వందే భారత్ రైళ్లలో భద్రత ఎంత? అసలివి హైస్పీడ్ రైళ్లేనా...

    • రచయిత, రోక్సి గగ్డేకర్
    • హోదా, బీబీసీ గుజరాతి, అహ్మదాబాద్

రాజధాని ఎక్స్‌ప్రెస్ నుంచి వందే భారత్, బుల్లెట్ ట్రైన్ వంటి సెమీ హైస్పీడ్ (ఎస్‌హెచ్‌ఎస్) రైళ్లు, హైస్పీడ్(హెచ్ఎస్) రైళ్ల రాకతో భారతీయ రైల్వే ముఖచిత్రం మారుతోంది.

ప్రజల జీవితాలతో మమేకమైన భారతీయ రైల్వే.. వలస కాలం నాటి రవాణా వ్యవస్థ నుంచి ఆధునిక యుగంలోకి అడుగుపెట్టిందని భారతీయులు విశ్వసిస్తున్నారు.

అయితే, గత వారం జరిగిన ఒడిశా ఘోర రైలు ప్రమాదం రైల్వే భద్రతకు సంబంధించిన చేదు అనుభవాలను గుర్తుకుతెస్తోంది.

ఒడిశా రైలు ప్రమాదం వంటి ఘటనల నేపథ్యంలో.. హైస్పీడ్ రైళ్లు నడపడానికి భారత్ సిద్ధంగా ఉందా? హైస్పీడ్ రైళ్ల లక్ష్యాన్ని భారత్ ఎలా సాధిస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

భారత్‌లో ప్రస్తుతం వందేభారత్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ వంటి సెమీ హైస్పీడ్ రైళ్లు నడుస్తున్నాయి. వేగంగా నడిచే మరికొన్ని రైళ్లలో రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, దురంతో, తేజస్, గరీబ్ రథ్, సువిధ ఎక్స్‌ప్రెస్ వంటివి ఉన్నాయి.

ప్రస్తుతం భారత్‌లో 22 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలిగే వందేభారత్ రైళ్లకు, 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. అయినా, ఆ వేగాన్ని కూడా ఇప్పటి వరకూ అవి చేరుకోలేకపోయాయి.

రానున్న రోజుల్లో వందే భారత్ వంటి సెమీ హైస్పీడ్ రైళ్లతో పాటు, అహ్మదాబాద్ - ముంబయి బుల్లెట్ ట్రైన్ వంటి రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని భారతీయ రైల్వే భావిస్తోంది.

అయితే, ఈ రైళ్లను ప్రారంభించడానికంటే ముందు సాంకేతికపరమైన అంశాలకు, సదుపాయాలకు ప్రాధాన్యం ఇచ్చి ఉండాల్సిందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

అవి హైస్పీడ్ రైళ్లేనా?

సుధాంశు మణి ఓ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి. ట్రైన్ 18 డిజైన్, అభివృద్ధి చేయడంలో మణి, ఆయన బృందం కీలకంగా వ్యవహరించింది. ఈ ట్రైన్ 18కే ఆ తర్వాత వందే భారత్‌‌ అనే పేరుపెట్టారు.

సెమీ హైస్పీడ్ రైళ్ల వేగంపై వివిధ అంశాలు ప్రభావం ఉంటుందని మణి అభిప్రాయపడ్డారు.

''కొత్త రైళ్లను తీసుకొచ్చే ముందు సిగ్నలింగ్ వ్యవస్థపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. సెమీ హైస్పీడ్ రైళ్ల విషయంలో పనిని వేగవంతం చేసే ప్రక్రియ కూడా చాలా ముఖ్యమైన అంశం'' అని ఆయన అన్నారు.

''ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి ప్రారంభించిన తొలి వందేభారత్ రైలు 96 కిలోమీటర్ల వేగంతో నడిచింది. అయితే, ఈ రైళ్ల సగటు వేగం ఇంకా తక్కువగా ఉందనేది నిజం'' అని బీబీసీతో మణి చెప్పారు.

