లయన్స్ డెన్: పాలస్తీనాలో పుట్టుకొచ్చిన ఈ కొత్త సాయుధదళం ఏంటి

ఇజ్రాయెల్ దళాలు, పాలస్తీనియన్ల మధ్య ఆక్రమిత వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలెంలో ఈ ఏడాది ప్రారంభం నుంచే ఉద్రిక్తత, హింస పెరుగుతూ వస్తోంది.

పాలస్తీనాలో కొత్తగా ఉనికిలోకి వచ్చిన సాయుధ దళం 'లయన్స్ డెన్' ఇజ్రాయెల్ దళాలపై జరిగిన పలుదాడులకు కారణమని చెబుతున్నారు.

ఉత్తర వెస్ట్ బ్యాంక్‌లోని పురాతన నగరం నాబ్లస్ నుంచి ఈ కొత్త సాయుధ దళం పుట్టుకొచ్చింది. ఈ దళం పేరు అరబిక్‌లో 'అరీన్ అల్ ఉసుద్' అంటే 'ది లయన్స్ డెన్' అని అర్థం.

లయన్స్ డెన్ సభ్యులు, మద్దతుదారులంతా యువ పాలస్తీనియన్లు. తమది సంప్రదాయ రాజకీయాలకు అతీతంగా ఎదిగిన దళం అని చెబుతున్నారు.

ఇంతకీ వాళ్లెవరు? వాళ్ల ఉనికి ఎంత ప్రాముఖ్యం?

అసంతృప్తితో ఉన్న యువ పాలస్తీనియన్లు

"లయన్స్ డెన్ దళంలో ఆగ్రహంతో, అసంతృప్తితో ఉన్న యువ పాలస్తీనియన్లు ఉన్నారు. చాలామంది 20లలో ఉన్నవారే. వెస్ట్ బ్యాంక్ లేదా గాజాలో ఉన్న రాజకీయ వర్గాలకు చెందినవారు కారు. ముఖ్యంగా, ఈ సమూహం ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాటంపై దృష్టిపెడుతోంది" అని హొరైజన్ సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇబ్రహీం జిబ్రిల్ దలాల్షా అన్నారు.

ఈ సంస్థ వెస్ట్ బ్యాంక్‌లోని రమల్లా నగరంలో ఉంది.

ఈ సాయుధ దళం ప్రధానంగా నాబ్లస్ నగరంలో, ముఖ్యంగా అల్-యాస్మినా పరిసరాల్లో చురుకుగా ఉంది.

గత కొద్ది నెలల్లో పదుల సంఖ్యలో పాలస్తీనియన్లను దళంలో చేర్చుకున్నారు.

ఈ దళానికి ప్రస్తుతం ఉనికిలో ఉన్న రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదు కానీ, ఈ దళ సభ్యుల్లో కొందరికి గతంలో రాజకీయ సంబంధాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

"అది పార్టీలకు అతీతంగా పనిచేస్తున్న దళం. అందరూ కలిసికట్టుగా ఒక్క సమూహంగా పనిచేస్తున్నారు. అయితే, వారిలో కొందరు గతంలో ఇస్లామిక్ జిహాద్, అల్-అక్సా మార్టర్స్ బ్రిగేడ్స్, హమాస్ లేదా ఫతా లాంటి సమూహాలతో సంబంధం ఉన్నవారు" అని అమెరికాలోని రిచ్‌మండ్ విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రవేత్త డానా ఎల్ కుర్ద్ వివరించారు.

ఈ దళం ఎలా ప్రారంభమైంది?

మొదట 2022 ఫిబ్రవరిలో 'నాబ్లస్ బెటాలియన్' అనే పేరుతో ఈ దళం ఉనికిలోకి వచ్చింది. అప్పట్లో ఇందులో కేవలం 10 మంది సభ్యులు ఉండేవారు. జెనిన్ శరణార్థి శిబిరం నుంచి వచ్చిన సాయుధ సమూహం 'జెనిన్ బెటాలియన్' నుంచి ప్రేరణ పొందారు.

2022 ఆగస్టులో ఇజ్రాయెల్ ఆర్మీ నాబ్లస్‌లోని ఒక ఇంటిపై దాడి చేసింది. అందులో సీనియర్ ఫైటర్ ఇబ్రహీం అల్-నాబ్లూసీ సహా ఇద్దరు ఫైటర్లు చనిపోయారు.

అల్-నాబ్లూసీని చంపడం అనేకమందిని కదిలించిందని చెబుతున్నారు. ఇజ్రాయెల్ దాడిలో చనిపోయినవారికి నివాళులు అర్పించేందుకు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో 'లయన్స్ డెన్' అధికారికంగా ఉనికిలోకి వచ్చిందని భావిస్తున్నారు.

