You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ నుంచి ఇంటర్నేషనల్ క్రిమినల్‌గా మారిన హష్‌పప్పీకి 11 ఏళ్ల జైలు శిక్ష
నైజీరియాకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ హష్‌పప్పీ 11 సంవత్సరాల 3 నెలల జైలు శిక్ష పడింది.
అంతర్జాతీయ నేర ముఠాలో ఉన్నందుకు అమెరికాలోని ఓ కోర్టు ఆయనకు ఈ శిక్ష విధించింది.
హష్‌పప్పీ అసలు పేరు రామోన్ అబ్బాస్. ఇన్‌స్టాగ్రామ్‌లో 28 లక్షల మంది ఫాలోవర్లు ఆయనకు ఉండేవారు. విలాసవంతమైన తన లైఫ్‌స్టైల్‌ను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రదర్శించుకునేవారు.
మోసాలు, నేరాలకు పాల్పడినట్లుగా నిరూపణ అయి కోర్టు ఆయన్ను దోషిగా తేల్చడంతో ఇన్‌స్టాగ్రామ్ ఆయన అకౌంట్‌ను డిజేబుల్ చేసింది.
లాస్ఏంజెలిస్ కోర్టులో న్యాయమూర్తి తీర్పులో.. హష్‌పప్పీ చేతిలో మోసపోయిన బాధితులకు 1,732,841 డాలర్లు (సుమారు రూ. 14,15,40,185) చెల్లించాలని చెప్పారు. దాంతోపాటు 135 నెలల జైలు శిక్ష విధించారు.
మనీలాండరింగ్ కేసులో హష్‌పప్పీ గత ఏడాదే తన తప్పును అంగీకరించారు.
ఖతర్‌లో కొత్తగా స్కూల్ ఏర్పాటుకు నిధులు ఇచ్చేందుకు యత్నించిన కొందరి నుంచి 11 లక్షల డాలర్లు (సుమారు రూ. 8.9 కోట్లు) మేరకు మోసగించేందుకు ప్రయత్నించినట్లు కాలిఫోర్నియాలోని కోర్టు పత్రాలు వెల్లడిస్తున్నాయి.
బోగస్ వెబ్‌సైట్ ఒకటి తయారుచేసి బ్యాంక్ అధికారులమని చెప్పుకొంటూ హష్‌పప్పీ, మరికొందరు కలిసి బాధితులను మోసగించినట్లు కోర్టు పత్రాలు సూచిస్తున్నాయి.
యూఎస్ న్యాయశాఖ వెబ్‌సైట్‌లో అప్పటి యాక్టింగ్ అటార్నీ ట్రేసీ విల్కిన్సన్ పొందుపరిచిన వివరాల ప్రకారం మిగతా అనుమానితులకు కూడా ఇందులో పాత్ర ఉన్నప్పటికీ కీలక పాత్ర హష్‌పప్పీదే.
అనేక ఇతర సైబర్, బిజినెస్ ఈ-మెయిళ్ల ద్వారా 2.4 కోట్ల డాలర్ల(సుమారు రూ. 196 కోట్లు) మేర నష్టం కలిగించినట్లు హష్‌పప్పీఅంగీకరించారని అమెరికా న్యాయశాఖ వెల్లడించింది.
‘రామోన్ అబ్బాస్ అమెరికా, మరికొన్ని ఇతర దేశాలకు చెందినవారిని లక్ష్యంగా చేసుకుని మనీలాండరింగ్‌కు పాల్పడ్డారు’ అంటూ అందుకు ఆధారాలను ఎఫ్‌బీఐ లాస్‌ఏంజెలస్ ఫీల్డ్ ఆఫీస్ ఇంచార్జి అసిస్టెంట్ డైరెక్టర్ డాన్ ఆల్వే సోమవారం కోర్టుకు సమర్పించారు.
