేర్కొన్నారు.

ఓలీ రాజీనామాను రాష్ట్రపతి అంగీకరించారని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తెలిపింది.

కేపీ శర్మ ఓలీ ఇల్లు తగలబెట్టిన ఆందోళనకారులు

కాఠ్‌మాండూలో కర్ఫ్యూ విధించినప్పటికీ, మంగళవారం అనేక ప్రదేశాల్లో నిరసనలు, ఘర్షణలు జరిగినట్టు సమాచారం.

నిరసనకారుల బృందాలు వివిధ నాయకులు, మంత్రుల ఇళ్లను ధ్వంసం చేశారని, దహనం చేశారని రిపోర్టులు అందుతున్నాయి.

మంగళవారం మధ్యాహ్నానికి నిరసనకారులు సింహ్ దర్బార్, పార్లమెంట్ హౌస్ ఆవరణలోకి ప్రవేశించినట్టు బీబీసీ నేపాలీ సర్వీస్ తెలిపింది.

భక్తపూర్‌లోని బాలాకోట్‌లో ఉన్న ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ ఇంట్లో మంటలు, విధ్వంసానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. వివిధ మీడియా సంస్థలు కూడా దహనం గురించి వివరాలను అందించాయి.

దీంతో పాటు, నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవుబాకు చెందిన బుధనీల్కంఠాలోని నివాసాన్ని నిరసనకారులు ధ్వంసం చేసినట్టు కూడా రిపోర్టులు వచ్చాయి.

దేవుబా నివాసాన్ని ధ్వంసం చేశారని తెలుసని, అక్కడి పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని దేవుబా సన్నిహితులు, కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి ఎన్‌పి సౌద్ బీబీసీకి చెప్పారు.

మంటల్లో పార్లమెంట్, ఎయిర్‌పోర్టు మూసివేత

కాఠ్‌మాండూ లోయలో ప్రతికూల పరిస్థితులతో పాటు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ పొగలు ఎగసిపడుతుండడంతో విమానాశ్రయాన్ని మూసివేసినట్టు నేపాల్ పౌర విమానయాన అథారిటీ తెలిపింది.

దేశీయ విమానాలు ఇప్పటికే నిలిపివేశారు. ఇప్పుడు అంతర్జాతీయ విమానాలపై కూడా ప్రభావం పడనుంది.

దిల్లీ నుంచి కాఠ్‌మాండూ వెళ్లే సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)