జలుబు చాలా రోజులుగా వేధిస్తోందా? ‘లాంగ్ కోల్డ్’ కావొచ్చు!

    • రచయిత, మిషెల్ రాబర్ట్స్
    • హోదా, బీబీసీ హెల్త్ న్యూస్ ఎడిటర్

కోవిడ్ సోకిన వారిలో ఇన్ఫెక్షన్ తగ్గినా జలుబు సమస్యలు ఎక్కువ కాలం కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిని ‘దీర్ఘ కాలిక కోవిడ్ (లాంగ్ కోవిడ్)’గా పరిగణిస్తున్నారు.

లాంగ్ కోవిడ్ మాదిరిగానే ‘దీర్ఘ జలుబు’ (లాంగ్ కోల్డ్) సమస్యను ఇటీవలే గుర్తించారు.

ఈ సమస్య బారిన పడిన వారిలో దగ్గు, కడుపునొప్పి, అతిసారం వంటి లక్షణాలు కనిపించాయి.

బ్రిటన్‌లో 10,171 మంది ఇచ్చిన వివరాల ఆధారంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు తెలిశాయి.

అయితే ఈ అంశం గురించి మరింత లోతుగా అధ్యయనం చేయాలని, లక్షణాల తీవ్రతను బట్టి ఎలాంటి వైద్యం చేయాలో తెలుసుకోవాల్సి ఉందని నిపుణులు అంటున్నారు.

శ్వాసకోస వైరస్ లేదా మరేదైనా వైరల్ ఇన్ఫెక్షన్‌ల వలన శ్వాసకోశ సంబంధింత సమస్యలు దీర్ఘకాలం కొనసాగడం కొత్తేమీ కాదు. కోవిడ్ వల్ల ఈ దీర్ఘకాలిక సమస్యల అంశం మరోసారి చర్చలోకి వచ్చింది.

రోగులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకునేందుకు ఈ అధ్యయన ఫలితాలు వీలు కల్పించాయని పరిశోధకులు అన్నారు.

"వైరస్ బారిన పడినవారు తీవ్రమైన అలసటను ఎదుర్కొంటున్నారనేది భ్రమ కాదు, నిజమే. ఈ సమస్యను గుర్తించాల్సిన అవసరం ఉంది" అని లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అడ్రియన్ మార్టినో బీబీసీతో అన్నారు.

లాంగ్ కోల్డ్ లక్షణాలు

ప్రముఖ క్లినికల్ మెడిసిన్ జర్నల్ ‘ద లాన్సెట్’ పబ్లిష్ చేసిన అధ్యయనంలో భాగంగా 2021లోని మొదటి రెండు నెలల్లో కోవిడ్ బారిన పడిన వారిని, ఇతర శ్వాసకోస సమస్యలున్నవారిని, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పాలని కోరారు.

అందుకు స్పందనగా వారు తమ తమ సమస్యలను నివేదించినట్లు లాన్సెట్ తెలిపింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారంతా కోవిడ్ వ్యాక్సీన్ తీసుకోవాల్సి ఉంది.

అధ్యయనం వివరాలు ఇలా ఉన్నాయి.

వివరాలు తెలిపిన 10,171 మందిలో1,343 మంది ఇటీవలే వారు కోవిడ్ బారిన పడ్డామని చెప్పారు.

472 మంది ఫ్లూ లేదా జలుబు వంటి శ్వాసకోస వైరస్ సోకడం వలన ఇబ్బంది పడ్డట్లుగా తెలిపారు. అయితే అనారోగ్యం నుంచి కోలుకున్న వారందరిలోనూ ఈ సమస్యలు తలెత్తలేదు.

ఎలాంటి శ్వాసకోస సంబంధిత అనారోగ్యం ఎదుర్కోని వారికంటే, కొన్ని వారాల ముందు కోవిడ్, జలుబు లేదా ఫ్లూ బారిన పడిన వారిలో వందల మంది తాము కోలుకున్నాక కూడా కొన్ని నెలలపాటు కింద చెప్పిన సమస్యలతో బాధపడ్డామని తెలిపారు.

