You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యువ ఆటగాళ్ల ఆట కోహ్లీ, రోహిత్ లాంటి సీనియర్ల రిటైర్మెంట్‌కు కారణమవుతుందా?
- రచయిత, కే బోధిరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత క్రికెట్ జట్టులో ఇటీవల చాలా మంది కొత్త ముఖాలకు చోటు దక్కింది. వీరంతా జట్టులో నిలదొక్కుకొంటున్నారు. అయితే ఇలా కొత్తవారు వస్తుండటం పలు సంకేతాలను పంపుతోంది. భారత జట్టు కూర్పులో మార్పులకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.
1970ల తర్వాత భారత క్రికెట్‌లో చాలా మార్పులు వచ్చాయి. సునీల్ గవాస్కర్ నుంచి సచిన్ తెందూల్కర్ వరకు అందరూ మారుతున్న కాలానికి అనుగుణంగా నడుచుకున్నారు.
ఎందుకంటే గవాస్కర్, సచిన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇలా ఏ ఆటగాడైనా పరిమిత కాలమే క్రికెట్ ఆడగలడు. ఏళ్ల పాటు ఆడాలని వారి మనసు కోరుకున్నా, శరీరం సహకరించదు. అంతేకాదు సీనియర్ ప్లేయర్లు వారి చోటును విడిచిపెట్టేంత మార్పుకు తర్వాతి తరం ఆటగాళ్ల రాక దారితీస్తోంది.
ముఖ్యంగా 2000వ సంవత్సరం తర్వాత యువ ఆటగాళ్ల రాక, సాంకేతికత, క్రికెట్‌ని చూసే అభిమానుల సంఖ్య పెరగడం తదితర కారణాలతో భారత క్రికెట్లో భారీ మార్పులే వచ్చాయి.
అకస్మాత్తుగా రిటైర్మెంట్‌తో చిక్కులు
అప్పట్లో గవాస్కర్, కపిల్ దేవ్, మొహమ్మద్ అజారుద్దీన్, నవజ్యోత్ సింగ్ సిద్ధు, వెంకటేష్ ప్రసాద్, జవగళ్ శ్రీనాథ్, కృష్ణమాచారి శ్రీకాంత్, మొహిందర్ అమర్‌నాథ్ వంటి వెటరన్ ఆటగాళ్ల రిటైర్మైంట్‌తో భారత జట్టు ఇబ్బందుల్లో పడింది.
ఆ సమయంలో టీమిండియా కెప్టెన్సీకి సరైన వారెవరనే ప్రశ్నలు తలెత్తాయి. ప్రయోగాలూ చేశారు. చివరికి గంగూలీకి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది బీసీసీఐ.
ఆ తర్వాత గంగూలీ, సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే లాంటి సీనియర్ ఆటగాళ్లు వీడ్కోలు పలికారు. దీంతో మహేంద్ర సింగ్ ధోనీ ఆధ్వర్యంలో జట్టు తయారైంది. ఆ జట్టు భారత క్రికెట్లో భారీ మార్పులను తీసుకొచ్చింది. టీ20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీలను, 2011లో యువ ఆటగాళ్లు, సీనియర్ ఆటగాళ్ల కూర్పుతో వన్డే వరల్డ్ కప్ కైవసం చేసుకుంది.
ఆ తర్వాత ధోనీ కాలం ముగిసింది, తర్వాత జట్టు పగ్గాలు విరాట్, రోహిత్ శర్మ అందుకున్నారు. ఇరువురి నేతృత్వంలోని జట్లు కూడా ప్రపంచ క్రికెట్లో సత్తా చాటాయి.
ఇప్పుడు రోహిత్ , విరాట్ రోజులూ ముగుస్తున్నాయి. దీంతో భారత జట్టు తర్వాతి తరం వైపు మళ్లేందుకు సిద్ధమవుతోందని ఇటీవలి మ్యాచ్‌లు రుజువు చేస్తున్నాయి.
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, శుభ్‌మన్ గిల్ లాంటి యువ ఆటగాళ్లు రాణించి జట్టుకు విజయాన్ని అందించారు.
కోహ్లీ, రోహిత్ లేకుండా భారత్ విజయం సాధించగలదన్న ధీమా కనిపించింది.
సహజ మార్పులు - బలవంతపు మార్పులు
జట్టు కూర్పులో మార్పులు పలు రకాలు. వీటిలో సహజ మార్పులు, బలవంతపు మార్పులూ ఉంటాయి. జట్టులో కొందరు ఆటగాళ్లు నిలకడగా రాణిస్తూ, ఒకే స్థానంలో ఏళ్ల పాటు ఆడతారు. అలాంటి సమయంలో యువ ఆటగాళ్ల ప్రతిభను పరీక్షించే అవకాశం దొరకదు.
