You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘‘క్యాథలిక్ చర్చిలో 600 మంది చిన్నారులను లైంగికంగా వేధించిన మతబోధకులు’’
- రచయిత, బ్రాండన్ డ్రేనాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో క్రైస్తవ మతబోధకులు చిన్నారులను లైంగికంగా వేధించారనే ఆరోపణలు వస్తున్నాయి.
బాల్టిమోర్ చర్చిలో గత 80 ఏళ్లలో సుమారు 600 మందికి పైగా చిన్నారులు లైంగిక వేధింపులకు గురయ్యారని, 150 మందికి పైగా మతగురువులు ఈ అఘాయిత్యాలకు పాల్పడినట్టు మేరీల్యాండ్ అటార్నీ జనరల్ ఆంతోని బ్రౌన్ విడుదల చేసిన నివేదిక తెలిపింది.
చర్చిలో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని బయట విస్తృతంగా ప్రచారం జరిగినా క్యాథలిక్ చర్చి దానిని దాచి ఉంచేందుకు ప్రయత్నించిందని ఆంతోని బ్రౌన్ తన 463 పేజీల నివేదికలో ఆరోపించారు.
2018 నుంచి ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోంది. నివేదిక వెల్లడించిన అంశాల మీద బాధితులు, ఆందోళనకారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. నిందితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాల్టిమోర్ బిషప్ విలియమ్ లోరి బాధితులకు క్షమాపణ చెప్పారు. ''చర్చి చరిత్రలో ఇది ఖండించాల్సిన విషయం'' దానిని మరచిపోలేమని, అలాగని విస్మరించలేమన్నారు. ప్రభువును ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.
లక్షల రికార్డుల సమీక్ష
దర్యాప్తులో భాగంగా 1940ల నాటి నుంచి లక్షల రికార్డులను సమీక్షించారు.
సుమారు 600 మందికి పైగా చిన్నారులను 156 మంది లైంగికంగా వేధించినట్లు తేలిందని ఆంటోని బ్రౌన్ తన నివేదికలో వెల్లడించారు. '' నిజానికి వారి సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చు'' అని ఆయన చెప్పారు.
ఒంటరి చిన్నారులే తరచూ వేధింపులకు గురైనట్లు విచారణలో తేలింది.
చర్చితో సంబంధమున్న చిన్నారులపై ఈ అఘాయిత్యాలు జరిగాయి. చర్చి సిబ్బంది, పాటలు పాడే బృందంలోని సభ్యులు, చర్చి యువజన సంఘాల కార్యక్రమాల్లో పాల్గొనేవారు, చర్చికి సంబంధించిన గృహాల్లో పనిచేసేవారు బాధితుల్లో ఉన్నట్లు నివేదిక తెలిపింది.
మతగురువులు, చర్చికి సంబంధించిన ఇతర సిబ్బంది విచ్చలవిడిగా, నిరంతరాయంగా ఈ దారుణాలకు పాల్పడ్డారని విచారణలో తేలినట్టు అటార్నీ జనరల్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు.
నిందితులను కాపాడిన 'మతాధికారులు'
చిన్నారులపై చర్చి సభ్యుల వేధింపులను బాల్టిమోర్ చర్చి ఒక పద్ధతి ప్రకారం, ఉద్దేశపూర్వకంగానే దాచి ఉంచిందని నివేదికలో ఆరోపించారు. బిషప్‌లు, చర్చి వ్యవహారాలు చూసుకునే కీలక వ్యక్తులు వేధింపులకు గురైన చిన్నారులపై కనికరం చూపించాల్సింది పోయి, వేధింపులకు గురిచేసిన వారిపైనే సానుభూతి చూపిస్తూ వచ్చారని నివేదిక తెలిపింది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న మతాధికారులను కాపాడేందుకు చర్చి కీలక వ్యక్తులు ప్రయత్నించిన అనేక సందర్భాలను కూడా నివేదికలో ప్రస్తావించారు.
వేధింపులకు పాల్పడిన వారిలో కొందరు అవే స్థానాల్లో కొనసాగుతుండగా, మరికొందరు పదోన్నతిపై ఇతర చర్చిలకు బదిలీ అయ్యారు. ఆరోపణలపై చర్చి ఆధర్యంలో జరిగిన విచారణ మతాధికారుల నేతృత్వంలో జరిగిందని, స్వతంత్ర వ్యక్తులతో విచారణ జరగలేదని నివేదిక వెల్లడించింది.
