ఏకపక్ష విజయంలోనూ టీడీపీకి దక్కని ఆ రెండు నియోజకవర్గాలు..

    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలుగుదేశం పార్టీ ఆరోసారి అధికారంలోకి వచ్చింది. 40 ఏళ్ల కాలంలో పదిసార్లు ఎన్నికలోలో పోటీ చేసిన ఆ పార్టీ ఈ సారి 135 సీట్లు సాధించింది.

ఈ క్రమంలో ఆ పార్టీ గతంలో తమకు పట్టులేని అనేక నియోజకవర్గాలలో పాగా వేయగలిగింది.

కానీ, తెలుగుదేశం చరిత్రలోనే ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజయం సాధించని రెండు నియోజకవర్గాలను ఈసారి కూడా గెలవలేకపోయింది.

ఆ రెండు నియోజకవర్గాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌లోని రెండు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా గెలవలేదు. ప్రస్తుత ఎన్నికలలోనూ తెలుగుదేశం పార్టీకి ఆ కోరిక తీరలేదు.

అందులో ఒకటి పులివెందుల కాగా, రెండోది యర్రగొండపాలెం.

పులివెందుల: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి గట్టి పట్టున్న కడప జిల్లాలోని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు.

ప్రస్తుత ఎన్నికలలో ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పోటీచేశారు. తెలుగుదేశం పార్టీ బీటెక్ రవిని ఇక్కడ తమ అభ్యర్థిగా నిలిపింది.

54,628 ఓట్లు మాత్రమే సాధించిన బీటెక్ రవి 61,687 ఓట్ల తేడాతో జగన్మోహన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

దీంతో ఈ ఎన్నికలు కూడా తెలుగుదేశం పార్టీకి పులివెందులలో విజయం అందించలేక పోయాయి.

1978లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారి ఈ నియోజకవర్గంలో పోటీ చేసినప్పటి నుంచి ఆ కుటుంబానికి చెందినవారే గెలుస్తున్నారు.

1978, 1983, 1985 ఎన్నికలలో రాజశేఖర్ రెడ్డి వరుసగా మూడుసార్లు ఇక్కడ విజయం సాధించారు.

1989లో రాజశేఖర్ రెడ్డి కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడంతో పులివెందులలో ఆయన సోదరుడు వై.ఎస్. వివేకానందరెడ్డి పోటీ చేసి గెలిచారు.

1991‌లో వివేకానందరెడ్డి రాజీనామా చేయడంతో పులివెందులకు జరిగిన ఉప ఎన్నికలలో రాజశేఖర్ రెడ్డి బాబాయి(రాజారెడ్డికి సోదరుడు), నేత్ర వైద్యుడు అయిన వై.ఎస్. పురుషోత్తమరెడ్డి పోటీ చేసి గెలిచారు.

అనంతరం 1994 ఎన్నికలలో మళ్లీ వివేకానందరెడ్డే పోటీ చేసి విజయం సాధించారు.

1999లో రాజశేఖర్ రెడ్డి కడప లోక్‌సభ స్థానానికి బదులు పులివెందుల అసెంబ్లీ స్థానానికి మళ్లీ పోటీ చేశారు. అప్పటి నుంచి అంటే 1999, 2004, 2009 ఎన్నికలలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మూడుసార్లు పులివెందుల నుంచి గెలిచారు.

అనంతరం రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో 2010లో జరిగిన ఉప ఎన్నికలలో ఆయన భార్య వై.ఎస్. విజయమ్మ పోటీ చేసి గెలిచారు.

కానీ, అక్కడికి కొద్దిరోజులలోనే కుమారుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ స్థాపించడంతో ఆయనతో పాటు విజయమ్మ కూడా కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో పులివెందులకు ఉపఎన్నిక అవసరమైంది.

ఆ ఉపఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయమ్మ గెలిచారు.

అనంతరం 2014లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2019లోనూ ఆయన అదే స్థానం నుంచి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికవడంతో పాటు తన పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి అయ్యారు.

ఇలా 1978 నుంచి 2024 వరకు మూడు ఉపఎన్నికలతో కలిపి మొత్తం 14 సార్లు పులివెందుల నుంచి కాంగ్రెస్ తరఫున వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన అయిదుగురు ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్, వైసీపీ, ఒకసారి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవడమే తప్ప తెలుగుదేశం మాత్రం ఇంతవరకు బోణీ చేయలేకపోయింది.

యర్రగొండపాలెం:

ప్రకాశం జిల్లాలోని ఎస్సీ రిజర్వ్‌డ్ అసెంబ్లీ స్థానం యర్రగొండపాలెంలో వైసీపీకి చెందిన తాటిపర్తి చంద్రశేఖర్ విజయం సాధించారు.

తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన ఎరిక్షన్ బాబు 5,200 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

దీంతో ప్రస్తుత ఎన్నికలలోనూ యర్రగొండపాలెం సీటును టీడీపీ గెలుచుకోలేకపోయింది.

1955లో ఏర్పడిన యర్రగొండపాలెం నియోజకవర్గం 1972 తరువాత రద్దయింది. మళ్లీ మూడు దశాబ్దాల తరువాత 2009 నుంచి ఉనికిలోకి వచ్చింది. అయితే, 1972 వరకు జనరల్ నియోజకవర్గంగా ఉన్న ఇది 2009 నుంచి ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారింది.

ఒక ఉప ఎన్నిక సహా ఎనిమిది సార్లు యర్రగొండపాలెం నియోజకవర్గానికి ఎన్నికలు జరగ్గా నాలుగుసార్లు కాంగ్రెస్ పార్టీ, రెండుసార్లు సీపీఐ, రెండుసార్లు వైసీపీ గెలిచాయి.

జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేశ్ ఈ నియోజకవర్గం నుంచి 2009, 2019 ఎన్నికలలో రెండుసార్లు గెలిచారు.

అంతకుముందు 1962, 1967లో పూల సుబ్బయ్య ఇక్కడ రెండుసార్లు గెలిచారు. వీరిద్దరు మినహా ఈ నియోజకవర్గంలో రెండు సార్లు గెలిచిన నేతలు వేరే ఎవరూ లేరు.

అయితే డీలిమిటేషన్ తరువాత ఏర్పడి, టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేకపోయిన కొన్ని నియోజకవర్గాలలో ఈసారి ఆ పార్టీ బోణీ చేయగలిగింది.

అలాంటివాటిలో రాజాం, రంపచోడవరం, పూతలపట్టు, శ్రీశైలం, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలున్నాయి.

వీటన్నింటిలో ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిచింది.

రాజాంలో కోండ్రు మురళీమోహన్, రంపచోడవరంలో మిరియాల శిరీష దేవి, పూతలపట్టులో కె.మురళీమోహన్, శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నెల్లూరు సిటీలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్‌లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ తరఫున గెలిచారు.

ఇక 1985లో తప్ప మరెన్నడూ గెలవని కోడుమూరు నియోజకవర్గంలో ఈసారి టీడీపీ విజయం సాధించగలిగింది.

టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి 21 వేలకు పైగా ఆధిక్యంతో ఈ నియోజకవర్గంలో విజయం సాధించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)