You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లోకం చుట్టిన వీరుడు... ఎక్కడా విమానం ఎక్కలేదు
- రచయిత, రెడేషియన్
- హోదా, బీబీసీ ముండో
ప్రపంచం మొత్తాన్ని చుట్టి రావాలని ఎప్పుడైనా అనుకున్నారా?
300 కంటే తక్కువ మందే ఈ కలను నిజం చేసుకున్నారు. వీరిలో ముగ్గురు రెండుసార్లు ప్రపంచాన్ని చుట్టివచ్చారు.
అయితే, ఒకరు మాత్రం విమానం ఎక్కకుండానే ప్రపంచంలోని ప్రతి దేశాన్ని చూశారు. ఆయన చెబుతున్న విశేషాలేమిటో చూద్దాం.
‘‘నా పేరు టోర్బ్యోర్న్ సీ పెడెర్సెన్. ఒక ట్రావెలర్ ఇలాంటి పేరు పెట్టుకోవడం కాస్త వింతగా అనిపించొచ్చు. అయితే, అదేమీ నాకు అడ్డు కాలేదు. నన్ను థోర్ అని పిలవండి’’ అని డెన్మార్క్‌కు చెందిన ఆయన చెప్పారు.
డేనిష్ శాస్త్రవేత్త పీట్ హెయిన్ నుంచి స్ఫూర్తి పొందానని ఆయన చెబుతున్నారు. ‘‘చుట్టు పక్కల ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే మొదట పర్యటించాలి’’ అని పీట్ చెబుతుంటారని థోర్ అన్నారు.
తొమ్మిదేళ్ల క్రితం ప్రపంచాన్ని చుట్టి వచ్చేందుకు ఆయన ఇంటి నుంచి బయల్దేరారు. తన యాత్ర పూర్తయ్యే వరకు మళ్లీ ఇంటికి తిరిగిరానని ఆయన కంకణం కట్టుకున్నారు.
ఈ యాత్ర కోసం ఆయన కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు. ప్రతి దేశంలోనూ కనీసం 24 గంటలు గడపాలి, విమానం ఎక్కకుండా నేల లేదా నీటి మార్గాల్లో దేశాలను చుట్టిరావాలి.. లాంటి నిబంధనలను ఆయన పెట్టుకున్నారు.
‘‘ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లేందుకు కారును కొనుక్కోకూడదు, లేదా అద్దెకు తీసుకోకూడదు. స్థానికులతోపాటు పర్యటకులతోనూ కాసేపు గడపాలి’’ అని ఆయన చెప్పారు.
ప్రపంచంలోని ప్రతి దేశాన్నీ చుట్టి వచ్చేందుకు ఆయనకు 3,512 రోజులు పట్టింది. బస్సు, రైలు, పడవ, ట్యాక్సీల సాయంతో ఆయన భిన్న దేశాల్లో పర్యటించారు.
సాధారణంగా ప్రపంచాన్ని చుట్టి రావడమంటే 193 ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు, రెండు అబ్జర్వర్ స్టేట్‌లలో పర్యటిస్తారు. కానీ, థోర్ మాత్రం వివాదాస్పద ప్రాంతాలతో కలిపి 203 దేశాల్లో పర్యటించారు.
ఎప్పుడు మొదలైంది?
2013, అక్టోబరు 10న ఈ యాత్రను థోర్ మొదలుపెట్టారు. 2018లోగా దీన్ని పూర్తిచేయాలని ఆయన భావించారు. కానీ, ఇది పూర్తయ్యేందుకు మరో ఐదేళ్లు అదనంగా పట్టింది.
మే 2023లో ఆయన హిందూ మహా సముద్రంలోని మాల్దీవులకు చేరుకున్నారు. అదే ఆయన జాబితాలోని చివరి దేశం.
జూన్ వరకూ ఆయన అక్కడే ఉన్నారు. అక్కడి థిలాఫుషి దీవి నుంచి బీబీసీతో ఆయన మాట్లాడారు.
ఈ పర్యటనలో మీరు మరచిపోలేని సంఘటన ఏమిటి?
చాలా ఉన్నాయి. తొలిసారి పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత, రెండో పెళ్లి కూడా జరిగింది.
అంతరిక్షంలోకి రాకెట్ దూసుకెళ్తుంటే చూశాను. ఈ భూమిని విడిచివెళ్తున్న ఒక వస్తువును చూడటం అదే తొలిసారి. చాలా గొప్పగా అనిపించింది.
ఒక నౌకలో వెళ్తున్నప్పుడు, పెద్ద తుపాను వచ్చింది. తిమింగలాలు ఈత కొట్టడాన్ని దగ్గర నుంచి చూశాను. సూడాన్‌లో ఒక పెళ్లికి నన్ను ఆహ్వానించారు. ఇలా చాలా ఉన్నాయి.
మీ భార్యను ఎలా కలుసుకునేవారు?
నన్ను చూడటానికి ఆమె 27 సార్లు వచ్చారు. అయితే, వీటిలో అన్నింటికంటే కష్టంగా అనిపించింది హాంకాంగ్‌లో ఉన్నప్పుడు, అప్పట్లో అక్కడ కరోనావైరస్ వ్యాపిస్తోంది.
అక్కడ చాలా కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఎలాంటి పడవలూ నడపడం లేదు. మరోవైపు నేను వెళ్లాలి అనుకునే చాలా దేశాలు సరిహద్దులను మూసివేశాయి.
