క్రికెట్: ధోనీతో యువ ఆటగాడైన రాబిన్ మింజ్‌ను ఎందుకు పోల్చుతున్నారు? ఐపీఎల్‌లో తొలి గిరిజన ఆటగాడు ఈయనేనా

    • రచయిత, ఆనంద్ దత్
    • హోదా, బీబీసీ హిందీ

ఐపీఎల్-17 కోసం డిసెంబర్ 19న దుబయిలో జరిగిన మినీ వేలంలో ఝార్ఖండ్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లను వివిధ జట్లు కొనుగోలు చేశాయి.

జంషెడ్‌పూర్‌కు చెందిన కుమార్ కుషాగ్రాను దిల్లీ క్యాపిటల్స్ రూ.7.20 కోట్లకు కొనుగోలు చేయగా, రాంచీకి చెందిన సుశాంత్ మిశ్రాను రూ. 2.20 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.

ఇక మూడో ఆటగాడు 21 ఏళ్ల ఎడమ చేతి బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ రాబిన్ మింజ్.

అతన్ని గుజరాత్ టైటాన్స్ రూ.3.60 కోట్లకు కొనుగోలు చేసింది.

ఈఎస్‌పీఎన్ క్రిక్ సమాచారం ప్రకారం ఐపీఎల్ జట్టులో ఆడబోతున్న మొదటి గిరిజన ఆటగాడు రాబిన్ మింజ్.

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గురువారం రాబిన్ ను కలిశారు. అతనికి శుభాకాంక్షలు చెబుతూ స్వీట్లు తినిపించారు.

అయితే, ధోనీకి మింజ్‌కు చాలా పోలికలున్నాయంటున్నారు అక్కడి వారు. ఇంతకీ మింజ్ క్రికెట్‌లో ఎలా ఎదిగారు?

'ధోనీకి నాకు పోలిక అదే'

"రూ. 20 లక్షలకు ఎవరైనా కొనుగోలు చేస్తే బాగుంటుందనుకున్నా, కానీ ధర పెరుగుతూనే ఉంది. నేనసలు ఊహించలేదు" అని రాబిన్ బీబీసీతో అన్నారు.

''టీమ్‌లో సెలెక్ట్ అయ్యాక మా అమ్మకి ఫోన్ చేస్తే ఏడ్చేసింది. నాన్న కూడా ఏడవడం మొదలుపెట్టారు. నా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది'' అని చెప్పారు.

భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని రాబిన్ తన ఆరాధ్యదైవంగా భావిస్తారు.

'ధోనీ ఐపీఎల్‌లో ఆడుతాడు, నేను కూడా ఆడుతా. నాకు గర్వంగా ఉంది. నేను కూడా ఆయనలాగే వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌" అని అన్నారు.

రాబిన్ గత నాలుగేళ్లుగా ఝార్ఖండ్ జట్టులో ఆడుతున్నాడు. ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోనీని పలుమార్లు కలిసి ఆయన నుంచి చిట్కాలు తీసుకునేవారు.

''ప్రశాంతమైన మనస్సుతో ఆడాలని, ఎప్పుడూ ముందుకు ఆలోచించాలని ధోనీ సార్ చెబుతుంటారు'' అని అన్నారు రాబిన్.

రాబిన్ ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చారు.

ఇంత డబ్బు ఏం చేస్తావనే ప్రశ్నకు “ఈ డబ్బు ఏం చేయాలో మేం ఆలోచించ లేదు. ఐపీఎల్‌లో నా టీం తరఫున మెరుగ్గా ఆడాలి, భవిష్యత్తులో టీమిండియా తరపున ఆడాలనేదే నా కోరిక'' అని తెలిపారు రాబిన్.

ప్రస్తుతం ఝార్ఖండ్ అండర్ -23 జట్టులో ఆడుతున్నారు రాబిన్.

ఎప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నాడు?

రాబిన్ గుమ్లా జిల్లా రైడిహ్ బ్లాక్‌లోని సిలం పండంటోలి గ్రామ నివాసి.

అయితే గత కొన్నేళ్లుగా అతను రాంచీలోని నమ్‌కుమ్ ప్రాంతంలో నివసిస్తున్నారు.

రాబిన్ తండ్రి ఫ్రాన్సిస్ జేవియర్ మింజ్ ఆర్మీలో పనిచేసి రిటైరయ్యారు.

24 ఏళ్ల పాటు '9 బిహార్ రెజిమెంట్'లో విధులు నిర్వర్తించారు.

ప్రస్తుతం, రాంచీ విమానాశ్రయంలో సెక్యూరిటీ గార్డుగా బోర్డింగ్ పాస్‌లను తనిఖీ చేస్తారు జేవియర్.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. “ఐపీఎల్‌లోకి రాబిన్ వెళతాడని నాకు తెలుసు. పాపా.. చింతించకండి, ఏదో ఒక టీం కొంటుందని రాబిన్ అనేవాడు. ఎవరైనా 20 లక్షలకు కొనాలనుకునేవాడిని'' అన్నారు.

