లారా ట్రంప్: తెరపైకి డోనల్డ్ ట్రంప్ కోడలు.. కుమార్తె ఇవాంకా రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు

    • రచయిత, బ్రాండన్ లివ్సే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లారా ట్రంప్ రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లోని సెంటర్ స్టేజ్‌ మీద కొద్ది రోజుల కిందట కనిపించినప్పుడు, అది 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ కుటుంబంలో మారుతున్న సమీకరణలను సూచించింది.

నల్లటి దుస్తులు ధరించిన లారా ట్రంప్.. తన ఇద్దరు పిల్లలకు తాతయ్యగా డోనల్డ్ ట్రంప్ గురించి వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు.

తన మామగారిపై జరిగిన హత్యాయత్నం గురించి లారా ట్రంప్ పిడికిలి బిగించి చెబుతున్నప్పుడు పార్టీ అభిమానులు పెద్ద పెట్టున హర్షం వ్యక్తం చేశారు.

"బహుశా మీరు శనివారం డొనాల్డ్ ట్రంప్‌లోని మరో వ్యక్తిని చూసి ఉంటారు. మీరు మీ సొంత కళ్లతో చూస్తే కానీ ఆయన ఎలాంటి వారో మీరు ఊహించలేరు" అని ఆమె వాళ్లతో అన్నారు.

41 ఏళ్ల లారా ట్రంప్, ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ సహ అధ్యక్షురాలిగా ఉన్నారు. మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ట్రంప్ తన ప్రచారం కోసం జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న వారిలో ఆమె ఒకరు.

ఇటీవలి కాలంలో లారా ట్రంప్, ఆమె భర్త ఎరిక్, ఆయన సోదరుడు డొనాల్డ్ జూనియర్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు వ్యతిరేకంగా ట్రంప్ ప్రచారంలో కీలక పాత్రను షోషిస్తూ, ఆయన రాజకీయ జీవితంలో అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులుగా మారారు.

2016లో డోనల్డ్ ట్రంప్ విజయం తర్వాత వైట్ హౌస్‌లో అత్యంత గౌరవమర్యాదలు పొందిన ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్ గత నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ఈ కన్వెన్షన్‌లో అధికారికంగా మాట్లాడిన మొదటి కుటుంబ సభ్యురాలు లారా. ఇది కుటుంబంలో ఆమె పాత్రనే కాకుండా, ఆమె తదుపరి రాజకీయ ఆకాంక్షలనూ సూచిస్తోంది.

ఒక లైంగిక వేధింపుల కేసులో ట్రంప్‌ తరపున వాదించిన న్యాయవాది అలీనా హబ్బా మాట్లాడుతూ.. “ఆమె చాలా అద్భుతంగా మాట్లాడిందని అనుకుంటున్నాను’’ అన్నారు.

"ఆమె గుండె లోతుల్లోంచి మాట్లాడారు. ఒక తాతయ్యగా ట్రంప్ ఎలాంటివారనేది ఆమె మాట్లాడారు. అవి ఆమె మాత్రమే మాట్లాడగలిగే విషయాలు" అన్నారు అలీనా.

కుటుంబంలో లారా ట్రంప్ ప్రాధాన్యం క్రమక్రమంగా పెరుగుతోందని పరిశీలకులు భావిస్తున్నారు.

"ఆమె ప్రసంగం దేశానికి ఆమెను చాలా బాగా పరిచయం చేసింది. ఆమె గతంలో ప్రచారంలో పాల్గొని, గత ఎనిమిదేళ్లుగా ట్రంప్ అంతర్గత బృందంలో భాగమైనా, ఇలా ప్రజల్లోకి రావడం ఇదే మొదటిసారి. ఇప్పుడు ఆమె రిపబ్లికన్ పార్టీలో అధికారిక పాత్రను పోషిస్తున్నారు" అని ఇటీవల టైమ్ మ్యాగజైన్ కోసం లారా ట్రంప్‌ను ఇంటర్వ్యూ చేసిన రిపోర్టర్ ఎరిక్ కోర్టెలెస్సా అన్నారు.

ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీకి చెందిన రిపబ్లికన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మిషెల్ మెరెల్ మాట్లాడుతూ.. లారా ట్రంప్ నియామకంతో ప్రచారంలో చాలా మార్పు వచ్చిందని అన్నారు.

"ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు నిధుల సేకరణ చాలా వేగం పుంజుకుంది. నాయకత్వంలో మార్పే దీనికి కారణం. ఇది నిజంగా పార్టీకి పునరుజ్జీవం లాంటిది" అన్నారు.

ఈ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కొందరు లారా, ఎరిక్ ట్రంప్‌ల పాత్రను 2016లో ఇవాంకా, జారెడ్ పాత్రలతో పోల్చి చూస్తున్నారు. అయితే, ట్రంప్ సంస్థలో ఎరిక్‌కు ప్రముఖ పాత్ర ఉంది. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా మరోసారి గెలిస్తే, ఆయన తన తండ్రి విస్తృత వ్యాపార సామ్రాజ్యంలో కీలక వ్యక్తిగా వ్యవహరించే అవకాశం ఉంది.

లారా రిపబ్లికన్ పార్టీలో తన పట్టును పెంచుకోవడానికి ప్రయత్నిస్తుండగా, జూనియర్ ట్రంప్‌కు సైతం రాజకీయాలలో తన ప్రాబల్యాన్ని బలోపేతం చేసుకోవాలనే ఆకాంక్ష ఉండవచ్చని కోర్టెలెస్సా అన్నారు.

"తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని డొనాల్డ్ ట్రంప్ జూనియర్ చెబుతున్నారు. కానీ ఆయన సోదరుడు ఎరిక్, వదిన లారా సహా కుటుంబంలోని మిగతా వారూ ఆయనకు రాజకీయాలపై చాలా ఆసక్తి ఉందని భావిస్తున్నారు. నిజానికి లారా తన ఇంటర్వ్యూలో నాతో, 'అత్యున్నత పదవిని ఆశిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జూనియర్ ట్రంపే’ అన్నారు.’’

ఎరిక్, డొనాల్డ్ జూనియర్ ఎప్పుడూ తండ్రి చుట్టే ఉంటారు, ఆయనపై దాడి జరిగినప్పటి నుంచి అదింకా ఎక్కువైంది.

ఒక ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి జూనియర్ ట్రంప్ తన తండ్రి గుణగణాలను చాలా మెచ్చుకోగా.. లారా ట్రంప్ కుటుంబ పెద్దగా, తాతయ్యగా డోనల్డ్ ట్రంప్ పాత్రపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ సందర్భంగా జూనియర్ ట్రంప్ తన 17 ఏళ్ల కుమార్తెను వేదికపై పరిచయం చేశారు. ఆమె తన తాతయ్య గురించి చెప్పుకొచ్చారు.

అయితే ఇదంతా, ‘ట్రంప్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు’ అని వాదిస్తున్న డెమోక్రటిక్ దాడులను తిప్పికొట్టే వ్యూహం అని విమర్శకులు అంటున్నారు.

ట్రంప్ కుటుంబ సభ్యుల ఐక్యత గురించి, ప్రేమ గురించి ఎంత చెప్పినా.. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో కొంతమంది కీలక కుటుంబ సభ్యులు కనిపించకపోవడంపై తలెత్తిన సందేహాలకు మాత్రం సమాధానాలు లేవు.

ట్రంప్ భార్య మెలానియా తన భర్తతో బయట చాలా అరుదుగా కనిపించినా, ర్యాలీలో షూటింగ్ జరిగినప్పటి నుంచి ఆమె ఆయన పక్కన అసలు కనిపించడం లేదు.

వారి చిన్న కుమారుడు 18 ఏళ్ల బారన్ సైతం ఈ సమావేశంలో కనిపించలేదు. కొన్నేళ్లుగా బారన్ బయట కనిపించకున్నా, ఇటీవల మియామీలో జరిగిన ట్రంప్ ర్యాలీలో ప్రముఖంగా కనిపించడం, తనకూ రాజకీయ ఆకాంక్షలు ఉండవచ్చని సూచిస్తోంది.

మొత్తం మీద, రిపోర్టర్ ఎరిక్ కోర్టెలెస్సా మాటల్లో చెప్పాలంటే, ‘లారా ట్రంప్ రిపబ్లికన్ నేషనల్ కమిటీకి కో-ఛైర్‌గా ఉన్నందున రాబోయే నాలుగు నెలల్లో మనం చాలా మార్పులను చూడబోతున్నాం’.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)