You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఫిఫా ప్రపంచకప్‌లో '33వ జట్టు' పాలస్తీనా.. ఆడకుండానే అభిమానుల మనసు గెలుచుకుంది
ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో పాలస్తీనా ఆడలేదు. కానీ, ఈ క్రీడామహోత్సవంలో లక్షలాది అభిమానులను సంపాదించుకుంది.
ఖరాత్‌లో ఫుట్‌బాల్ మైదానాల నుంచి వీధుల వరకు పాలస్తీనా జెండా రెపరెపలాడింది.
ప్రపంచకప్‌లో 32 దేశాల జట్లు ఆడుతున్నాయి. పాలస్తీనా "33వ జట్టు"గా ఉందని, ఏ దేశానికి ప్రపంచ కప్ వచ్చినా, పాలస్తీనా విజేత అవుతుందని పలువురు భావిస్తున్నారు.
డిసెంబరు 6న రౌండ్ ఆఫ్ 16లో స్పెయిన్‌పై మొరాకో అపూర్వమైన విజయం సాధించిన తరువాత ఆ జట్టు మైదానంలో పాలస్తీనా జెండాను ఎగురవేసింది. అల్ రేయాన్స్ ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం ఆనందోత్సాహాలతో మారుమోగింది.
మొరాకోకు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు ఉన్నప్పటికీ, ఆటగాళ్లు స్వతంత్రంగా పాలస్తీనా ఆందోళనకు బహిరంగంగా మద్దతు ప్రకటించడంతో వాళ్లు హీరోలైపోయారు.
గ్రూప్ దశలో కెనడాను ఓడించిన తరువాత కూడా మొరాకో జట్టు పాలస్తీనా జెండా ఎగురవేసి సంబరాలు చేసుకుంది.
అయితే ఫిఫా నిబంధనల ప్రకారం, పిచ్‌పై ఆటగాళ్లు బ్యానర్లు, జెండాలు, ఫ్లైయర్‌లను ప్రదర్శించడం నిషేధం. అలా చేసిన వారిపై విచారణ చేపట్టవచ్చు.
అందుకే, మొరాకో బృందం పాలస్తీనా జెండా ఎగరేసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాలస్తీనా మద్దతుదారులు చప్పట్లు కొట్టి వారి ధైర్యాన్ని మెచ్చుకున్నారు.
మొరాకో ఆటగాళ్లు పాలస్తీనా జెండాలు పట్టుకుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మొరాకో విజయానికి అరబ్ దేశాలతో పాటు పాలస్తీనాలో కూడా సంబరాలు జరుపుకున్నారని అల్ జజీరా నివేదిక వెల్లడించింది. గాజా స్ట్రిప్‌లోని స్పోర్ట్స్ హాల్‌లో వేలాది మంది గుమిగూడి మ్యాచ్ చూశారు. మొరాకో గెలవడంతో వీధుల్లోకి వచ్చి వేడుక చేసుకున్నారు.
మొరాకో జట్టు సంబరాలు
ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలో సెమీ ఫైనల్‌కు చేరిన మొదటి ఆఫ్రికన్ అరబ్ జట్టుగా మొరాకో చరిత్ర సృష్టించింది. కానీ, సెమీ ఫైనల్‌లో ఫ్రాన్స్ చేతిలో ఓడిపోవడం అభిమానులకు కొంత నిరాశ కలిగించింది.
రౌండ్ ఆఫ్ 16లో స్పెయిన్‌పై మొరాకో గెలిచి సెమీస్‌లో స్థానం సంపాదించిన రోజు ఖతార్ వీధులలో పచ్చ, తెలుపు, ఎరుపు, నలుపు రంగులు కలగలిసిన పాలస్తీనా జెండా రెపరెపలాడింది.
పాలస్తీనా సమస్య ప్రపంచం దృష్టిలో కనుమరుగైపోలేదన్న విషయాన్ని ఈ ఘటన చాటి చెప్పిందని అనేకమంది భావించారు.
స్టేడియంలో, ఫ్యాన్ జోన్‌లో అభిమానులు పాలస్తీనా జెండాలతో పాటు చేతులకు బ్యాండ్స్, బ్రేస్‌లెట్లతో కనిపించారు. 'ఫ్రీ పాలస్తీనా' నినాదాలు చేశారు.
"ఇటీవలి శాంతి ఒప్పందం తరువాత పాలస్తీనా వివాదం సమసిపోయిందన్నది అబద్ధమని ఈ వరల్డ్ కప్ నిరూపించింది" అని పాలస్తీనా ఫుట్‌బాల్ జట్టు అధికారి రాజౌబ్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో అన్నారు. రాజౌబ్ 'ఫతా మూవ్‌మెంట్' సెక్రటరీ జనరల్ కూడా.
ప్రపంచ కప్ సందర్భంగా పాలస్తీనాకు లభించిన మద్దతును ఈ ఒప్పందంపై 'చెంపపెట్టు'గా రజౌబ్ భావిస్తున్నారు.
