You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ముద్దు రేపిన దుమారం, స్పెయిన్ ఫుట్‌బాల్ క్రీడాకారిణి పెదాలపై ముద్దు పెట్టి సస్పెండైన ఫెడరేషన్ ప్రెసిడెంట్... అసలేం జరిగింది?
ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల ప్రపంచ ఫుట్‌బాల్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మీద స్పెయిన్ టీం గెలిచింది. ఇది వారికి చరిత్రాత్మకం. స్పానిష్ ఫుట్‌బాల్ లోకానికి ఉత్సాహభరిత సందర్భం కూడా.
అయితే, ఈ విజయానికి సంబరాలు జరుపుకుంటున్నసమయంలో అక్కడ ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అదొక వివాదంగానూ మారింది. ఇంతకీ ఆ స్టేడియంలో ఏం జరిగింది?
టోర్నీలో విజేతలైన టీం సభ్యులకు అవార్డు బహుకరించే వేదిక మీద రాయల్ స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు లూయిస్ రుబియాలిస్, మహిళల ఫుట్‌బాల్ టీం ప్లేయర్ జెన్నిహెర్మసోను పెదాలపై ముద్దు పెట్టుకున్న తీరు ఫుట్‌బాల్ అభిమానుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది.
ఈ వివాదం పెద్దది కావడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు కూడా పడింది.
దీని పరిణామాలు ఊహించని రీతిలో మారిపోయాయి. మరింత ముదురుతున్న ఈ వ్యవహారం మూడు ప్రశ్నలు సంధిస్తోంది. అవేంటంటే..?
ముద్దు వ్యవహారంలో రుబియాలిస్ ఏం చేయబోతున్నారు?
ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మీద 1-0 గోల్స్‌తో స్పెయిన్ విజయం సాధించింది. 46 ఏళ్ల రుబియాలిస్ ప్రముఖుల గ్యాలరీలో కూర్చుని, మ్యాచ్ వీక్షించారు.
విజయం సాధించిన స్పెయిన్ టీంకు కప్పు బహూకరించే సమయంలో జట్టు సభ్యురాలు హెర్మసోను రుబియాలిస్ ముద్దు పెట్టుకున్నారు. వేదిక మీదే ఆమె తలను రెండు చేతులతో గట్టిగా పట్టుకుని పెదవులపై ముద్దు పెట్టారు.
ఇది జరిగిన కాసేపటికే రుబియాలిస్ ప్రవర్తన తనకు నచ్చలేదని హెర్మసో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
దీంతో రుబియాలిస్ తన చర్యల పట్ల క్షమాపణలు చెప్పారు. అయితే అది మాత్రమే సరిపోదని స్పెయిన్ తాత్కాలిక అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ అన్నారు.
ఆయనతో పాటు స్పెయిన్ ఉప ప్రధానమంత్రి, తాత్కాలిక కార్మిక మంత్రి యోలండ డియాజ్ కూడా రుబియాలిస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పుట్‌బాల్ ప్రపంచాన్ని ముద్దు వ్యవహారం ఎలా కుదిపేస్తోంది?
రుబియాలిస్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఫిఫా ప్రకటించింది.
ఫిఫా ప్రకటన తర్వాతి రోజే రాయల్ స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్, జనరల్ అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో రుబియాలిస్ రాజీనామా చేస్తారని అందరూ భావించారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టంచేశారు.
అయితే, ముద్దు విషయంలో తన అనుమతి లేదని, అతని ప్రవర్తన తనకు నచ్చలేదని హెర్మసో అదే రోజు స్పష్టంచేశారు.
దీంతో రుబియాలిస్‌ను సస్పెండ్ చేసేందుకు స్పానిష్ ప్రభుత్వం న్యాయపరమైన ప్రక్రియ మొదలు పెట్టింది. ఇది స్పానిష్ ఫుట్‌బాల్‌కు ‘మీ టూ ఉద్యమం’ లాంటిదన్నారు స్పానిష్ క్రీడల శాఖ కార్యదర్శి .
మరోవైపు రుబియాలిస్‌పై క్రమశిక్షణ చర్యలు ప్రకటించే వరకు తాము ఆయనను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఫిఫా ఆగస్టు 26న ప్రకటించింది.
రుబియాలిస్ ఆ పదవిలో ఉన్నంత వరకూ తాము స్పెయిన్ తరపున ఆడేది లేదని హెర్మసో ప్రాతినిధ్యం వహిస్తున్న ఫుట్‌ప్రో యూనియన్ తెలిపింది. అంతేకాదు 81 మంది ఫుట్‌బాల్ ప్లేయర్లు సంతకం చేసిన ప్రకటన కూడా విడుదల చేసింది.
