You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. 29 మంది మావోయిస్టులు మృతి
ఛోటేబేథియా పోలీసు స్టేషన్ పరిధిలోని బినగుండా-కోరగుట్టా అడవుల్లో మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయని పోలీసులు చెప్పారు.
లైవ్ కవరేజీ
లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. 29 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు చనిపోయారని అధికారులు తెలిపారు.
ఈ ఎన్‌కౌంటర్ ఘటనలో ముగ్గుర భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయని చెప్పారు.
‘‘2024 ఏప్రిల్ 16న కాంకేర్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు(డీఆర్‌జీ), బీఎస్‌ఎఫ్ కలిసి ఛోటేబేథియా పోలీసు స్టేషన్ పరిధిలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి’’ అని పోలీసులు తెలిపారు.
మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో, ఛోటేబేథియా పోలీసు స్టేషన్ పరిధిలోని బినగుండా-కోరగుట్టా అడవుల్లో మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయని చెప్పారు.
ఈ ఎన్‌కౌంటర్ తర్వాత, 29 మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఏకే 47 రైఫిల్స్‌ను, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎలక్టోరల్ బాండ్ల గురించి ప్రధాని మోదీ ఏం చెప్పారు? రాహుల్ గాంధీ ఏమన్నారు?
చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా పనిచేసిన ఏకైక మహిళ తెలుగువారే
ఇరాన్‌పై కొత్త ఆంక్షలు విధించాలని ఇజ్రాయెల్ డిమాండ్, గార్డన్ కొరేరా, సెక్యూరిటీ కరస్పాండెంట్
ఇరాన్‌పై సైనికంగా ఇజ్రాయెల్ ఎలా స్పందించబోతోందోనని అందరూ ఎదురుచూస్తున్న సమయంలో.. దౌత్య పరంగానూ ఇజ్రాయెల్ ముందుకు వెళ్తోంది.
ఇరాన్‌పై మరింత ఒత్తిడి చేసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది.
ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధించాలని 32 దేశాలకు లేఖలు రాసినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి వెల్లడించారు. ఇరాన్ క్షిపణుల తయారీని అడ్డుకునేందుకు మరిన్ని ఆంక్షలు అవసరమని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఇరాన్‌తో అణు ఒప్పందం చర్చల నడుమ గతంలో విధించిన కొన్ని ఆంక్షలకు గత అక్టోబరులో కాలం చెల్లింది. అయితే, అమెరికా, బ్రిటన్, కొన్ని ఈయూ దేశాలు దీనికి అదనంగా కొన్ని ఆంక్షలు అమలు చేస్తున్నాయి.
ఇస్లామిక్ రివొల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ)ని టెర్రరిస్టు సంస్థగా గుర్తించాలని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి పిలుపునిస్తున్నారు.
అయితే, ఇప్పటికే అమెరికా ఐఆర్‌జీసీని టెర్రరిస్టు సంస్థగా గుర్తించింది. కానీ, బ్రిటన్‌తోపాటు చాలా దేశాలు ఇంకా చర్యలు తీసుకోలేదు.
యూపీఎస్సీ: సివిల్స్‌లో అనన్య రెడ్డికి మూడో ర్యాంకు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 ఫలితాలు విడుదలయ్యాయి.
ఆదిత్య శ్రీవాస్తవ మొదటి ర్యాంకు దక్కించుకోగా, అనిమేష్ ప్రధాన్‌కు రెండో ర్యాంకు, డీ అనన్యా రెడ్డికి మూడో ర్యాంకు వచ్చాయి.
అనన్య రెడ్డిది తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా. దిల్లీలోని మెరండా హౌస్ కాలేజీ నుంచి ఆమె డిగ్రీని పూర్తి చేశారు.
డిగ్రీ పూర్తయిన తర్వాత ఆమె సివిల్ సర్వీస్ పరీక్షల కోసం సన్నద్ధం కావడం మొదలుపెట్టారు. క్రికెట్ అంటే తనకు ఆసక్తి అని, విద్యార్థులకు మెంటర్‌గా వ్యవహరించడం అంటే కూడా ఇష్టమని ఆమె అన్అకాడమీ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.
ఈ ఏడాది మొత్తంగా 1016 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) సహా ఇతర అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల్లో చేరనున్నారు.
సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్ష 2023 మే 28న నిర్వహించారు. మెయిన్స్ అనంతరం ఇంటర్వ్యూలు ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య నిర్వహించారు.
శిరోముండనం కేసులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకి 18 నెలల జైలు శిక్ష
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, ప్రస్తుతం మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆపార్టీ అభ్యర్థిగా ఉన్న తోట త్రిమూర్తులును 28 ఏళ్ల క్రితం నాటి వెంకటాయపాలెం శిరోముండనం కేసులో దోషిగా కోర్టు తేల్చింది.
