బైడెన్ తప్పుకోవడం అమెరికా రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది? కమలా హారిస్‌‌కు ఎంతవరకు అనుకూలం

    • రచయిత, ఆంటోనీ జర్కర్
    • హోదా, బీబీసీ న్యూస్, ఉత్తర అమెరికా ప్రతినిధి

అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసు నుంచి జో బైడెన్ తప్పుకొని, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు మద్దతు ఇచ్చారు.

అయితే, బైడెన్ తప్పుకోవడంతో డెమొక్రాట్లకు కలిగే లాభమేంటి? నష్టమేంటి?

కమలా హారిస్‌కు ఈ పోటీ ఎలా ఉండబోతుంది?

అమెరికా రాజకీయాలపై ఈ ప్రభావం ఎలా ఉండనుంది?

బైడెన్ మద్దతుతో డెమొక్రాట్ల అభ్యర్థిగా కమలా హారిస్‌ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువయ్యాయి.

కమలా హారిస్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు బైడెన్ ప్రకటించారు. నాలుగేళ్ల క్రితం ఆమెను ఉపాధ్యక్షురాలిగా ఎంపిక చేస్తూ తీసుకున్న నిర్ణయం ఉత్తమమైనదిగా చెప్పారు.

బైడెన్ మద్దతును పొందడం తాను గౌరవంగా భావిస్తున్నానని కమలా హారిస్ అన్నారు.

మరోవైపు అధ్యక్షుడి ప్రతిపాదననే చాలా మంది డెమొక్రాట్లు అనుసరించే అవకాశం ఉంది.

డెమొక్రటిక్ కన్వెన్షన్‌కు ఇంకా నెల కంటే తక్కువ వ్యవధి ఉన్న సమయంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఈ అనిశ్చితి నుంచి బయటపడేందుకు డెమొక్రాట్లు ఆమెకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.

దీని వెనుక ఆచరణాత్మక, రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి.

రాజ్యాంగపరంగా చూసుకుంటే పార్టీలో బైడెన్ తర్వాత స్థానం ఆమెదే.

అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నల్లజాతి మహిళను ఓడించడం పార్టీకి అంత మంచిది కాకపోవచ్చు.

ఇప్పటి వరకు క్యాంపెయిన్ ద్వారా సేకరించిన సుమారు 100 మిలియన్ డాలర్ల ఫండ్(భారతీయ కరెన్సీలో సుమారు రూ.836 కోట్లు) యాక్సెస్ తక్షణమే ఆమెకు లభించనుంది.

కమలా హారిస్‌పై ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయంటే..

కానీ, పబ్లిక్ ఒపీనియన్ సర్వేల్లో జో బైడెన్‌తో పోలిస్తే కమలా హారిస్‌కు ఆమోద రేటింగ్స్ తక్కువగా ఉన్నాయి.

డోనల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా జరిగే ముఖాముఖిగా చర్చలలో మాత్రం ఆమె చాలా వరకు బైడెన్‌తో సమానంగానే ఉండనున్నారు.

ఇక రెండోది కమలా హారిస్‌ ఉపాధ్యక్షురాలిగా కొన్ని కష్టమైన పరిస్థితులు దాటుకుంటూ వచ్చారు.

ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ఆమెకు అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో వలసల సమస్య పరిష్కరించే పని అప్పగించారు.

అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రకటనలు విమర్శలకు దారితీశాయి.

మరోవైపు కమలా హారిస్ అంతకుముందు కూడా ఈ పోటీలో ఉండడం కలిసొచ్చే అంశం కావొచ్చు.

2020 ఎన్నికల సమయంలో డెమొక్రాటిక్ అధ్యక్ష నామినేషన్‌కు ఆమె పోటీ పడ్డారు.

తొలుత ఆమె అధ్యక్ష నామినేషన్‌కు పోటీ పడినప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కాస్త తడబడ్డారు.