ఈ ఒప్పదాన్ని (నార్మలైజేషన్ డీల్) పాలస్తీయన్లు విశ్వాసఘాతుకంగా పరిగణిస్తారు. ఈ డీల్ ద్వారా సార్వభౌమాధికారం లేని రాజ్యాన్ని అంగీకరించమని పాలస్తీనియన్లపై ఒత్తిడి తేస్తున్నారని విశ్వసిస్తారు.
"ఎన్నో ఏళ్ల నిరాశ నిస్పృహల తరువాత, ఖతార్ ప్రపంచ కప్ అరబ్ ప్రపంచంలో పాలస్తీనా ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించింది" అని పాలస్తీనియన్ సెంటర్ ఫర్ పాలసీ అండ్ సర్వే రీసెర్చ్ పేర్కొంది.
ఈసారి టోర్నమెంట్‌కు అర్హత సాధించిన పాలస్తీనాను '33వ' జట్టుగా రజౌబ్ పేర్కొన్నారు.
ఖతార్‌తో సంబంధం
పాలస్తీనాకు సార్వభౌమాధికారం ఉండాలని కోరుకుంటున్న దేశాలలో ఖతార్ ఒకటి. ఖతార్‌లో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు నివసిస్తున్నారు.
నవంబర్ 29న, 'పాలస్తీనా ప్రజలకు అంతర్జాతీయ సంఘీభావ దినాన్ని' (ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడారిటీ విత్ ది పాలస్తీనియన్ పీపుల్) ఖతార్‌లో అధికారికంగా జరుపుకున్నారు.
ముట్టడిలో ఉన్న గాజా స్ట్రిప్‌ను పునర్నిర్మించేందుకు సహాయం చేస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని ఖతార్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
పాలస్తీనా సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకురావడంలో ఈ ప్రపంచ కప్ పెద్ద పాత్ర పోషించిందని గాజాపై పట్టు ఉన్న ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ హమాస్ ప్రతినిధి హజెమ్ ఖాసిం అన్నారు. హమాస్‌కు ఖతార్ మద్దతు ఇస్తుంది.
మొరాకో మూలాలకు చెందిన లక్షలాది యూదులు ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు. వీరంతా ప్రపంచ కప్‌లో మొరాకో విజయానికి సంబరాలు చేసుకున్నారు.
అరబ్బుల సానుభూతి ఎటువైపు ఉందో ఈ ప్రపంచ కప్ స్పష్టం చేసిందన్న విషయాన్ని ఇజ్రాయెల్‌లోని ప్రముఖ మీడియా సంస్థలు కూడా అంగీకరించాయి.
"సోషల్ మీడియాలో ప్రపంచ కప్‌లో నిజమైన విజేత పాలస్తీనా" అని వామపక్ష వార్తాపత్రిక హారెట్జ్ రాసింది.
ఫిఫా పాలస్తీనా ఫుట్‌బాల్ జట్టును గుర్తించింది. కానీ, ఆ జట్టు ఎప్పుడూ ప్రపంచ కప్‌కు అర్హత సాధించలేకపోయింది.
పాలస్తీనా-ఇజ్రాయెల్ వివాదం
పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య ఎన్నో దశాబ్దాలుగా వివాదం నెలకొని ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం, 1948 మే 14న ఇజ్రాయెల్ స్థాపన తరువాత వివాదం రాజుకుంది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య నాలుగు ప్రధాన యుద్ధాలు జరిగాయి. అవి సమస్యను పరిష్కరించడానికి బదులుగా, మరింత సంక్లిష్టపరిచాయి.
గత సంవత్సరం, గాజా తీవ్రవాదులు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య 11 రోజుల యుద్ధం జరిగింది. 200 మంది పాలస్తీనియన్లు, డజన్ల కొద్దీ ఇజ్రాయిలీలు మరణించారు.
ఇజ్రాయెల్‌లోని ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో సైన్యం దాదాపు ప్రతిరోజూ సైనిక చర్యలు చేపడుతుంది. ఈ చర్యలలో ఈ ఏడాది ఇప్పటి వరకు 132 మంది పాలస్తీనియన్లు మరణించారు. పాలస్తీనా దాడుల్లో 19 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు.
తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్లు చేపడుతున్నట్టు ఇజ్రాయెల్ చెబుతోంది. కానీ, మరణించిన వారిలో పాలస్తీనా పిల్లలు కూడా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- వహాయ: ఐదో భార్య పేరుతో సెక్స్ బానిసలుగా బాలికలు.. ప్రభుత్వం నిషేధించేవరకు పోరాడిన మహిళ
- 100 రోజుల భారత్ జోడో యాత్ర: రాహుల్ గాంధీపై జోకులు తగ్గడానికి ఈ యాత్రే కారణమా? ప్రజలు మారిపోతున్నారా?
- చైనాలో మందుల కోసం ఎగబడుతున్న జనం.. అసలేం జరుగుతోంది?
- సౌత్ కొరియాలో జెండర్ ఈక్వాలిటీ మంత్రిత్వ శాఖను రద్దు.. అధ్యక్షుడి నిర్ణయంపై మహిళల ఆగ్రహం
- అవతార్ 2 రివ్యూ: ‘మన’ అనుకున్నది ఎవరైనా లాక్కుంటే ఏం చేస్తామో అదే అవతార్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)