జరిగిన ఘటనల గురించి హెర్మసోను ప్రశ్నిస్తూనే రుబియాలిస్‌పై ఆమె చేసిన ఆరోపణల మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని రాయల్ స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ వెల్లడించింది.
హెర్మసో, లేదా ఆమె తరపున ఎవరైనా అబద్దాలను ప్రచారం చేస్తున్నారా? అనే దానిపై రాయల్ స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్, దాని అధ్యక్షుడు వివరణ ఇస్తారని ఫెడరేషన్ తెలిపింది.
ఫుట్ ప్రో యూనియన్ పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో ‘చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తాం’ అనే వ్యాఖ్యలను స్పానిష్ రాయల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్, దాని అధ్యక్షులు సీరియస్‌గా తీసుకున్నారు.
ఫుట్‌బాల్ ప్రపంచం, చట్టం గురించిన వాదోపవాదాలను పక్కన పెడితే ఈ వ్యవహారం క్రీడాకారులపై లైంగిక వేధింపుల గురించిన చర్చను, వేధింపులకు వ్యతిరేకంగా వీధుల్లో ఆందోళనలను రాజేసింది.
దేశంలో పురుషాధిపత్యం ఉందని, అది రుబియాలిస్ రూపంలో బయటపడిందని మంత్రి డియాజ్ అన్నారు.
దేశంలో సామాజిక ఆలోచనా ధోరణి మారాలని, లైంగిక వేధింపులు, మహిళలపై హింస లాంటి అంశాల్లో బాధితులకు అండగా నిలవాలని ఆమె పిలుపిచ్చారు.
ఫుట్‌ప్రో యూనియన్ ప్రతినిధులతో సమావేశమైన తర్వాత ఆమె ‘’దేశంలో వ్యవస్థీకరించిన పురుషాధిక్యత స్పానిష్ సమాజంలో ఎంత దారుణంగా ఉందో శుక్రవారం చూశాం” అని తెలిపారు.
రుబియాలిస్, ఫిఫా, స్పానిష్ ప్రభుత్వం: ఇపుడేం జరగనుంది?
రుబియాలిస్‌ను సస్పెండ్ చేస్తూ ఫిఫా ప్రకటించిన తర్వాత స్పెయిన్ ప్రభుత్వానికి సంబంధించిన క్రీడా న్యాయస్థానం పాలక విభాగం సభ్యులు ఏం నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది.
వాళ్లు రుబియాలిస్‌పై విచారణ ప్రారంభించాలని నిర్ణయిస్తే అది ఆయన అనర్హతకు దారి తియ్యవచ్చు.
రుబియాలిస్ లేదా స్పానిష్ రాయల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రతినిధులెవ్వరూ హెర్మసోను సంప్రదించవద్దని ఫిఫా ఆదేశించింది.
రుబియాలిస్ మీద క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమిస్తే ఫెడరేషన్ అధ్యక్ష బాధ్యతలు పెడ్రో రొచా జుంకోకు దక్కుతాయి. ఆయన ప్రస్తుతం ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు, రుబియాలిస్‌కు రైట్ హ్యాండ్ కూడా.
స్పానిష్ రాయల్స్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చట్టం ప్రకారం అధ్యక్షుడు లేనప్పుడు ఉపాధ్యక్షుడికే ఆ బాధ్యతలు దక్కుతాయి. దీంతో పెడ్రో రొచా జుంకో తాత్కాలిక అధ్యక్షుడిగా ఉంటారని ఫెడరేషన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.
తనపై వచ్చిన ఆరోపణల విషయంలో విచారణ సంస్థల ఎదుట తన వాదన స్వయంగా తానే వినిపిస్తానని రుబియాలిస్ అంటున్నారు. ఫిఫాపై తనకు పూర్తి విశ్వాసం ఉందని ఆయన స్పష్టంచేశారు.
రుబియాలిస్ తన కేసు తానే వాదించుకోవడం వల్ల వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అప్పుడే ఆయన నిజాయతీ బయటపడుతుందని ఫెడరేషన్ కూడా ప్రకటించింది.
రుబియాలిస్‌ను సస్పెండ్ చేస్తూ ఫిఫా చేసిన ప్రకటనను క్రీడా లోకం స్వాగతించింది.
యూరోపియన్ ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ అయిన యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఈ వ్యవహారంపై స్పందించకపోవడాన్ని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఈ అసోసియేషన్‌కు రుబియాలిస్ ఉపాధ్యక్షుడు కూడా.