2023 ప్రారంభంలో ఇజ్రాయెల్ ఆర్మీ.. లయన్స్ డెన్ దళంలో ముఖ్యులను అరెస్ట్ చేసింది. కొందరిని మట్టుబెట్టింది. ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపారన్న ఆరోపణలతో ఈ చర్యలు తీసుకుంది.

ఈ ఫైటర్ల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ముఖ్యంగా టిక్‌టాక్‌లో తెగ కనిపించాయి. కొద్ది నెలల తరువాత, ముఖానికి మాస్క్ తొడుక్కున్న సాయుధులు నాబ్లస్ నగరంలో కవాతు చేశారు.

ఇది పాలస్తీనా ప్రభుత్వానికి, ఇజ్రాయెల్ భద్రతా దళాలకు ఆందోళన కలిగించింది.

"ఇజ్రాయెల్‌కు ఏమీ నష్టం లేకపోవడం, పెరుగుతున్న అణచివేత, ఇజ్రాయెల్ ఆక్రమణ, అంతర్జాతీయ, ప్రాంతీయ స్పందన తగ్గిపోవడం, కొనసాగుతున్న రాజకీయ, ఆర్థిక స్తబ్దత.. ఇవన్నీ ఈ దళం ఏర్పడడానికి కారణాలు" అని డానా ఎల్ కుర్ద్ అభిప్రాయపడ్డారు.

ఈ దళానికి ప్రజల మద్దతు ఉందా?

పాలస్తీయన్ యువతలో "ప్రస్తుత పరిస్థుతులపై అసంతృప్తితో ఉన్నవారికి, పాత ఫతా, హమాస్ రాజకీయాలతో విసిగిపోయినవారికి" ఈ దళం కొత్త ఉత్సాహాన్నిచ్చిందని ఎల్ కుర్ద్ అన్నారు.

పాలస్తీనాలో అనేకమంది ఈ దళానికి మద్దతిస్తున్నారన్న దానికి ఆధారాలు ఉన్నాయి.

పాలస్తీనియన్ సెంటర్ ఫర్ పాలసీ అండ్ సర్వే రీసెర్చ్ డిసెంబర్‌లో వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌లో నిర్వహించిన ఒక పోల్‌లో 70 శాతం కంటే ఎక్కువ మంది లయన్స్ డెన్ వంటి స్వతంత్ర సాయుధ దళాలకు మద్దతు ఇచ్చారు.

యువ పాలస్తీనియన్లు ఇలాంటి సాయుధ తిరుగుబాటు సమూహాలకు మద్దతివ్వడానికి ఒక ముఖ్య కారణం పాలస్తీనా నాయకత్వం వృద్ధాప్యం బాట పట్టడమని విశ్లేషకులు అంటున్నారు.

"పాలస్తీనా ప్రభుత్వం రాజకీయంగా దివాలా తీసిందని, శాంతియుత మార్గాల ద్వారా రాజకీయ స్వాతంత్ర్యం సాధించలేరని వాళ్లు విశ్వసిస్తున్నారు. ప్రతిఘటించడం, పోరాటం మాత్రమే వివాదాలకు పరిష్కారమని భావిస్తున్నారు" అని ఇబ్రహీం దలాల్షా అన్నారు.

లయన్స్ డెన్ దళం సోషల్ మీడియాలో కూడా చాలా పాపులర్ అయింది. లయన్స్ డెన్ టెలిగ్రాం ఛానెల్‌కు 1.3 లక్షల కంటే ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్నారు. టెలిగ్రాంలో ఈ దళం సంఘీభావం కోసం ఇచ్చిన పిలుపుకు వందల సంఖ్యలో పాలస్తీనియన్లు స్పందించారు.

ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్న మిలిటెంట్లకు సంఘీభావంగా మద్దతుదారులంతా డాబా మీదకు వెళ్లి 'తక్బీర్స్' (దేవుడి గొప్పతనాన్ని సూచించే పదం) అని అరవాలని కోరారు.

వెస్ట్ బ్యాంక్, ఆక్రమిత తూర్పు జెరూసలెంలోని అన్ని ప్రాంతాల నుంచి యువ పాలస్తీనియన్లు 'డెన్‌ను పరాజయం లేదు' అంటూ నినాదం చేశారు.

పాలస్తీనా ప్రభుత్వంతో ఈ దళం సంబంధాలు ఎలా ఉన్నాయి?

ఇజ్రాయెల్, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్ఓ) మధ్య ఓస్లో శాంతి ఒప్పందంలో భాగంగా వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనా స్వయంప్రతిపత్త ప్రాంతాలను పాలించేందుకు ఏర్పడిన ప్రభుత్వమే పాలస్తీనియన్ అథారిటీ (పీఏ)

పాలస్తీనా పట్టణాలు, గ్రామాలు చాలావరకు పీఏ పాలనలోనే ఉన్నాయి. పీఏలో లౌకికవాద ఫతా వర్గం అధిక సంఖ్యలో ఉంది. మరో వర్గం హమాస్ నియంత్రణలో గాజా స్ట్రిప్ ఉంది. హమాస్‌కు వెస్ట్ బ్యాంక్‌లో పెద్ద పట్టు లేదు.