రైల్వే ట్రాక్ సామర్థ్యం పెంచకుండా నిర్దేశిత వేగాన్ని చేరుకోవడం అంత సులువు కాదని, రైళ్ల వేగం పెరగాలంటే ట్రాక్ సామర్థ్యం పెంచడంతో పాటు కవచ్ వంటి భద్రతా వ్యవస్థలు అవసరమని ఆయన అన్నారు.

''ఇప్పుడున్న ట్రాక్స్, వనరులు 130 కిలోమీటర్ల వేగానికి సరిపోతాయి కానీ, సెమీ హైస్పీడ్ రైళ్ల వేగానికి సరిపోవు'' అని మణి చెప్పారు.

ఈ ఏప్రిల్ నాటికి దేశంలో 22 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు వందేభారత్ రైళ్లకు అనుమతులు ఉన్నప్పటికీ, అవి వాటి లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి.

వందేభారత్ రైళ్ల సగటున ఎంత వేగంతో నడుస్తున్నాయని మధ్యప్రదేశ్‌కి చెందిన ఆర్టీఐ యాక్టివిస్ట్ చంద్రశేఖర్ గవార్ అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ సమాధానమిచ్చింది. అందులో వందేభారత్ రైళ్ల సగటు వేగం 2021-22లో గంటకు 84.8 కిలోమీటర్లుగా ఉందని, 2023-23లో 81.38 కిలోమీటర్లుగా రైల్వే తెలిపింది.

అంటే, సెమీ హైస్పీడ్ రైళ్లు నడపాలనే విజన్ ఉన్నప్పటికీ, వాటి లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు.

''చాలా మంది ఈ రైళ్ల వేగం గురించి మాట్లాడుతున్నారు. కానీ, నిర్దేశిత వేగాన్ని అందుకోవడంలో అవి విఫలమయ్యాయి. దీనివల్ల వాటి సమయపాలన కూడా అంత సంతృప్తికరంగా లేదు'' అని గవార్ అన్నారు.

'కవచ్' కావాలి

సెమీ హైస్పీడ్ రైళ్లకు భద్రత కోసం కవచ్ లాంటి వ్యవస్థలు అవసరమని మణి అభిప్రాయపడ్డారు.

''కొత్త రైళ్లు ప్రారంభించడానికి నేను వ్యతిరేకం కాదు. మేము ఆ రైలుని తయారుచేశాం. ఆచరణలో కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. సెమీ హైస్పీడ్ రైళ్ల కోసం ట్రాక్‌ల సామర్థ్యం పెంచడం, ఎలాంటి అవాంతరాలు లేని అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి'' అని ఆయన అన్నారు.

అలాగే, రైల్వే శాఖకు కేటాయించిన నిధులను కూడా సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు మణి. రైల్వేకు నిధులు కేటాయించడంలో ఎలాంటి ఇబ్బందులు లేనప్పటికీ, సెమీ హైస్పీడ్ రైళ్లకు భద్రత పెంచేందుకు ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

కవచ్ వంటి వ్యవస్థను కేవలం రైళ్లలో మాత్రమే ఏర్పాటు చేస్తే సరిపోదని, ట్రాక్ పొడవునా ఏర్పాటు చేస్తేనే ప్రభావవంతంగా పనిచేస్తాయని మరో రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి మహేష్ మంగళ్ చెప్పారు.

కవచ్ వ్యవస్థను పరీక్షించడంలో మహేష్ మంగళ్ కీలకంగా వ్యవహరించారు. ఆయన రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్(ఆర్‌డీఎస్‌వో) జనరల్ మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు.

రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఈ కవచ్ వ్యవస్థను రూపొందించింది. రెండు రైళ్లు ఒకేసారి ఒకే ట్రాక్‌పై ఉన్నట్టయితే, రైలు కదులుతుందా? లేదా ఆగి ఉందా? అనేది తెలుసుకునేందుకు లోకోపైలట్‌ నుంచి సిగ్నల్ కోసం కవచ్ ఎదురుచూస్తుంది.

