‘‘వినాయక చవితికి పీరియడ్స్ రక్తంతో పూజలు’’... రక్తం కోసం కోడలిని ‘చిత్రహింసలు’ పెట్టిన అత్తామామలు

    • రచయిత, మాన్సీ దేశ్‌పాండే
    • హోదా, బీబీసీ కోసం

పీరియడ్స్ సమయంలో వచ్చే రక్తం కావాలని, దాన్ని అమ్మాలని అత్తమామలు అడిగారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేశారు.

పూణెలోని విశ్రాంతవాడి పోలీస్ స్టేషన్‌లో 28 ఏళ్ల యువతి చేసిన ఫిర్యాదు దిగ్భ్రాంతి కలిగించింది.

భర్త, అత్తమామలు తనను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

2022 ఆగస్టులో తనకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ రక్తాన్ని పట్టి ఇవ్వాలని అత్తమామలు అడిగారని, అందుకు నిరాకరించడంతో బలవంతంగా కాళ్లు, చేతులు కట్టేసి నెలసరి రక్తాన్ని తీసుకున్నారని ఆమె చెప్పారు.

ఈ ఘటన మహరాష్ట్రలోని బీడ్ జిల్లాలో జరిగింది. 2023 మార్చి 7న ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆమె అత్తమామలు సహా ఏడుగురిపై కేసు నమోదుచేశారు.

విశ్రాంత్‌వాడి పోలీస్ ఇన్‌స్పెక్టర్ దత్తాత్రయ భాప్కర్ ఈ కేసు వివరాలు తెలిపారు.

"28 ఏళ్ల యువతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

2019లో సాస్వాడ్‌లో ఆమె వివాహం జరిగింది. తరువాత ఆ దంపతులు కొన్నాళ్లు చందన్‌నగర్‌లో, కొన్నాళ్లు ఫుర్సుంగిలో కాపురం పెట్టారు. అత్తమామలు తనను వేధిస్తున్నారంటూ ఆ యువతి 2021లో గృహహింస కేసు పెట్టారు.

కేసు విచారణలో ఉండగా, ఆమె భర్త, అత్తమామలు ఆమెకు నచ్చజెప్పి కేసు వెనక్కి తీసుకునేలా చేశారు. తరువాత ఆ జంట బీడ్ జిల్లాలోని కామ్‌ఖేడాలో అత్తవారింటికి వచ్చేశారు."

కామ్‌ఖేడాలోని అత్తవారింట్లో ఉన్నప్పుడే ఆమె నెలసరి రక్తాన్ని బలవంతంగా తీసుకున్న ఘటన జరిగిందని పోలీసులు చెప్పారు.

నెలసరి రక్తాన్ని రూ. 50 వేలకు అమ్మకం

"2022 ఆగస్టులో వినాయక చవితి సందర్భంగా, ఆమె బావగారు (భర్త అన్నయ్య) ఆమెను నెలసరి రక్తం ఇమ్మని అడిగారు. ఏదో పూజ కోసం నెలసరి సమయంలో వచ్చే రక్తం కావాలని చెప్పారు. అందుకు యువతి నిరాకరించారు.

'మీ భార్యను అడిగి తీసుకోండి' అని ఆమె కోపంగా బదులిచ్చారు. అయితే, ఇంకా పిల్లలు కనని మహిళ నెలసరి రక్తమే కావాలని చెప్పి, ఆమెను రక్తం ఇమ్మని వేధించారు. ఈ రక్తం అమ్మితే రూ. 50,000 వస్తాయని చెప్పారు. ఆమె ఒప్పుకోలేదు.

దాంతో, ఆమె బావగారు, మరొక బావగారు, ఇతర నిందితులు బలవంతంగా ఆమె నెలసరి రక్తాన్ని తీసుకున్నట్టు యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై గృహహింస, లైంగిక వేధింపుల కేసులు నమోదు చేశాం" అని ఇన్‌స్పెక్టర్ దత్తాత్రయ భాప్కర్ తెలిపారు.

బీడ్ జిల్లా పూణేకు సమీపంలో ఉన్నందున పూణేలో కేసు ఫైల్ చేశారని, నిందితులను ఇంకా అరెస్ట్ చేయలేదని పూణె పోలీసులు తెలిపారు.

ఈ ఘటన రాష్ట్ర మహిళా కమిషన్‌ దృష్టికి వెళ్లింది. మహిళా కమిషన్‌ ద్వారా తదుపరి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు రూపాలీ చకంకర్‌ చెప్పారు.

"ఈమధ్యే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నాం. కానీ ఇలాంటి ఘటనలు చూస్తే మహిళలు అణచివేత, దౌర్జన్యాలను వ్యతిరేకంగా ఇంకెంత పోరాడవలసి ఉందో అనిపిస్తోంది. దీనిపై కమిషన్‌ తదుపరి చర్యలు తీసుకుంటుంది. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు అంధ్‌శ్రద్ధ నిర్మూలన్ సమితి, ఇతర సామాజిక సంస్థల సహకారంతో అవగాహన కార్యక్రమాలు చేపడతాం" అని ఆమె తెలిపారు.

'మూఢనమ్మకాలను నిరోధించే చట్టాలు కఠినంగా అమలుచేయాలి..'

ఈ కేసులో తగిన చర్యలు తీసుకుంటామని మహరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శాసనసభలో తెలిపారు.

మూఢనమ్మకాలు, క్షుద్రపూజల వంటివి అరికట్టేందుకు మూఢనమ్మకాలను నిరోధించే చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని మూఢనమ్మకాల నిర్మూలన కమిటీ పేర్కొంది.

"చాలా సందర్భాలలో పోలీసులకు కూడా ఇందులో ఉన్న వైపరీత్యం, ఆంతర్యం అర్థం కావట్లేదు. వాళ్లు కేసులను సీరియస్‌గా తీసుకోరు. అప్పుడు బాధితులు సామాజిక సంస్థలను ఆశ్రయించాల్సి వస్తోంది. అందుకే, పోలీసులకు కూడా తగిన శిక్షణ ఇవ్వాలి" అని మూఢనమ్మకాల నిర్మూలన కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, రాష్ట్ర బువాబాజీ సంఘర్ష్ శాఖ ఉనంతాధికారి నందిని జాదవ్ అన్నారు.

"మూడనమ్మకాల నిరోధక చట్టం వచ్చి పదేళ్లు అవుతోంది. ఇప్పటివరకు, నిబంధనలు ఖరారు చేయలేదు. ఒక కమిటీని మాత్రమే ఏర్పాటుచేశారు. దీనికొచ్చే నిధులు ఏమవుతున్నాయి? చట్టం వచ్చి ఏం లాభం? ఇలాంటి కేసులు ఈమధ్య బాగా పెరుగుతున్నాయి. ఇది గృహహింసను మరింత ఉధృతం చేస్తోంది. చదువుకున్నవారు కూడా మూఢనమ్మకాల బారిన పడుతున్నారు. మహిళలే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన కేసులూ బయటికొచ్చాయి. ఇదిలాగే కొనసాగితే, సమాజం ఎలా ముందుకు వెళుతుంది?" అని నందిని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి: