You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కేరళ-ఆపరేషన్: కడుపులో పరికరాలు వదిలేసి కుట్లు వేసిన డాక్టర్లు, ఆసుపత్రి ఎదుట మహిళ నిరసన దీక్ష
కేరళలో ఒక శస్త్రచికిత్స కారణంగా ఏళ్లుగా విపరీతమైన నొప్పిని అనుభవిస్తున్నారు ఆ మహిళ. తన పరిస్థితికి కారణమైన వైద్యులకు శిక్ష పడాలని ఆమె ఇప్పటికీ కోరుతున్నారు.
న్యాయం కోసం ఆమె చేస్తున్న పోరాటం గురించి బీబీసీ ప్రతినిధి ఇమ్రాన్ ఖురేషీ ఆమెతో మాట్లాడారు.
31 సంవత్సరాల హర్షినా గత కొన్నేళ్లుగా భరించలేని కడుపు నొప్పితో బాధను అనుభవించారు.
గతేడాది స్కాన్ చేయగా ఆమె శరీరంలో ఒక జత వైద్య పరికరాలు (ఫోర్సెప్- పట్టుకారులాంటి పరికరం) ఉన్నాయని తెలిసింది.
"ఐదేళ్లుగా నేను అనుభవించిన బాధను వర్ణించలేను" అని హర్షినా బీబీసీతో అన్నారు.
ముగ్గురు పిల్లల తల్లి అయిన హర్షినాకు ప్రతీ కాన్పులో సిజేరియన్ ఆపరేషన్లు (సి-సెక్షన్) జరిగాయి.
ఆమె 2012, 2016లలో కొళికోడ్ జిల్లా తామరస్సేరి పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు సిజేరియన్లు చేయించుకున్నారు.
2017లో కొడుకు పుట్టిన తర్వాత కొళికోడ్ జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో సి-సెక్షన్ చేయడం హర్షినాకు చివరి శస్త్రచికిత్స.
దీని తర్వాతే తనకు కడుపునొప్పి మొదలైందని హర్షినా చెప్పారు.
నొప్పి గురించి వైద్యులకు చెబితే ఏమన్నారంటే?
"నొప్పి గురించి వైద్యుల వద్ద ప్రస్తావించినపుడు, మూడో సిజేరియన్ ఆపరేషన్ జరిగినందునే అలా అవుతోందని వైద్యులన్నారు. చాలామంది మహిళలు కూడా ఇలాగే ఫిర్యాదులు చేశారని చెప్పారు" అని హర్షినా గుర్తుచేసుకున్నారు.
నొప్పి తగ్గకపోవడంతో ఆమె ఏళ్లుగా చాలా మంది వైద్యులను సంప్రదించారు. నొప్పి మూలాన్ని కనుగొనే ప్రయత్నం ఆమెపై మానసికంగానే కాకుండా ఆర్థికంగానూ ప్రభావం చూపింది.
అయితే 2022 సెప్టెంబరులో మూత్రాశయ ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన పరీక్షలు నిర్వహించినప్పుడు, సమస్య ఏమిటో ఆమెకు తెలిసింది. కడుపులో లోహంతో చేసిన వస్తువులు ఉన్నట్లు స్కాన్‌లో తేలింది.
అవి 6.1 సెం.మీ పొడవు, 5 సెం.మీ వెడల్పు కలిగిన ఒక జత ఫోర్సెప్స్ అని తేలింది. శస్త్రచికిత్సల సమయంలో రక్తస్రావం అయ్యే నాళాలను బిగించడానికి వైద్యులు వాటిని ఉపయోగిస్తారు.
ఆ పరికరాలను తొలగించేందుకు ఆమెకు మరో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.
ఈ ఘటనపై హర్షినా కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణకు కమిటీని నియమించారు.
మరోవైపు కొళికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి కూడా అంతర్గత విచారణ చేపట్టింది.
విచారణలో ఏం తేలింది?
రెండు విచారణలు చివరి దశకు వచ్చాయి. కొళికోడ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ దాని శస్త్రచికిత్స పరికరాలు ఏవీ మిస్ కాలేదని తెలిపింది.
హర్షినా తమ వద్దకు రాకముందు రెండు శస్త్రచికిత్సలు చేసుకున్నట్లు కూడా గుర్తుచేస్తోంది.
మరోవైపు ఆరోగ్య శాఖ కూడా దీనిని పరిష్కరించడంలో విఫలమైంది.
ప్రభుత్వ ప్రత్యేక విచారణ కమిటీ కూడా ఈ పరికరాల మూలాన్ని కనుక్కోలేకపోయింది.
హర్షినా శస్త్రచికిత్సలు చేయించుకున్న రెండు ఆసుపత్రులలోనూ వైద్య పరికరాల రికార్డు లేదు.
దీనిపై ఆరోగ్య శాఖ మంత్రి వీణను బీబీసీ సంప్రదించింది, కానీ స్పందన రాలేదు.
బాధ్యులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ వారం ప్రారంభంలో హర్షినా ఆసుపత్రి బయట నిరాహార దీక్షకు దిగారు.
అయితే ఆమరణ నిరాహార దీక్ష ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని, విరమించాలని గురువారం స్థానిక ప్రతిపక్ష నాయకులు ఆమెకు సర్ది చెప్పారు.
హర్షినా తన నిరాహారదీక్షను విరమించినప్పటికీ ఆసుపత్రి వెలుపల నిరసన చేస్తూనే ఉన్నారు.
"నాకు న్యాయం జరిగే వరకు ధర్నాలో కూర్చుంటాను" అని హర్షినా వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
- ఇండియా జీ20: విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశం మీద యుక్రెయిన్ యుద్ధ ప్రభావం..
- కైలాస: ఇండియా నుంచి పారిపోయిన నిత్యానంద ‘దేశం’ మీద ఐక్యరాజ్య సమితి ఏమని చెప్పింది
- త్రిపురలో మరొకసారి గెలిచిన బీజేపీ... నాగాలాండ్‌లోనూ కూటమిదే అధికారం
- తవాంగ్: ‘‘భారత సైనికుల శవాలను వీధుల్లో పడేసి వెళ్లేవారు...’’ 1962 నాటి ఇండో చైనా యుద్ధం చూసిన వారు ఏమంటున్నారు?
- కరోనావైరస్ పుట్టింది చైనాలోని వూహాన్ ల్యాబ్‌లోనే -ఎఫ్‌బీఐ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)