'షమీ ఫెర్రారీలాంటి వాడు, గ్యారేజిలోంచి ఎప్పుడు తీసినా స్పీడ్ తగ్గేదే ఉండదు...'

    • రచయిత, అభిజిత్ శ్రీవాస్తవ
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

20 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ న్యూజిలాండ్ పై ఇండియా విజయం సాధించింది. ఐసీసీ టోర్నమెంట్ లో న్యూజిలాండ్ పై భారత్ గెలిచి 20 ఏళ్ళు అయింది. ఈనేపథ్యంలో వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ధర్మశాలలో జరిగిన వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.

ఈ టోర్నమెంట్‌లో భారత్‌కింది వరుసగా ఐదో విజయం. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ కంటే కూడా ఈ మ్యాచ్‌ను ఎక్కువమంది ఓటీటీలో చూశారు. దీంతోపాటు ఈ టోర్నమెంట్‌లో విరాట్ కోహ్లీ (354 పరుగులు), రోహిత్‌శర్మ ( 311 పరుగులు) టాప్ టూ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నారు.

ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు ఇది వరుసగా ఐదో విజయం. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.

ఈ మ్యాచ్‌లో విరాట్‌కోహ్లీ 95 పరుగులు చేయగా, టోర్నమెంట్‌లో మొదటిసారి బ్యాటింగ్ చేసే అవకాశం అందుకున్న రవీంద్రజడేజా చివరి వరకు కొనసాగి విన్నింగ్‌షాట్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

ఈ విజయంలో తప్పనిసరిగా అభినందించాల్సిన ఆటగాడు ఎవరంటే, అది కచ్చితంగా మహమద్ షమీనే. ఈ టోర్నీలో మొదటిసారి బౌలింగ్ చేసే అవకాశం వచ్చిన షమీ చెలరేగిపోయాడు.

షమీ తన 10 ఓవర్ల కోటాలో 5.4 సగటు పరుగులు ఇచ్చి ఐదుగురు న్యూజీలాండ్ బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపించాడు. షమీ అద్భుత ప్రదర్శన వల్లనే భారీ స్కోరు దిశగా సాగుతున్న న్యూజీలాండ్ 273 పరుగులకు పరిమితమైంది. షమీ తన బౌలింగ్‌లో కుడి, ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్లు ఇద్దరినీ ఔట్ చేయడం విశేషం.

ఫుల్‌లెంగ్త్‌తో 2 వికెట్లు, గుడ్‌లెంగ్త్‌తో ఒక వికెట్, షార్ట్ ఆఫ్ గుడ్‌లెంగ్త్‌ బాల్‌తో మరో వికెట్ తీసిన షమీ యార్కర్‌తో మరో వికెట్ సాధించాడు.

తుదిజట్టులో చోటు లేకపోవడంపై...

తుదిజట్టులో లేకపోవడంపై షమీని ప్రశ్నించగా, ‘‘జట్టు బాగా ఆడుతున్నప్పుడు బయట కూర్చోవడం కష్టం అనిపించదు. సహచరులు బాగా ఆడుతున్నప్పుడు వారికి సపోర్ట్ ఇవ్వాలి... అంతిమంగా జట్టు ప్రదర్శన ముఖ్యమన్నదే నేనుఆలోచిస్తాను’’అని షమీ అన్నాడు.

తన ప్రదర్శనపై షమీ మాట్లాడుతూ ‘‘ చాలా కాలం తరువాత ఆడుతున్నప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉండటం ముఖ్యం. మొదటి బంతికే వికెట్ సాధించినా ఈ నమ్మకం వస్తుంది. ఈ మ్యాచ్‌లో నాకదే జరిగింది’’ అన్నాడు.

మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ కూడా షమీని ప్రశంసించాడు. ఇక్కడి పరిస్థితులను అతను చక్కగా ఉపయోగించుకున్నాడని అభినందించాడు.

ఇర్ఫాన్‌పఠాన్ కూడా షమీ ప్రదర్శనపై . ‘‘షమీ ఫెర్రారీ లాంటివాడు. గ్యారెజీ నుంచి ఎప్పుడు బయటకు తీసినా దాని ప్రయాణం అంతే స్పీడు, అదే థ్రిల్, అదే సంతోషం కలిగిస్తుంది’’ అంటూ ట్వీట్ చేశాడు.

