పహల్గాం: కాల్పులు జరిగిన గంటదాకా జవాన్లు అక్కడికి ఎందుకు రాలేదు?

    • రచయిత, మజిద్ జహంగీర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

స్థలం: బైసరన్, పహల్గాం

తేదీ: ఏప్రిల్ 22, మంగళవారం

దాడి జరిగిన సమయం: మధ్యాహ్నం 2.15 గం.లకు

పహల్గాం మార్కెట్‌కు 6 కిలోమీటర్ల దూరంలోని బైసరన్‌లో ఈ దాడి జరిగింది. ఒక స్థానిక యువకుడు సహా 26 మంది ఈ కాల్పుల్లో చనిపోయారు.

పర్యటకులను లక్ష్యంగా చేసుకుని జమ్మూకశ్మీర్‌లో ఇలాంటి భారీ దాడి జరగడం మూడు దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారి.

పహల్గాంకు చెందిన అబ్దుల్ వాహిద్ వానీ స్థానిక హార్స్ రైడర్స్ అసోసియేషన్‌ అధ్యక్షులు. బైసరన్‌లో కాల్పులు జరిగిన ప్రాంతానికి చేరుకున్న తొలి స్థానిక వ్యక్తి ఆయనే. బీబీసీ ఆయనతో మాట్లాడింది.

పోలీసుల నుంచి తనకు ఫోన్ వచ్చిందని వానీ చెప్పారు.

''ఆ సమయంలో నేను గన్‌షిబల్‌లో ఉన్నా. మధ్యాహ్నం రెండున్నర సమయంలో నాకు మొదటగా పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. బైసరన్‌లో ఏదో జరిగిందని చెప్పారు. నన్ను వెళ్లి చూడమన్నారు. నేను, నా సోదరుడు సజ్జాద్ పరిగెత్తుకుంటూ బైసరన్‌కు వెళ్లాం. మేం అక్కడికి వెళ్లేసరికి మధ్యాహ్నం దాదాపుగా మూడున్నర అయింది. ఆ సమయంలో అక్కడ నేను తప్ప ఎవరూ లేరు. ఎటు చూసినా రక్తమోడుతున్నవారు కనిపించారు. మేం వెళ్లిన తర్వాత పోలీసులు వచ్చారు'' అని ఆయన చెప్పారు.

దాదాపు గంట తర్వాత సంఘటనా స్థలానికి పోలీసులు

బైసరన్‌లో కాల్పులు జరిగిన ప్రాంతానికి దాదాపు గంట తర్వాత పోలీసులు వచ్చారని ఓ సీనియర్ పోలీసు అధికారి నాతో చెప్పారు.

సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవడానికి కనీసం గంట సమయం పట్టిందని మరో వర్గం నుంచి కూడా నాకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వచ్చిన తర్వాతే ఆర్మీ, సీఆర్పీఎఫ్ అక్కడకు వచ్చాయని కూడా ఆయన తెలిపారు.

చాలామంది పోలీసు అధికారులు, స్థానికులతో దీని గురించి నేను మాట్లాడా. వారంతా పేరు చెప్పడానికి ఇష్టపడలేదు.

అమర్‌నాథ్ యాత్ర మార్గం

పహల్గాం మార్కెట్ ద్వారా ఏటా లక్షలమంది భక్తులు అమర్‌నాథ్ గుహ యాత్రకు వెళుతుంటారు. పహల్గాంలోని నున్వాన్ ప్రాంతం యాత్రకు బేస్ క్యాంప్. అక్కడి నుంచి భక్తులు గుంపులుగా బయలుదేరి అమర్‌నాథ్ ఆలయానికి చేరుకుంటారు.

అమర్‌నాథ్ యాత్ర సమయంలో పహల్గాం నుంచి ఆలయానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుంటాయి.

బైసరన్ లోయకు ఏడాదంతా పర్యటకులను అనుమతిస్తారు. 2024లో అమర్‌నాథ్ యాత్ర సమయంలో మాత్రమే బైసరన్ పార్కును మూసివేశారని స్థానికంగా ఉండే ఓ వ్యక్తి చెప్పారు.

2015 వరకు అమర్‌నాథ్ యాత్ర సమయంలో బైసరన్‌లో భద్రతాబలగాలను మోహరించేవారని కూడా ఆయన చెప్పారు. యాత్ర సమయంలో కాకుండా ఏడాదికాలంలో మరెప్పుడూ ఇక్కడ భద్రతాసిబ్బంది ఉండరని తెలిపారు.

2015 తర్వాత 2024 వరకు బైసరన్‌లో యాత్ర సమయంలో కూడా బలగాల మోహరింపు ఆపేశారని చెప్పారు.

పార్కులో సీసీటీవీ కెమెరాలు లేవని ఆరోపణలు

బైసరన్‌లో భద్రతా ఏర్పాట్ల గురించి పహల్గాంకు చెందిన అనేకమందితో బీబీసీ మాట్లాడింది. భద్రతాలోపమే ఈ దాడికి అసలు కారణమని వారు ఆరోపించారు.

పెద్దసంఖ్యలో పర్యటకులు సందర్శించే పార్కులో ఒక్క సీసీటీవీ కెమెరా కూడా లేదని స్థానికులు ఒకరు తెలిపారు.

రోజంతా పర్యటకులు ఉండే ఈ ప్రాంతంలో ఒక్క భద్రతా సిబ్బందిని కూడా విధుల్లో ఉంచలేదని మరో స్థానికుడు విమర్శించారు.

బైసరన్‌లో సీసీటీవీ కెమెరాలు లేవని మరో పోలీసు అధికారి కూడా ధ్రువీకరించారు.

