జుంబా: హిందూ, ముస్లిం సంస్థలు కలసికట్టుగా వ్యతిరేకిస్తున్న కేరళ ప్రభుత్వ నిర్ణయం

    • రచయిత, అష్రాఫ్ పదన్న
    • హోదా, తిరువనంతపురం

ప్రభుత్వ పాఠశాలల్లో జుంబా క్లాసులను ప్రవేశపెట్టాలనే కేరళ ప్రభుత్వ నిర్ణయం వివాదంగా మారింది. దీనిపై ఈ వారం ప్రారంభంలో కొన్ని మతపరమైన సంఘాలు నిరసన తెలిపాయి, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.

కేరళ ప్రభుత్వం జూన్‌లో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారం ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని దాదాపు 14,000 ప్రభుత్వ పాఠశాలలను రోజువారీ జుంబా సెషన్‌లు నిర్వహించాలని సూచించింది.

అయితే, ఈ నిర్ణయాన్ని కొన్ని హిందూ, ముస్లిం సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి.

జుంబా ఒక 'సాంస్కృతిక చొరబాటు' అని, ఇది వారి మతపరమైన, నైతిక విలువలకు అనుగుణంగా లేదని తెలిపాయి.

అంతేకాదు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొనరాదని సూచించాయి. ఈ నిరసనలు తగ్గుముఖం పట్టినప్పటికీ, ఆయా సంస్థలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాయి.

ప్రభుత్వం ఏమంటోంది?

జుంబా కార్యక్రమాన్ని రద్దు చేయబోమని, 'మతాన్ని విద్యతో కలపకూడదు' అని కేరళ ప్రభుత్వం అంటోంది.

"నిరసనలు తెలుపుతున్న వారు మాదకద్రవ్యాల సమస్య కంటే ప్రమాదకరమని నిరూపించుకుంటున్నారు" అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వి. శివన్‌కుట్టి బీబీసీతో అన్నారు.

జుంబాను షెడ్యూల్‌లో చేర్చాలని పాఠశాలలను కోరినప్పటికీ.. ఈ డ్యాన్స్ క్లాసులకు వెళ్లాలా వద్దా అనేది విద్యార్థుల ఇష్టమని ఆయన అన్నారు.

"మేం ఎవరినీ బలవంతం చేయడం లేదు, మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆపేయవచ్చు" అని మంత్రి అన్నారు.

పాఠశాల విద్యార్థులలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వాడకాన్ని నివారించడానికి గత నెలలో కేరళ ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలతో నిరసనలు ప్రారంభమయ్యాయి.

ప్రభుత్వ నిర్ణయాలలో పాఠశాలల చుట్టూ మరింత భద్రత, అవగాహన ప్రచారాలు, విద్యార్థులకు పునరావాస కార్యక్రమాలు, రోజువారీ జుంబా క్లాసులు ఉన్నాయి.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఈ సెషన్ల కోసం శిక్షణ పొందిన జుంబా ఇన్‌స్ట్రక్టర్‌ను నియమించుకోవాలి. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకూ సౌకర్యవంతంగా ఉండేలా జుంబా షెడ్యూల్‌ రూపొందించాలి.

మత పెద్దలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్రంలోని 'సమస్త కేరళ జమియ్యతుల్ ఉలేమా' వ్యతిరేకించింది. ఈ సంస్థ వందలాది ముస్లిం మత పాఠశాలలను నిర్వహిస్తోంది.

ఆ గ్రూపు ప్రతినిధి నాసర్ ఫైజీ కూడతై బీబీసీతో మాట్లాడుతూ ''అబ్బాయిలు, అమ్మాయిలు అసభ్యకరమైన దుస్తులు ధరించి, కలిసి డ్యాన్స్ చేయడం సరైనది కాదు'' అని అన్నారు.

"జుంబా భారతీయ నైతిక విలువలకు విరుద్ధం ఎందుకంటే, ఇందులో బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం, ఒకరితో ఒకరు దగ్గరగా కదులుతూ నృత్యం చేయడం ఉంటుంది. దీనిని అనుమతించకూడదు" అని ఆయన అభిప్రాయపడ్డారు.

హిందూ మేధావుల సంస్థగా పిలుచుకునే రైట్ వింగ్ ఆర్గనైజేషన్ 'భారతీయ విచార కేంద్రం' కూడా జుంబాను వ్యతిరేకిస్తోంది.

''జుంబా విదేశాల నుంచి తెచ్చుకున్నది. మాదకద్రవ్యాల వాడకాన్ని నివారించడానికి విద్యార్థులతో బలవంతంగా జుంబా చేయించడం దుర్మార్గం'' అని భారతీయ విచార కేంద్రం డైరెక్టర్ ఆర్ సంజయన్ ఒక ప్రకటనలో తెలిపారు.

"జుంబా వంటి విదేశీ కార్యకలాపాలను ప్రోత్సహించడం వెనుక చాలా విషయాలు దాగి ఉన్నాయి. ప్రభుత్వం మన సంస్కృతిని రక్షించే లేదా ప్రోత్సహించే ప్రయత్నం చేయడం లేదు" అని ఆయన ఆరోపించారు.

తల్లిదండ్రులు, విద్యార్థులు దీన్ని తిరస్కరించాలని సంజయన్ కోరారు.

కాగా, కేరళ ప్రభుత్వం ఈ ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చింది.

అనుచిత దుస్తులు ధరించరు: మంత్రి

"విద్యార్థుల ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం వారు ఫిట్‌నెస్ ప్రయాణాన్ని ప్రారంభించేలా ప్రోత్సహించడానికే ఈ ఆలోచన, అంతకంటే మరేం లేదు" అని మంత్రి శివన్‌కుట్టి అన్నారు.

జుంబా సెషన్ల సమయంలో విద్యార్థులు పాఠశాల యూనిఫామ్‌లను ధరించాలని మార్గదర్శకాలు స్పష్టంగా చెబుతున్నాయని, కాబట్టి 'అనుచితమైన దుస్తులు ధరించే' అవకాశం లేదని మంత్రి వివరించారు.

"పాఠశాలల్లో చిన్నపాటి వ్యాయామాలనూ ప్రోత్సహిస్తుంటారు. ఆ సమయంలో విద్యార్థులు యూనిఫామ్‌లనే ధరిస్తారు" అని ఆయన గుర్తుచేశారు.

పిల్లలలో ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని శివన్‌కుట్టి అన్నారు.

"విద్యార్థులు క్రీడల్లో చురుగ్గా ఉంటే, అది వారి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, సానుకూల ఆలోచనను పెంపొందించడంలో తోడ్పడుతుంది. వారి చదువుతో పాటు వ్యక్తిగత వృద్ధికీ సహాయపడుతుంది" అని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)