విజయం తరువాత రోహిత్ శర్మ ఏమన్నాడు?

మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ ‘‘టోర్నమెంట్‌లో తమ ప్రారంభం బాగుందని కానీ, సగం పనిమాత్రమే పూర్తయింది. న్యూజిలాండ్ బ్యాటింగ్ తీరు చూసినప్పుడు ఒకదశలో స్కోరు 300 పరుగులు దాటుతుందని భావించాం. మిచెల్, రచిన్ చక్కని భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మంచు కారణంగా ఈ వికెట్ బ్యాటింగ్ ‌కు అనుకూలంగా ఉంది. కానీ మా బౌలర్లు తెలివిగా బౌల్ చేశారు. వారిని 273 పరుగులకే పరిమితం చేయడమనేది గొప్ప ప్రయత్నం’’ అన్నాడు.

రోహిత్‌శర్మ కూడా ఈ మ్యాచ్‌లో చక్కని ఆరంభాన్ని అందించాడు. అతను క్రీజులో ఉన్నంతసేపు రన్‌రేటు 6 పైనే ఉంది.

శుభమన్‌గిల్‌తో కలిసి చక్కని ఇన్నింగ్స్ మొదలు పెట్టడంపై ‘‘ గిల్‌తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తున్నాను. మా ఇద్దరి బ్యాటింగ్ శైలి భిన్నంగా ఉంటుంది. మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి అభిమానం ఉంది. మేమిద్దం పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోయినా టీమ్ గెలిచినందుకు సంతోషంగా ఉందని’’ చెప్పాడు.

చేజ్‌మాస్టర్ విరాట్‌కోహ్లీ గురించి ‘‘ అతను భారీ స్కోర్ చేయడాన్ని ఏళ్ళ తరబడి చూస్తున్నాం. అతను మనసును స్థిరంగా ఉంచుకుంటాడు. తన పని తాను చేస్తాడు’’ అని రోహిత్ శర్మ తెలిపాడు.

‘చేజ్ మాస్టర్’ విరాట్ కోహ్లీ

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ మిస్ అయ్యాడు. కానీ, అతను చేసిన 95 పరుగులు అతన్ని ‘చేజ్ మాస్టర్ ’ అని ఊరికే పిలవరనే మరోసారి గుర్తు చేశాయి.

12వ ఓవర్లో రోహిత్ శర్మ అవుటయ్యాక విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. రెండు ఓవర్ల తరువాత శుభ్‌మన్ గిల్ కూడా అవుటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ కూడా కొద్దిసేపు మాత్రమే నిలవగలిగాడు. అతను కూడా 22వ ఓవర్లో అవుటయ్యాడు.

పది ఓవర్ల తరువాత కెఎల్ రాహుల్ కూడా 35 పరుగుల మీద ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కానీ మరో ఎండ్‌లో విరాట్ కోహ్లీ స్థిరంగా ఉన్నాడు. 33వ ఓవర్ చివరి బంతికి విరాట్ తన అర్థసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్లోనే రాహుల్ అవుటయ్యాడు.

60 బంతులలో విరాట్ తన అర్థసెంచరినీ సాధించాడు. కానీ తరువాతి ఓవర్లలోనే ప్రపంచ కప్‌లో తన తొలిమ్యాచ్ ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ రనవుట్ గా వెనుదిరిగాడు.

191 పరుగులకే భారతజట్టులోని సగంమంది సభ్యులు పెవిలియన్‌కు చేరారు. ఇంకా విజయానికి 83 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఈ టోర్నమెంట్‌లో సగంమంది భారత బ్యాట్స్‌మెన్ అవుటవడం ఇదేమొదటిసారి. దీంతోపాటు ఇప్పటిదాకా లోయర్ ఆర్డర్‌కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఈ పరిస్థితులలో రవీంద్రజడేజా ఓ పక్క, చేజ్‌మాస్టర విరాట్ కోహ్లీ మరోపక్క నిలబడ్డారు. జట్టు ఒత్తిడికి గురవుతున్నప్పుడు విరాట్ కోహ్లీ స్కోర్ ను ముందుకు నడుపుతూ జట్టును విజయానికి దగ్గరగా తీసుకువచ్చాడు. అతను తన వ్యక్తిగత స్కోరు 95 పరుగులకు చేరుకున్నప్పుడు మరో సెంచరీ సాధిస్తాడని భావించారు. కానీ అదే స్కోరుపై అవుటయ్యాడు.

విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొనియాడాడు.

మాజీ క్రికెట్ ఇర్ఫాన్ పఠాన్ అయితే ‘‘ ప్రపంచంలోని బ్యాట్స్‌మెన్లందరూ ఓ పక్క, విరాట్ ఒక్కడు ఒకపక్క... విరాట్ అందరికంటే ముందున్నాడు’’ అని ట్వీట్ చేశాడు.

భారత జట్టు దేనిపై దృష్టిసారించాలి?

న్యూజిలాండ్‌తో మ్యాచ్ గెలిచినప్పటికీ కొన్ని అంశాలపై టీమ్‌ మేనేజ్‌మెంట్ దృష్టిసారించాల్సి ఉంది. ప్రతి మ్యాచ్ అనంతరం ఫీల్డింగ్ బాగా చేసిన వారికి డ్రెస్సింగ్‌రూమ్‌లో మెడల్స్ ఇస్తారు. తమ జట్టంతా ఫీల్డింగ్ విషయంలో ఎంతో కష్టపడుతుందని, దీని ఫలితం మ్యాచ్‌లలో కనిపిస్తోందని, ఇంతకుముందు మ్యాచ్‌లు గెలిచిన సందర్భాలలో రోహిత్ శర్మ చెప్పాడు.

కానీ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు కొన్ని క్యాచ్‌లు వదిలేశారు. ఈ విషయాన్నిమ్యాచ్ అనంతరం కెప్టెన్ కూడా ప్రస్తావించాడు. ఇలాంటి మ్యాచ్‌లలో క్యాచ్‌లు వదిలిస్తే మ్యాచ్‌ను కూడా వదులుకోవాల్సివస్తుంది.

‘‘ గత నాలుగు మ్యాచ్‌లలో మేం ఫీల్డింగ్ బాగా చేశాం. కానీ ఈ మ్యాచ్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరైన రవీంద్ర జడేజా కూడా ఓ క్యాచ్‌ను మిస్ చేశాడు. క్యాచ్‌లు వదిలేయడం ఆటలో భాగం. కానీ పోనుపోను ఫీల్డింగ్ ఎంత ముఖ్యమో మాకు బాగా తెలుసు’’ అని రోహిత్ చెప్పాడు.

అంటే, టీమీండియా ఫీల్డింగ్ విషయంలో ఇంకా కష్టపడాల్సి ఉంది.

ఫీల్డింగ్‌తో పాటు టీమీండియా తన లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లపైన కూడా దృష్టిసారించాలి. వీరందరికీ ఇప్పటిదాకా టోర్నీలో ఆడే అవకాశం రాలేదు.

రోహిత్‌శర్మ, శుభ్‌మన్‌ గిల్ న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో శుభారంభాన్ని ఇచ్చారు. మరోపక్క కిందటి మ్యాచ్‌ను సెంచరీతో గెలిపించిన విరాట్ కోహ్లీ ఉన్నాడు. దీన్నిబట్టి టీమ్ ఇండియా మ్యాచ్‌పై పట్టు బిగించినట్టయింది. కానీ మరోపక్క కెఎల్ రాహుల్‌కంటే ముందుగా వచ్చిన శ్రేయస్ అయ్యర్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడటంలో విఫలమయ్యాడు.

దీనిపై జట్టు దృష్టిసారించాలి. ఎందుకంటే భవిష్యత్తులో సెమీఫైనల్స్ ‌లాంటి మ్యాచ్‌లలో మిడిల్ ఆర్డర్ చేసే పొరపాట్లు మొత్తం జట్టుపై ప్రభావం చూపుతాయి.

శ్రేయస్‌కు షార్ట్‌ పిచ్ బంతులు బలహీనంగా మారాయా?

న్యూజీలాండ్ తో మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ 29బంతులలో 33 పరుగులు చేశాడు. వీటిల్లో పుల్, ఫ్లిక్, కవర్‌డ్రైవ్, స్ట్రైయిట్ డ్రైవ్ లాంటి చక్కటి షాట్లు ఉన్నాయి. కానీ ట్రెంట్ బౌల్ట్ షార్ట్ పిచ్‌ బాల్ ను పుల్ చేసే ప్రయత్నంలో అవుటయ్యాడు.