ఒకవేళ సీనియర్ల ఆటగాళ్లు రిటైరైతే యువ ఆటగాళ్లను అత్యవసరంగా జట్టులోకి చేర్చుకోవాల్సి వస్తుంది. ఆ సమయం జట్టును ఇబ్బందుల్లోకి నెడుతుంది.
ఉదాహరణకు వెస్టిండీస్ జట్టులో క్రిస్ గేల్ వంటి సీనియర్ ఆటగాళ్లు జట్టుకు వీడ్కోలు పలికారు. ఒక్కసారిగా యువ ఆటగాళ్లు జట్టులోకి వచ్చాక ఆశించిన ఫలితాలు రావడం కష్టమైంది. పాత వెస్టిండీస్ ఇమేజ్ మసకబారింది.
జట్టులో సహజమైన మార్పు అనివార్యం. సీనియర్ ఆటగాళ్ల బ్యాటింగ్, బౌలింగ్ నైపుణ్యాలు తగ్గినపుడు వారు రిటైరవ్వాలి. లేకపోతే అప్పటికప్పుడు యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకురావడం ఇబ్బందుల్లో పడేస్తుంది.
ఈ నేపథ్యంలో భారత జట్టు మాత్రం బలవంతపు మార్పు దిశగా పయనిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
టీ20 ప్రపంచ కప్‌తో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వెటరన్ ఆటగాళ్ల శకం ముగిసిపోవచ్చని అనలిస్టులు భావిస్తున్నారు.
ఇపుడు యువ ఆటగాళ్లతో కూడిన జట్టును చూడొచ్చంటున్నారు.
రాణిస్తున్న యువ ఆటగాళ్లు
ఇప్పటికే యశస్వీ జైస్వాల్, గిల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్ వంటి చాలా మంది యువ ఆటగాళ్లకు తగిన శిక్షణ, అనుభవం దొరికాయి.
కోహ్లీ లేకుండా టెస్ట్ విజయాలు సాధ్యమా, రోహిత్ లేకుండా పవర్‌ప్లే స్కోర్ పెంచవచ్చా అనే ప్రశ్నలు కనుమరుగవుతున్నాయి.
జైస్వాల్ వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసి తన ఫామ్‌ను నిరూపించుకుంటూ బలమైన ఆరంభాన్ని అందుకున్నాడు. టీ20 ఫార్మాట్‌కు తగ్గట్టుగా తన ఆటను తీర్చిదిద్దుకున్నాడు.
ఇక ఇటీవలే జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ అనేక దేశవాళీ మ్యాచ్‌లలో రాణించాడు, జట్టులో ఏ స్థానంలోనైనా ఆడగలనని నిరూపించాడు.
ఇది కాకుండా గిల్, శ్రేయస్ వంటి బలమైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఉన్నారు. తద్వారా కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోయినా జట్టు గెలవగలదని యువ ఆటగాళ్లు నిరూపిస్తున్నారు.
సచిన్, గంగూలీ, ద్రవిడ్ లేని జట్టును చూసి అభిమానులు ఆందోళన చెందిన కాలంలో యువ ఆటగాళ్లు విజయాల వైపు నడిపిన రోజులున్నాయి.
మార్పుకు భారత జట్టు సిద్ధంగా ఉందా?
''భారత జట్టు ప్రస్తుతం మార్పు దిశగా పయనిస్తోందనే విషయాన్ని కాదనలేం. ఎందుకంటే ఆ మార్పులు లేకుండా, జట్టు ముందుకు వెళ్లదు. జైస్వాల్ మంచి ఓపెనర్‌గా ఎదుగుతున్నాడు. అతనిలో శిఖర్ ధావన్, జయసూర్యల మాదిరి దూకుడు, సొగసైన ఆటతీరు కనిపిస్తున్నాయి’’ అని క్రీడారంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టు ముత్తు కుమార్ అన్నారు.
రోహిత్ శర్మకు ఇప్పుడు 36 ఏళ్లు. అతడు ఆటను కొనసాగించగలడో లేదో తెలియదు. కాబట్టి రోహిత్ స్థానంలో గిల్, కేఎల్ రాహుల్ రావచ్చు. పరిస్థితుల ఆధారంగా రాహుల్ మూడో స్థానంలో ఆడొచ్చు. ఎందుకంటే గిల్ బ్యాటింగ్‌లో నిలకడ లోపించింది. నిలకడగా ఆడకపోతే అతని స్థానాన్ని రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు చేజిక్కించుకోవచ్చు.
తనకు ఏ స్థానం సరిపోతుంది, ఏ స్థానంలో ఆడాలనేది ఆటగాడే నిర్ణయించుకోవాలని ముత్తుకుమార్ చెబుతున్నారు.
