You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి: కొత్తగా తీసిన పాత కథ.. విశ్వక్‌సేన్ నటన మెప్పించిందా?
- రచయిత, శృంగవరపు రచన
- హోదా, బీబీసీ కోసం
వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చే నటుడు విశ్వక్ సేన్. ఆయన నటించిన తాజా సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.’
పేదవాడు ధనవంతుడయ్యే కథలు, ఒక ప్రాంతం కేంద్రంగా ఉండే పగలు-ప్రతీకారాల ఆధారంగా ఎన్నో కథలు ఇప్పటికే సినిమాలుగా వచ్చేశాయి. ఈ రెండింటిని కలిపి తీసిన సినిమానే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.’
గోదావరిలో ఒక పల్లెటూరు. దాన్ని లంక అంటారు. కత్తి కడితే ఎవరినైనా చంపడం లంకలో ఉన్న ఆచారం. ఆ పల్లెలో ఊహ వచ్చేసరికే తల్లిని, తర్వాత తండ్రిని పోగొట్టుకున్న రత్నాకర్ కథ ఈ సినిమా.
ఎవరి మీదా నమ్మకం లేకుండా,కేవలం అవసరాలకే మనుషులను వాడుకోవడం రత్నాకర్ నైజం. అటువంటి రత్నాకర్ డబ్బు, అధికారం కోసం ఎంత వరకు వెళ్లాడన్నది ఈ కథలో ఒక కోణం అయితే , ఈ కత్తి కట్టే ఆచారం రత్నాకర్‌తో ఎలా ముగిసిపోయింది, దాని కోసం రత్నాకర్ ఏం చేశాడనేది చెప్పడం రెండో కోణం.
కొంత మొరటుగా ప్రవర్తించే రత్నాకర్‌ను ఆ ఊరి రాజకీయ నాయకుడి కూతురు ఎందుకు ప్రేమించింది? ఆమె తండ్రి రత్నాకర్ చేతుల్లో ఎందుకు చనిపోయాడు? రత్నాకర్ తన సొంత గ్యాంగ్‌లో ఉన్న మిత్రులను, వారి పిల్లలను ఎందుకు చంపాలనుకున్నాడు? భార్యకు ఇచ్చిన మాటను తప్పి ఇంకో హత్య ఎందుకు చేశాడు? అసలు రత్నాకర్ ఇలా ఎందుకు తయారయ్యాడు? చివరికి అతనిలో మార్పు వచ్చిందా? లేదా? అన్నదే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కథ.
సాగతీతలు లేవు కానీ..
ఈ సినిమా కథలో ఎక్కడ సాగతీతలు లేవు. కథ వేగంగానే ముందుకు నడుస్తుంది. కానీ ఇప్పటికే ఈ తరహా కథలు అనేకం రావడం వల్ల పాత చింతకాయ పచ్చడిని కొత్త జాడిలో పెట్టినట్టు అనిపిస్తుంది,
రత్నాకర్ పాత్రలో విశ్వక్‌సేన్ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్.
డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్,మాస్ స్టైల్ లో, పాత్రకు తగినట్టు ఎమోషన్స్ పలికించడంలోనూ విశ్వక్ సేన్ విజయం సాధించాడు.
రత్న పాత్రలో అంజలి నటన సినిమాకు బలమైంది.
ఈ సినిమాలో ఉన్న మూడు పాటలు సినిమాకు ప్లస్ పాయింట్స్. రెండు పాటల్లో విశ్వక్ సేన్ డ్యాన్స్ కూడా గొప్ప ఆకర్షణ.
పేదరికం, నిరక్షరాస్యత, పగలు-ప్రతీకారాలతో రగిలే మనుషుల పాత్రలను చిత్రించడంలో దర్శకుడు కృష్ణ చైతన్య తీసుకున్న జాగ్రత్త సినిమాకు మరో ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
అక్కడి నుంచి మారిపోయింది
ఫస్ట్ హాఫ్ వరకు బావుందనే ఫీల్ కలిగించే ఈ సినిమా సెకండ్ హాఫ్ లో మామూలుగా మారిపోతుంది.
అనేక సన్నివేశాలు, సందర్భాలు జోడించడంతో కథలో ముఖ్య పాత్రల స్క్రీన్ టైమ్ తగ్గిపోయింది.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్రతో ప్రేమ-పెళ్లి కూడా అసహజంగా అనిపిస్తుంది.
గ్యాంగ్స్ కేంద్రంగా వచ్చే సినిమాల్లో ఎత్తులు, పైఎత్తులు ఎంతో ఉత్కంఠను కలిగిస్తాయి.
ఈ కథలో రత్నాకర్ తెలివైన వాడు. కానీ ఈ తెలివి అతను ఎదిగే వరకే కథలో కనిపిస్తుంది. తర్వాత కేవలం ఆవేశపూరిత పాత్రగా మారిపోతుంది. అది ‘హీరోయిజం ఫ్యాక్టర్’ ని నిలబెట్టినా, కథను కొంత తేలిపోయేలా చేసింది.
సాయి కుమార్, నాజర్ నటన పరిమితమైనట్టు అనిపిస్తుంది.
ఈ కథలో సాగతీత లేకపోయినా, చాలా సన్నివేశాల్లో ప్రేక్షకులకు ‘ఎమోషనల్ స్పేస్’ కూడా లేనంత వేగంగా కథ ముందుకు సాగిపోతుంది.
అదే మైనస్
మాస్ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువ ఉండాలనేది కమర్షియల్ సినిమా సూత్రమే అయినా, అది కథను పక్క దారి పట్టించేలా ఉండకూడదు.
ఈ సినిమాలో ‘కత్తి కట్టే ఆచారం’ గురించిన కథ లోతుగా లేకపోవడం, ఓ గ్యాంగ్ కు ఉండే ప్రత్యేక శైలి లేకపోవడం మైనస్ పాయింట్స్.
అక్కడక్కడ ఫోటోగ్రఫీ కూడా బాగోలేదు.
తీవ్రమైన ఉద్వేగాలున్న రత్నాకర్ తన గురించి మాత్రమే ఆలోచించుకునే తత్వం నుండి జరిగే ట్రాన్సిషన్ ను చూపించడంలో స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ కావడం సినిమాను బలహీనపరిచింది.
కథలో జాగ్రత్త తీసుకోవడంతో పాటు స్క్రీన్ ప్లే దశలో కథలో ఉండే బలమైన ఎమోషన్స్ ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అవుతాయో లేదో అనే గ్రహింపు సినిమా సక్సెస్‌ను నిర్ణయిస్తుంది.
ఆ గ్రహింపులో గురి తప్పిన సినిమానే ఈ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.’
(గమనిక: అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- ‘ఒక కూతురు నుంచి ఇలాంటి మాటలు వినడం అసాధారణంగా అనిపిస్తుంది...’
- స్కూటీ అంటే అమ్మాయి, బైక్ అంటే అబ్బాయి...హైదరాబాద్‌లో పిల్లల విక్రయ ముఠా గుట్టు ఎలా బయటపడిందంటే...
- టీ20 వరల్డ్‌కప్: ఆస్ట్రేలియా నుంచి అమెరికాకు పిచ్ తరలింపు, ఎలా సాధ్యమైంది?
- స్టార్మీ డేనియల్స్: డోనల్డ్ ట్రంప్ దోషిగా తేలిన ‘హష్ మనీ’ కేసులో కీలక వ్యక్తి అయిన ఈ మహిళ ఏం చెప్పారు?
- ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా, గత అనుభవాలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)