You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కృష్ణమ్మ’ మూవీ రివ్యూ: ఇంకాస్త ఘాటుగా ఉంటే బావుండేది!
- రచయిత, శృంగవరపు రచన
- హోదా, బీబీసీ కోసం
ప్రొఫెషనల్ టచ్ యాక్టింగ్ స్టైల్‌తో సినిమాల్లో దూసుకుపోతున్న నటుడు సత్యదేవ్. ఇప్పటివరకు క్లాసీ స్టైల్‌లో ఇమిడిపోయిన సత్యదేవ్ ఒక్కసారిగా మాస్ స్టైల్‌లో విజృంభించిన సినిమానే ‘కృష్ణమ్మ.’
ఆయేషా హత్య కేసు నుంచి కొంత ప్రేరణతో, అదే నేపథ్యంలో ‘ఫేక్ ఎన్ కౌంటర్స్‘ గురించి కూడా చెప్తూ, మాస్ అప్పీల్ ఉండేలా తీసిన సినిమానే ‘కృష్ణమ్మ.’
ముగ్గురు అనాథల జీవితాల చుట్టూ తిరిగే కథ ఇది. సత్యదేవ్ మొదటిసారి మాస్ అప్పీల్‌లో రస్టిక్‌గా, తన కళ్ళతో భావోద్వేగాలు పలికించి ఈ పాత్రలో ఇమిడిపోయారు. బెజవాడ కృష్ణమ్మ, అక్కడి మనుషులు, అలాగే పేదరికం, అనాథ జీవితాలు, చిన్న చిన్న నేరాలు చేసే వారిని ఎలా పెద్ద వాటిల్లో ఎలా ఇరికిస్తారో చెప్పే కథ ఇది.
ఊహించని పరిస్థితుల్లో ఈ ముగ్గురు అనాథలు తాము చేయని నేరాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. కానీ, అది ఓ మహిళను అత్యాచారం చేసి హత్య చేసిన నేరం. ఆ నేరం ఏంటో తెలియకుండా వారు ఎందుకు ఒప్పుకున్నారు? ఆ అమ్మాయి ఎవరు? ముగ్గురు మిత్రుల మీద వేసిన ఆ కేసులో ఎందుకు ఇద్దరే మిగిలారు? అన్నదే ఈ సినిమా కథ.
ఈ సినిమాలో ముగ్గురు యువకుల స్నేహాన్ని చాలా గొప్పగా చూపించే ప్రయత్నం చేసినా, ఇంటర్వెల్ వరకు కూడా సాగతీత ఎక్కువ ఉండటం వల్ల కొంత పేలవంగా ఉంది.
ఇలాంటి కథలు ఇప్పటికే సినిమాలుగా వచ్చినా, కొంత ఎమోషనల్ ట్రాక్, క్రైమ్ ట్రాక్ కలిసినప్పుడు తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో కొంత ఆయేషా హత్య కేసు ప్రేరణ ఉన్న ఛాయలు కనిపిస్తాయి. కానీ అది ఈ సినిమాకు బలంగా మారలేదు.
ఈ పాత్రలు మన మధ్యే తచ్చాడుతున్నట్టు, వారి గురించి మనం ఎప్పుడో ఓసారి వార్తల్లోనో లేక ఎక్కడో విన్నామన్న జ్ఞాపకం మాత్రం ప్రేక్షకులకు తప్పకుండా వస్తుంది. ఇలా అనిపించడం వల్ల ఏం జరుగుతుందో కొంత అభిప్రాయం ప్రేక్షకులకు ఏర్పడిపోతుంది కూడా.
ఇలాంటి కథల్లో ఆ ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా సినిమా ఉంటేనే కథ చప్పబడకుండా ఉంటుంది. ఇక్కడే ‘కృష్ణమ్మ’ చతికిలబడింది. ఇలాంటి క్రైమ్ కథల్లో ఊహించని మలుపులు లేకపోతే కథ ఆసక్తికరంగా అనిపించదు.
సాగతీత, ఎమోషనల్ ట్రాక్‌ను ఎస్టాబ్లిష్ చేసే బలమైన సంఘటనలు పడకపోవడం వల్ల మొదటి సగ భాగం అంతా కూడా కథ బాగున్నా, సాగదీస్తున్నట్లే అనిపిస్తుంది.
సత్యదేవ్ అన్ని సినిమాల తరహాలోనే ఈ సినిమాలో కూడా హీరోకు కాకుండా కథకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తుంది. కథతో పాటు నాయకుడు నడుస్తాడు తప్ప, కథను పక్కకు తోసి అతను ముందుకు వెళ్ళడు.
భాష ,ఆహార్యం అన్నీ కూడా సత్యదేవ్‌ను ఈ సినిమాకు గొప్ప బలంగా మారేలా చేశాయి. మాస్ సినిమాల్లో సాధారణంగా ఉండే మసాలా ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో కనిపించవు.
‘కోటి’ పాత్రలో నటించిన లక్ష్మణ్ మీసాల, శివ పాత్రలో లక్ష్మణ్ బురుగుల పాత్రలకు న్యాయం చేసేలా నటించారు. సహనటుల నటన, సత్యదేవ్ మాస్ అప్పీల్‌లో ఇమిడిపోవడం,ఈ సినిమాలోని రెండు పాటలు కథకు బలాన్నిచ్చేలా ఉండటం మాత్రం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్.
