తెలంగాణ: ములుగు జిల్లాలో పురుషునికి కాల్చిన గడ్డపారతో ‘శీల’ పరీక్ష...

వివాహేతర సంబంధం ఆరోపణలతో గంగాధర్ అనే వ్యక్తి చేత కాల్చిన గడ్డపారను పట్టించిన ఘటన తెలంగాణలోని ములుగు జిల్లాలో చోటు చేసుకుంది.

ఈమేరకు బంజరుపల్లికి చెందిన జగన్నాథం గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు కాపీలోని వివరాల ప్రకారం...

ఎస్టీ అయిన జగన్నాథం గంగాధర్ బంజరుపల్లి గ్రామంలో నివసిస్తున్నారు. అయితే పెద్దమ్మ కుమారుడు జగన్నాథం నాగయ్యకు గంగాధర్ మీద అనుమానం ఉంది. తన భార్యతో గంగాధర్‌కు సంబంధం ఉందని నాగయ్య తరచూ ఆరోపిస్తూ ఉండేవారు.

కుల పంచాయతీ దృష్టికి ఆ విషయాన్ని నాగయ్య తీసుకెళ్లారు.

తప్పు చేశాడో లేదో తెలియాలంటే గంగాధర్ కాల్చిన గడ్డపారను పట్టుకోవాలని కుల పంచాయతీలోని పెద్దలు ఆదేశించారు. దాంతో ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం సుమారు 7.30 గంటల ప్రాంతంలో కన్నాయిగూడెం దగ్గర గల లక్నవరం చెరువు వద్ద పరీక్ష పెట్టారు.

నిప్పుల్లో గడ్డపారను బాగా వేడి చేసి దాన్ని పట్టుకోవాలని చెప్పారు. చేతులు కాలక పోతే తప్పు చేసినట్లు కాదని, చేతులు కాలితే తప్పు చేసినట్లు అని పెద్దలు చెప్పారు. తప్పు చేసినట్లు తేలితే గంగాధర్ రూ.11 లక్షలు కట్టాలని వారు తీర్మానం చేశారు.

ఆ తీర్మానం ప్రకారం కాలిన గడ్డపారను రెండు చేతులతో గంగాధర్ పట్టుకున్నాడు. తన చేతులు కాలలేదు కాబట్టి తాను ఏ తప్పూ చేయలేదని, అయినా తనను డబ్బులు కట్టాలంటూ వారు వేధిస్తున్నారని గంగాధర్ ఆరోపించారు.

ప్రాణహాని కలుగుతుందని తెలిసినప్పటికీ తన చేత బలవంతంగా బాగా కాలిన గడ్డపారను పట్టించారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో గంగాధర్ పేర్కొన్నారు.

గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)