“ఒకసారి సిడ్నీ మ్యాచ్‌లో వీవీఎస్ లక్ష్మణ్ ఓపెనర్‌గా బరిలోకి దిగారు. సెంచరీ చేశాడు. కానీ ఆ తర్వాతి గేమ్‌లోనే వీవీఎస్, తన ప్లేస్ నాలుగో డౌన్‌లో ఉందని, ఓపెనింగ్ కాదని చెప్పాడు. కాబట్టి ఒక ఆటగాడే తన స్థానాన్ని నిర్ణయించుకోవాలి. కోహ్లీ జట్టులో మూడో స్థానాన్ని ఎలా నిలబెట్టుకున్నాడో అలాగే గిల్ కూడా ఓపెనర్‌గా వస్తాడా? వన్‌డౌన్‌లో ఉంటాడా అనేది అతనే నిర్ణయించుకోవాలి'' అన్నారు ముత్తుకుమార్.
విరాట్ కోహ్లీ సంగతేంటి?
విరాట్ కోహ్లీ పరిస్థితి గురించి ముత్తు కుమార్ మాట్లాడుతూ- “కోహ్లీ ఒక టెస్ట్ సిరీస్‌లో ఆడతాడు, మరొక టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. అతను ఆడాలనుకున్నప్పుడు కచ్చితంగా ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉండాలనుకుంటాడు. అలా ఎప్పటివరకు అతనికి స్థానం ఉంటుందో తెలియదు. భవిష్యత్తులో విరాట్ కూడా బెంచ్‌కు పరిమితమయ్యే సమయం రావచ్చు'' అని అన్నారు.
''టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు ఇష్టపడే కోహ్లీ, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సిరీస్‌లలో ఆడలేదు. అతనికి వేరే సమస్యలు ఉండవచ్చు. కానీ గిల్, పటీదార్, సర్ఫరాజ్ ఖాన్ వంటి ఆటగాళ్లు కోహ్లీ మాదిరి ప్రభావం చూపగలరు. భవిష్యత్తులో అతని స్థానాన్ని కాలమే భర్తీ చేస్తుంది. ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ మాదిరి భవిష్యత్తులో కోహ్లీ ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు” అని చెప్పారు ముత్తుకుమార్.
రికీ పాంటింగ్‌కు జరిగింది ఇదే
జట్టులో రోహిత్ శర్మ, కోహ్లీల స్థానం గురించి ముత్తుకుమార్ మాట్లాడుతూ- "వారిద్దరూ గొప్ప ఆటగాళ్లు. వీరిద్దరిని జట్టు నుంచి వైదొలగాలని బీసీసీఐ నేరుగా చెప్పకపోవచ్చు. ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్ గొప్ప కెప్టెన్, బ్యాటర్, కానీ అతన్ని రిటైర్ కావాలని ఆస్ట్రేలియా బోర్డు మర్యాదపూర్వకంగా కోరినట్లే ఏదో ఒక సమయంలో బీసీసీఐ కూడా చేయొచ్చు. కోహ్లీ వంటి వారిని బెంచ్‌కు పరిమితం చేసి అవమానించకుండా, ఈ సీనియర్ ఆటగాళ్లే రిటైర్మెంట్ తీసుకునేలా బీసీసీఐ అడుగులేయవచ్చు'' అన్నారు.
"ఇప్పుడు భారత జట్టులో 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లు రోహిత్, కోహ్లీ మాత్రమే. మిగతా వారంతా 20 నుంచి 30 ఏళ్ల వయసులో ఉన్న ఆటగాళ్లు. రోహిత్, కోహ్లీల స్థానాలు కూడా ఖాళీ అయితే, పూర్తి యువ జట్టు తయారవుతుంది. భవిష్యత్తులో ఇదే జరుగుతుంది" అని ముత్తుకుమార్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- చరిత్రలో తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోతున్న టీడీపీ.. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?
- ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, క్యాష్ చేసుకోని బాండ్ల సొమ్మును 15 రోజుల్లో దాతలకు తిరిగి ఇచ్చేయాలి: సుప్రీం కోర్టు స్పష్టీకరణ
- ఉత్తరాఖండ్ యూసీసీ: 'లివ్-ఇన్ రిలేషన్షిప్'లో ఉన్నవారు రిజిస్ట్రార్‌కు సమాచారం ఇవ్వాలి, లేకుంటే శిక్ష తప్పదంటున్నకొత్త చట్టం
- రేవంత్ రెడ్డి X కేసీఆర్: ముఖ్యమంత్రులు బూతులు మాట్లాడొచ్చా? నేతల దిగజారుడు భాషను ఎలా చూడాలి?
- తమిళనాడు అభివృద్ధి మంత్రమేంటి? ఈ రాష్ట్రాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ ఎందుకు పొగిడింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)