‘అబ్బాస్ తన మోసాలకు సోషల్ మీడియాలోని తన ఖాతాలను ఉపయోగించుకున్నారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి, ఆన్‌లైన్ బ్యాంక్ మోసాలు, ఈమెయిల్ మోసాలకు సోషల్ మీడియాను ఉఫయోగించుకున్నారు ఆయన. ఆయన మోసాల కారణంగా చాలామంది ఆర్థికంగా భారీ నష్టాలు చవిచూశారు’ అని కోర్టుకు సమర్పించిన పత్రాల్లో ఉంది. ఉత్తరకొరియా నేరగాళ్లతో ఆయన చేతులు కలిపారని ఆ పత్రాల్లో ఆరోపించారు.
‘వివిధ దేశాలకు చెందిన అధికారుల సమన్వయ ఫలితమే హష్‌పప్పీకి శిక్ష పడడం, నేరస్థులు అమెరికాలో నేరాలకు పాల్పడ్డారా? అమెరికా వెలుపల నేరాలకు పాల్పడ్డారా అనేదాంతో సంబంధం లేకుండా బాధితుల తరఫున ఎఫ్‌బీఐ న్యాయం కోరుతుంది. అంతర్జాతీయ నేరగాళ్లకు ఇది స్పష్టమైన హెచ్చరిక’ అని డాన్ ఆల్వే అన్నారు.
కాగా తాను చేసిన తప్పులకు తనను క్షమించాలంటూ న్యాయమూర్తి ‘ఓటిస్ డీ రైట్’ను హష్‌పప్పీ రాతపూర్వకంగా కోరారు.
బాధితులకు తన సొంత డబ్బుతో తిరిగి చెల్లింపులు చేస్తానని హష్‌పప్పీ చెప్పారు. మోసాలతో తాను 3 లక్షల డాలర్లు (సుమారు రూ. 2 కోట్ల 45 లక్షలు) మాత్రమే సంపాదించానని హష్‌పప్పీ చెప్పారు.
2020లో దుబయిలో హష్‌పప్పీని అరెస్ట్ చేశారు. దాంతో ఆయన విలాసవంతమైన జీవనశైలికి ముగింపు పడింది.
హష్‌పప్పీ గురించి ఆయన చిన్నప్పటి నుంచి తెలిసినవారు ‘బీబీసీ’తో ఆ వివరాలు చెప్పారు. ఆయన తండ్రి టాక్సీ డ్రైవర్ కాగా తల్లి మార్కెట్‌లో వ్యాపారి.
అయితే, పెద్దవాడవుతున్న కొద్దీ హష్‌పప్పీ డబ్బు వెదజల్లడం ప్రారంభించారు. ఆయన తనతో వచ్చేవారందరికీ బీర్ కొనిపెట్టేవారని స్థానికంగా డ్రైవరుగా పనిచేసే సేయే చెప్పారు.
నైజీరియాలో ఆయన తన మోసాలు, విలాసాలతో యాహూ బాయ్‌గా ముద్రపడ్డారని సేయే చెప్పారు.
ఆన్‌లైన్‌లో ఇతరుల వ్యక్తిగత వివరాలు దొంగిలించి వారిని బెదిరించి, బురిడీ కొట్టించి శృంగార సంబంధాలు ఏర్పరుచుకోవడం, వారి నుంచి డబ్బులు దోచుకునేవారిని యాహూ బాయ్స్ అంటుంటారు.
2019లో హష్‌పప్పీ మోసాల ఫలితంగా యూరోపియన్ ద్వీపం మాల్తాలో గందరగోళం ఏర్పడింది.
ఉత్తరకొరియాకు చెందిన ఓ ముఠా మాల్తీస్ బ్యాంక్‌ను హ్యాక్ చేసి కొల్లగొట్టిన 1.3 కోట్ల యూరోలను(సుమారు రూ. 106 కోట్లు) హష్‌పప్పీ మళ్లించే ప్రయత్నంలో అక్కడి పేమెంట్ సిస్టమ్స్ అన్నీ స్తంభించిపోయాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)