పాలస్తీనాలో కొత్తగా ఉనికిలోకి వస్తున్న సాయుధ దళాలతో కలిసి పోరాడుతున్న యువ పాలస్తీనీయన్లు 1993లో జరిగిన ఓస్లో ఒప్పందం సమయానికి పుట్టి ఉండరు కూడా.

"పాలస్తీనియన్ అథారిటీ నాయకత్వం, ఫతా పాలక పక్షం అనేక కారణాల వల్ల లయన్స్ డెన్ దళం పట్ల అసంతృప్తిగా ఉంది" అని దలాల్షా అన్నారు.

"అయినప్పటికీ, దళాన్ని బలవంతంగా నాశనం చేయడం కన్నా, వారితో సహకరించాలని వ్యూహాత్మక నిర్ణయం తీసుకుని ఉండవచ్చు" అని దలాల్షా అభిప్రాయపడ్డారు.

ఆయుధాలు విడిచిపెట్టి పాలస్తీనా భద్రతా దళంలో చేరమని లయన్స్ డెన్ సమూహానికి నచ్చజెప్పడానికి పీఏ ప్రయత్నిస్తున్నట్టు కొంతమంది చెబుతున్నారు.

కొందరు సభ్యులు అందుకు అంగీకరించారు కానీ, దళ నాయకులు ఆయుధాలు విడిచిపెట్టడానికి నిరాకరించారు. చివరి వరకు పోరాడతామని చెప్పారు.

"లయన్స్ డెన్ సభ్యులు కొందరు పీఏను విమర్శించినా దానితో వివాదాల జోలికి పోరు. పీఏకు వ్యతిరేకంగా వెళితే, చాలామంది ప్రజలతో నేరుగా వివాదానికి దిగినట్టు అవుతుంది. అలా జరగకుండా ఉండేలా జాగ్రత్త పడుతుండవచ్చు” అని దలాల్షా అన్నారు.

ఇజ్రాయెల్ ఏమంటోంది?

ఇజ్రాయెల్ లయన్స్ డెన్ దళాన్ని "తీవ్రవాద సంస్థ"గా పరిగణిస్తోంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ ఆర్మీ నాబ్లస్‌లోకి చొరబడి 11 మంది పాలస్తీనియన్లను హతమార్చింది. అందులో ఆరుగురు లయన్స్ డెన్ సభ్యులని ఆ దళం టెలిగ్రాంలో తెలిపింది.

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) మొదట నాలుగు గంటల పాటు దాడి జరిపింది. తరువాత, తమ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నట్టు ప్రకటించింది. పాలస్తీనియన్ సాయుధులు ఇజ్రాయెల్ ఆర్మీని కాల్చి చంపారని, అందుకే చర్యలను తీవ్రతరం చేస్తున్నట్టు తెలిపింది.

"ముప్పు ఉందని మేం గ్రహించాం, అందుకే లోపలికి చొచ్చుకుని వెళ్లి, పని పూర్తిచేయాల్సి వచ్చింది" అని ఐడీఎఫ్ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్ మీడియాతో చెప్పారు.

ఇజ్రాయెల్ ఇటీవల నాబ్లస్, తూర్పు జెరూసలెం చుట్టుపక్కల అనేక ప్రాంతాలను బ్యారికేడ్లు, సిమెంట్ బ్లాకులతో మూసివేసింది.

"ఇజ్రాయెల్ చాలా తీవ్రంగా స్పందించింది. కానీ, లయన్స్ డెన్ ప్రభావం ఇంకా కొనసాగుతుంది. వాళ్లు మరిన్ని కొత్త దళాలను ప్రోత్సహించవచ్చు లేదా మరికొందరిని తమ దళంలో చేర్చుకోవచ్చు" అని డానా ఎల్ కుర్ద్ అభిప్రాయపడ్డారు.

లయన్స్ డెన్ దళం పాలస్తీనా భూభాగాల్లో రాజకీయంగా కూడా ప్రభావం చూపించవచ్చని ఇబ్రహీం దలాల్షా భావిస్తున్నారు.

"పాలస్తీనా స్వేచ్ఛ సాధించాలి, ఇజ్రాయెల్ ఆక్రమణకు ముగింపు పలకాలన్న వాళ్ల ఆశయాలను నెరవేర్చుకోవడం అంత సులువు కాదు. కానీ, వారి ఉనికి, వారి కార్యకలాపాలు పాలస్తీనా అథారిటీకి, ఇజ్రాయెల్‌కు ఆటంకంగా నిలిచాయి. సవాలుగా మారాయి" అన్నారు దలాల్షా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)