You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
9 నెలలలో విక్రయించినన్ని ఏసీలు 3 నెలలలోనే అమ్మకం.. దేశంలో ఏసీల వాడకం ఏ స్థాయిలో పెరిగిందంటే
- రచయిత, సౌతిక్ బిస్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీ శివార్లలో నివసిస్తున్న గోవింద్ రామ్ అనే ‘వ్యర్థాల డీలర్’ పిల్లలు బతిమాలడంతో మే నెలలో ఎయిర్ కండిషనర్(ఏసీ)ను కొనుగోలు చేశారు. పాఠశాలకు వెళ్లే గోవింద్ పిల్లలు ఉక్కపోత భరించలేకపోతున్నామని చెప్పడంతో ఆయన ఏసీ కొన్నారు.
పొదుపు చేసిన డబ్బులతో గోవింద్ ఏసీ కొనుగోలు చేసి పిల్లల బెడ్‌రూమ్‌లో పెట్టించారు. అయితే, ఈ ఉపశమనం ఖర్చుతో కూడుకున్నదని ఆయన చెప్పారు. గత నెలలో గోవింద్‌కు విద్యుత్ బిల్లు సాధారణంగా వచ్చే దానికంటే ఏడు రెట్లు ఎక్కువగా వచ్చింది.
“నేను కేవలం ఫ్యాన్ కిందనే వేసవిని భరించాను. కానీ ఈ సంవత్సరం నా పిల్లలు చాలా ఇబ్బందిపడ్డారు. అందుకే నేను ఏసీ కొనాల్సి వచ్చింది ”అని గోవింద్ చెప్పారు.
గత ఐదు దశాబ్దాలుగా దేశం 700కు పైగా సందర్భాలలో వడగాలులను ఎదుర్కొంది, అయితే ఈ వేసవిలో మాత్రం తీవ్రమైన వేడి ఉందని నిపుణులు భావిస్తున్నారు.
కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) ప్రకారం దేశంలోని 97 శాతం కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం ఉంది. వారిలో చాలామంది మంది ఫ్యాన్లపై ఆధారపడుతున్నారు. కానీ ఈ సంవత్సరం దేశంలో ఏసీల మార్కెట్ మునుపెన్నడూ లేని విధంగా పెరిగింది.
ఆశ్చర్యం కలిగించేలా అమ్మకాలు
“ఏసీల పరిశ్రమలో నా 45 ఏళ్ల అనుభవంలో నేను ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. ఏసీలకు పెరిగిన డిమాండ్ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. గత ఏడాదితో పోల్చితే ఈ వేసవిలో ఏసీల అమ్మకాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది’’ అని అని ప్రముఖ కూలింగ్, రిఫ్రిజిరేషన్ కంపెనీ బ్లూ స్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బి త్యాగరాజన్ చెప్పారు.
2024 మార్చి నుంచి జులై వరకు దేశంలో ఏసీల అమ్మకాలు 60 శాతం పెరిగి ఉండొచ్చు. గతంలో ఈ పెరుగుదల ఇది 25-30 శాతం మాత్రమే వృద్ధి ఉందని త్యాగరాజన్ అంటున్నారు. దాదాపు ఒక దశాబ్దం క్రితం మే చివరి వారంలో అమ్మకాలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని, కానీ, ఇపుడు ఏప్రిల్‌లోనే అలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆయన గుర్తుచేసుకున్నారు.
కంపెనీలు సాధారణంగా ఏడాదిలోని 9 నెలల్లో విక్రయించినన్ని ఏసీలను ఈసారి కేవలం 3 నెలల్లోనే విక్రయించాయి.
దేశంలోని 30 కోట్ల ఇళ్లలో కేవలం 8 శాతం ఏసీలు ఉన్నప్పటికీ ప్రపంచంలో భారత దేశానిదే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏసీ మార్కెట్. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన 17 కోట్ల యూనిట్లలో చైనా 9 కోట్లు, భారత్ 1.2 కోట్ల ఏసీ యూనిట్లు ఉన్నాయి.
2050 నాటికి దేశంలో హోం ఎయిర్ కండిషనర్ ఉండేవారి సంఖ్య 9 రెట్లు పెరుగుతుందని ప్యారిస్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) అంచనా వేసింది. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్‌ల వంటి ఇతర గృహోపకరణాలను ఏసీలు అధిగమిస్తాయని ఐఈఏ అంచనా వేస్తోంది.
ఐఈఏ ప్రకారం.. ఆ సమయానికి ఇళ్లలోని ఏసీలకు వాడే విద్యుత్ డిమాండ్ అనేది ఆఫ్రికా ప్రస్తుత మొత్తం విద్యుత్ వినియోగాన్ని అధిగమిస్తుంది.
" ఆకాంక్షలు పెరగడం, ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి సుముఖంగా ఉండటంతో పాటు తీవ్రమైన వేడి వాతావరణం కూడా ఏసీలకు డిమాండ్ పెంచింది" అని త్యాగరాజన్ చెప్పారు.
