You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పంజాబ్: కెనడా వెళ్లేందుకు అమ్మాయిలతో ఒప్పంద వివాహాలు, పెరుగుతున్న మోసం కేసులు
- రచయిత, సరబ్‌జిత్ సింగ్ ధలివాల్
- హోదా, బీబీసీ జర్నలిస్ట్
“కెనడా వెళ్లడానికే మా అబ్బాయి, ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ యువతి కెనడాకు వెళ్లాక మా అబ్బాయిని కెనడా వచ్చేందుకు విజిటర్ వీసా ఏర్పాటు చేస్తుంది. అక్కడికి వెళ్లాక, భార్యకు విడాకులు ఇస్తాడు”
ఇదీ పంజాబ్‌లోని కపుర్తలాలో రెండు కుటుంబాల మధ్య రాసుకున్న ఒప్పంద వివాహంలోని నియమ నిబంధనలు.
స్టాంప్ పేపర్‌పై ఒప్పందం రాసుకుని, నోటరీ చేయించారు. (రెండు కుటుంబాలు అంగీకరిస్తూ, సంతకం చేసిన ఒప్పంద ప్రతి బీబీసీ వద్ద ఉంది)
ఒప్పందం చేసుకున్నట్లుగా ఆ యువతి కెనడా వెళ్లడానికి వీలుగా ఉన్నతవిద్య, ఐఈఎల్‌టీఎస్ కోర్సు ఉత్తీర్ణత సాధించేందుకు తీసుకునే శిక్షణకు అయ్యే ఖర్చు కూడా ఆ యువకుడి కుటుంబమే భరిస్తుంది.
అందుకు బదులుగా ఆ యువతి కెనడా వెళ్లిన తరువాత, యువకుడికి విజిటర్ వీసా వచ్చేలా ఏర్పాట్లు చేయాలి.
పంజాబ్‌లో కాంట్రాక్టు పెళ్లిళ్ల ట్రెండ్ కొనసాగుతోంది. అడపాదడపా ఫిర్యాదులు బయటకు వస్తున్నాయి.
కపుర్తలా పోలీసులకు అందిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం..
ఆ ఒప్పందం అనంతరం బంధువుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వివాహాన్ని నమోదు చేసుకున్నారు.
అయితే, యువతి తల్లిదండ్రులు ఆమెను అత్తారింటికి పంపలేదు. వారి దృష్టిలో ఇది నిజమైన పెళ్లి కాదు. ఒప్పంద వివాహం. అయితే, అనుకున్నదానికంటే ముందుగానే, ఆ యువతి కెనడా వెళ్లిపోయింది.
యువకుడి కుటుంబానికి చెప్పకపోవడంతో, వారి మధ్య వివాదం మొదలైంది. చివరికి యువకుడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
ఇటీవల కపుర్తలాలో ఇలాంటి ఘటనలకు సంబంధించి, రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.
రూ.45 లక్షలు మోసం చేసిందంటూ యువతిపై కేసు
ఓ ఫిర్యాదులో కపుర్తలాకు చెందిన బల్‌జిత్ జగ్గీ (పేరు మార్చాం) ఫిర్యాదులో పేర్కొన్నదాని ప్రకారం..
బల్‌జిత్ జగ్గీ తల్లిదండ్రులు మోగాలోని కవిత (పేరు మార్చాం)ను కలుసుకున్నారు. ఆమె తన కుమార్తె స్వాతి(పేరు మార్చాం)ని ఉన్నత చదువులు చదివించాలని అనుకుంటోందని, కెనడా పంపాలని అనుకుంటోందని తెలుసుకున్నారు.
కవిత, జగ్గీ కుటుంబాల మధ్య ఒప్పందం వివాహానికి అంగీకారం కుదిరింది. బల్‌జిత్ సోదరుడు సౌరబ్(పేరు మార్చాం)ను, కవిత కుమార్తె స్వాతికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. స్వాతి కంటే సౌరబ్ తొమ్మిదేళ్లు పెద్దవారు.
ఒప్పందం ప్రకారం పెళ్లి ఖర్చులు, స్వాతి చదువుకు అయ్యే ఖర్చులు జగ్గీ కుటుంబమే భరిస్తుంది. అందుకు బదులుగా స్వాతి కెనడాకు వెళ్లాక సౌరబ్ జగ్గీని తీసుకెళ్లేందుకు విజిటర్ వీసా వచ్చేలా చూడాలి.
ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నదాని ప్రకారం 2019లో ఇద్దరికీ వివాహమైంది. స్వాతికి కెనడా వీసా లభించడంతో ఆమె ఆ దేశానికి వెళ్లారు. మొత్తంగా స్వాతి కోసం 40 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు జగ్గీ కుటుంబం చెప్తోంది.
కెనడా వెళ్లాక స్వాతి మాట ఇచ్చినట్లుగా మూడు నెలలకు సౌరబ్‌ను కెనడా తీసుకెళ్లలేదని, ఆలోగా సౌరబ్ మరణించాడని ఎఫ్ఐఆర్‌లో ఉంది.