బైసరన్‌కు వెళ్లే మార్గంలోగానీ, పార్కు చుట్టుపక్కలగానీ, పార్కులోగానీ భద్రతాసిబ్బంది ఎవరూ లేరని మరో సీనియర్ భద్రతా అధికారి చెప్పారు.

సీఆర్‌పీఎఫ్‌ బలగాలను ఎక్కడన్నా మోహరించాలంటే పోలీసులు లేదా ఆర్మీ అనుమతి తీసుకోవాలని సీఆర్‌పీఎఫ్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

టూరిస్టు అసిస్టెంట్లు ఏం చెప్పారు?

దాడి జరిగిన రోజు తాము టూరిస్ట్ అసిస్టెంట్ గైడ్స్(టీఏజీ)లను ముగ్గురిని అక్కడ ఉంచామని జమ్మూకశ్మీర్ పర్యటక విభాగం అధికారి ఒకరు చెప్పారు. వారు బైసరన్ పార్కు బయట ఉన్నారని తెలిపారు.

పర్యటకులకు దారి చూపించడం, వారిని ఎవరన్నా మోసగిస్తున్నారేమో గమనించడం టీఏజీ పని అని ఆయన చెప్పారు. భద్రతాపరంగా వారు చేసేదేమీ లేదని, వారి దగ్గర ఆయుధాలుండవని ఆయనన్నారు.

పోలీసు డిపార్ట్‌మెంట్‌లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా ఈ గైడ్లను నియమించుకుంటారు. వారి జీతం రూ. 12 వేలు. పహల్గాంలో ఇలాంటి టూరిస్ట్ అసిస్టెంట్ గైడ్‌లు 30మంది వరకు ఉంటారు.

2015లో ఈ టూరిస్ట్ గైడ్‌లను నియమించినట్టు బీబీసీ దగ్గర కూడా సమాచారముంది. ఇప్పటిదాకా వారికి భద్రతావిషయాలపై ఎలాంటి శిక్షణా ఇవ్వలేదు.

బైసరన్ పార్క్ వరకు ఆర్మీ అప్పుడప్పుడు పెట్రోలింగ్ జరుపుతుంటుందని మరో స్థానికుడు చెప్పారు.

పహల్గాంలో భద్రతాసిబ్బంది ఎంతమంది ఉన్నారు?

పహల్గాంలో సీఆర్‌పీఎఫ్ ఓ బృందం ఎప్పుడూ ఉంటుంది. వాళ్లతో పాటు సైన్యం ఉంటుంది. అయితే సైన్యం సంఖ్య మరీ ఎక్కువ ఉండదు.

పహల్గాం మార్కెట్‌కు కనీసం ఆరు కిలోమీటర్ల దూరంలో ఆర్మీ బృందం ఉంటుంది. అంటే కాల్పులు జరిగిన బైసరన్ ప్రాంతానికి సైన్యం కనీసం 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సీఆర్‌పీఎఫ్ కంపెనీని పహల్గాం మార్కెట్ దగ్గర మోహరించారు. ఇది కాల్పులు జరిగిన ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పహల్గాంలో పోలీస్ స్టేషన్ కూడా ఉంది. దీంతో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా ఉంది. మొత్తంగా అక్కడ కనీసం 40 మంది పోలీసులున్నారు.

కొన్నేళ్ల కిందటి వరకు తాను బైసరన్‌గుండా కట్టెలు కొట్టుకోవడానికి అటవీప్రాంతంలోకి వెళ్లేదాన్నని 50 ఏళ్ల మహిళ ఒకరు చెప్పారు. ఆ ప్రాంతంలో భద్రతాసిబ్బందిని తానెప్పుడూ చూడలేదన్నారు.

చాలా ఏళ్లుగా పహల్గాం ప్రశాంతంగా ఉందని ఓ పోలీసు అధికారి చెప్పారు. అందుకే పోలీసులకు, భద్రతా సిబ్బందికి ఇలాంటి ఘటన ఒకటి జరుగుతుందన్న ఆలోచన లేదని ఆయన తెలిపారు.

పహల్గాంలో తీవ్రవాద దాడులు జరగబోవన్న అతి విశ్వాసం భద్రతా బలగాలకుందని కూడా ఆయన అన్నారు.

కాల్పులకు ముందు బైసరన్‌లో 1,092మంది పర్యటకులు ఉన్నారని తెలిసింది. దాడి సమయంలో అక్కడ 250 నుంచి 300 మంది ఉన్నారు. దాడికి ముందు వరకు దాదాపు 2,500మంది పర్యటకులు బైసరన్‌కు వచ్చేవారని ఆయన తెలిపారు.

పహల్గాం మార్కెట్ నుంచి బైసరన్‌కు వెళ్లేదారి రాళ్లు, దట్టమైన అడవితో నిండి ఉంటుంది. గుర్రాల మీదగానీ, నడుచుకుంటూగానీ పర్యటకులు అక్కడికి వెళ్తుంటారు.

దాడి ఎంత పెద్దదంటే...

పహల్గాంలో పర్యటకులపై జరిగిన దాడి గడిచిన మూడు దశాబ్దాల్లో అతిపెద్దది. కశ్మీర్‌లో పర్యటకులపై అలాంటి దాడి జరుగుతుందన్న ఊహ కూడా ఎవరికీ లేదు.

2019లో ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత తీవ్రవాదానికి అడ్డకట్ట వేశామని మోదీ ప్రభుత్వం తెలిపింది.

కానీ, ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కూడా జమ్మూకశ్మీర్‌లో ఇలాంటి ఘటనలు ఆగలేదు. అంతేకాదు...గత 20 ఏళ్లలో ప్రశాంతంగా ఉన్న జమ్మూలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)