ముఖ్యంగా, భారతీయ ఎయిర్-కండిషనర్ కొనుగోలుదారులలో 95 శాతం మంది మధ్యతరగతి వారు మొదటిసారి కొనుగోలు చేసేవారున్నారు. 65 శాతం పైగా చిన్న నగరాలు, పట్టణాల నుంచి ఉన్నారు. సగానికి పైగా సున్నా-వడ్డీ రుణాల ద్వారా కొంటున్నారు.
అత్యధిక అమ్మకాలు ఉత్తర భారతదేశంలోని వేడిగా ఉన్న ప్రాంతాల నుంచి వస్తున్నాయి. ఉదాహరణకు మే నెల మధ్య నుంచి దిల్లీలో రోజువారీ ఉష్ణోగ్రతలు స్థిరంగా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ అంతకంటే ఎక్కువగా ఉన్నాయి.
సీఈఈడబ్ల్యూ ప్రకారం దేశంలోని 23 రాష్ట్రాలలో దాదాపు వంద కోట్ల మంది ప్రజలు వేడికి గురవుతున్నారు. దేశంలో పచ్చని ప్రదేశాలు చాలా తక్కువ. వేగవంతమైన అభివృద్ధి అనేది పర్యావరణాన్ని చల్లబరచడానికి సహాయపడే నీటి వనరులను హరిస్తోంది. వాహనాలు, కర్మాగారాలు, నిర్మాణ కార్యకలాపాల నుంచి వెలువడే గ్రీన్‌హౌస్ ఉద్గారాలు ఉష్ణోగ్రతలను మరింత పెంచుతున్నాయి.
ఏసీలు ఎవరెవరు వాడుతున్నారు?
గాలి రాని అపార్ట్‌మెంట్‌లు, గాజు, క్రోమ్ భవనాలు వేడిని గ్రహించి, ప్రతిబింబిస్తాయి. ఇవన్నీ నగరాలను వేడిగా, నివసించడానికి అసౌకర్యంగా మారుస్తున్నాయి.
అయితే ఇది కథలో ఒక భాగం మాత్రమే. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను ప్రజలు ఎలా ఎదుర్కొంటున్నారో అంచనా వేయడానికి, ఇటీవల నిర్వహించిన ఓ దేశవ్యాప్త సర్వేలో అర్థా గ్లోబల్స్ సెంటర్ ఫర్ ర్యాపిడ్ ఇన్‌సైట్స్ (సీఆర్ఐ) అనే థింక్ ట్యాంక్ ఈ ప్రశ్న వేసింది: “మధ్యాహ్నం బయట వేడిగా ఉన్నప్పుడు మీ ఇంటి లోపల ఎలా ఉంటుంది?".
దాదాపు 32 శాతం మంది ప్రతివాదులు తమ ఇళ్లు వేడిగా, అసౌకర్యంగా ఉన్నట్లు తెలిపారు. ఇది తీవ్ర ఉష్ణోగ్రతలతో దేశంలోని పోరాటాన్ని హైలైట్ చేస్తోంది.
తమ ఇళ్లను చల్లబరచగలిగిన వారిలో 42 శాతం మంది ఎనర్జీ-ఇంటెన్సివ్ ఎయిర్ కండిషనర్లు లేదా కూలర్‌లపై ఆధారపడుతున్నారు. వేడిమి తరచుగా ఖరీదైన పరిష్కారాలను కోరుతుందని ఇది సూచిస్తోంది.
అలాగే 8 మంది ఫోర్-వీలర్ యజమానులలో ఒకరు మాత్రమే తీవ్రమైన వేడితో తమ ఇళ్లు అసౌకర్యంగా ఉన్నట్లు తెలపగా, అదే సమయంలో ఏ వాహనం లేని 8 మందిలో నలుగురు వేడిమితో ఇబ్బంది పడుతున్నారు. దీనికి విరుద్ధంగా టూ-వీలర్, ఫోర్-వీలర్ యజమానులలో దాదాపు 40 శాతం మంది ఏసీలు లేదా కూలర్‌లపై ఆధారపడుతున్నారు.
అదేసమయంలో వాహనాలు లేనివాళ్లలో కేవలం 16 శాతం మంది మాత్రమే ఈ కూలింగ్ పరిష్కారాలను ఉపయోగిస్తున్నారు.
ప్రత్యక్ష సూర్యకాంతి లేకున్నా పేదలు ఇంటి లోపల కూడా విపరీతమైన వేడిని ఎలా ఎదుర్కొంటారో ఈ డేటా హైలైట్ చేస్తోందని సీఆర్ఐ డైరెక్టర్ నీలాంజన్ సిర్కార్ తెలిపారు.
పరిష్కారాలు ఏమిటి?
"ఏసీలు ఉన్న ధనవంతుల కుటుంబాలు, ఇంకా వాటిని కొనలేని పేద కుటుంబాల మధ్య అంతరం పెరుగుతోంది" అని ఎయిర్ కండిషనింగ్, ప్రపంచ అసమానతలపై జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ మ్యాన్‌హీమ్, బర్కిలీలోని కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకుల అధ్యయనం చెబుతోంది.
కిటికీలు లేని మురికివాడల గుడిసెలలో సరైన వెంటిలేషన్, అస్థిరమైన విద్యుత్ కారణంగా వారి ఇంటిలోపల వేడితో బతకడం కష్టం. 24/7 విద్యుత్‌తో ఉండే విలాసవంతమైన నివాస గృహాలలో చాలామంది మురికివాడల నివాసితులు పని చేస్తారు.
అందులో ఒకరు ఇటీవల ఒక వార్తాపత్రికతో మాట్లాడుతూ “నేను నా మురికివాడకు తిరిగి రావాలని కోరుకోవడం లేదు. అపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నప్పుడు ఏసీలో చల్లని గాలి కింద పడుకున్నట్లు అనిపిస్తుంది” అని అన్నారు.
సరస్సులు, రిజర్వాయర్లు, చెరువులు, చిత్తడి నేలలు, కాలువలు ఇలా భారతదేశం జల ఆవాసాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది.
కూల్ హౌస్‌లను నిర్మించడం, శీతలీకరణ కప్పులను ఉపయోగించడం, ఇంటి లోపల ఉష్ణోగ్రతలను తగ్గించడానికి వైట్ పెయింట్ కప్పులు, భవనాలకు పైప్‌లైన్ల ద్వారా చల్లబడిన నీటిని సరఫరా చేయడం, మరింత సమర్థవంతమైన ఎయిర్ కండిషనర్‌లను ఇన్‌స్టాల్ చేయడం కూడా దీనికి అవసరం.
63 దేశాలు ఏకమైనా.. కలవని ఇండియా
గత సంవత్సరం అమెరికా, కెనడా, కెన్యాలతో సహా 63 దేశాలు శీతలీకరణ ఉద్గారాలను తీవ్రంగా తగ్గించడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రతిజ్ఞపై సంతకం చేశాయి. దానిపై ఇండియా సంతకం చేయలేదు. అయితే దీనిలో భారత్ పురోగతి సాధించిందని సీఈఈడబ్ల్యూకి చెందిన షాలు అగర్వాల్ చెప్పారు.
శీతలీకరణ కార్యాచరణ ప్రణాళికను అమలు చేసిన మొదటి దేశాలలో ఒకటిగా భారత్ ఏసీ శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి దాదాపు రెండు దశాబ్దాల విధానాలను అనుసరించింది.
మరింత సమర్థమైన ఇన్వర్టర్ ఏసీలు ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా ఉన్నాయి. ఇంధన సామర్థ్యం కోసం కంపెనీలు వాటిలో 24 డిగ్రీల సెంటీగ్రేడ్ డిఫాల్ట్ ఉష్ణోగ్రతను సెట్ చేశాయి. ఫ్యాన్లకు ఎనర్జీ రేటింగ్‌లు కూడా తప్పనిసరి.
కానీ బయట ఆధారాలు మిశ్రమంగా ఉన్నాయి. కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన లోకల్‌సర్కిల్స్ ఇటీవల నిర్వహించిన సర్వేలో దిల్లీ, దాని శివార్లలో 43 శాతం మంది ఎయిర్-కండిషనర్ యూజర్లు తమ యూనిట్లు 23-24C శ్రేణికి చల్లబడలేదని చెప్పారు. ఈ వేసవిలో రాజధానిలో ఉష్ణోగ్రతలు తరచుగా 45C కంటే ఎక్కువగా ఉంటాయి.
ఎయిర్ కండిషనింగ్ అవసరాన్ని ఎవరూ సందేహించరు. కానీ విస్తృతమైన ఏసీ వాడకం ఇంటి లోపలి వేడిని బహిష్కరించడం ద్వారా బయటి ఉష్ణోగ్రతలను కూడా పెంచుతుంది. వాటి రసాయన శీతలీకరణలు పర్యావరణ ప్రమాదాలను కలిగిస్తాయి.
వాతావరణ మార్పులతో వడగాల్పులు వంటి విపరీత వాతావరణ సంఘటనలు తరచుగా, తీవ్రంగా మారుతున్నాయి. ప్రజలను వేడి నుంచి రక్షించడానికి భారత్ చాలా చేయవలసి ఉంది. ఈ వేసవిలో దేశంలో తీవ్రమైన వేడి కారణంగా 140 మందికి పైగా మరణించినట్లు అధికారులు తెలిపారు. వాస్తవ సంఖ్య బహుశా ఎక్కువ ఉండొచ్చు.
భారత్ హీట్‌వేవ్‌తో పోరాడుతున్న సమయంలో ఏసీ అమ్మకాల పెరుగుదలను చూస్తుంటే సమస్యకు ఇప్పటికీ పరిష్కారం కనుగొనలేదని అర్థమవుతోంది.
ఇవి కూడా చదవండి:
- అమెరికా అధ్యక్ష ఎన్నికలు: ప్రెసెడెన్షియల్ డిబేట్లో బైడెన్, ట్రంప్‌లు ఏం చెప్పారు
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)