క్యాంపెయిన్‌ కూడా అంత బాగా నిర్వహించలేకపోవడంతో, నామినేషన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

కమలా హారిస్‌ను ఎంపిక చేయడం డెమొక్రాట్లకు కాస్త రిస్కే అయినప్పటికీ ప్రస్తుతం వారి దగ్గర ఇంతకంటే సురక్షితమైన ఆప్షన్స్ లేవు.

డెమొక్రటిక్ కన్వెన్షన్‌ ఎలా ఉండనుందో?

గత 50 ఏళ్లుగా, రాజకీయ సమావేశాలు(పొలిటికల్ కన్వెన్షన్లు) కాస్త విసుగు పుట్టించేవిగా మారాయి.

టీవీ కోసం ప్రతి నిమిషానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను ముందుగానే రాసి పెట్టుకోవడంతో, అధ్యక్ష నామినేషన్ సమయంలో అవి పలు రోజుల పాటు జరిగే వాణిజ్య ప్రకటనలుగా మారిపోయాయి.

గత వారం జరిగిన రిపబ్లిక్ కన్వెన్షన్ విషయంలో కూడా కాస్త అటుఇటుగా అదే జరిగింది. వచ్చేనెలలో డెమొక్రాటిక్ కన్వెన్షన్ జరగనుంది.

ఈ సమావేశం కోసం పార్టీ, బైడెన్ క్యాంపెయిన్ ఏమైతే స్క్రిప్ట్ రాశారో, అది ఇప్పుడు పనికి రాకుండా పోతుంది.

ఇప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని, జరిగే పరిస్థితులను నియంత్రిస్తూ.. కన్వెన్షన్ ఫ్లోర్‌ను నిర్వహించాల్సి ఉంది.

ఒకవేళ కమలా హారిస్‌ పార్టీని ఏకం చేయడంలో విఫలమైతే, ఈ కన్వెన్షన్ డెమొక్రటిక్ అభ్యర్థులందరికీ ఒక రాజకీయ స్వేచ్ఛను ఇస్తుంది.

తెరవెనుక, కెమెరాల ముందు పలువురు అభ్యర్థులు నామినేషన్ కోసం పోటీ పడొచ్చు.

ఇది ఒక ఆసక్తికరమైన రాజకీయ చదరంగంగా, ప్రత్యక్ష ప్రసారంగా, అంచనా వేయని విధంగా ఉండవచ్చు. అమెరికా ప్రజలు ఇలాంటిది మరెప్పుడూ చూసి ఉండరు.

రిపబ్లికన్లకు కలిగే ప్రయోజనాలేంటి?

ఈ ఏడాది రిపబ్లికన్ కన్వెన్షన్ చాలాపక్కాగా, జాగ్రత్తగా సాగింది. తమ అజెండాను ప్రమోట్ చేయడమే కాకుండా, జో బైడెన్‌ను విమర్శించడంపైనా ఈ కన్వెన్షన్‌లో పూర్తిగా దృష్టి పెట్టారు.

తాము వ్యతిరేకిస్తున్న డెమొక్రాట్ల బలహీనతలను లక్ష్యంగా చేసుకుని, వారమంతా ఈవెంట్లు జరిపారు రిపబ్లికన్లు.

తమ అభ్యర్థి బలాన్ని ఈ క్యాంపెయిన్ హైలెట్ చేసింది.

జో బైడెన్‌కు భిన్నంగా చేసిన ప్రయత్నాలు, యువ పురుష ఓటర్లను బైడెన్‌కు దూరం చేసే వ్యూహం రిపబ్లికన్ల ప్రచారంలో స్పష్టంగా కనిపించింది.

ఒకవేళ కమలా హారిస్ ఇప్పుడు డెమొక్రాట్ల తరఫున అధ్యక్ష అభ్యర్థి అయితే ప్రస్తుత పరిపాలనలో విఫలమైన అంశాలను రిపబ్లికన్లు ఎత్తిచూపే అవకాశం ఉంది.

అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని నెలల్లో ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రస్తుతం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)