You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వాసుకి ఇండికస్: 4.7 కోట్ల ఏళ్ల నాటి అత్యంత పొడవైన ఈ పాము కథ ఏంటంటే..
- రచయిత, టీమ్ కలెక్టివ్ న్యూస్‌రూమ్
- హోదా, న్యూ దిల్లీ
గుజరాత్‌లోని కచ్ జిల్లా పంధారో ప్రాంతం.
ఇక్కడున్న ఒక లిగ్నైట్ గని నుంచి సేకరించిన కొన్ని శిలాజాలపై పురాతత్వ శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టినప్పుడు, వారికి ఒక శిలాజం దొరికింది.
అది ప్రపంచంలో ఇప్పటివరకూ వెలుగుచూసిన పాముల్లో అత్యంత పొడవైన పాము శిలాజం.
ఆ పాము పొడవు 10 నుంచి 15 మీటర్లు ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది 4.7 కోట్ల ఏళ్లనాటిదని భావిస్తున్నారు.
ఈ పాము జాతికి ‘వాసుకి ఇండికస్’ అనే పేరు పెట్టారు.
పరిశోధనలో ఏం బయటపడింది?
ఐఐటీ రూర్కీ ప్రొఫెసర్లు సునిల్ వాజ్‌పేయీ, దేబ్‌జీత్ దత్తా ఈ శిలాజాన్ని గుర్తించినట్లు హిందుస్థాన్ టైమ్స్‌లో ఒక కథనం ప్రచురించారు. దీనిపై ‘నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్’లో ఒక కథనం కూడా ప్రచురితమైంది.
పురాణాలను పరిశీలిస్తే, ఈ పేరును శివుడితో సంబంధమున్న పాము గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తుంటారు.
మాడ్సోయిడే జాతిపై 2018లో రాయల్ సొసైటీ ఆఫ్ ఓపెన్ సైన్సెస్‌లో ఒక కథనం ప్రచురితమైంది.
దీని ప్రకారం, మాడ్సోయిడే జాతి అనేది భూమిపై కనిపించే గోండ్వానా ‘ఘోస్ట్ స్నేక్’.
ఈ జాతి పాములు క్రెటేషియస్ కాలం (సుమారు 6.6 నుంచి 10.5 కోట్ల ఏళ్లకు పూర్వం) నుంచి లేట్ ప్లీస్టోసీన్ కాలం (సుమారు 0.12 కోట్ల ఏళ్ల క్రితం) మధ్య జీవించినట్లు అంచనా.
పాముల పరిణామక్రమాన్ని అర్థం చేసుకోవడంలో ఈ జాతి పాములపై అధ్యయనం చాలా ముఖ్యమైనది.
మాడ్సోయిడే జాతికి చెందిన ఈ సర్పాలు.. పాముల్లోనే అతిపెద్దవి. 4.7 కోట్ల ఏళ్ల క్రితం ప్రస్తుతం భారత్ ఉన్న ప్రాంతంలో ఇవి జీవించేవి.
‘‘ఆ కాలంలో ఉష్ణమండల ప్రాంతాల్లో విపరీతమైన ఉష్ణోగ్రతల వల్లే ఆ పాముల పరిమాణం అంత పెద్దగా ఉండొచ్చు’’ అని పరిశోధనా పత్రంలో రాశారు.
ఇప్పటివరకూ లభించిన 27 భిన్నమైన శిలాజల విశ్లేషణ అనంతరం.. ఇది చాలా పెద్ద పామని తేలింది.
దాని శరీరం మొత్తం పొడవైన గొట్టం మాదిరిగా కనిపించొచ్చు.
ఆ పాము పొడవు 10.9 మీటర్ల నుంచి 15.2 మీటర్ల వరకూ ఉండొచ్చు. ప్రస్తుత ఆగ్నేయాసియా అంటే ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లో కనిపించే ‘రెటిక్యులేటెడ్ పైథాన్’ అనేది భూమిపై జీవించి వుండే పాముల్లో అత్యంత పొడవైనవి.
అయితే, వీటి పొడవు 6.25 మీటర్లు. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన పాము శిలాజం దీని కంటే చాలా పెద్దది.
1912లో 10 మీటర్ల పొడవున్న పాముకు ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు లభించింది. అది ఒక గ్రీన్ అనకొండ. వీటిలో ఆడ పాములు మగ జాతి పాముల కంటే పొడుగ్గా ఉంటాయి.
సాధారణంగా ఇలాంటి పాములు వెచ్చని వాతావరణంలో కనిపిస్తాయి.
అవశేషాలు ఎలా దొరికాయి?
‘వాసుకి ఇండికస్’ పాము శిలాజాలు తొలిసారి 2005లో ప్రొఫెసర్ సునిల్ వాజ్‌పేయీ గుర్తించారు. కచ్‌లో పంధారో బొగ్గు గని పరిసరాల్లో ఇవి బయటపడ్డాయి.
మొదట్లో ఈ అవశేషాలు మొసలి శిలజాలు కావచ్చని భావించారు. అయితే, 2022 వరకూ సునిల్ ప్రయోగశాలలోనే ఈ శిలాజాలు అలానే ఉండిపోయాయి. ఆ తర్వాత దేబ్‌జీత్ దత్తా పరిశోధన కొనసాగించడంతో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగుచూశాయి.
అప్పుడే ఈ శిలాజం సాధారణ మొసలిది కాదని, వేరే జాతి జీవిదై ఉంటుందనే అవగాహనకు ఇద్దరు ప్రొఫెసర్లూ వచ్చారు.
‘‘ఈ శిలాజాలు 2005లోనే దొరికాయి. కానీ, కొన్నాళ్ల తర్వాత వీటిపై పరిశోధన పక్కనపెట్టేసి, వేరే వాటిపై దృష్టి సారించాం. మళ్లీ 2022లో పరిశోధన కొనసాగించాం. మొదట్లో ఇదొక మొసలి శిలాజమని భావించాం. ఎందుకంటే భారీ స్థాయిలో శిలాజం ఉండటమే దీనికి కారణం. కానీ, తర్వాత విశ్లేషణలో ఇదొక పాము శిలాజమని తేలింది’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో సునిల్ వాజ్‌పేయీ చెప్పారు.
వాసుకి పరిమాణం పెద్దగా ఉండటంతో ఇది ఇతర జీవులను వేటాడొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుత కొండ చిలువలు, అనకొండల మాదిరిగానే ఇది ఎరను పట్టుకొని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే, ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. పరిశోధనకు నేతృత్వం వహించిన వారిలో ఒకరైన దేబ్‌జీత్ మాట్లాడుతూ.. ఈ పాము మరీ అంత క్రూరమైనది కాకపోవచ్చని కూడా అన్నారు. ఆనాటి ఉష్ణోగ్రతల వల్లే పాముకు అంత పెద్ద శరీరం ఉండి ఉండొచ్చని చెప్పారు.
ఇప్పటివరకూ ఉన్న శిలాజాల అధ్యయనం ప్రకారం, ఇదే అత్యంత పొడవైన పాము. దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)