ఎస్సీ వర్గానికి చెందిన ఇద్దరికి శిరోముండనం చేసిన కేసులో ఆయనకు 18 నెలల జైలుశిక్ష, రూ. 2 లక్షల జరిమానా కూడా విధించింది.
విశాఖలోని ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక ప్రత్యేక కోర్టులో సుదీర్ఘకాలం పాటు సాగిన విచారణలో ఎట్టకేలకు తీర్పు వెలువడింది.
ఈ కేసులో తోట త్రిమూర్తులు ఏ1గా ఉన్నారు. మరో 8 మంది నిందితుల మీద కేసు విచారణ సాగింది.
1994 ఎన్నికల్లో తోట త్రిమూర్తులు టీడీపీ రెబల్ అభ్యర్థిగా ఇండిపెండెంట్‌గా గెలిచారు. ఆ ఎన్నికల్లో బీఎస్పీ తరుపున ఎన్నికల ప్రచారం చేసిన కోటి చిన నూకరాజు, ఆయన సోదరులకు కలిపి వెంకటాయపాలెం 1996 డిసెంబర్ 29న శిరోముండనం చేశారు.
అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న తోట త్రిమూర్తులు స్వగ్రామంలోనే ఈఘటన జరిగింది. ఆయన మీద ఆరోపణలు రావడంతో అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.
28 ఏళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగింది. కేసులో బాధితులు ముగ్గురు మరణించారు. ప్రధాన సాక్షి కోటి రాజు సహా పలువురు మృతి చెందారు.
ఈ కేసు విచారణ 3 కోర్టుల్లో సాగింది. ఎట్టకేలకు నిందితులపై అభియోగాలు రుజువుకావడంతో కోర్టు శిక్షను ఖరారు చేసింది. తీర్పు పట్ల బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పతంజలి ప్రకటన వివాదం కేసు ఏప్రిల్ 23కు వాయిదా
పతంజలి ప్రకటనపై వివాదం కేసు విచారణను ఏప్రిల్ 23కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పేందుకు యోగా గురు రామ్‌దేవ్ సిద్ధంగా ఉన్నారని సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీ మంగళవారం చెప్పారు.
ఈ విషయంలో రామ్‌దేవ్, పతంజలి ఆయుర్వేద్ మేనిజింగ్ డైరెక్టర్ బాలకృష్ణ ఏం చెప్పాలని అనుకుంటున్నారో తెలుసుకోవాలని భావిస్తున్నట్లు జస్టిస్ హిమా కోహ్లీ చెప్పారు.
అయితే, మధ్యలో కొంతసేపు ఆడియోలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనిపై కోర్టు స్పందిస్తూ.. మేం ఎలాంటి సెన్సర్ చేయలేదని అన్నారు.
ఆ తర్వాత విచారణను ఏప్రిల్ 23కు వాయిదా వేశారు. అప్పుడు కూడా యోగా గురు రామ్‌దేవ్‌తోపాటు బాలకృష్ణ విచారణకు హాజరుకావాలని కోర్టు సూచించింది.
దీనికి ముందుగా బేషరతుగా క్షమాపణలు చెబుతూ దాఖలుచేసిన అఫిడవిట్లను స్వీకరించేందుకు కోర్టు నిరాకరించింది. తప్పు చేసి దొరికిపోయిన తర్వాతే, వీరు క్షమాపణలు చెబుతున్నారని కోర్టు వ్యాఖ్యలు చేసింది.
సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కేసు: గుజరాత్‌లో ఇద్దరు అనుమానితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులకు సంబంధించిన కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఆ ఇద్దరినీ గుజరాత్‌లో అరెస్టు చేసినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.
సల్మాన్ ఇంటి వద్ద ఏప్రిల్ 14న జరిగిన కాల్పులకు సంబంధించిన ఈ కేసును ముంబయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆ ఇద్దరు నిందితులను గుజరాత్‌లోని భుజ్‌లో క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసిందని, వారిని ముంబయికి తీసుకొస్తారని ముంబయి పోలీసులు చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
మరోవైపు పశ్చిమ కచ్ పోలీసులు కూడా ఈ అంశంపై ఒక ప్రకటన విడుదల చేశారు. సల్మాన్ ఇంటి వద్ద కాల్పులకు సంబంధించి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసినట్లు దానిలో పేర్కొన్నారు.
ఆ ఇద్దరు అనుమానితుల పేర్లు విక్కీ గుప్తా, సాగర్ పాల్ అని ఆ ప్రకటనలో తెలిపారు.
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ఈ పేజీని ప్రచురిస్తోంది.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌పై చేయండి.