You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నిమిష ప్రియకు క్షమాభిక్షపై స్పందించిన మహదీ కుటుంబం, బీబీసీతో మాట్లాడిన ఆయన సోదరుడు ఏమన్నారంటే..
యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా పడింది. ఈ కేసులో హత్యకు గురైన తలాల్ అబ్దో మహదీ సోదరుడు అబ్దెల్ ఫతేహ్ మహదీతో బీబీసీ మాట్లాడింది.
తలాల్ అబ్దో మహదీ హత్య కేసులో నిమిష ప్రియను స్థానిక కోర్డు దోషిగా తేల్చి మరణ శిక్ష విధించింది.
జూలై 16న ఆమెకు మరణశిక్ష అమలు చేయాల్సి ఉండగా, అది వాయిదా పడినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.
2017లో తలాల్ మహదీ మృతదేహాన్ని నీటి ట్యాంక్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరణశిక్ష పడిన 34 ఏళ్ల నిమిష ప్రియ ప్రస్తుతం యెమెన్ రాజధాని సనాలోని సెంట్రల్ జైలులో ఉన్నారు.
తలాల్‌కు అధికమొత్తంలో మత్తుమందు ఇచ్చి చంపేసి, అతని శరీరాన్ని ముక్కలు చేసినట్లు నిమిష ప్రియపై అభియోగాలు నమోదయ్యాయి.
ఈ ఆరోపణలను నిమిష ప్రియ తిరస్కరిస్తున్నారు.
తలాల్ ఆమెను శారీరకంగా హింసించారని, డబ్బు, పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకుని తుపాకీతో బెదిరించారని ఆమె తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.
అయితే, తలాల్ మహదీ తన డబ్బంతా లాగేసుకున్నారని, పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నాడంటూ నిమిష ప్రియ తరఫు న్యాయవాది చేస్తున్న ఆరోపణలను మహదీ సోదరుడు అబ్దెల్ ఫతేహ్ మహదీ నిర్ద్వంద్వంగా ఖండించారు.
నిమిష ప్రియ తరఫు న్యాయవాది వాదనలు 'అబద్దం' అని తలాల్ మహదీ సోదరుడు ఫతేహ్ మహదీ అన్నారు.
"అవన్నీ తప్పుడు వాదనలు. వాటికి ఎలాంటి ఆధారాలు లేవు" అని ఆయన చెప్పారు.
"కుట్రదారు (నిమిష ప్రియ) కూడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. ఆమె పాస్‌పోర్ట్‌ను నా సోదరుడు(తలాల్ అబ్దో మహదీ) స్వాధీనం చేసుకున్నాడని ఆమె కూడా చెప్పలేదు" అని ఆయన అన్నారు.
నిమిషను తన సోదరుడు తలాల్ మహదీ "దోచుకున్నారన్న" వార్తలు కేవలం పుకార్లేనని ఫతేహ్ మహదీ కొట్టిపారేశారు.
నిమిష, తలాల్ మహదీ మధ్య సంబంధం, ఇతర అన్ని సంబంధాల వంటిదేనని ఆయన అన్నారు.
"వారిద్దరికీ పరిచయమైంది. ఆ తర్వాత భాగస్వామ్యంతో మెడికల్ క్లినిక్ ప్రారంభించారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుని, 3 - 4 ఏళ్లు కలిసి ఉన్నారు" అని ఫతేహ్ మహదీ బీబీసీతో చెప్పారు.
"నిజాలను దాచిపెట్టే ప్రయత్నం జరగడం దురదృష్టకరం. హంతకురాలిని బాధితురాలిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నేరాన్ని సమర్థించే ప్రయత్నం జరుగుతోంది" అని ఆయన అన్నారు.
ఈ కేసులో నిమిష ప్రియను క్షమించి రాజీకి వస్తారా? అని అడిగినప్పుడు "ఆమెకు క్షమాభిక్ష విషయంలో మా అభిప్రాయం చాలా స్పష్టం. ఈ కేసులో "ఖుదా కా కానూన్" (గాడ్స్ లా) అమలు చేయాలని కోరుకుంటున్నాం. వేరే దేనికీ అంగీకరించం" అబ్దెల్ ఫతేహ్ మహదీ అన్నారు.
మరణశిక్ష వాయిదా
తొలుత, జూలై 16న నిమిష ప్రియ మరణశిక్షను అమలు చేయనున్నట్లు నిర్ణయించారు.
బీబీసీ హిందీ అసోసియేట్ జర్నలిస్ట్ ఇమ్రాన్ ఖురేషి చెప్పిన దాని ప్రకారం, భారత అధికారులు ఆమెను కాపాడేందుకు యెమెన్ జైళ్ల శాఖ అధికారులు, ప్రాసిక్యూషన్ కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు.
దీంతో మరణశిక్షను ప్రస్తుతానికి వాయిదా వేశారు.
గతంలో నిమిషకు మరణశిక్ష ఖరారైన అనంతరం, ఈ విషయంలో చర్యలు చేపట్టాలని ఆమె కుటుంబం భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ఆ కుటుంబానికి చేతనైన సాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఈ కేసులో ఇరువర్గాల మధ్య పరస్పర ఒప్పందం కోసం ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేసింది.
నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా పడడానికి ముందు, యెమెన్‌లో నిమిష ప్రియ కేసులో పవర్ ఆఫ్ అటార్నీగా ఉన్న శామ్యూల్ జెరోమ్ బీబీసీతో మాట్లాడారు
"అన్నీ సానుకూలంగా జరుగుతున్నాయి. ఈరోజు (మంగళవారం) చివరి నాటికి మంచి వార్త వినొచ్చు. కానీ, అది మరణశిక్ష రద్దు చేస్తారని కాదు, మరణశిక్షను వాయిదా వేయొచ్చు" అని చెప్పారు.
'ఇప్పటివరకు మహదీ కుటుంబం ఆమెకు క్షమాభిక్ష ప్రసాదించలేదు. వారు క్షమిస్తేనే మరణశిక్షను రద్దు అవుతుంది. ప్రస్తుతం శిక్ష అమలు రోజును వాయిదా వేసే అవకాశం మాత్రమే ఉంది, దీని వల్ల మహదీ కుటుంబంతో మాట్లాడటానికి మాకు కొంత ఎక్కువ సమయం లభిస్తుంది" అని శామ్యూల్ జెరోమ్ చెప్పారు.
అంతకు ముందు ఏం జరిగింది?
జూలై 14 సోమవారం నాడు, కేరళలో ప్రముఖ ముస్లిం మతపెద్ద.. గ్రాండ్ ముఫ్తీ ఏపీ అబూబకర్ ముస్లియార్ నిమిష ప్రియ కేసు గురించి "యెమెన్‌కు చెందిన కొంతమంది షేక్‌లతో" మాట్లాడారు.
"సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ సభ్యులు గ్రాండ్ ముఫ్తీని కలిశారు. ఆ తర్వాత ఆయన కొంతమంది షేక్‌లతో (యెమెన్‌కు చెందిన) మాట్లాడారు" అని సుప్రీంకోర్టు న్యాయవాది సుభాష్ చంద్ర బీబీసీతో చెప్పారు.
"మృతుడి బంధువులతో పాటు కొందరు కీలక వ్యక్తులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు మాకు సమాచారం ఉంది" అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)