ఆ తరువాత 2023లో స్వాతి తిరిగి భారత్‌కు వచ్చిన సమయంలో బల్‌జిత్‌తో వివాహం జరిపారు. ఇద్దరి మధ్యా 13 ఏళ్లు వ్యత్యాసం ఉంది.
మార్చిలో వివాహం తరువాత స్వాతి తిరిగి కెనడాకు వెళ్లిందని, కానీ ముందుగా చెప్పినట్లుగా తనను కెనడాకు పిలవలేదని బల్‌జీత్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
వివాహ ఖర్చు కూడా తామే భరించినట్లు రాశారు బల్‌జీత్.
తన ఫోన్ కూడా తీయడం లేదని, తమను మోసం చేశారంటూ స్వాతి, ఆమె తల్లి కవితలపై ఫిర్యాదు చేశారు.
‘స్వాతి’ ఏమంటున్నారు?
కెనడాలో నివసిస్తోన్న స్వాతితో బీబీసీ మాట్లాడింది. బల్‌జిత్ చేసిన ఫిర్యాదు, అందులో పేర్కొన్న విషయాలన్ని అవాస్తవమని స్వాతి చెప్పారు.
“అసలు మా మధ్య ఒప్పందమే లేదు. మేం చేసుకున్నది నిజమైన వివాహం” అని చెప్పారు.
తాను వెళ్లాక వీసా కోసం సౌరబ్ రెండు సార్లు దరఖాస్తు చేసుకున్నాడని, కానీ రిజెక్టయిందని తెలిపారు.
ఆ తరువాత సౌరబ్ మరణించారని, 2023లో సౌరబ్ సోదరుడు బల్‌జీత్ జగ్గీని సమ్మతితోనే వివాహం చేసుకున్నట్లు తెలిపారు.
స్వాతి చెప్పినదాని ప్రకారం.. బల్‌జీత్ వేధింపులకు పాల్పడుతుండటంతో, జూన్ నుంచి అతడితో మాట్లాడటం మానేశారు. అంతేకాక జల్‌జీత్ తల్లి కూడా ఈ విషయంలో తనవైపే ఉందని, అతడి వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు.
ట్రెండ్‌గా మారింది..
పంజాబ్ నుంచి కెనడాకు వెళ్లే వారి సంఖ్య ఈ మధ్య కాలంలో పెరుగుతోంది. కెనడాకు వెళ్లేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు అక్కడివారు. అలా మొదలైందే ఈ ఒప్పంద వివాహాల ట్రెండ్.
2021లో ఇలాంటి కేసు వార్తల్లో నిలిచింది. బర్నాలా జిల్లాకి చెందిన లవ్‌ప్రీత్ సింగ్ అనే వ్యక్తి బియెంత్ కౌర్‌ను పెళ్లిచేసుకున్నారు.
ఐఈఎల్‌టీఎస్ ఉత్తీర్ణత సాధించిన బియెంత్ కౌర్ కెనడా వెళ్లేందుకు అవసరమైన ఖర్చులను కూడా లవ్‌ప్రీత్ సింగ్ భరించారు.
బియెంత్ కౌర్ కెనడా వెళ్లాక కూడా ఇద్దరి మధ్యా మాటలు నడిచాయి. కానీ ఓ రోజు లవ్‌ప్రీత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో ఉంది. లవ్‌ప్రీత్ సింగ్ బంధువు మాట్లాడుతూ, ఆ సమయంలో లవ్‌ప్రీత్ సింగ్ వంటి బాధితులు చాలామందే బయటకు వచ్చారని, కానీ, కెనడాకు వెళ్లాలనే ఆశను కొంతమంది తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని అన్నారు.
కారణమేంటి?
ఐఈఎల్‌టీఎస్ వివాహాల ట్రెండ్ పంజాబ్ అంతటా కనిపిస్తోందని అన్నారు పాటియాలాలోని పంజాబ్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జ్ఞాన్ సింగ్.
"ఇందుకు కారణం పంజాబ్‌లో ఉపాధి లేకపోవడం, కెనడా పట్ల ఆసక్తి పెరగడం.
వివాహం తరువాత యువతి కెనడాకు వెళ్లాక, ఇద్దరి ప్రపంచాలు వేరుగా ఉంటాయి. వారి తీరు మారే అవకాశం ఉంది, అందుకే విషయాలు సంక్లిష్టంగా మారుతున్నాయి.
యువకులు చదువులో వెనకబడటం వలన లేదా ఐఈఎల్‌టీఎస్‌లో స్కోరు తక్కువ ఉన్న కారణంగా వారు కెనడా వెళ్లే దారి లేక, కెనడా వెళ్లాలనుకునే యువతులను ఎంచుకుని వారి వెంట వెళ్లేందుకు చూస్తున్నారు.
ముందుగా అనుకున్నట్లుగానే ఆ యువతి కెనడా వెళ్లాక, ఇద్దరి అభిప్రాయాల్లో వ్యత్యాసాలు రావొచ్చు. ఈ కారణంగా కొన్నిసార్లు ఇలాంటి వివాదాలు తలెత్తుతున్నాయి" అన్నారు.
ఇవి కూడా చదవండి..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)