ఒకవేళ లోకోపైలట్ నుంచి ఎలాంటి సిగ్నల్ రాకపోతే కవచ్ వ్యవస్థ అప్రమత్తమై బ్రేక్‌ అప్లికేషన్‌ను యాక్టివేట్ చేస్తుంది. అలాగే, లోకో ఇంజిన్‌ స్టార్ట్ చేసే సమయంలో కూడా అన్ని సాంకేతిక అంశాలను స్వయంగా సమీక్షిస్తుంది.

''కవచ్ అనేది స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం. దాని ఏర్పాటుకు అయ్యే ఖర్చు కూడా తక్కువే. ఇప్పటి వరకూ కొన్ని రూట్లలో చాలా తక్కువ దూరం వరకు మాత్రమే కవచ్ అందుబాటులో ఉంది. సెమీ హైస్పీడ్ రైళ్లలో కవచ్ అమలుకు ప్రాధాన్యం ఇవ్వాలి'' అని మణి అన్నారు.

''రైల్లో కవచ్ వ్యవస్థ ఏర్పాటు చేయడంతోనే అది పనిచేస్తుందని అర్థం కాదు. కవచ్ పనిచేయాలంటే ఆ మార్గం మొత్తం ఆర్‌ఎఫ్‌ఐడీ‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్‌ఎఫ్‌ఐడీలు రికార్డ్ చేసిన డేటాను కంట్రోల్ సిస్టమ్‌కి పంపిస్తాయి. ప్రతి మిల్లీసెకండ్ డేటాను ఈ ఆర్ఎఫ్‌ఐడీలు రికార్డ్ చేస్తాయి.'' అని మహేష్ చెప్పారు.

ప్రస్తుతం కొన్ని రూట్‌లలో, కొంతభాగంలోనే ఈ ఆర్‌ఎఫ్‌ఐడీలు ఏర్పాటయ్యాయని, కవచ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేయాలంటే ప్రతి కిలోమీటర్‌కి ఈ ఆర్‌ఎఫ్‌ఐడీలు అమర్చాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

వందే భారత్ రైళ్లలో రెండు కవచ్ వ్యవస్థలు ఉన్నప్పటికీ, ట్రాక్ మొత్తం ఆర్‌ఎఫ్‌ఐడీలు అమర్చి ఉంటే మాత్రమే రైళ్లు ఢీకొనకుండా నివారిండచంతో పాటు, రైలు వేగంపై పర్యవేక్షణ సాధ్యమవుతుంది.

అయితే, ఇప్పటి వరకూ వందే భారత్ రైళ్లు నడుస్తున్న ఏ రూట్‌లోనూ ఆర్‌ఎఫ్‌ఐడీ టవర్లు లేవని మహేష్ బీబీసీకి చెప్పారు.

అన్ని రైల్వే ట్రాక్స్‌, స్టేషన్లలో ఆర్ఎఫ్‌ఐడీ పరికరాలు అమర్చాల్సిన అవసరం ఉందని, అప్పుడు మాత్రమే వందే భారత్ రైళ్లు 160 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలవని ఆయన అన్నారు.

ట్రాక్‌ల పునరుద్ధరణ

దేశంలో 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేందుకు రైల్వే ట్రాక్‌ల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ట్రాక్‌ల పునరుద్ధరణ పనులకు అవసరమైనన్ని నిధులు ఉన్నప్పటికీ ఆ విషయంలో రైల్వే శాఖ పట్టాలు తప్పిందని 2021 కాగ్ నివేదిక విమర్శించింది.

రైల్వేలో భద్రతా చర్యలు చేపట్టేందుకు 2017-18లో లక్ష కోట్ల రూపాయల కార్పస్ ఫండ్‌తో రాష్ట్రీయ రైల్ సురక్ష కోష్(ఆర్ఆర్ఎస్‌కే) ఏర్పాటైంది. ఏడాదికి 20 వేల కోట్ల రూపాయల చొప్పున, ఐదేళ్లలో ఈ నిధులు ఖర్చు చేయాలన్న లక్ష్యంతో ఆర్ఆర్ఎస్‌కేను ఏర్పాటు చేశారు.