స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా రుబియాలిస్‌ను తొలగించినా, యురోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీలో సభ్యుడిగా 2027లో పదవీకాలం ముగిసేవరకూ ఆయన కొనసాగే అవకాశం ఉందని బీబీసీ స్పోర్ట్స్ అనలిస్ట్ సైమన్ స్టోన్ చెప్పారు.
ప్రస్తుత పరిస్థితి మీద యరోపియన్ పుట్‌బాల్ ఫెడరేషన్ బహిరంగ ప్రకటన చెయ్యడం లేదు. అయితే సంస్థలో కొంతమంది సభ్యులు మాత్రం రుబియాలిస్ రాజీనామా చెయ్యకపోవడం నమ్మశక్యంగా లేదని చెప్పినట్లు ఓ అనలిస్ట్ తెలిపారు.
ఈ సంఘటనపై ఫిఫా విచారణ చేపట్టడమే సరైనదని, పైగా ఇదంతా ఫిఫా నిర్వహించిన టోర్నీలో జరిగింది కాబట్టి దీనిపై తాము మాట్లాడటం సరైనది కాదని యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ చెప్పింది.
మరోవైపు స్పెయిన్ మహిళల జట్టు కోచింగ్ సిబ్బందిలో పలువురు రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. క్రీడా స్ఫూర్తిని చాటుతూ హెర్మసోకు మద్దతుగా, కోచ్ జోర్జ్ విల్డాకు దూరం ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
శుక్రవారం తన ప్రసంగంలో రుబియాలిస్‌పై ప్రశంసలు గుప్పించారు విల్డా. శనివారం రుబియాలిస్ ప్రవర్తనను తప్పుపట్టారు.
స్పానిష్ రాయల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ సమావేశంలో రుబియాలిస్ ప్రసంగం తర్వాత చప్పట్లు కొట్టిన విల్డాపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఫిఫా రుబియాలిస్‌ను సస్పెండ్ చేసిన తర్వాతనే విల్డా ఆయనను విమర్శించారు.
రుబియాలిస్ తల్లి నిరాహార దీక్ష
ఈ వ్యవహారంలో అనూహ్యంగా రుబియాలిస్ తల్లి నిరాహార దీక్షకు దిగారు. తన కుమారుడిని అమానవీయంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.
మధ్యధరా సముద్ర తీరంలో ఉన్న మోర్టిల్ అనే గ్రామంలో రుబియాలిస్ తల్లి ఆంజెలిస్ బేజర్ ఓ చర్చి లోపలకు వెళ్లి తలుపులు వేసుకున్నారు.
తాను రేయింబవళ్లు నిరవధికంగా దీక్ష చేస్తానని ఆమె స్పానిష్ వార్తా సంస్థ ఈఎఫ్ఈతో చెప్పారు.
ఆమెకు మద్దతుగా కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగు పొరుగువారు డివినా పస్టోరా చర్చ్ ముందు సమావేశం అయ్యారు.
‘మేం చాలా బాధ పడుతున్నాం. అతడు తప్పు చేశాడని తేలకముందే శిక్ష వేశారు’ అంటూ రుబియాలిస్ సోదరి వనెస్సా రుయిజ్ ఆరోపించారు.
‘మీడియా మమ్మల్ని వేధిస్తోంది. మేం మా ఇళ్లను వదిలేయాల్సి వచ్చింది. మా బతుకేదో మమ్మల్ని బతకనివ్వండి. హెర్మసో నిజం చెప్పాలి. ఇలా చెయ్యడం సరి కాదు.’ అన్నారు రుయిజ్.
స్పెయిన్ మహిళా జట్టు ప్రపంచ కప్ ఫుట్‌బాల్ గెలిచిందన్న ఉత్సాహాన్ని ఈ సంక్షోభం ఆక్రమించేసింది. ఈ వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.
ఇవి కూడా చదవండి:
- ఆసియా కప్ 2023 : భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే టెన్షన్ తప్పదా, ఎందుకీ భావోద్వేగాలు?
- చంద్రుడిపై సల్ఫర్, ఆక్సిజన్ కనుగొన్న ప్రజ్ఞాన్ రోవర్.. ఇస్రో ప్రకటన
- చంద్రయాన్ -3: ఇస్రోకు ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటి వరకు ఏం సమాచారం ఇచ్చింది?
- వీర్యం ఉత్పత్తికి కారణమయ్యే ‘వై క్రోమోజోమ్’ రహస్యాలను ఛేదించారు.. పురుషుడు నిర్వీర్యం అవుతాడా?
- టెరీ గౌ: ఈ ‘ఐఫోన్’ బిలియనీర్ తైవాన్ అధ్యక్షుడు కాగలరా? చైనాను ఎదుర్కోగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)