వారు చెప్పిన లక్షణాలు:

  • డయేరియా
  • కడుపు నొప్పి
  • కండరాలు లేదా కీళ్ల నొప్పులు
  • నిద్రలేమి
  • జ్ఞాపకశక్తి/ఏకాగ్రత సమస్యలు
  • తల తిరగడం/కళ్లు తిరగడం
  • దగ్గు

ఇటీవలి కాలంలో కోవిడ్ బారిన పడిన వారు తాము రుచి, వాసన తెలియకపోవడం, తల తిరగడం, మైకం, ఎక్కువగా చెమట పట్టడం వంటి సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు.

అయితే, మొదట గమనించే లక్షణాలను బట్టి తీవ్రతను అంచనా వేయడం కష్టం. కొంత మందిలో తొలుత ఈ లక్షణాల తీవ్రత కనిపించినా, త్వరగా కోలుకుంటారు. మరికొంత మందిలో ఈ లక్షణాలు అంతగా ప్రభావం చూపించకపోయినా దీర్ఘకాలం కొనసాగొచ్చు.

లాంగ్ కోవిడ్ లేని వారిలోనూ లక్షణాలు

ఈ అధ్యయన ప్రధాన పరిశోధకురాలు, లండన్ క్వీన్ మేరీ యూనివర్సిటీకి చెందిన గియులియా వివాల్డి మాట్లాడుతూ, “కేవలం దీర్ఘకాలిక కోవిడ్ బారిన పడినవారిలోనే కాకుండా, ఇతర ఇన్ఫెక్షన్లకు గురైన వారిలోనూ ఇలాంటి లక్షణాలు ఉన్నట్లు మేం కనుగొన్నాం” అన్నారు.

“అవగాహన లేకపోవడం, ఈ సమస్య ఫలానాది అని తెలిపే పదం లేకపోవడం వల్ల ఎక్కువ మంది ఈ లక్షణాలు ఉన్నా కూడా , ‘లాంగ్ కోల్డ్’ గురించి నివేదించలేదు” అని అన్నారు.

“ప్రస్తుతం లాంగ్ కోవిడ్‌పై పరిశోధనలు కొనసాగుతున్నందున,ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఇతర శ్వాసకోస ఇన్ఫెక్షన్లు, వ్యాధి లక్షణాల గురించి కూడా పరిశోధన చేస్తాం. దీర్ఘ కాలిక ఇన్ఫెక్షన్లను గుర్తించడం, చికిత్స అందించడం కష్టంతో కూడుకున్నది. ఒకటికి మించి లక్షణాలు ఉన్న కారణంగా, వ్యాధి నిర్ధరణ కూడా కష్టం” అని చెప్పారు.

లండన్ ఇంపీరియల్ కాలేజీలోని ఎక్స్‌పరిమెంటల్ మెడిసిన్ విభాగ ప్రొఫెసర్ పీటర్ ఓపెన్ షా అభిప్రాయం ప్రకారం ఈ అధ్యయనం చాలా ముఖ్యమైనది. ఆయన మాట్లాడుతూ, “శ్వాసకోస ఇన్ఫెక్షన్ల నుంచి కోలుకుని, సాధారణ జీవితం గడపడానికి ఎక్కువ సమయం పడుతుందన్న విషయం ఈ అధ్యయనం వల్ల తెలుస్తోంది. ఇన్ఫెక్షన్ల బారిన పడ్డవారు వెంటనే కోలుకోవడం సాధ్యం కాదని గుర్తుంచుకోవాలి” అన్నారు.

ఈ ‘లాంగ్ కోల్డ్’ సమస్యను దీర్ఘ కాలిక కోవిడ్ బారిన పడినవారిలో కనిపించే సమస్యగా మాత్రమే చూడకూడదని తెలిపారు.

“కేవలం కోవిడ్ మాత్రమే కాదు, ఇతర శ్వాసకోస ఇన్ఫెక్షన్ల బారిన పడిన వారిలో దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయన్న వాదనను ఈ అధ్యయనం బలపరుస్తోంది” అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సైకియాట్రి విభాగ ప్రొఫెసర్ పాల్ హ్యారీసన్ అన్నారు.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)