నా భార్య కూడా హాంకాంగ్‌లో ఉంటున్న నన్ను చూడటానికి రావడం కష్టమైంది. ఎందుకంటే అప్పటికి మా ఇద్దరికి పెళ్లి కాలేదు. పైగా నాకు అక్కడ నివాస ధ్రువపత్రాలేమీ లేవు.
మొదట అక్కడ ఒక చిన్న ఉద్యోగం సంపాదించి తాత్కాలిక నివాస అనుమతులు పొందాను. యూటాలోని ఒక ఏజెన్సీ సాయంతో మేం ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్నాం.
నిజానికి డెన్మార్క్‌లో ఈ పెళ్లి చెల్లదు. కానీ, హాంకాంగ్‌లో చెల్లుతుంది. వెంటనే మిగతా పేపర్ వర్క్ పూర్తిచేసి నా భార్యకు వీసా పంపించాను.
అప్పుడు ఆమె అక్కడకు వచ్చి నాతో వంద రోజులు గడిపారు.
ఏ దేశంలోకి వెళ్లడం కష్టం అనిపించింది?
ఈక్వెటోరియల్ గినియా. నేను దాదాపుగా నమ్మకం కోల్పోయాను.
దాదాపు ఆరు దౌత్య కార్యాలయాలకు వెళ్లాను. కానీ, ఎవరూ నాతో మర్యాదగా నడుచుకోలేదు.
మొత్తానికి నేలపై సరిహద్దుల గుండా దేశంలోకి వెళ్లాలని భావించాను. కానీ, చెక్‌పోస్టుల దగ్గర యూనిఫాం వేసుకున్న జవాన్లు నాకు చుక్కలు చూపించారు.
చాలా కష్టంగా అనిపించింది.
ఈక్వెటోరియల్ గినియాలో అడుగుపెట్టడానికే దాదాపు నాలుగు నెలలు పట్టింది.
మరి కష్టానికి తగిన ఫలితం కనిపించిందా?
కనిపించింది. అది నా 100వ దేశం. కాబట్టి ఫలితం కనిపించిందనే చెప్పుకోవాలి.
అది అందమైన దేశం. అక్కడి ప్రజలు కూడా చాలా అందంగా ఉంటారు. నాతో వారు చాలా సరదాగా ఉన్నారు.
ఏమైనా వస్తువులు కొనుగోలు చేశారా?
నా లగేజీలో పట్టని వస్తువులేమీ నేను కొనుగోలు చేయను.
అయితే, చిన్నచిన్న వస్తువులను కొనుగోలుచేసి వాటిని వచ్చేటప్పుడు నా భార్యకు ఇచ్చే వాడిని. వాటిని ఆమె ఇంటికి తీసుకెళ్లేవారు.
మరోవైపు ప్రజలు కూడా నాకు కొన్ని బహుమతులు ఇచ్చారు. కొందరు చాలా మంచి బహుమతులు ఇచ్చారు.
నేను డేనిష్ రెడ్ క్రాస్ గుడ్‌విల్ అంబాసిడర్‌ను. కాబట్టి కొన్ని దేశాల్లోని రెడ్ క్రాస్ ప్రతినిధులను నేను కలిశాను.
వారు కాఫీ కప్పులు లాంటివి ఇచ్చేవారు.
విమానాలు ఎగురుతుంటే ఏం అనిపిస్తుంది? వాటిలో వెళ్తే మీ ప్రయాణం తేలిక అవుతుంది కదా?
కచ్చితంగా.
కొన్నిసార్లు నేను చాలా అసౌకర్యంగా అనిపించే బస్సుల్లో సుదీర్ఘంగా ప్రయాణించాల్సి వచ్చింది. విమానాలు కనిపించినప్పుడు, అసలు నేను ఏం చేస్తున్నానా అని అనిపించేది.
నా సుదీర్ఘమైన బస్సు యాత్ర 54 గంటలు. అలాంటి ప్రయాణం తర్వాత ఎంత కష్టంగా ఉంటుందో మీరు ఊహించుకోండి.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీకు ఎప్పుడైనా అలసటగా అనిపించిందా?
చాలాసార్లు.
నిజానికి 2015లో నేను డెన్మార్క్ వెళ్లిపోవాలని అనుకున్నాను.
కానీ, ఎవరూ సాధించలేనిది కొత్తగా ఏదైనా చేయాలనే కలే నన్ను ముందుకు నడిపించింది. ఆ లక్ష్యాన్ని ఎలాగైనా చేరుకోవాలని అనుకున్నాను.
మొత్తానికి మళ్లీ ఇంటికి వెళ్లేందుకు నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను.
ఇవి కూడా చదవండి:
- మనీ: యూపీఐ, ఓఎల్ఎక్స్, డెబిట్/క్రెడిట్ కార్డ్ మోసాల బారిన పడకూడదంటే ఇలా చేయాలి
- కర్ణాటక బస్సుల్లో పక్క రాష్ట్రాల మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చా?
- కొలంబియా అమెజాన్: దట్టమైన అడవిలో ఆ నలుగురు పిల్లలు 40 రోజులు ఏం తిన్నారు, ఎలా నిద్రపోయారు... అడవే వారిని కాపాడిందా?
- భారత్‌లో వందేళ్ళ కిందటే తొలి అండర్ వాటర్ మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాలని కలగన్న బ్రిటిష్ ఇంజనీర్
- వక్షోజాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకుంటే ఏమవుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)