కొన్ని నియమ నిబంధనలతో నడిచే ప్రజాస్వామ్య సమాజంలో ఆటవిక న్యాయం పుట్టే పరిస్థితుల గురించి ఎంత వివరంగా చూపించాలో, ఆ వివరాలు ఉండేలా నేపథ్యాన్ని నిర్మించడంలో పూర్తిగా కాకపోయినా కొంతమేరకు విజయం సాధించిన కథ ఇది.
సాధారణంగా పౌరులు నేరస్థులుగా ఇరుక్కునే కథల్లో ఎన్నో మలుపులు ఉంటాయి. ఆ మలుపులు ఎక్కువ లేకుండానే కథ ముగిసిపోవడం కూడా ఈ సినిమాకు ఒక మైనస్.
అలాగే ఫార్ములా ఫ్రేమ్‌లో వెళ్ళే కథను ఎమోషనల్ టర్న్ తీసుకునే సమయంలో క్రైమ్ కార్నర్ వైపు నడిపించడం ప్రేక్షకులను గందరగోళం చేస్తుంది. ఈ గందరగోళంలో సినిమాలో సగం సమయం మాస్ అప్పీల్,యాక్షన్ అప్పీల్ మాయమైపోయి కథను నిస్సారమయ్యేలా చేశాయి.
సినిమా దర్శకత్వ విషయానికి వస్తే కనెక్టింగ్ ఎలిమెంట్స్ అద్భుతంగా ఉన్నాయి. కానీ, సినిమాటోగ్రఫీ తేలిపోయినట్టు ఉండటం, ‘మాస్ అపీజ్ మెంట్ ఫ్యాక్టర్’ కు తగ్గ యాక్షన్ సీక్వెన్స్ లేకపోవడం సినిమాకు గొప్ప లోటుగా అనిపిస్తాయి.
ఎంత మామూలు కథ అయినా, ప్రతీ మనిషి జీవితంలో ఎన్నో కొన్ని తెలియని విషయాలు ఉంటాయి.
కథ లైన్ ప్రేక్షకులకు అర్థమైతే పర్లేదు కానీ, కథలో ప్రతి సీను చాలా మామూలుగా అనిపించడం వల్ల కథ తేలిపోయింది. క్రైమ్ ఎలిమెంట్ అన్నది పాత్రల పట్ల జాలి కలిగించడానికి పెట్టినా, అది కృత్రిమంగా ఉన్నట్టే అనిపిస్తుంది.
సత్యదేవ్ కోసం తప్ప కథ కోసం సినిమాలో సగం దాకా ప్రేక్షకులను నిలిపే అంశాలు లేవు. అతనొక్కడే ఈ సినిమాను మోసినట్టు అనిపిస్తుంది. ఈ ముగ్గురి మిత్రుల స్నేహాన్ని బాగా చెప్పే సంఘటనలు తక్కువ, అలాగే అనాథ జీవితం నుంచి కుటుంబం ఏర్పడిన ఆశను బలంగా కథలో ఉండేలా జాగ్రత్త తీసుకోలేదు.
అందుకే ఈ సినిమా చూస్తున్నంత సేపు కథ బాగుంది అనిపిస్తుంది కానీ బలంగా ఉందని అనిపించదు.
కథ బావుండటం సినిమా కథా నిర్మాణంలో మొదటి దశ అయితే, ఆ కథ పేలవంగా మారకుండా చూసుకోవడం రెండవ దశ. మొదటి దశలో విజయం సాధించిన ‘కృష్ణమ్మ’ రెండో దశలో మాత్రం ఫెయిల్ అయ్యింది.
అందుకే ‘రేప్ అండ్ మర్డర్’లాంటి సున్నితమైన, బాధ కలిగించే ఎమోషనల్ నేపథ్యం కూడా ఈ సినిమాకు అసెట్ కాలేకపోయింది.
‘కృష్ణమ్మ’లాంటి పవర్ ఫుల్ టైటిల్‌కి అటూ పూర్తిగా మాస్, లేకపోతే ఇటూ పూర్తిగా రివెంజ్ యాక్షన్, లేకపోతే ఎమోషనల్ స్టోరీగా నడిచినా బావుండేదేమో. కానీ ఈ మూడు కలిసి కలగాపులగం అయ్యి, ఒక యావరేజ్ మార్క్ సినిమా కోవలోనే ఈ ‘కృష్ణమ్మ’ నిలిచిపోయింది.
(గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- హెచ్డి దేవేగౌడ: అన్నం లేక పస్తులున్న రోజుల నుంచి ప్రధానమంత్రి పదవి దాకా.
- దక్షిణ కొరియా: ప్రెప్పర్లు ఎవరు, ఉత్తర కొరియాతో యుద్ధం భయంతో ఎందుకు అన్నీ సర్దుకుంటున్నారు?
- లోక్‌సభ ఎన్నికలు: ఒకనాడు 400కు పైగా స్థానాలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 300 స్థానాలలో మాత్రమే ఎందుకు పోటీ చేస్తోంది?
- 4.7 కోట్ల ఏళ్లనాటి వాసుకి పాము అవశేషాలు వెలుగులోకి.. అసలేంటి ఈ పాము కథ?
- అడాల్ఫ్ హిట్లర్ కోసం ఆ మహిళలు కన్న వేలమంది ‘ఆర్య పుత్రులు’ ఏమయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)