You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు వైసీపీ దూరమైందా, జగన్ ఎక్కడ కూర్చుంటారు?
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆసక్తికరంగా సాగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. కూటమి ఘన విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకి సన్నాహాలు మొదలయ్యాయి.
టీడీపీ శాసనసభా పక్షం సమావేశం (టీడీఎల్‌పీ) నిర్వహించి సభా నాయకుడిని ఎన్నుకుంటారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాక తదనునుగుణంగా ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది.
దిల్లీలో ఎన్డీయే సమావేశంలో పాల్గొని, ముఖ్య నేతలను ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఆయన జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.
ఫలితాలు వెలువడగానే మంగళవారం సాయంత్రమే జనసేన కార్యాలయానికి వెళ్లి పవన్, ఆయన కుటుంబ సభ్యుల్ని కలిశారు. ఆ సందర్భంగా కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయమై కొంత చర్చించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో జూన్ రెండో వారంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి.
అయితే ఈసారి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరన్నది ఆసక్తిగా మారింది. జగన్ ప్రధాన ప్రతిపక్ష నేత కాగలరా? అసలు ఈ హోదా దక్కడానికి ఉన్న నిబంధనలు ఏమిటి? కథనంలో తెలుసుకుందాం.
1977 తరువాత...
భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 168 నుంచి 221 వరకూ రాష్ట్రాల శాసనసభలు, మండళ్ల నిర్వహణ, విధుల గురించి ప్రస్తావించారు.
ఏదైన చట్ట సభలో అధికార పార్టీ/ అధికారంలో ఉండే పార్టీల తర్వాత పెద్ద పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది.
నిజానికి 1977వరకూ ప్రధాన ప్రతిపక్ష హోదా సమస్య రాలేదు. అంతకుముందు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే వివాదమే లేదు. రెండో పెద్ద పార్టీకి గుర్తింపు ఇచ్చేవారు. కానీ తొలిసారిగా 1977లో కాంగ్రెస్ ఓటమి తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్టుకి చట్టబద్ధత కల్పించారు.
1977లో రూపొందించిన నిబంధనల ప్రకారం పార్లమెంట్/ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీ నేతకు కొన్ని సదుపాయాలు కల్పించారు.
దాని ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కాలంటే సభలో ఆ పార్టీకి కనీసం 10 శాతం సభ్యులుండాలి. ఈ మేరకు లోక్‌సభలో 55, ఏపీ అసెంబ్లీలో 18 సీట్లు దక్కిన పార్టీలకే ప్రధాన ప్రతిపక్ష హోదా హోదా లభిస్తుంది. నిర్ణీత సంఖ్యలో సీట్లు దక్కిన పార్టీ నాయకుడిని ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ ప్రకటిస్తారు.
తాజాగా జరిగిన ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి 135, జనసేనకి 21 , వైఎస్సార్సీపీకి 11, బీజేపీకి 8 సీట్లు చొప్పున దక్కాయి.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగడంతో, ఆ పార్టీలు ప్రభుత్వంలో భాగస్వాములయ్యే అవకాశం కనిపిస్తోంది.
అయితే 11 స్థానాలు మాత్రమే గెలుచుకున్న వైసీపీ ప్రతిపక్షం అవుతుంది. అయితే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష స్థానం దక్కాలంటే ఆ పార్టీకి కనీసం 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. దీంతో ఇప్పుడు వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం కనిపించడం లేదు.
ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోతే
ప్రధాన ప్రతిపక్ష నేతకు క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. సభలో సీట్ల కేటాయింపులో విపక్షానికి ప్రాధాన్యం దక్కుతుంది.
క్యాబినెట్ హోదా కలిగి ఉండడంతో పాటు పీఎస్, పీఏ సహా సిబ్బంది, అలవెన్సులు, తదనుగుణమైన ప్రోటోకాల్ కూడా వర్తిస్తుంది.
సభలో చర్చల సందర్భంగా స్పీకర్ అనేక సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతను సంప్రదించడం ఆనవాయితీ. సభలో ప్రశ్నలు వేసే విషయంలో కూడా ప్రధాన ప్రతిపక్షానికి ప్రాధాన్యం ఉంటుంది.
మిగిలిన పార్టీలకు సభ్యుల సంఖ్యను బట్టి ప్రశ్నలు కేటాయిస్తారు.
