గడ్డం గీసే పాతకాలం నాటి కత్తికీ, రేజర్ ఫిలాసఫీకీ ఏమిటి సంబంధం?

‘‘అంతా సమానమైనప్పుడు, సులువైన పరిష్కారాలు లభించే అవకాశాలు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి.’’

ఇలాంటి వాటితో పాటు, 14వ శతాబ్దపు పూజారి ఫ్రాన్సిస్కాన్ చెప్పిన అనేక సూక్తులు చాలా ప్రజాదరణ పొందాయి.

సైన్స్ నుంచి తర్కం వరకు ఇలా అన్ని రంగాలకు ఈ సూక్తులు వర్తించాయి. ఇప్పటికీ ఈ సూక్తులు చెల్లుబాటులో ఉన్నాయి.

మధ్యయుగ యూరప్‌లోని గొప్ప తత్వవేత్తల్లో ఒకరిగా ఈ పూజారి ఫ్రాన్సిస్కాన్‌కు పేరుంది. ఆయనను స్పానిష్‌లో విలియం లేదా గిలెర్మో అని పిలిచేవారు.

ఇంగ్లండ్‌కు దక్షిణాన ఉన్న ఓకమ్ అనే ఒక చిన్న గ్రామంలో ఆయన జన్మించారు. అందుకే ఆయన చరిత్రలో ‘‘విలియం ఆఫ్ ఓకమ్’’గా ప్రసిద్ధి చెందారు.

ఆలోచనల్లో స్పష్టత

స్వేచ్ఛ, వాస్తవిక స్వభావంపై ఆయన ఆలోచనలతో రాజకీయ తత్వవేత్త థామస్ హాబ్స్ ప్రభావితం అయ్యారు. ఇవి ప్రొటెస్టెంట్ సంస్కరణలను ప్రోత్సహించడంలో ఉపయోగపడ్డాయి.

తన కెరీర్ తొలినాళ్లలో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్‌కు ఆయన కోపం తెప్పించారు. తన సొంత మతానికి సంబంధించిన ఆదేశాలను వ్యతిరేకించారు. పోప్ చేత బహిష్కరణకు గురయ్యారు.

పాలకులకు అధికారం, వారు పాలించే ప్రజల నుంచి లభిస్తుందని ప్రకటించిన వారిలో ఆయన కూడా ఒకరు.

చర్చి, రాజ్యం వేర్వేరుగా ఉండాలని ఆయన నమ్మారు. సైన్స్‌తో మతాన్ని ఎప్పుడూ కలపకూడదని ఆయన నొక్కి చెప్పారు. సైన్స్ అనేది తర్కం మీద, మతం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుందని అన్నారు.

దేవుని ఉనికికి సంబంధించి థామస్ అక్వినాస్ ఇచ్చిన అయిదు తార్కిక రుజువులను తిరస్కరించడానికి ఆయన శాస్త్రీయ వాదనలను ఉపయోగించారు.

దేవుని ఉనికిని కేవలం తర్కం ద్వారానే నిర్ధారించలేమని ఆయన చెప్పారు. ఈ రకమైన వాదనలతో ఆయన జీవితం ఎంత అల్లకల్లోలంగా మారిందనేది ఇప్పుడు ముఖ్యం కాదు. కానీ, ఆయన చేసిన పని చాలా ఆసక్తికరమైనది, విలువైనది కూడా.

ఇప్పుడు మనం మాట్లాడుతున్న సిద్ధాంతంతో ఉన్న సంబంధం దృష్ట్యా ఆయన పేరు ఎక్కువగా ప్రస్తావనకు వచ్చింది.

తాత్విక వాదనలను వీలైనంత సరళంగా ఉంచాలని ఆయన నమ్మారు. తన సొంత సూత్రాలు, పూర్వీకుల సూత్రాలతోపాటు తాత్విక వాదనలను సరళంగా ఉంచాలనే సూత్రాన్ని కూడా ఆయన తీవ్రంగా ఆచరించారు.

శతాబ్దాల తర్వాత, చాలామంది మేధావులు వాడిన తర్వాత ఆయన ఐడియాకు ఓకమ్ రేజర్ లేదా ఓకమ్ అనే పేరు పెట్టారు.

మానసిక సత్వర మార్గం

ఫిలాసఫికల్ రేజర్ అనేది ఒక మానసిక సత్వర మార్గం (మెంటల్ షార్ట్‌కట్).

అనవసరంగా సంక్లిష్టం చేసే అంశాలను, అసంభవ పరికల్పనలను తోసిపుచ్చడం ద్వారా ఒక అంశాన్ని బాగా వివరించడానికి ఫిలాసఫికల్ రేజర్ సిద్ధాంతం మనకు ఉపయోగపడుతుంది.

‘‘రుజువుల్లేకుండా చెప్పిన అంశాలను, రుజువుల్లేకుండానే తిరస్కరించవచ్చు’’ అని హిచెన్స్ చెప్పారు. చాలామంది ఇదే మాటను చెబుతుంటారు.

ఇలాగే హాన్లోన్ కూడా ఒక మాట చెప్పారు. అదేంటంటే, ‘‘మూర్ఖత్వంతో వివరించే ఒక అంశాన్ని ఎప్పుడు కూడా దుర్మార్గమైనదిగా పరిగణించకూడదు’’ అని హాన్లోన్ అంటారు.