వేధింపుల ఘటనలు దిగ్భ్రాంతికి గురిచేశాయని, హృదయాన్ని ముక్కలు చేశాయని బిషప్ లోరి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
''ఈ దారుణ ఘటనలను ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాధితులకు ఈ కఠోర నిజం తెలుసు. అలాంటి దారుణాలు జరిగాయి'' అని ఆయన తెలిపారు.
ఇంకా కోపంగానే బాధితులు
బాల్టిమోర్ చర్చి బాధితురాలు జీన్ హర్గడన్ వెనర్ ఆ దారుణాలపై స్పందించారు. చర్చి పరిధిలోని క్యాథలిక్ స్కూల్‌లో ఆమె చదువుకున్నారు. మతగురువు, స్కూల్‌లో గైడెన్స్ కౌన్సెలర్ నుంచి వెనర్ లైంగిక వేధింపులను ఎదుర్కొన్నారు. తాను ఇంకా కోపంగా ఉన్నానని ఆమె చెప్పారు.
జోసెఫ్ మాస్కెల్ తనను వేధింపులకు గురిచేసినట్లు ఆమె ఆరోపించారు. మాస్కెల్ 39 మందికి పైగా చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
2001లో ఆయన చనిపోవడానికి ముందు, తనపై వచ్చిన ఆరోపణలను మాస్కెల్ కొట్టిపారేశారు. ఆయన ఎలాంటి విచారణను ఎదుర్కోలేదు.
''మేం నిజం చెప్పడానికే ఇంకా ఉన్నాం. మమ్మల్ని ఎవరూ ఆపలేరు. రోజూ ఆ దారుణం గుర్తొస్తుంది. ఇది మాకు జీవితకాలం విధించిన శిక్ష లాంటిది'' అని 1970లో సాలిస్‌బరి చర్చిలో లైంగిక వేధింపులకు గురైన మరో బాధిత వ్యక్తి కర్ట్ రప్రెష్ట్ చెప్పారు.
ఆ దారుణం సమాజం దృష్టికి, ప్రజల దృష్టికి రావడం కొంత ఉపశమనంగా అనిస్తుందని రప్రెష్ట్ స్థానిక మీడియాతో చెప్పారు.
''బాల్టిమోర్ చర్చిలో చిన్నారులపై లైంగిక వేధింపుల విషయంలో దిగ్భ్రాంతికర నిజాలు తమ దృష్టికి వచ్చాయి'' అని బాధితుల తరఫున న్యాయం కోసం పోరాడుతున్న బిషప్ అకౌంటబిలిటీ సంస్థ అధ్యక్షుడు టెరెన్స్ మెక్‌కీర్నన్ తెలిపారు.
నివేదికను బహిర్గతం చేసేందుకు అనుమతులు ఇవ్వాలని బాధితుల తరఫు న్యాయవాదులు గతేడాది కోర్టును కోరారు. గత నెల వరకూ అందుకు కోర్టు అనుమతించలేదు. అయితే, నివేదికలో మార్పులు చేసిన అనంతరం బహిర్గతం చేసేందుకు బాల్టిమోర్ న్యాయమూర్తి సమ్మతించారు.
ప్రస్తుత నివేదికలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 37 మంది పేర్లను, వారి హోదాలను వెళ్లడించలేదు. అయితే భవిష్యత్తులో వీరి పేర్లు వెల్లడించే అవకాశం ఉంది.
చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురైన వారు 38 ఏళ్లలోపు మాత్రమే ఫిర్యాదు చేయాలని ఆ తరువాత చేయడానికి లేదంటూ ఉన్న నిబంధనలను ఎత్తివేస్తూ మేరీల్యాండ్ రాష్ట్రం పోయిన నెలలో ఒక బిల్లుకు ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం ఆ బిల్లు గవర్నర్ వద్ద ఉంది. అది చట్టంగా మారితే వయసుతో సంబంధం లేకుండా ఫిర్యాదులు చేయొచ్చు.
ఇవి కూడా చదవండి
- ఇరాక్ వార్@20: సద్దాం పాలనే నయమని సర్వేలో తేల్చిన ప్రజలు
- ‘‘హిందూ మహాసముద్రంలో ఇదొక సముద్రపు శ్మశానవాటిక... కానీ శవాల లెక్క ఉండదు’’
- తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల ఫారాలు ఎందుకు మూతపడుతున్నాయి?
- 72 మంది ముస్లింలను చంపిన కేసులో ఒక్కరినీ పట్టుకోలేకపోయారా, బాధితులు ఏమన్నారు?
- సీక్రెట్ : మనం చెప్పిన అబద్ధాలే మన రహస్యాలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)