You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు: పోటీ నుంచి వైదొలగిన బైడెన్, కమలా హారిస్‌కు మద్దతు
అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి జో బైడెన్ తప్పుకొన్నారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడాలనుకున్నప్పటికీ వైదొలగక తప్పని పరిస్థితులు ఆయనకు ఏర్పడ్డాయి.
తన అభ్యర్థిత్వంపై సొంత పార్టీలో వ్యతిరేకత, ట్రంప్‌తో డిబేట్ సమయంలో తడబడడం, ఆ తరువాత కూడా తన సామర్థ్యాలపై అనుమానాలు కొనసాగుతుండడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు.
కొద్దికాలంగా బైడెన్ అభ్యర్థిత్వంపై సొంత పార్టీలోని నేతల నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతూ వచ్చాయి.
ముఖ్యంగా 81 ఏళ్ల బైడెన్ వయోభారం కారణంగా ట్రంప్‌తో పోటీ పడే పరిస్థితుల్లో లేరనే అభిప్రాయం డెమొక్రాట్లలో కొందరి నుంచి వ్యక్తమైంది.
అయితే, బైడెన్ మాత్రం తొలుత తాను తప్పుకొనేది లేదంటూ చెప్పుకొచ్చినా ఇటీవల మాత్రం అనారోగ్య సమస్యలు ఏర్పడితే తప్పుకొంటానన్నారు.
ఆయన ఆ ప్రకటన చేసిన కొద్దిరోజులకే కోవిడ్ బారిన పడ్డారు. ఇప్పుడు పోటీ నుంచి వైదొలగారు.
ఈ మేరకు ఆదివారం ఆయన దేశ ప్రజలకు, పార్టీ సభ్యులకు రాసిన లేఖలో దేశ ప్రయోజనాల కోసం అధ్యక్ష ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
అనంతరం, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అభ్యర్థిత్వానికి మద్దతిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తాజా పరిణామాలతో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హారిస్‌కు అధ్యక్ష పదవికి పోటీ పడే అవకాశాలు మెరుగుపడ్డాయి.
పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన తరువాత బైడెన్ ‘ఎక్స్’లో కమలా హారిస్ గురించి రాశారు.
‘‘నా సహచర డెమొక్రాట్లకు..
అధ్యక్షుడిగా నా మిగతా పదవీ కాలంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడం కోసం నేను అధ్యక్ష పదవికి పోటీ చేయాలన్న పార్టీ నామినేషన్‌ను ఆమోదించడం లేదు.
2020లో అప్పటి ఎన్నికల సమయంలో పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ అయినప్పుడు నా తొలి నిర్ణయం ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ను ఎంచుకోవడం.
నేను తీసుకున్న నిర్ణయాలలో అది అత్యుత్తమ నిర్ణయం.
ఇప్పుడు రానున్న ఎన్నికల్లో పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌కు నా పూర్తి మద్దతు ఇస్తున్నాను.
డెమొక్రాట్లంతా ఏకమై ట్రంప్‌ను ఓడించాల్సిన సమయమొచ్చింది. ఆ పని చేద్దాం’ అంటూ బైడెన్ ట్వీట్ చేశారు.
కాగా.. బైడెన్ మద్దతు పొందడం తనకు దక్కిన గౌరవమని, అధ్యక్ష పదవి నామినేషన్ గెలుచుకుంటానని.. ట్రంప్‌కు వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేస్తానని 59 ఏళ్ల కమలా హారిస్ అన్నారు.
‘ఎలక్షన్‌కు ఇంకా 107 రోజులు ఉంది. కలసి కట్టుగా పోరాడి, కలసికట్టుగా గెలుద్దాం’ అన్నారామె.
అయితే, బైడెన్ రేసు నుంచి తప్పుకొన్నప్పటికీ హారిస్ ఇంకా అభ్యర్థిగా నిర్ణయం కాలేదు.
ఆగస్ట్‌లో జరగాల్సిన డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో పార్టీ అభ్యర్థి ఎవరనేది తేలనుంది.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)