అయితే, 2017-18లో రూ.16,091 కోట్లు, 2018-19లో రూ.18,000 కోట్లు మాత్రమే భద్రత కోసం ఆర్ఆర్ఎస్‌కే ఖర్చు చేసింది.

ఆ మరుసటి ఏడాది 2019-20లో నిర్దేశిత విభాగాల్లో తిరోగమనాన్ని కాగ్ గుర్తించింది. గతంలో 81.55 శాతం నిధులు ఖర్చు చేయగా, 2019-20 ఏడాదిలో 73.76 శాతానికి తగ్గింది.

ట్రాక్‌ల పునరుద్ధరణ పనుల కోసం 2018-19లో రూ.9,607 కోట్లు ఖర్చు చేయగా, 2019-20లో అది రూ.7417 కోట్లకు తగ్గింది. ట్రాక్‌ల పునరుద్ధరణ పనుల కోసం కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయింది రైల్వే శాఖ.

ట్రాక్‌ల పనులు జరగకపోవడం ప్రమాదాలకు కూడా కారణంగా తేలింది. 2017 నుంచి 2021 వరకూ జరిగిన మొత్తం 1127 రైలు ప్రమాదాల్లో 289 ప్రమాదాలు ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు జరగకపోవడం వల్లే జరిగినట్లు కాగ్ తేల్చింది. మొత్తం ప్రమాదాల్లో అవి 26 శాతం.

అయితే, గతంతో పోలిస్తే రైల్వేలో భద్రతా ప్రమాణాలు పెరిగినప్పటికీ మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరముందని ప్రకాష్ కుమార్ సేన్ రాయిటర్స్ వార్తా సంస్థకు చెప్పారు.

ఆయన కిరోడిమల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం హెడ్‌గా ఉన్నారు. అలాగే 2020లో ప్రచురితమైన అధ్యయనం ''భారత్‌లో రైలు ప్రమాదాలకు కారణాలు, దిద్దుబాటు చర్యలు(కాజెస్ ఆఫ్ రైల్ డీరైల్‌మెంట్ ఇన్ ఇండియా అండ్ కరెక్టివ్ మెజర్స్)'' ప్రధాన రచయితల్లో ఒకరు.

''సాధారణంగా రైలు ప్రమాదాలకు మానవ తప్పిదం లేదా ట్రాక్ నిర్వహణ లోపాలే కారణమని చెబుతుంటారు.'' అని సేన్ అన్నారు. కార్మికులపై పనిభారం ఎక్కువగా ఉంటోందని, వారికి కాలానుగుణంగా అవసరమైన శిక్షణ కూడా ఇవ్వడం లేదని ఆయన చెప్పారు. వారికి సరిగ్గా విశ్రాంతి కూడా దొరకడం లేదన్నారాయన.

అయితే, రైల్వే శాఖ వాదన మరోలా ఉంది. భద్రతపై రైల్వే శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని, కొన్నేళ్లుగా రైలు ప్రమాదాల సంఖ్య తగ్గడమే అందుకు నిదర్శనమని చెబుతోంది.

బుల్లెట్ ట్రైన్ భద్రత ఎంత?

వందేభారత్ వంటి సెమీ హైస్పీడ్ రైళ్లతో పాటు బుల్లెట్ ట్రైన్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది.

అహ్మదాబాద్‌ - ముంబయి నగరాల మధ్య గంటకు 360 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపింది.

ఈ రెండు నగరాల మధ్య నడవనున్న బుల్లెట్ ట్రైన్ కేవలం 2 గంటల 7 నిమిషాల్లోనే 508 కిలోమీటర్ల గమ్యాన్ని చేరుకోగలదని అంచనా.

ఈ బుల్లెట్ ట్రైన్ షింకాన్సెన్ టెక్నాలజీతో నడుస్తుంది. జపాన్‌లో 1960ల నుంచి ఈ టెక్నాలజీ వాడుకలో ఉంది.

నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ విడుదల చేసిన నివేదిక ''ఇండియాస్ బుల్లెట్ ట్రైన్ రైడ్, ది జర్నీ సో ఫార్'' ప్రకారం, బుల్లెట్ ట్రైన్ షింకాన్సెన్ టెక్నాలజీతో నడుస్తుంది. ఈ జపనీస్ టెక్నాలజీకి సంబంధించిన విషయాల్లో సున్నా మరణాల రేటుని ప్రముఖంగా ప్రస్తావించారు.

ఈ బుల్లెట్ ట్రైన్లలో రైళ్లు ఢీకొనకుండా ప్రత్యేక బ్రేకింగ్ మెకానిజం, స్టేషన్ల వద్ద వేగంగా వెళ్లకుండా నియంత్రించేందుకు డిజిటల్ షింకాన్సెన్ ఆటోమెటిక్ ట్రైన్ కంట్రోల్(డీఎస్-ఏటీసీ) సిస్టమ్ ఏర్పాటు చేసి ఉంటుంది.

రైలు నిర్వహణ అంతా మాన్యువల్‌ అయినప్పటికీ, సరైన సమయంలో బ్రేక్ వేయడంలో విఫలమైతే ఈ డీఎస్-ఏటీసీ సిస్టమ్ వెంటనే రైలు వేగాన్ని అదుపులోకి తీసుకొచ్చి రైలును నిలిపివేస్తుంది.

బుల్లెట్ ట్రైన్ మార్గంలో రైల్వే ట్రాక్ వెంట ఎలాంటి సిగ్నలింగ్ వ్యవస్థ ఉండదు. డ్రైవర్ క్యాబిన్‌లోనే సిగ్నల్ కూడా కనిపిస్తుంది. దానితో పాటు రైలు ఎంత వేగంతో వెళ్తుంది? ఎంత వేగంతో వెళ్లొచ్చు? అనే వివరాలు కూడా కనిపిస్తాయి.

ఒకవేళ రైలు వేగాన్ని నియంత్రించడంలో డ్రైవర్ విఫలమైతే, వెంటనే కొలిజన్ ఎవాయిడెన్స్ సిస్టమ్ అప్రమత్తమై రైలు వేగాన్ని తగ్గించి నియంత్రణలోకి తీసుకొస్తుంది.

జపాన్ బుల్లెట్ ట్రైన్ నెట్‌వర్క్‌కి సంబంధించిన ప్రభుత్వ వెబ్‌సైట్‌లోనూ ఈ టెక్నాలజీ గురించిన వివరాలు పొందుపరిచారు. భద్రతపరంగా షింకాన్సెన్ టెక్నాలజీ అత్యుత్తమమైనదిగా చెబుతున్నారు.

1964లో ఈ టెక్నాలజీ వినియోగం ప్రారంభమైనప్పుడు రైలు వేగం 210 కిలోమీటర్లు కాగా.. ఇప్పుడది 320 కిలోమీటర్లకు పెరిగింది. ఈ టెక్నాలజీ వల్ల ఇప్పటి వరకూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని నివేదికలు చెబుతున్నాయి.

అయితే, బుల్లెట్ ట్రైన్స్‌కు ఎలాంటి ప్రమాదాలు జరగవని కూడా చెప్పలేము. చైనాలోని జిఝౌ ప్రావిన్స్‌లో జరిగిన ఒక హైస్పీడ్ రైలు ప్రమాదంలో డ్రైవర్ ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు ప్రయాణికులకు గాయాలైనట్లు చైనా మీడియా సీజీటీఎన్ కథనం తెలిపింది. డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేక్ వేసినప్పటికీ ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంది.

భద్రతా చర్యల గురించి తెలుసుకునేందుకు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను బీబీసీ సంప్రదించింది. ఈ కథనం రాసే సమయం వరకూ బీబీసీ ప్రశ్నలకు ఎలాంటి జవాబు రాలేదు.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)