''నాకు చాలా సంతోషంగా ఉంది, సెలక్ట్ అయితే పేల్చాలని టపాకాయలు కూడా తెచ్చి ఉంచాను'' అని చెప్పారు జేవియర్.

రెండేళ్ల వయసులో..

"నాకు ఇంతకంటే గొప్ప క్రిస్మస్ బహుమతి మరొకటి ఉండదు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి నాకు ఏడుపొస్తోంది. ఝార్ఖండ్‌కు ధోనీ ఎలాంటి కీర్తిని తెచ్చిపెట్టాడో, నా కొడుకు కూడా అదే ఘనత సాధించాలనేది నా కల'' అని చెప్పారు రాబిన్ తల్లి అలిస్ మింజ్. పాఠశాల రోజుల్లో అలిస్ మింజ్ ఫుట్‌బాల్, అథ్లెటిక్స్ ఆడేవారు.

"రాబిన్ రెండేళ్ల వయస్సులో బంతిని కర్రతో కొట్టడం ప్రారంభించాడు. నేను ఫుట్‌బాల్, హాకీ ఆడేవాడిని. తనకు టెన్నిస్ బాల్ ఇచ్చినప్పుడు మొదట్లో కుడి చేతితో కొట్టడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఎడమచేత్తో ఆడుకోవడం మొదలుపెట్టాడు. నా కుటుంబంలో ఎడమచేతి వాటం వాళ్లు లేరు. క్రికెట్‌ తప్ప అతను చాలా పనులు కుడిచేత్తోనే చేస్తాడు. దీంతో ఐదేళ్ల వయసులో క్రికెట్ కోచింగ్ ఇప్పించడం మొదలుపెట్టా" అన్నారు

"నేను సెక్యూరిటీ గార్డుగా బోర్డింగ్ పాస్‌లను చెక్ చేస్తాను. నా కొడుకు ఐపీఎల్ ఆడేందుకు రాంచీలో విమానం ఎక్కేందుకు వచ్చే రోజు కోసం వేచి ఉన్నా" అని చెప్పారు జేవియర్.

ఝార్ఖండ్ అండర్-19 తరఫున ఆడిన ఈస్ట్ జోన్ టోర్నమెంట్‌లో రాబిన్ కేవలం 5 మ్యాచ్‌ల్లోనే మూడు సెంచరీలు సాధించాడు.

2019 సంవత్సరంలో విదర్భపై 133 పరుగులు చేయడం తన అత్యుత్తమ ఇన్నింగ్స్ అని రాబిన్ అంటున్నారు.

రాబిన్ స్పెషాలిటీ అదే: కోచ్

రాబిన్ కోచ్ పేరు ఆసిఫ్ హక్ అన్సారీ. ఆయన ప్రస్తుతం నమ్‌కుమ్‌లోని ప్లేగ్రౌండ్‌లో 100 మందికి పైగా ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్నారు.

రాబిన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా ఆడలేదు, అంత ధర ఎలా వచ్చిందనే ప్రశ్నకు కోచ్ ఆసిఫ్ స్పందిస్తూ "ఐపీఎల్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ మాత్రమే ఎంపికకు కొలమానం కాదు. రాబిన్ ముంబై ఇండియన్స్ క్యాంపునకు నిరంతరం హాజరయ్యాడు. చాలాజట్ల ట్రయల్స్‌లో పాల్గొన్నాడు" అని చెప్పారు.

''వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌లా బలం ఉండటం రాబిన్ స్పెషాలిటీ. రాబిన్ ఓవర్‌లో 15 నుంచి 20 పరుగులు కొట్టగలడు. భారీ సిక్సర్లు బాదగలడు'' అని కోచ్ తెలిపారు.

క్రికెట్‌లో ఒక గిరిజన ఆటగాడు ఈ స్థాయికి చేరుకోవడం జార్ఖండ్‌లోని ఇతర గిరిజన ఆటగాళ్లకు కూడా ప్రోత్సాహకంగా ఉంటుందని ఆసిఫ్ అభిప్రాయపడ్డారు.

ధోనీకి ఫ్యాన్

రాబిన్ ఫేవరెట్ క్రికెటర్ అయిన మహేంద్ర సింగ్ ధోనీకి, ఆయన మధ్య చాలా పోలికలు ఉన్నాయంటున్నారు అక్కడివాళ్లు.

ధోనీలాగే రాబిన్ కూడా బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్. ధోనీలాగే భారీ సిక్సర్లూ కొట్టగలడు

భారత క్రికెట్ జట్టులో ధోనీ అరంగేట్రం చేసినప్పుడు ఇంటర్ మాత్రమే చదివాడు.

రాబిన్ కూడా టెన్త్ తర్వాతే క్రికెట్‌పై దృష్టి సారించాడు. తర్వాత చదువును కొనసాగించలేదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)