ఓకమ్ తన వాదనను కొంతవరకు అస్పష్టంగా వివరించారు. కానీ, ఇతర రచయితల అభిప్రాయాలు స్పష్టమైన కోణాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

అలాంటి తత్వవేత్తలు చాలామంది ఉన్నారు. వారిలో అరిస్టాటిల్ ఒకరు.

ఓకమ్ కంటే చాలా ఏళ్ల క్రితమే అనలిటికల్ సెకండ్స్‌లో అరిస్టాటిల్ ఇలా రాశారు.

‘‘తక్కువ శ్రమతో చేసే పనిని, ఎక్కువ శ్రమతో చేస్తే అది వ్యర్థమే. వాస్తవాల వివరణ అవసరానికి మించి క్లిష్టంగా ఉండకూడదు’’ అని అనలిటికల్ సెకండ్స్‌లో అరిస్టాటిల్ పేర్కొన్నారు.

భూమికి ఆవల ఏమి ఉందో అని ఆలోచిస్తూ ఓకమ్‌ ఇలా అనుకున్నారు.

‘‘స్వర్గంలో కూడా భూమి మీద ఉన్నట్లే ఉంటుందని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే, అనవసరంగా బహుళత్వాన్ని పరిచయం చేయకూడదు’’ అని ఓకమ్ భావించారు.

నికోలస్ కోపర్నికస్ మనస్సులో కూడా ఇవే ఆలోచనలు ఉన్నాయి. రేజర్ సిద్ధాంతాన్ని మొదట ఆచరించిన వారిలో కోపర్నికస్ కూడా ఒకరు.

భూమి చుట్టూ ఖగోళ వస్తువులు తిరుగుతున్నాయని 1543లో కామెంటరీయోలస్‌లో కోపర్నికస్ ప్రకటించారు. అయితే, ఇందులోని అపారమైన సంక్లిష్టతను సరళంగా, క్లుప్తంగా పరిష్కరించవచ్చని ఆయన చెప్పారు.

సూర్య విప్లవం

సరళత కోసం వెదుకులాటలో కోపర్నికస్ ఒక భావనకు వచ్చారు. అదేంటంటే, గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని కోపర్నికస్ భావించారు. కానీ, ఈ భావన కూడా ఆయనకు కాస్త క్లిష్టంగానే అనిపించింది.

ఆసక్తికరంగా రెండో శతాబ్దపు గ్రీకు గణిత శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రవేత్త, భౌగోళిక శాస్త్రవేత్త క్లాడియస్ టాలెమీ, ఓకమ్ రేజర్ తరహాలోనే ఒక మాట చెప్పారు.

‘‘మేం వీలైనంత సరళ మార్గాల ద్వారా ఒక దృగ్విషయాన్ని వివరించడాన్ని మంచి సిద్ధాంతంగా భావిస్తున్నాం’’ అని టాలెమీ అన్నారు.

ఏది ఏమైనప్పటికీ, రేజర్ సిద్ధాంతానికి కోపర్నికస్ మాత్రమే భక్తుడు కాదు.

టాలెమీ, కోపర్నికస్ మోడల్ సౌరవ్యవస్థల వివరణాత్మక పోలికను 1632లో గెలీలియో గెలీలి చేశారు.

‘‘ప్రకృతి అనవసరంగా వస్తువులను పెంచదు. తన ప్రభావాన్ని ఉత్పన్నం చేయడానికి వీలైనంత సులువైన, సరళమైన అంశాలను ఉపయోగించకుంటుంది. ప్రకృతి ఏదీ వ్యర్థం చేయదు’’ అని భావించారు.

సరళతను ఉపయోగించి వాస్తవికతను మెరుగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన శాస్త్రవేత్తల కథలతో చరిత్ర మొత్తం నిండి ఉంది.

‘‘అన్ని శాస్త్రాల లక్ష్యం ఏంటంటే, వీలైనన్ని తక్కువ పరికల్పనలు, సిద్ధాంతాల ద్వారా ఎక్కువ వాస్తవాలను కనుగొనాలి’’ అనే ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మాటతో దీన్ని ముగిద్దాం.

ఓకమ్ రేజమ్ ఏం చెబుతుంది?

ఏ విషయంలోనైనా సరళ వివరణను ఎంచుకోవాలని ఓకమ్ రేజర్ సిద్ధాంతం చెబుతోంది.

ఆకాశంలో కదులుతున్న కాంతిని చూసినప్పుడు అది ఫ్లయింగ్ సాసర్ అని అనుమానించడాని కంటే ముందు అదొక విమానం లేదా ఉపగ్రహం అయ్యే అవకాశం గురించి ఆలోచించండి. లేదా, మీకు తోకచుక్కను చూసే అదృష్టమే కలుగుతుందేమో.

ఈ సిద్ధాంతాన్ని అనుసరించి వైద్య విద్యార్థులకు సూచించేంది ఏంటంటే, మీరు గిట్టల శబ్ధం విన్నప్పుడు గుర్రాల గురించి ఆలోచించండి. జీబ్రా గురించి కాదు.

ఈ సూత్రం విద్యార్థులకు వ్యాధి లక్షణాల ఆధారంగా చాలా సరళమైన చికిత్సను గుర్తించాలని సూచిస్తుంది.

కోవిడ్ మూలం నుంచి కాస్మిక్ డార్క్ మ్యాటర్ వరకు శాస్త్రవేత్తలు ఇదే సూత్రాన్ని పాటిస్తారు. కానీ, రేజర్ తరహాలోనే దీన్ని కూడా చాలా జాగ్రత్తగా వాడాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)