వివిధ బిల్లులపై చర్చ సందర్భంగా సమయం కేటాయింపు కూడా ప్రతిపక్ష పార్టీ బలాన్ని అనుసరించే ఉంటుంది.
అఖిలపక్ష సమావేశాల సందర్భంగా ప్రతిపక్షనేత హోదా ఉన్న పార్టీ నేతకు ప్రాధాన్యం దక్కుతుంది.
ఇక 16,17 లోక్ సభల్లో కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాకు దూరంగా నిలిచిపోయింది. 2014లో కేవలం 44 సీట్లు, 2019లో 52 స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది.
దాంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది ఆ పార్టీ. అయితే, స్పీకర్ అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమంటూ కాంగ్రెస్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
దీంతో లోక్‌సభలో రెండో పెద్ద పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు.
1984 లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అప్పట్లో కాంగ్రెస్ తర్వాత రెండో పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు.
పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్ష నేతకు సీవీసీ, ఎన్‌హెచ్‌ఆర్‌సీ, లోక్‌పాల్ వంటి సంస్థ అధిపతుల నియామకాల్లో భాగస్వామ్యం ఉంటుంది
జగన్ సంగతేంటి?
ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి హోదాలో కొనసాగిన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 2014-19 మధ్య ప్రధాన ప్రతిపక్ష నేతగానూ ఉన్నారు. అప్పట్లో ఆయన పార్టీకి 67 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి.
కానీ తాజా ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితం కావడంతో జగన్‌కి ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేదు.
ఆయనకు సభలో ఎక్కడ సీటు కేటాయించాలనే విషయాన్ని స్పీకర్ నిర్ణయిస్తారు.
సభ జరుగుతున్నప్పుడు చర్చకు సమయం కేటాయింపు, ప్రశ్నలకు అవకాశం వంటి వాటిలో ప్రాధాన్యం ఉండదు.
కేవలం ఆయన కూడా సాధారణ ఎమ్మెల్యేలానే వ్యవహరించాల్సి ఉంటుంది.
ఎమ్మెల్యేకు దక్కే అలవెన్సులు, ఇతర అవకాశాలు మాత్రమే వస్తాయి. క్యాబినెట్ హోదా లభించే అవకాశం లేదు.
ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన నేతకు ఇలాంటి పరిస్థితి రావడం ఇదే తొలిసారి.
గతంలో చంద్రబాబు కూడా మూడు దఫాలు విపక్షంలో ఉన్నప్పటికీ ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కడంతో క్యాబినెట్ స్థాయి ప్రోటోకాల్ కేటాయించారు.
కానీ ప్రస్తుతం జగన్ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.
ఈ విషయంపై శాసనసభా వ్యవహారాల నిపుణుడు పి.రమేష్‌తో బీబీసీ మాట్లాడింది.
"సభలో నిబంధనలను అనుసరించి ప్రతిపక్ష హోదాకు తగ్గట్టుగా ఎమ్మెల్యేలు గెలవలేకపోవడంతో వైఎస్సార్సీఎల్పీ సీట్ల విషయం స్పీకర్ పరిధిలోనే ఉంటుంది. కూటమిలో భాగస్వామ్య పార్టీలన్నీ కొత్త ప్రభుత్వంలో పాలుపంచుకుంటే ఇక వైఎస్సార్సీపీ సభ్యులు మాత్రమే విపక్షం అవుతారు. కాబట్టి తొలి వరుసలోనే సీటు దక్కే అవకాశం ఉండొచ్చు. అయినా అది స్పీకర్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఇక శాసనసభాపక్షం నాయకుడిగా ఆ పార్టీ ఎవరిని ఎంచుకుంటారనేది కూడా ఆసక్తికరమే." అని చెప్పారాయన.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేల జాబితా..
- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి: కనిపించని ప్రవాహంలో కొట్టుకుపోయిన కెరటం
- తెలుగుదేశం పార్టీ విజయానికి దారులు వేసిన 5 పరిణామాలివే...
- ఏపీ సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్, ఫలితాలపై ఆయన ఏమన్నారంటే..
- లోక్‌సభ ఎన్నికల ఫలితాలు: బీజేపీ కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ వ్యూహం ఎలా ఫలించింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)