ఇప్పటిదాకా ఈ టోర్నమెంట్‌లో శ్రేయస్ అఫ్ఘనిస్తాన్ పై 25 (నాటౌట్ ) పరుగులు, పాకిస్తాన్ పై 53 (నాటౌట్), బంగ్లాదేశ్‌పై 19, న్యూజిలాండ్ పై 33 పరుగులు చేశాడు. కానీ అతని షార్ట్‌పిచ్ బంతుల బలహీనత న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మరోసారి బయటపడింది.

షార్ట్‌ పిచ్ బంతులతో పరుగులు రాబట్టాలని శ్రేయస్ చాలాకాలంగా ప్రయత్నిస్తున్నాడు కానీ... ఈ బంతులకే అవుటవుతున్నాడు.

రెండేళ్ళకిందట తన తొలి ఆస్ట్రేలియా పర్యటన మ్యాచ్ లో

రెండుపరుగులకే ఓ షార్ట్‌పిచ్ బంతికి బలవ్వగా, తరువాత మ్యాచ్‌లో 38పరుగులు చేశాడు. తన బలహీనతపై శ్రేయస్ కూడా మాట్లాడాడు. ‘‘ మొదటి మ్యాచ్‌లో ఆడేటప్పుడు షార్ట్ బాల్ రాబోతోందని తెలుసు, కానీ నేను తికమకపడ్డాను. కానీ రెండో మ్యాచ్‌లో బంతిని చూశాకా నా ఆట నేను ఆడాలని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పాడు.

అప్పటి నుంచి శ్రేయస్ వెస్టిండీస్ ఫాస్ట్ పిచ్‌లపై 53 సగటుతో, న్యూజిలాండ్ ‌లో 64 సగటుతో పరుగులు చేశాడు. కానీ ఈ వరల్డ్ కప్ కు ముందు ఇండియాలో సౌతాఫ్రికాతో 191 సగటుతో పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాతో 52 సగటుతో పరుగులు సాధించాడు. వీటిల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలపై చేసిన సెంచరీలు కూడా ఉన్నాయి.

శ్రేయస్ పై కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకం పెట్టుకుంటున్నప్పటికీ ఈ షార్ట్ పిచ్ బంతులు ఆడే బలహీనతను శ్రేయస్ తరువాతి మ్యాచ్‌లోనైనా అధిగమించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇతనికి పోటీగా ఇషాన్ కిషన్ డగౌట్‌లో కూర్చని అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు.

న్యూజిలాండ్ ను ఓడించాకా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడమే కాదు, బౌలింగ్, బ్యాటింగ్ లోనూ తన సత్తా చూపింది.

రోహిత్ సేన ఇదే విజయపరంపరను కొనసాగించాలి. టీమీండియా తన తరువాత మ్యాచ్‌లలో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్ తో తలపడనుంది.

ఇవి కూడా చదవండి

  • రఫా క్రాసింగ్ ఓపెన్: 20 లక్షలమందికి 20 లారీల సాయం సరిపోతుందా?
  • ఒకరి కంటే ఎక్కువ మందితో సెక్స్‌ చేయమంటారు, శారీరకంగా హింసిస్తారు, అండర్ వరల్డ్‌ సెక్స్‌ ఊబిలో కూరుకుపోయిన మహిళల వేదన
  • గాజా ప్రజలను కాపాడండి: ఐక్యరాజ్య సమితిలో కన్నీరు పెట్టుకున్న పాలస్తీనా ప్రతినిధి
  • ఒమేగల్‌: లైంగిక వేధింపులకు పాల్పడే వారిని పరిచయం చేసే డేటింగ్ సైట్లపై కేసులు వేయొచ్చా?
  • ఇజ్రాయెల్‌: శిథిలాల కింద కాళ్లకు లోహపు వైర్లతో నగ్నంగా మహిళ శవం.. మరో చోట 20 మంది పిల్లలను బంధించి దహనం చేశారు
  • కుడా బక్స్: ‘ఎక్స్‌రే కళ్ల’తో యూరోపియన్ల మతి పోగొట్టిన భారతీయ ఇంద్రజాలికుడు