షాహీన్ అఫ్రిదికి గాయం కావడం వల్లే పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్‌ కోల్పోయిందా?

ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్-2022 ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్ షాహిన్ షా అఫ్రిది గాయపడ్డాడు.

ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోగా ఇంగ్లండ్ రెండో సారి టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది.

‘షాహీన్ షాహ్ అఫ్రిదికి గాయం కాకుండా ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది’ అని మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అన్నాడు.

29 బంతుల్లో 41 పరుగులు చేయాలి..

గాయం వల్ల అఫ్రిది మైదానం వీడే సమయానికి ఇంగ్లండ్ 41 పరుగులు చేయాల్సి ఉంది. ఉన్న బంతులు 29 మాత్రమే.

‘టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇదే కీలక మలుపా?’ అంటూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కూడా ట్వీట్ చేసింది.

‘షాహీన్ అఫ్రిది గాయపడటం కచ్చితంగా మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్’ అని కొంత మంది ట్విటర్ యూజర్లు పోస్ట్ చేశారు.

కానీ విశ్లేషకుల మాట మరోలా ఉంది. షాహీన్ అఫ్రిది ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఓడి పోయి ఉండేదని, ఎందుకంటే ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం లేదని వారు చెబుతున్నారు.

గాయం కాకపోతే ఫలితం మరోలా ఉండేదా?

గాయపడటానికి ముందు షాహీన్ అఫ్రిది 2 ఓవర్లు వేసి 13 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్ తీశాడు. గాయపడి మైదానం వీడిన అఫ్రిది, కాసేపటి తరువాత మళ్లీ బౌలింగ్‌కు వచ్చాడు. ఒక బాల్ వేసిన తరువాత మళ్లీ నొప్పితో బయటకు వెళ్లి పోయాడు.

టీ20 నిబంధనల ప్రకారం ఒక బౌలర్ గరిష్టంగా నాలుగు ఓవర్లు వేయొచ్చు. ఆ లెక్కన చూస్తే అఫ్రిది ఇంకా 11 బంతులు బౌల్ చేసే అవకాశం ఉంది. తొలి ఓవర్ నుంచి కూడా అఫ్రిది బౌలింగ్ చేసిన తీరును చూస్తే అతను అద్భుతమైన ఫాంలో ఉన్నాడనే విషయాన్ని ఎవరైనా అంగీకరిస్తారు.

షాహీన్ అఫ్రిది వేసిన అనేక బంతులకు ఇంగ్లండ్ ప్లేయర్స్ దగ్గర జవాబు లేకుండా పోయింది. టీ20 క్రికెట్‌లో 11 బంతులు అనేవి తక్కువేమీ కాదు. అందుకే ‘షాహీన్ అఫ్రిది గాయపడటం’ మ్యాచ్‌లో కీలక మలుపు అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అన్నారు.

భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ అభిప్రాయం కూడా అలాగే ఉంది.

‘అఫ్రిది గాయపడకుండా ఉండి ఉంటే ఆట మరింత ఆసక్తిగా ఉండేది’ అని ఆయన ట్వీట్ చేశారు.

పాకిస్తాన్ రిస్క్ చేసిందా?

షాహీన్ అఫ్రిది తరచూ గాయాల బారిన పడుతూ వస్తున్నాడు. ఈ ఏడాది జులైలో శ్రీలంక టెస్టు సిరీస్‌లో గాయపడ్డాడు.

మోకాలి గాయంతో ఈ ఏడాది ఆసియాకప్ కూడా అఫ్రిది ఆడలేక పోయాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ ఆడలేదు.

కానీ టీ20 వరల్డ్ కప్-2022కి ముందు ఫిట్‌గా ఉన్నాడు అంటూ అఫ్రిదిని సెలెక్ట్ చేశారు. ఈ వరల్డ్ కప్‌లో అతను చాలా జాగ్రత్తగా బౌలింగ్ చేశాడు. తన వేగాన్ని కాస్త తగ్గించుకున్నాడు.

అందువల్ల షాహీన్ అఫ్రిది ఫిట్‌నెస్ మీద చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. అతన్ని తీసుకోవడం ద్వారా పాకిస్తాన్ చాలా పెద్ద రిస్క్ చేస్తోందనే విమర్శలు కూడా వచ్చాయి.

వరల్డ్ కప్ తొలి మ్యాచ్ భారత్‌తో ఆడింది పాకిస్తాన్. ఆ మ్యాచ్‌లో అఫ్రిది ఒక్క వికెట్ కూడా తీయలేక పోయాడు. పైగా నాలుగు ఓవర్లకు 34 పరుగులు ఇచ్చాడు.

ఆ తరువాత జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లోనూ ఒక్క వికెట్ కూడా తీయలేదు షాహీన్ అఫ్రిది. ఆ మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో పాకిస్తాన్ ఓడిపోయింది.

నెదర్లాండ్స్ మీద నాలుగు ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీశాడు.

కానీ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది అద్భుతంగా ఆడాడు. మూడు ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిచింది.

ఇక బంగ్లాదేశ్ మీద మరొకసారి రెచ్చిపోయాడు. 22 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గాను నిలిచాడు.

న్యూజీలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. గాయపడటం వల్ల ఇంగ్లండ్ మీద తన బౌలింగ్ కోటాను అఫ్రిది పూర్తి చేయలేక పోయాడు.

మొత్తం మీద ఈ వరల్డ్ కప్‌లో అఫ్రిది 11 వికెట్లు తీశాడు.

అంతర్జాతీయ టీ20లలో ఇప్పటి వరకు 47 మ్యాచ్‌లు ఆడిన అఫ్రిది 58 వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)